Why are tyres always black: రోడ్డు మీద వెళ్లే కార్లు, బైక్‌లు, చివరికి కోట్ల విలువైన లగ్జరీ కార్లు కూడా ఎరుపు, తెలుపు, నీలం అంటూ రంగురంగుల్లో మెరిసిపోతుంటాయి. ఇలా వెహికిల్ ఏ రంగులో ఉన్నాకానీ.. టైర్లు మాత్రం ఎప్పుడూ నల్లగానే ఉంటాయి! అసలు రబ్బర్ సహజ రంగు తెల్లగా ఉన్నప్పుడు, టైర్లను కూడా రంగురంగుల్లో ఎందుకు తయారు చేయరు? దీని వెనక ఉన్న క్రేజీ సైన్స్ సీక్రెట్ ఏంటో, ఎవరికీ తెలియని ఆ ఆసక్తికరమైన నిజాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజువారీ జీవితంలో చూసే చాలా విషయాలను లైట్ తీసుకుంటాం. కానీ వాటి వెనక ఊహించని నిజాలు దాగుంటాయి. అందులో ఒకటే ఈ నల్లటి టైర్ల కథ.
నిజానికి రబ్బర్ రంగు తెలుపు:
మనం వాడే టైర్లను సహజ రబ్బరుతో తయారు చేస్తారు. ఈ రబ్బరు చెట్ల నుంచి వచ్చే పాలు (Latex) పూర్తిగా తెల్లటి రంగులో ఉంటాయి. ప్రారంభంలో అంటే.. 1900ల కాలంలో వాహనాలకు తెల్లటి రంగులో ఉండే టైర్లనే వాడేవారు. కానీ ఆ తెల్లటి రబ్బర్ టైర్లకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ టైర్లు చాలా సాఫ్ట్‌గా ఉండటం వల్ల రోడ్డు మీద కొద్ది దూరం వెళ్లగానే అరిగిపోయేవి. ఎండ వేడికి త్వరగా పాడైపోయేవి.
‘కార్బన్ బ్లాక్’ మ్యాజిక్:
తెల్లటి రబ్బరు టైర్లు ఎక్కువ కాలం మన్నిక రాకపోవడంతో సైంటిస్టులు ఒక సరికొత్త ప్రయోగం చేశారు. రబ్బరు మరింత స్ట్రాంగ్‌గా మారడానికి, వేడిని తట్టుకోవడానికి దానికి ‘కార్బన్ బ్లాక్’ అనే నల్లటి రసాయన పదార్థాన్ని ఇందులో కలపడం ప్రారంభించారు. ఎప్పుడైతే తెల్లటి రబ్బరుతో ఈ కార్బన్ బ్లాక్ కలిసిందో.. ఆ టైర్ల రంగు పూర్తిగా నల్లగా మారిపోయింది.
టైర్లు నల్లగా ఉండటం వల్ల లాభాలు :
టైర్లు నల్లగా మారడం వెనక కేవలం రంగు మార్పు మాత్రమే లేదు, అంతకు మించిన లాభాలు ఉన్నాయి.
బలం: కార్బన్ బ్లాక్ కలపడం వల్ల టైర్ల బలం, మన్నిక ఏకంగా 10 రెట్లు పెరిగింది.
హీట్ రెసిస్టెన్స్: వేసవి కాలంలో.. రోడ్లు చాలా వేడిగా ఉంటాయి. ఆ వేడిని తట్టుకుని, టైర్లు కరిగిపోకుండా లేదా పేలిపోకుండా ఈ నల్లటి పదార్థం కాపాడుతుంది.
యూవీ కిరణాల నుంచి రక్షణ: సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల వల్ల రబ్బరు త్వరగా బీటలు వారకుండా ఈ కార్బన్ బ్లాక్ రక్షిస్తుంది.
రంగురంగుల టైర్లు ఎందుకు తయారు చేయరు?
ఒకవేళ ఈ రోజుల్లో స్టైల్ కోసం ఎరుపు లేదా పసుపు రంగు టైర్లను తయారు చేయాలనుకుంటే చేయవచ్చు. కానీ వాటికి కార్బన్ బ్లాక్ వాడటం కుదరదు. దీని వల్ల ఆ రంగు టైర్లు చూడటానికి బాగున్నా.. రోడ్డుపై ఎక్కువ దూరం ప్రయాణించలేవు. త్వరగా అరిగిపోతాయి. పైగా భద్రత పరంగా కూడా చాలా డేంజర్. అందుకే ప్రాణాల కంటే స్టైల్ ముఖ్యం కాదు కాబట్టి.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు నల్లటి టైర్లనే వాడుతున్నాయి.