VLF Strada EV Launched: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి మరో కొత్త మోడల్ వచ్చేసింది. ఇటాలియన్ VLF బ్రాండ్.. భారత మార్కెట్లో స్ట్రాడా (Strada) పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటర్ ధరలు రూ.1.20 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లు, 85 కిలోమీటర్ల వేగం, 250 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
VLF స్ట్రాడాను సిటీ (City), మ్యాక్స్ (Max) అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. సిటీ వేరియంట్ ధర రూ.1.20 లక్షలుగా ఉండగా, మ్యాక్స్ వేరియంట్ ధర రూ.1.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. సిటీ వేరియంట్ లో 2.16kWh సామర్థ్యం ఉన్న ఒక రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. మ్యాక్స్ వేరియంట్‌లో రెండు బ్యాటరీలు ఉండటంతో మొత్తం సామర్థ్యం 4.32kWhకు చేరుతుంది. వీటి సాయంతో సిటీ మోడల్ 130 కిలోమీటర్లు, మ్యాక్స్ మోడల్ 250 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ అందిస్తాయని కంపెనీ తెలిపింది.
రెండు వేరియంట్లలోనూ 4.8kW గరిష్ట పవర్, 34Nm టార్క్ అందించే BLDC హబ్ మోటార్‌ను అమర్చారు. ఇందులో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో మోడ్‌లో గంటకు 45 కిలోమీటర్లు, సిటీ మోడ్‌లో 65 కిలోమీటర్లు, స్పోర్ట్ మోడ్‌లో 85 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించవచ్చు.
ఒక బ్యాటరీని 20 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు మూడు గంటలు పడుతుంది. రెండు బ్యాటరీలకు ఆరు గంటల సమయం అవసరమవుతుంది. అయితే, ఛార్జర్ వాటేజ్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ స్కూటర్‌లో 780mm సీట్ హైట్, 175mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ముందు 16 అంగుళాల వీల్, వెనుక 14 అంగుళాల వీల్‌ను అందించారు. బ్రేకింగ్ కోసం ముందు 240mm, వెనుక 220mm డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ABSకు బదులుగా CBS బ్రేకింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు.
VLF స్ట్రాడాలో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, ఆల్ LED లైటింగ్, డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కీలెస్ ఇగ్నిషన్, విండ్‌షీల్డ్, లగేజ్ ర్యాక్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. కార్బోనియో బ్లాక్, లూనా వైట్, టైటానియో గ్రే, అర్బానో సిల్వర్ అనే నాలుగు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సిటీ వేరియంట్‌ను రూ.999తో, మ్యాక్స్ వేరియంట్‌ను రూ.1,999తో బుక్ చేసుకోవచ్చు. TVS iQube, బజాజ్ చేతక్, ఏథర్, విడా లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇది పోటీ ఇవ్వనుంది.
Read Also: జస్ట్ రూ.2,499కే సూపర్ బైక్.. యమహా అదిరిపోయే పండుగ ఆఫర్లు!