E-Paper
Advertisement

Nitish Kumar: 19 ఏళ్ల అధికారం.. నితీష్‌పై బీహార్ ప్రజల నమ్మకానికి కారణాలు ఇవేనా?

Nitish Kumar: 19 ఏళ్ల అధికారం.. నితీష్‌పై బీహార్ ప్రజల నమ్మకానికి కారణాలు ఇవేనా?
Advertisement

Nitish Kumar: 19 ఏళ్లుగా అధికారంలో ఉన్నా వ్యతిరేకత లేదు. పరిపాలనపై రిమార్క్ లేదు. ఆయనకు.. 75 ఏళ్ల వయసొచ్చినా జనం పెద్దగా పట్టించుకోలేదు. బీహార్‌లో నితీశ్ సర్కార్ టర్మ్‌లు మారుతోంది. రాజకీయం తీరు మారుతోంది. కానీ.. దాదాపు 20 ఏళ్లుగా జనం తీర్పు మాత్రం మారట్లేదు. బీహార్.. ఎందుకోసం మళ్లీ మళ్లీ నితీశ్ పాలనని, ప్రభుత్వాన్ని కోరుకుంటోంది? ఒక రాజకీయ నేతని.. జనం ఇంత బలంగా నమ్మడానికి రీజనేంటి? నితీశ్ మ్యాజిక్ వెనకున్న పబ్లిక్ లాజిక్ ఏంటి?

కానీ.. బీహార్‌లో నితీశ్ ప్రభంజనం మారడం లేదు. ప్రభుత్వం మారడం లేదు. పరిపాలనలో మారట్లేదు. జనం తీర్పు కూడా మారట్లేదు. 19 ఏళ్లకు పైగా.. బీహార్‌ని ఏలుతున్నది ఒకే నాయకుడు. అయినా సరే.. మెజారిటీ ప్రజలకు బోర్ కొట్టట్లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావట్లేదు. పదే.. పదే.. ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. మళ్లీ మళ్లీ అదే ప్రభుత్వం కొనసాగాలని అనుకుంటున్నారు. ఇన్నేళ్లవుతున్నా.. బీహార్ ప్రజల తుది తీర్పు మాత్రం స్థిరంగా ఉంటోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా.. బీహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ సెంటర్ పాయింట్‌గా కంటిన్యూ అవుతున్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా.. ఆయన పాలనపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. ఆయనకు 75 ఏళ్ల వయసొచ్చినా.. జనం నితీశ్‌కు నమ్మకాన్ని కోల్పోకపోవడం లేదు. ఇది.. భారత రాజకీయాల్లోనే ఓ అసాధారణమైన ఘట్టంగా చెప్పొచ్చు. 1985లో నితీశ్ కుమార్ అసెంబ్లీలో అడుగు పెట్టిన రోజు నుంచి.. ఆయన పార్టీ జేడీయూ ఎన్నో చీలికలు, మరెన్నో పొత్తులు, ఎన్నికల తిరుగుబాట్లని అధిగమించింది. అధికారాన్ని నిలబెట్టుకుంది. నితీశ్ కూడా కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా అనేకసార్లు పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత.. నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీహార్ పొలిటికల్ హిస్టరీలో.. తన రికార్డును తానే బద్దలుకొడుతూ.. తన కీర్తిని విస్తరించుకుంటున్నారు.

Advertisement

ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పట్టభద్రుడైన నితీశ్ కుమార్.. సోషల్ ఇంజనీరింగ్ వైపు ఆకర్షితుడయ్యారు. బీహార్ రాజకీయ ముఖచిత్రంపై తనదైన ముద్ర వేశారు. 1974 నుంచి 77 వరకు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో.. జైలు శిక్ష అనుభవించిన నాయకుల్లో నితీశ్ కూడా ఒకరు. 1985లో హర్నాట్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన జనతాదళ్‌లో ఉన్నారు. 1989లో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి.. పదిహేనేళ్లు ఎంపీగా పనిచేశారు. 1998లో జనతాదళ్ నుంచి విడిపోయిన తర్వాత.. జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీని స్థాపించారు.

వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో.. తొలిసారి రైల్వే మంత్రి అయ్యారు. బెంగాల్‌లో జరిగిన గైసల్ రైలు దుర్ఘటన తర్వాత.. రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2000 సంవత్సరం ఎన్నికల్లో బీహార్‌లో హంగ్ ఏర్పడటంతో.. తొలిసారి బీహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. వారం తర్వాత ఎన్డీయే బలపరీక్షలో నెగ్గడానికి సంఖ్యాబలం లేకపోవడంతో.. రాజీనామా చేశారు. 2005లో దాణా కుంభకోణం కారణంగా 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఒక్క పరిణామం.. రబ్రీ దేవి స్థానంలో ఆర్జేడీపై ఎన్డీయే విజయానికి దారితీసింది.

Advertisement

2014లో.. జేడీయూకి ఎన్డీయేతో సంబంధాలు తెగిపోయాయ్. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ దారుణంగా ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2015లో ప్రత్యర్థి అయిన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేశారు. దానినే.. మహా‌ఘట్‌బంధన్‌గా పిలిచారు. అప్పుడు నితీశ్ కుమార్ యాదవ్ సీఎంగా, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 2017లో మళ్లీ మహా‌ఘట్‌బంధన్ నుంచి బయటకొచ్చి.. ఎన్డీయేలో చేరారు. అప్పుడు కూడా సీఎం పదవికి రాజీనామా చేసి.. ఎన్డీయే కూటమి సీఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. 2022లో మరోసారి ఎన్డీయేని వదిలిపెట్టి.. మహా‌ఘట్‌బంధన్‌లో చేరారు. 2024లో మళ్లీ ఎన్డీయేలోకి తిరిగి వచ్చారు. ఆరోగ్యం క్షీణిస్తోందనే చర్చల మధ్యే.. నితీశ్ సీఎంగా కొనసాగారు. ఇప్పుడదే కూటమి నుంచి భారీ మెజారిటీతో గెలిచి.. రికార్డు స్థాయిలో పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. గడిచిన 20 ఏళ్లలో.. నితీశ్ కుమార్ ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా.. ఎన్నిసార్లు రాజీనామా చేసినా.. కూటములు మార్చినా.. జనం మాత్రం నితీశ్ వైపే నిలబడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని కోరుకున్నారు.

బీహార్‌లో నితీశ్ కుమార్‌కు.. క్యాస్ట్ న్యూట్రల్ లీడర్ అనే ఇమేజ్ ఉంది. పైగా.. అభివృద్ధి ప్రదాతగా గుర్తింపు పొందారు. కేవలం.. ఒకే కులానికి పరిమితం కాకుండా.. అత్యంత వెనుకబడిన వర్గాలు, మహాదళితులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈబీసీలు, మహాదళితులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారిని రాజకీయంగా, సామాజికంగా బలోపేతం చేశారు. ఈ వర్గాలు.. నితీశ్‌ని తమకు అండగా నిలిచిన నాయకుడిగా భావిస్తాయ్. ముఖ్యంగా.. నితీశ్ పాలనలో రోడ్లు, గ్రామాలకు విద్యుత్ సరఫరా, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధి లాంటి మౌలిక సదుపాయాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. అంతకుముందు.. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని బీహార్‌లో ఈ మార్పు ప్రజలకు కళ్లారా కనిపించింది. పైగా.. నితీశ్ పాలనలో స్థిరత్వం ఉంది.

ఆయన నాయకత్వంపై విశ్వసనీయత ఉంది. తన హయాంలో సంక్షేమ పథకాలు, కేంద్ర నిధులను సరైన విధానంలో వాడుకోవడంలో పేరుపొందారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించలేకపోయినా.. స్థిరమైన పాలనని అందించగలిగారు. నితీశ్ తరచుగా పొత్తులు మార్చినా, కూటములు మారినా.. బీహార్‌లో శాంతిభద్రతలకే తన తొలి ప్రాధాన్యత అనే వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఇదే.. జనంలో ఆయనపై నమ్మకం సడలకుండా చేసింది. బీహార్‌లో.. నితీశ్ ప్రత్యర్థులు, తేజస్వి యాదవ్ ఇచ్చిన భారీ వాగ్దానాల కంటే.. నితీశ్ నిలకడైన పాలననే జనం ఎక్కువగా నమ్ముతున్నారనడానికి.. బీహార్ ప్రజల తీర్పే నిదర్శనం.

