Alla Rama Krishna Reddy: రాజకీయాల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంట్రీనే అనూహ్యంగా జరిగింది.. మంగళగిరి ఎమ్మెల్యేగా తొలిసారి అత్యల్ప మెజార్టీతో గెలిచిన ఆర్కే.. రెండో సారి అనూహ్య విజయం సాధించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు. అయితే లోకేష్‌పై గెలిచిన ఆయనకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు సరికదా.. మొన్నటి ఎన్నికల్లో టికెట్ కూడా లేకుండా చేశారు. దాంతో ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ముఖ్యనాయకుడిగా ఫోకస్ అయిన ఆర్కే ఒక్కసారిగా తెరమరుగయ్యారు. ఇక ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లేనా? అసలు ఆయన రాజకీయ భవితవ్యంపై జరుగుతున్న చర్చేంటి?
మంగళగిరిలో మొదటిసారి 12 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆర్కే
ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అంటే రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. ఆయన 2014, 2019 ఎన్నికల్లో వరసగా మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తొలిసారి పోటీ చేసినప్పుడు నాటకీయ పరిణామాల మధ్య 12 ఓట్లతో గట్టెక్కి మంగళగిరిలో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. 2019లో అయితే మంత్రిగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మీద 5,337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.
లోకేష్‌పై గెలిచి జెయింట్ కిల్లర్ అనిపించుకున్న ఆర్కే
లోకేష్‌పై గెలవడంతో మంగళగిరి ఆర్కే పేరు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలో కూడా మారుమ్రోగిపోయింది. టీడీపీ అంటే చాలు ఒంటి కాలిపై లెగిసే నేతల్లో ఒకరిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే మిగిలిన వైసీపీ నేతల్లా పరుష పదజాలం వాడకుండా లాజికల్‌గా మాట్లాడే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ తీవ్రంగా వ్యతిరేకించిన రాజధాని అమరావతి అంశంలో, రాజధాని భూ సమీకరణ విషయంలో టీడీపీ నేతలను, ప్రభుత్వాన్ని కోర్డు కేసులతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు.
జగన్ హామీ ఇచ్చినా ఆర్కేకి దక్కని మంత్రి పదవి
ఆ సమయంలో లోకేష్ పై గెలవడంతో అందరూ ఆర్కేకి మంత్రి పదవి కన్ఫామ్ అనుకున్నారు. కేబినెట్ బెర్త్‌పై జగన్ కూడా ఆయనకు హామీ ఇచ్చారు. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో జగన్ స్వయంగా ఆ విషయం వెల్లడించారు. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు ఆర్కే మంత్రివర్గంలోకి రాబోతున్నారని గట్టి ప్రచారాలు జరిగాయి. కానీ గత ప్రభుత్వంలో ఆర్కే కి మాత్రం మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఇక ఎన్నికల ముందు మంగళగిరి టికెట్ విషయంలో ఆళ్ళకు కాకుండా టీడీపీ నుంచి వచ్చి గంజి చిరంజీవికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన అలకపాన్పు ఎక్కారు.
టికెట్ విషయంలో అలకపాన్పు ఎక్కిన ఆర్కే
ఒక టైమ్‌లో ఓ టైం లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడటంతో పాటు, రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. తర్వాత పరిణామాలతో కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. కొన్ని రోజులు పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల వెంట కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఏమైందో ఏమో కాని మళ్లీ వైసీపీ గూటికే చేరారు. వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ బిల్లులు క్లియర్ చేయడం వల్లే ఆర్కే టికెట్ దక్కకపోయినా సైలెంట్‌గా ఉన్నారంటారు. అయితే అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో సైతం వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు.
సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్‌గా ఆర్కె పేరు ప్రతిపాదన
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడమే కాదు మంగళగిరిలో లోకేష్ రికార్డు మెజారిటీ తో గెలవడంతో మంగళగిరిలో ఆర్కే కనిపించడమే మానేశారు. ఇప్పటి వరకు సైలెంట్ మోడ్‌లోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే.. ఇప్పట్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవంటున్నారు. ఆ మధ్యన ఆయనను సత్తెనపల్లి ఇన్చార్జ్‌గా వెళ్ళమని పార్టీ కోరిందని వార్తలు వచ్చాయి. అయితే దానికి ఆయన సమ్మతించలేదంట. ఆర్కే మౌనానికి పార్టీ పరంగా జగన్ వైఖరే కారణమన్న వాదన వినిపిస్తోంది.
మంగళగిరి విషయంలో ఆర్కేని సంప్రదించని జగన్
ఎన్నికల అనంతరం నియోజకవర్గాల వారీగా ప్రక్షాళన చేస్తున్న జగన్ మంగళగిరి నియోజకవర్గంపై అసలు దృష్టి పెట్టలేదు. ఆర్కేని కనీసం పిలిపించి మాట్లాడకపోవడం, ఆయనకు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వక పోవడమే ఆర్కే మౌనానికి కారణంగా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీ పరిస్థితి ఉండీ లేనట్లే కనిపిస్తుంది. కార్యకర్తలకు ధైర్యం చెప్పేవారు, కనీసం వైసీపీ వాయిస్ వినిపించే వారు లేకపోవడంతో అక్కడ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది.
మంగళగిరి బాధ్యతలు ఆర్కేకి అప్పగించాలంటున్న క్యాడర్
మాజీ మంత్రి అంబటి రాంబాబును సత్తెనపల్లి నుంచి షిఫ్ట్ చేసిన జగన్ అక్కడ వైసీపీ ఇన్చార్జ్‌గా సుధీర్ రెడ్డిని ప్రకటించారు. ఇప్పుడు సత్తెనపల్లి గోల లేదు కాబట్టి.. మంగళగిరి పార్టీ బాధ్యతలు ఆర్కేకి అప్పగిస్తే ఆయనకే కాదు పార్టీ కూడా మళ్ళీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. అదే కాకుండా మంగళగిరిలో లోకేష్‌ను ఎదుర్కోవాలంటే ఆర్కే దిక్కన్న టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో.