కేసీఆర్ పాలన.. కల్వకుంట్ల కుటుంబంపై తెలంగాణ రక్షణ సేన (టీఆరెస్) చీఫ్ కవిత మరోసారి విరుచుకుపడ్డారు. నేరేళ్లలో దళితులపై ఆనాడు జరిగిన పాశవిక దాడిని గురించి ప్రస్తావిస్తూ ఆమె పదేళ్ల పాలనను పాపాల పాలనతో పోల్చారు. ఆ కుటుంబంలో పుట్టినందుకు పశ్చాత్తాపం ప్రకటించారు.
ఆనాడు తనూ ప్రభుత్వంలో భాగస్వామిని అయినందుకు సిగ్గుతో తలించుకుంటున్నానన్న ఆమె.. బాధిత కుటుంబాలకు క్షమాపణ కోరారు. సిరిసిల్లా జిల్లా తంగెళ్లపల్లి మండలం నేరెళ్లలో ఇటీవల మృతి చెందిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం నేరెళ్ల బాధితులను కూడా ఆమె పరామర్శించారు. అక్కడే వారితో కలిసి మీడియాతో కవిత మాట్లాడారు. కేటీఆర్, బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ ముగ్గురూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయలేకపోయారన్నారు.
కేటీఆర్ అధికారంలో ఉండి వారిని అండగా నిలబడలేకపోయారని విమర్శించిన ఆమె.. పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ఆనాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 8 మందిని ఐదు రోజుల పాటు విపరీతంగా కొట్టారని, జైలర్ కూడా వీరిని తీసుకోవడానికి అనుమతించని విధంగా చితకబాదారని గుర్తు చేశారు.
మానవ హక్కుల కమిషన ఎస్పీపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినా.. ఓ ఎస్సైని బలి చేసి చేతులు దులుపుకున్నారని ఆనాటి పాలకుల రీతిని ఎండగట్టారు కవిత. బండి సంజయ్ కూడా ముసలి కన్నీరు కార్చి కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశానని అన్నారని, ఇంత వరకు ఆ రిపోర్టును బయటకు తీయలేదన్నారు.
కేటీఆర్ ఈ బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, ఆర్థికసాయం అందించాలని, విద్యా, వైద్యానికి పూర్తిగా మద్దతుగా నిలబడాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధితులకు ఒక్కొక్కరికి ఒక్కో కోటి చొప్పున పరిహారం అందించాలని కూడా ఆమె కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇష్యూను వదిలేది లేదన్నారామె. బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామని, కమిషన్ రిపోర్టును బయటకు తీసి… బాధితులకు న్యాయం జరిగి.. నిందుతులను బటయకు లాగి వారికి శిక్ష పడేదాకా వదలబోమన్నారు.
పరామర్శించి వెళ్లడానికి రాలేదని, పోరాడి, ప్రశ్నించి.. సమస్య పరిష్కారమయ్యేదాకా వీరికి అండగా ఉంటామని చెప్పేందుకే వచ్చామన్నారు. రక్షణ సేనా అని పేరు పెట్టుకున్నది ఇందుకేనన్నారు. తెలంగాణ సమాజాన్ని రక్షించుకోవడమే ఈ టీఆరెస్ ప్రధాన కర్తవ్యమని గుర్తు చేశారు కవిత.