Heavy Rains: అర్నబ్ తుఫాన్ తీరం బుధవారం ఉదయం ఏపీలో తీరం దాటడంతో నాలుగు రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. కాకపోతే దాని ముప్పు ఇంకా పొంచి వున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒడిషా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాను ధాటికి భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది అర్నాబ్ తుఫాను. దీని ఫలితంగా ఒడిషా, ఏపీ, తెలంగాణ, తెలంగాణ, యానాం, పుదుచ్చేరి ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో తీవ్ర నష్టాన్ని కలిగించింది. వరి పొలాల్లోని పంటలు నీట మునిగాయి. చేపలను ఆరబెట్టే వేదికలను మత్స్యకారులు కోల్పోయారు. యానాంలో తుఫాను తీరాన్ని తాకినప్పుడు గంటకు 125 నుండి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. ఆ తర్వాత 150 కిలోమీటర్ల వేగానికి గాలులు చేరాయి.
ఫలితంగా అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కాలేదు. అర్నబ్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై, కడలూరు, నాగపట్నం, పుదుచ్చేరి, కారైకాల్ తీర ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావం ఒడిషాపై పడింది. దక్షిణ జిల్లాల్లోని మల్కాన్‌గిరి తీవ్రం ప్రభావితం అయ్యే అవకాశముందని ఒడిషా విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో గజపతి జిల్లాలోని మహేంద్రగఢ్ లో దాదాపు 250 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కోరాపుట్‌లోని పొట్టంగిలో 188 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. ఇప్పటివరకు పెద్ద నష్టం, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. 19 వేలకు పైగా పడవలు ఒడ్డుకు వచ్చాయి. వర్షాల కారణంగా ఒడిషాలో దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ALSO READ: డిజిటల్ అరెస్టుల వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఉక్కుపాదం మోపాలని ఆదేశం
తుఫాను అర్నబ్ కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 31 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డి అంచనా వేసింది.
మంగళవారం బెంగాల్ తీరప్రాంతం, కొన్ని దక్షిణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. పశ్చిమ జిల్లాల్లో శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.