జెన్-జీ ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీజేఎస్ ఆధ్వర్యంలో ఇవాళ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా రేపు టీజేఎస్ ప్రతినిధుల బృందం జంతర్‌మంతర్‌కు వెళ్తున్నట్టుగా ఈ మేరకు కోదండరాం ప్రకటించారు. కానీ ఇక్కడ గల్లీలోనే ఆందోళన చేసి.. బీఆరెస్ మాత్రం చేతులు దులుపుకున్నది. పైగా ఢిల్లీ వెళ్లడం వల్ల అక్కడి ఉద్యమానికి రాజకీయ రంగు పులిమినట్టవుతుందని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు కేటీఆర్. అందుకే తాము రావడం లేదని కూడా చెప్పుకొచ్చాడు.
మరి ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని విద్యార్ధులకు సంఘీభావంగా ఉంటుంది. వారితో పాటు ఆందోళనలకు దిగుతున్నది. అంటే జెన్-జీ మీద కాంగ్రెస్ పార్టీ ముద్రవేసి మోడీ తప్పించుకుందామని చూస్తాడా? ఆ ఉద్యమ తీవ్రత మోడికి తెలుసు. ఎంతగా బీజేపీ సోషల్ మీడియా దీన్ని పక్కదారి పట్టిస్తున్న ఫలితం దక్కడం లేదు. ఎవరూ దీన్ని ఒప్పుకోవడం లేదు. మోడీకి సంఘీభావం దొరకడం లేదు.
వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకునే మోడీ కూడా పలు మార్పులు, సంస్కరణలంటూ ఉద్యమ వేడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఓ ఒక్క పార్టీ వెనుకుండి నడిపిన ఉద్యమం కాదని మోడీకి తెలుసు. కేటీఆర్‌కు తెలుసు. కానీ అక్కడి దాకా వెళ్లలేక..తాము రాలేమని చెప్పలేక.. పార్టీ రంగు పులుముతారని, ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తారని, దీన్ని బీజేపీ అస్త్రంగా వాడుతుందని చెప్పుకొచ్చాడు కేటీఆర్.
వాస్తవానికి కేటీఆర్ మనసులో ఉన్నది వేరు. అక్కడ బీజేపీ పై వ్యతిరేకత.. కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి మద్దతు లభించడంతో.. ఇది అంతిమంగా కాంగ్రెస్ కు లాభించే అవకాశాలున్నాయి. మరి తాము వెళ్లి కాంగ్రెస్ నెత్తిన పాలుపోస్తామా? అనే కోణంలో కేటీఆర్ ఆలోచించి ఉంటాడు. అందుకే ఆయనకు ఢిల్లీ వెళ్లేందుకు మనసు రావడం లేదు.
కానీ, ఇదే రోజు.. అంటే ఇవాళే దీనిపై ఆందోళన చేసిన టీజేఎస్ మాత్రం వెంటనే రేపు ఢిల్లీ వెళ్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏమిటో..? ప్రజా ఉద్యమాలకు, విద్యార్థి ఉద్యమాలకు ఉన్న విలువను ఎవరు ఎలా గుర్తిస్తున్నారో…ననే చర్చ జరుగుతోంది.