బీహార్‍‌ లెక్క చాలా సింపుల్. నితీశ్‌ పాలనని ఇంత గట్టిగా కోరుకోవడానికి మెయిన్ రీజన్ ఒక్కటే. ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల లాంటివన్నీ పక్కనబెడితే.. బీహార్ ప్రశాంతంగా ఉండాలి! అక్కడి జనం బలంగా కోరుకునేది ఇదొక్కటే! అంటే.. ఇన్నేళ్లయినా బీహార్ ప్రజలు జంగిల్‌రాజ్‌ని మర్చిపోలేకపోతున్నారా? ఈ జనరేషన్ కూడా నితీశ్‌నే నమ్మడానికి రీజనేంటి? పార్టీలు, ప్రభుత్వం, పరిపాలన విషయంలో.. బీహార్ ప్రజల ఆలోచన ఎలా ఉంది?

మొన్నటి ఎన్నికల్లో బీహార్‌లో గట్టిగా పనిచేసిన ఫ్యాక్టర్ ఒక్కటే. నితీశ్ సుపరిపాలనకు, లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలోని జంగిల్ రాజ్‌కు మధ్య వచ్చిన పోలికే.. బీహార్ మళ్లీ నితీశ్‌కి పట్టం కట్టేందుకు కారణమైంది. గత 20 ఏళ్లుగా.. బీహార్‌లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. ఇదొక్కటే పొలిటికల్ స్క్రీన్ మీదకు వస్తోంది. మహిళలను, యువతను.. అదే ప్రభావితం చేస్తోంది. 20 ఏళ్ల కిందటి నాటి ఓటర్లంటే ఏమో అనుకోవచ్చు. కానీ.. నేటితరం నవ, యువ ఓటర్లు కూడా నితీశ్ వెంటే నిలుస్తున్నారు. అలాగని.. నితీశ్ కుమార్ అంతగా పేరున్న విజనరీ లీడరేమీ కాదు. బీహార్ కూడా నితీశ్ హయాంలో.. దేశంలోని ఏ రాష్ట్రం సాధించనంత అభివృద్ధిలోనూ దూసుకుపోలేదు. కేవలం.. మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల మీదే.. అలా నడుస్తూ ఉంటుంది.

ఇవన్నీ పక్కనబెడితే.. ముఖ్యంగా.. జనం శాంతి భద్రతలను కోరుకున్నారు. క్రైమ్ రేట్ కంట్రోల్‌లో ఉండాలనుకున్నారు. కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీల లాంటివి చూడొద్దని గట్టిగా డిసైడ్ అయ్యారు. ప్రశాంతమైన జీవనం గడపాలనుకున్నారు. ఇప్పుడు.. నితీశ్ పాలనలో ఈ పరిస్థితులే ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో.. మళ్లీ ఆర్జేడీ కూటమి గనక అధికారంలోకి వస్తే.. బీహార్‌లో మళ్లీ జంగిల్ రాజ్ వస్తుందనే భయంతోనే.. ఇలాంటి తీర్పు ఇచ్చారనే చర్చ ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా నడుస్తోంది. బీహార్ ప్రజల్లో ఈ తరహా భావన ఇప్పటికీ పోవట్లేదు. ఎప్పటికి పోతుందో క్లారిటీ లేదు. నితీశ్ కుమార్ ఉన్నంతవరకు బీహార్‌లో మెజారిటీ ప్రజల మద్దతు ఆయనకే ఉంటుందన్నది మాత్రం ఈ ఎన్నికలతో తేలిపోయింది. నితీశ్ తర్వాత బీహార్ జనం ముందున్న ఆప్షన్ ఎవరన్న దానిపై.. ఇప్పటికైతే స్పష్టత లేదు. కానీ.. మరోసారి రాష్ట్రంలో జంగిల్ రాజ్ రావొద్దనే క్లారిటీ మాత్రం మెజారిటీ ప్రజలకు ఉంది.

