Akhanda Bharat: రాబోయే రోజుల్లో భారత్ మ్యాప్ రూపం మారనుందా..? ప్రపంచంలో నడుస్తున్న ప్రస్తుత ట్రెండ్‌ను భారత్ కూడా అడాప్ట్ చేసుకుంటుందా…? అఖండ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడానికి ప్లాన్ గీస్తోందా…? పరిణామాలన్నీ చూస్తుంటే సందేహాలు వస్తున్నాయి. మహాత్మా గాంధీ హయాంలోనే వచ్చిన డిమాండ్‌కు ఇప్పుడు వ్యూహాలు రూపొందిస్తున్నట్లు అనుమానం వస్తుంది. కశ్మీర్ 370 రద్దు నుండీ… కొత్త పార్లమెంట్ భవనంలో అఖండ్ భారత్ చిత్రం… తాజాగా, భారత వాతావరణ శాఖ మొదటిసారి నిర్వహిస్తున్న ‘అఖండ్ భారత్’ సెమినార్ వరకూ వ్యవహారం వెనుక ఏదో నేపధ్యం ఉన్నట్లు అనిపిస్తోంది.
ఇటీవల ప్రపంచంలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. గత శతాబ్ధంలో పూర్వపు అవిభక్త రాజ్యాల పాలన కాదని ఎన్నో దేశాలు స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్నాయి. అయితే, ఇప్పుడు రష్యా, చైనా… చివరికి అమెరికా సామ్రాజ్యవాదం దిశగా అడుగులేస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్నా… చైనా తైవాన్‌ను ఆక్రమించాలనుకున్నా… అటు, కొరియాల గొడవైనా… ఇటు, మిడిల్ ఈస్ట్ యుద్ధమైనా… స్పష్టంగా సామ్రాజ్యాలను విస్తరించుకోవాలనే ఉద్దేశం గట్టిగానే ఉంది. చివరికి అమెరికా సైతం… కెనడా, మెక్సికో, పనామా, గ్రీన్ ల్యాండ్‌లను కలుపుకోడానికి ఆసక్తిగా ఉంది. ఇటీవల, దీనిపై అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇప్పుడు భారత్ కూడా ఇదే దిశగా అడుగులేస్తుందా అనే సందేహం కలుగుతుంది.
తాజాగా, భారత వాతావరణ శాఖ 150 ఏళ్లను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘అవిభక్త భారతదేశం’ సెమినార్‌లో పాల్గొనాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు ఇతర పొరుగు దేశాలను భారతదేశం ఆహ్వానించింది. విభేదాలను పక్కనపెట్టి, భారత ఉపఖండం ఉమ్మడి చరిత్రను ఐక్యంగా జరుపుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన తొలి ప్రయత్నం ఇది. ఇందులో భాగంగా… పొరుగున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్‌లకు ఆహ్వానాలు పంపారు. ఉపఖండంతో పాటు, మధ్యప్రాచ్యం, మధ్య-నైరుతి ఆసియా దేశాలకు కూడా ఆహ్వానాలు పంపించారు. అయితే, పాకిస్తాన్ ఇప్పటికే తాము పాల్గొంటామని ధృవీకరించింది. ఇక, బంగ్లాదేశ్ నుండి ధృవీకరణ కోసం భారత్ వేచి ఉంది. బంగ్లాదేశ్ ఓకే అంటే మాత్రం… ఈ సమావేశం ఒక చారిత్రాత్మక క్షణంగా మిగిలిపోతుంది. భారత వాతావరణ సంస్థ స్థాపన సమయంలో అవిభక్త భారతదేశంలో భాగమైన అన్ని దేశాల అధికారులు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నట్లు ఆహ్వానంలో పేర్కొన్నారు. ఇక, ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకోడానికి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.150 రూపాయల స్మారక నాణెం కూడా విడుదల చేయాలని నిర్ణయించారు.
