Best Waterproof EVs in India: వర్షాకాలం మొదలైతే చాలా సిటీస్ లో రోడ్ల మీద నీరు నిలిచిపోవడం సాధారణమే. అలాంటి సమయంలో పెట్రోల్ బైక్, లేదంటే స్కూటర్ నడిపేవారికి ఇంజిన్‌లోకి నీరు వెళ్లిపోతుందేమో, వెహికల్ మధ్యలో ఆగిపోతుందేమో అనే ఆందోళన ఉంటుంది. కానీ, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ సమస్య కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో సైలెన్సర్, ఎయిర్ ఇంటేక్ వ్యవస్థ ఉండదు. బ్యాటరీ, మోటార్ ను ప్రత్యేకంగా రూపొందించడం వల్ల సాధారణంగా వర్షపు నీటిని తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. అయితే, అన్ని ఈవీలు ఒకేలా ఉండవు. కొన్ని మోడళ్లు నీటిలో కూడా మెరుగైన పనితీరు కనబరుస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో వర్షాకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల గురించి తెలుసుకుందాం.
ఏథర్ కంపెనీ స్కూటర్లు క్వాలిటీ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నీళ్లున్న రోడ్ల మీద కూడా ఇవి ఎలాంటి సమస్య లేకుండా పని చేస్తాయి. బ్యాటరీ, మోటార్ రెండింటికీ IP67 ప్రొటెక్షన్ ఉంటుంది. సుమారు 400 మిల్లీమీటర్ల వరకు నీటిని తట్టుకునే సామర్థ్యం ఉంది. కంపెనీ ఈ స్కూటర్లపై ప్రత్యేక వాటర్ టెస్టులు కూడా నిర్వహించింది.
రివర్ ఇండీ స్కూటర్లను చాలా మంది స్కూటర్ల SUVగా పిలుస్తారు. దీనికి 165 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 14 అంగుళాల పెద్ద టైర్లు ఉండటంతో నీరు నిలిచిన రోడ్లపై ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లొచ్చు. బ్యాటరీ, మోటార్‌కు IP67 రేటింగ్ ఉండటం మరో ప్రత్యేకత.
హీరో మోటోకార్ప్ కు చెందినవిడా V1 ప్రో కూడా వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తుంది. బ్యాటరీకి IP67, మోటార్ కు IP68 రేటింగ్ ఉంది. సుమారు 300 మిల్లీమీటర్ల లోతు వరకు నీటిని తట్టుకునే సామర్థ్యం ఉందని కంపెనీ చెబుతోంది. మోటార్ కు ఉన్న IP68 రేటింగ్ అదనపు భద్రతను అందిస్తుంది.
స్కూటర్ కాకుండా ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునేవారికి ఓబెన్ రోర్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీనికి 200 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల రోడ్లపై నీరు నిలిచినా సులభంగా ప్రయాణించవచ్చు. బ్యాటరీ, డ్రైవ్ ట్రైన్ కు IP67 ప్రొటెక్షన్ ఉంటుంది. సుమారు 230 మిల్లీమీటర్ల నీటిని ఇది తట్టుకుని ప్రయాణిస్తుంది.
భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా S1 ప్రో కూడా ఒకటి. ఈ స్కూటర్‌లో సీల్డ్ బ్యాటరీ ప్యాక్ తో పాటు IP67 రేటింగ్ ఉంది. సుమారు 300 మిల్లీమీటర్ల నీటిలో కూడా ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. బాడీ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ భాగాలను నీరు లోపలికి వెళ్లకుండా ప్రత్యేకంగా రూపొందించారు.
ఈవీలలో కనిపించే IP రేటింగ్ అనేది నీరు, దుమ్ము నుంచి బ్యాటరీ, మోటార్ కు ఎంత రక్షణ ఉందో తెలియజేస్తుంది. IP67 రేటింగ్ ఉంటే ఒక మీటర్ లోతు నీటిలో సుమారు 30 నిమిషాల వరకు కూడా సురక్షితంగా ఉండేలా రూపొందిస్తారు. IP68 రేటింగ్ ఉన్నవి మరింత మెరుగైన ప్రొటెక్షన్ ను అందిస్తాయి.
Read Also: జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!