1990 నుంచి 2005 మధ్య కాలంలో.. బీహార్‌లో శాంతిభద్రతలు క్షీణించాయి. కిడ్నాప్‌లు, దోపిడీలు, హత్యలు అధికమయ్యాయి. సాయంత్రం వేళల్లో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. మహిళలకు కూడా అనేక కట్టుబాట్లు ఉండేవి. నితీశ్ కుమార్ అధికారంలోకి వచ్చాక.. న్యాయంతో కూడిన అభివృద్ధిని నినాదంగా మార్చుకున్నారు. వేలాది మంది నేరస్తులకు శిక్షలు పడేలా చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌ని కఠినంగా అణచివేశారు. దాంతో.. ప్రజలకు తమ భద్రతపై నమ్మకం ఏర్పడింది. ఇక.. మహిళల్లోనూ నితీశ్ బలమైన ఓట్ బ్యాంక్‌ని నిర్మించుకున్నారు. మహిళా ఓటర్లే.. నితీశ్ పాలనకు స్థిరమైన మద్దతుదారులుగా ఉన్నారు.

2016లో తీసుకొచ్చిన మద్య నిషేధం.. గ్రామీణ మహిళల్లో సానుకూల ప్రభావాన్ని చూపింది. జీవిక ప్రోగ్రామ్ ద్వారా.. లక్షలాది మంది మహిళలకు ఆర్థిక స్థిరత్వం, రుణ సౌకర్యం, శ్రమ గౌరవం లభించాయి. పంచాయతీ రాజ్ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో.. వారి రాజకీయ, సామాజిక సాధికారతకు అడుగు ముందుకు పడింది. అందువల్ల.. బీహార్ మహిళలు.. నితీశ్ పాలనలో అనుభవిస్తున్న స్వేచ్ఛను, భద్రతను తిరిగి జంగిల్ రాజ్‌లో కోల్పోవడానికి సిద్ధంగా లేరు. జేడీయూ ప్రభుత్వ పాలనలో లోపాలు ఉన్నప్పటికీ, ఉద్యోగాల సృష్టిలో వెనుకబడినప్పటికీ.. అరాచకం కంటే స్థిరమైన, భద్రతతో కూడిన పాలనే నయమనే.. సామాన్య ప్రజల ఆలోచనే.. నితీశ్ కుమార్‌ని రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలలో.. మరో ఆప్షన్ లేని నాయకుడిగా నిలబెట్టింది.

Also Read: ఏపీ ప్రభుత్వానికి రాజధాని రైతుల అల్టిమేటం.. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం చేస్తామని హెచ్చరిక..

జంగిల్‌రాజ్‌ నుంచి బీహార్‌ని రక్షిస్తానని 2005లో నీతీశ్‌ తొలిసారి అధికారంలోకి వచ్చారు. రెండు దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆయన రాజకీయంగా బలంగానే ఉన్నారు. బీజేపీ, ఆర్జేడీతో కలిసి గతంలో అధికారాన్ని పంచుకున్నా.. ఆయన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొన్నటి ఎన్నికల్లోనూ.. ప్రధాని మోడీ కూడా జంగిల్ రాజ్ ప్రస్తావన తెచ్చారు. అది.. మరోసారి బీహార్ ప్రజలు ఆలోచించేలా చేసింది. 2005 నుంచి తెచ్చిన సుపరిపాలన, కొత్తగా చేపట్టిన అభివృద్ధి ఎజెండానే జనం నమ్మారు. దాంతో.. 75ఏళ్ల నీతీశ్‌ దాదాపుగా తన చివరి ఎన్నికలుగా భావిస్తున్న ఈ పోరులో ప్రభంజనం సృష్టించారు. నితీశ్ కుమార్ విజయం కేవలం.. రాజకీయ వ్యూహం మాత్రమే కాదు. ఇది.. బీహార్ సమాజంలోని లోతైన అవసరాలు, వారిలోని భయాలు, ఆకాంక్షలకు ఓ మిర్రర్ లాంటిది. శాంతిభద్రతల పునరుద్ధరణ, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన పాలన అనే పునాదుల మీద.. నితీశ్ కుమార్ ప్రజల్లో తనపై నమ్మకాన్ని బలంగా నిర్మించుకున్నారు. ఇది.. ఆయన రాజకీయాల్లో కొనసాగినంత వరకు ఉంటుంది. ఇప్పట్లో దీనిని మార్చడం ఎవరి వల్లా కాదని.. ఈ ఎన్నికలతో తేలిపోయింది.

Story By Anup, Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×