ఒకసారి, భారత వాతావరణ శాఖ చరిత్ర చూస్తే… ఈ శాఖ, జనవరి 15, 1875న స్థాపించబడింది. అయితే, దీని కంటే చాలా కాలం ముందుగానే వాతావరణ అబ్జర్వేటరీలు ఏర్పాటయ్యాయి. మొదటి వాతావరణ అబ్జర్వేటరీలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించగా… కలకత్తా అబ్జర్వేటరీ 1785లో, మద్రాస్ అబ్జర్వేటరీ 1796లో, బాంబే అబ్జర్వేటరీ 1826లో ప్రారంభమైంది. ఇక, 19వ శతాబ్దం ప్రారంభంలో అనేక అబ్జర్వేటరీలను స్థాపించారు. ఇప్పుడు, ఇవి భారత ఉపఖండం అంతటా విస్తరించాయి. 1864లో వచ్చిన తుఫాను కలకత్తాను నాశనం చేసిన తర్వాత… 1866, 1871లో రెండు ఘోరమైన రుతుపవనాల వైఫల్యాల వల్ల బెంగాల్ అంతటా కరువు ఏర్పడింది. దాని తర్వాత 1875లో భారత వాతావరణ శాఖ ఉనికిలోకి వచ్చింది.
బ్రిటిష్ రాజ్ పాలనలో అడ్మినిస్ట్రేటీవ్ రికార్డుల నిర్వహణ, డేటా విశ్లేషణ అవసరమని నిర్ణయించిన తర్వాత భారత వాతావరణ శాఖ ఏర్పాటయ్యింది. కాబట్టి, వాతావరణ పరిశీలనల సేకరణ, విశ్లేషణ ఒకే భవనంలో ప్రారంభమయ్యాయి. భారత వాతావరణ శాఖ అనే సంస్థగా దీన్ని పేర్కొన్నారు. ఇక, 1875లో ప్రారంభమైనప్పటి నుండి, IMD ప్రధాన కార్యాలయం కలకత్తాలోనే ఉంది. 1905లో దీనిని సిమ్లాకు, తర్వాత 1928లో పూణేకు… చివరికి 1944లో న్యూఢిల్లీకి తరలించారు. అప్పటి నుండి అది అక్కడే ఉంది. అయితే, సంవత్సరాలుగా IMD ఒక సాధారణ స్థాయి నుండి ఆసియాకు ప్రముఖ వాతావరణ సూచన సంస్థగా మారింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, IMD వాతావరణ శాస్త్రాలు, కమ్యూనికేషన్, శాస్త్రీయ ఆవిష్కరణలలో గణనీయమైన పురోగతిని సాధించింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో స్థాపించబడినప్పుడు, దానితో సహకరించిన మొదటి వాటిలో వాతావరణ శాఖ ఒకటి. 24 గంటల వాతావరణ పర్యవేక్షణ మరియు తుఫాను హెచ్చరికల కోసం తన సొంత భూస్థిర ఉపగ్రహం INSATను ప్రయోగించిన మొదటి అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం నిలిచింది.
Also Read: Kondapalli Srinivas: ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా..? ఇది నిజమేనా..?
ఇంత చరిత్ర ఉంది కాబట్టే భారత వాతావరణ శాఖ 150వ వార్షికోత్సవాన్ని అఖండ భారత్ ఆశకు వేదిక చేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల… ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో కూడా అఖండ భారత్ అంశం చర్చకు దారి తీసింది. కొత్త పార్లమెంట్ భవనంలోని ఓ గోడపై ఉన్న మ్యాప్ శతాబ్దాలకు ముందు ఉన్న భారతదేశాన్ని సూచించే విధంగా రూపొందించారు. అందులో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న తక్షశిల, మరికొన్ని రాజ్యాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాప్‌ని ట్విట్టర్‌లో షేర్ చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ‘సంకల్పం సుస్పష్టం.. అఖండ భారత్’ అంటూ ట్వీట్ చేశారు. ప్రాచీన యుగాలలో భారతీయ ప్రభావాన్ని చిత్రించాలనే ఉద్దేశంతో… వాయువ్య ప్రాంతంలోని ప్రస్తుత అఫ్గనిస్థాన్ నుంచి ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించిని అఖండ భారత్ చిత్రాన్ని చెక్కారు.