రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో విద్యార్ధులు అలుపెరగకుండా ఉద్యమం చేశారని, ఈ విజయం వారికే సొంతమన్న ఆయన .. వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
ఇది ఒక్క విద్యావ్యవస్థ పైనే ఉద్యమం కాదని, ఈ నిరసన నిరుద్యోగం మీద.. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల మీద కూడా అన్నారు. ఓ రకంగా జెన్-జీ ఈ దేశపు స్థితి గతులను, ఇక్కడి పాలనను యావత్ ప్రపంచానికే చూపిందన్న ఆయన.. ఇంకా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. జెన్-జీకి కాక్రోచ్ పార్టీకి కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
బీజేపీ పాలిత దేశంలో ఇంతటి అరాచకాలు జరుగుతుంటే.. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కాంగ్రెస్సేనని యువతకు చెప్పే ప్రయత్నం చేశారు రాహుల్. ఎక్కడికైనా వస్తాం.. ఎలాగైనా మద్దతుగా ఉంటాం.. మీరొక పిలుపివ్వండి.. మేము మీ వెనుకుంటామని ఆయన ప్రకటించడం కూడా యువతను ఆకట్టుకున్నది. రాహుల్ లాంటి నేత.. ఎలాంటి ప్రతిష్టకు పోకుండా.. అహం చూపకుండా ఓ విశాల దృక్పథంతో యువతతో చేతులు కలిపి పోరాడుతామని, దేశ భవిష్యత్తును కాపాడదామని పిలుపునివ్వడం కూడా ఆ సందర్బాన్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే వ్యూహంలో భాగంగా ఆయన ఆ మాటలన్నారనేది స్పష్టం.
మోడీలాంటి తిరుగులేని నేత అని కీర్తిస్తూ కూర్చున్న బీజేపీ, దాని అనుబంధ సంఘాలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన కాక్రోచులను.. రాహుల్ లైట్‌గా తీసుకోదలుచుకోలేదు. ఓ జాతీయ పార్టీ అగ్రనేతగా ఆ కాక్రోచుల గురించి మాట్లాడాల్సి రావడం పట్లా ఏం తడబడలేదు. వెనుకా ముందు ఆలోచించలేదు. జెన్-జీ తలుచుకుంటే దేశ రాజకీయాలను మార్చేయగలదనే చరిత్ర మోడీకి తెలుసు. రాహుల్‌కూ తెలుసు.
కానీ మోడీ ఆలస్యంగా మేల్కొన్నాడు. రాహుల్ సమయానుకూలంగా పరిస్థితులను ఒడిసిపడుతున్నారు. యువతకు, విద్యార్థి లోకానికి దగ్గరయే ప్రయత్నం చేస్తున్నారు. ఆందుకే దీన్నిమోడీ, ఆరెసెస్ పై సాధించిన విజయంగా ఆయన అభివర్ణిస్తున్నారు. దీనికే విస్తృత ప్రచారం కల్పించి… దీనికి రాజకీయ రంగు పులమడం ద్వారా బీజేపీకి యువత మొత్తం వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని కూడా దేశానికి తెలియజెప్పడం రాహుల్ వ్యూహంగా కనిపిస్తున్నది.
ఇప్పటి దాకా ఏ రాజకీయ గొడుగు కింద లేకుండా ఉద్యమం చేసిన కాక్రోచ్… తమ డిమాండ్లను సాధించి విజయం సాధించినా.. ఇది తన రాజకీయ శక్తిగా మార్చుకునే క్రమంలో వారిని తనవైపు తిప్పుకునేందుకు, వారితో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందనే విషయాన్ని ప్రకటించి.. కాక్రోచులకు స్నేహ హస్తమందిస్తున్నాడు రాహుల్.
ఇదీ కొత్త రాజకీయ సమీకరణకు నాంది కానుందా? కాలక్రమేణా కాక్రోచులు.. కాంగ్రెస్ వేదికగా ఉద్యమాలు నిర్మించనున్నాయా? రాజకీయంగా దూరంగా ఉంటూనే ఉద్యమాల నిర్మాణంలో, మద్దతులో దూరం నుంచే కాంగ్రెస్ సంఘీభావం కోరడం ద్వారా .. ఐక్య ఉద్యమాలు నిర్మించాలనుకుంటున్నాయా? అంతిమంగా కేంద్రం మెడలు వంచి అనుకున్నవి సాధించాలనుకుంటున్నాయా? వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పనుంది త్వరలో.