Big Stories

Nellore Rural Politics: కోటంరెడ్డి కొంప కొల్లేరా? ఆదాల అడ్రస్ గల్లంతా?

Analysis on Nellore Rural Assembly Constituency 2024: ఈ ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ వివిధ సెగ్మెంట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాంటి చోట్ల భారీ మెజార్టీతో గెలవాలని పావులు కదిపారు. ఆ లిస్ట్‌లో నెల్లూరు రూరల్ సెగ్మెంట్ ఒకటి. అక్కడ నుంచి రెండో సారి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ముందు నుంచి జగన్ వీరవిధేయుడన్న పేరుండేది.. అలాంటాయన జగన్‌కి రివర్స్ అయ్యారు. కోటంరెడ్డి జగన్‌తో పాటు వైసీపీపై చేసిన పదునైన విమర్శలు ఆ పార్టీకి డ్యామేజ్‌గా మారాయి. అందుకే ఈ సారి ఏలాగైన కోటంరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాలను కోటంరెడ్డిపై పోటీకి దింపారు. నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి వర్సెస్ ఆదాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ క్రమంలో వారిలో గెలుపుగుర్రం ఎక్కేదెవరన్నది ఆసక్తి రేపుతోంది

- Advertisement -

ఇప్పుడు మీరు చూస్తున్నది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం.. పేరుకు రూరల్ అయినా అత్యధిక భూభాగం సిటీ పరిధిలోనే ఉంటుంది. 2009 ఎన్నికలప్పుడు కొత్తగా ఏర్పడిన రూరల్ సెగ్మెంట్లో.. మొదటిసారి దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డికి  నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటారని .. సమస్యలపై తక్షణం స్పందిస్తారన్న గుడ్‌విల్ ఉంది.

- Advertisement -

సెగ్మెంట్లో విస్తృత పరిచయాలు, మంచి రాజకీయ సంబంధాలు ఉన్న కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఈ సారి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు .. మంచి వాగ్దాటితో ప్రత్యర్ధులను ఇరుకున పెట్టగల సామర్థ్యం ఉన్న సీనియర్ నేతగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుర్తింపు ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని ఒక రేంజ్లో టార్గెట్ చేసిన కోటంరెడ్డి. వైసీపీ నుంచి బయటకు వచ్చేటప్పుడు జగన్‌ని పెద్ద ఇరకాటంలోకి నెట్టారు వైసీపీ ప్రభుత్వం ఫోన్ టాపింగ్‌కు పాల్పడుతుందన్న ఆరోపణలతో దుమారం రేపారు. ఆ అంశాన్ని తెలుగుదేశం పార్టీ మంచిగా క్యాష్ చేసుకుందన్న అభిప్రాయం ఉంది.

Also Read: పిఠాపురంలో అల్లర్లు!! హైటెన్షన్!

ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే వైసీపీని టార్గెట్ చేయడం ప్రారంభించిన కోటంరెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా.. కక్షసాధింపులకు పాల్పడుతున్నారని జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైసీపీతో తెగతెంపులకు సిద్దమైన ఆయన జిల్లాకు చెందిన ఇతర సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం, మేకపాటిలతో కలిసి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చి బయటకు వచ్చారు. ఎన్నికలకు కొంత కాలం ముందు టీడీపీలో చేరి సొంత నియోజకవర్గం నుంచి మూడో సారి పోటీ చేశారు.

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరవేసినప్పుడే .. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డికి నెల్లూరు రూరల్ ఇన్చార్జ్‌ బాధ్యతలు కట్టబెట్టారు జగన్ .. ఆదాలను రూరల్‌‌కు షిఫ్ట్ చేసినప్పుడు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్ధిగా బిగ్ షాట్ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఫోకస్ అవుతున్నారు. వైసీపీ ఇన్చార్జ్‌గా నెల్లూరు రూరల్‌లో హడావుడి మొదలుపెట్టిన ఆదాల ప్రభాకరరెడ్డి.. వేమిరెడ్డితో సత్సంబంధాలు కొనసాగించారు. అయితే ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేశారు.. వేమిరెడ్డి నిర్ణయంతో షాక్ అయిన వైసీపీ నేతలు ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేశారు.. ఆ టైంలో కోటంరెడ్డి అధికారపక్ష నేతలకు గట్టిగానే వార్నింగులు ఇచ్చారు. వైసీపీలో ఉన్నప్పటి నుంచే వేమిరెడ్డితో సత్సంబంధాలున్న కోటంరెడ్డికి ఆయన కూడా టీడీపీలోకి రావడం, ఎంపీగా పోటీ చేయడం ప్లస్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

అదలా ఉంటే గతంలో సర్వేపల్లి, అల్లూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేగా పనిచేసి.. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచారు ఆదాల ప్రభాకరరెడ్డి.. ఆయన్ని రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన జగన్ ఆ టైంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులను కూడా భారీగానే మంజూరు చేశారు. అప్పటినుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నాయకులు, ప్రజలతో సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేశారు .. చివరి నిముషంలో ఎంపీ అభ్యర్ధిగా వచ్చిన విజయసాయిరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులిద్దరూ నెల్లూరు రూరల్‌కి కొత్త ముఖాలే అవ్వడంతో ప్రచారంలో దూకుడు ప్రదర్శించలేకపోయారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం .. పోల్‌మేనేజ్‌మెంట్‌పై ఆయనకున్న పట్టు, ప్రతి బూత్ పరిధిలో సొంత అనుచరగణం ఉండటం, స్థానికంగా ఉన్న విస్తృత పరిచయాలు.. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ పరిచయాలతోనే కోటంరెడ్డి వరుసగా రెండు సార్లూ 20 వేలకు పైగా మెజార్టీతో గెలిచారంటున్నారు. ఆయన2019 ఎన్నికల్లో 60.56 శాతం పోలింగ్ నమోదైనప్పుడు కోటంరెడ్డి 22, 776 వేల మెజార్టీతో గెలిచారు. ఈ సారి ఆ సెగ్మెంట్లో 67.76 శాతం పోలింగ్ నమోదైంది .. దాంతో ఈ సారి గెలిచే అభ్యర్ధి మెజార్టీపై చర్చలు మొదలయ్యాయి.

Also Read: సీదిరికి సినిగిపోద్దా? సిత్తరాల సిరపడా!?

కోటంరెడ్డి టీడీపీలో చేరిన తక్కువ కాలంలోనే భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి తీసుకొచ్చారు.. నెల్లూరులో గణనీయంగా ఉన్న కోటంరెడ్డి బంధుగణం అంతా ఈ సారి రాజకీయాలకు అతీతంగా ఆయన విజయం కోసం పనిచేసిందంటున్నారు. ముందు నుంచి టీడీపీలో కొనసాగుతూ ఆయనకు రాజకీయ శత్రువులుగా ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ సారి అండగా నిలిచారంట. మరోవైపు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి వైసీపీలో చేరడం కూడా కలిసి వచ్చిందంటున్నారు. అలాగే రూరల్ నియోజకవర్గంలో పట్టున్న ఆనం విజయకుమార్ రెడ్డి ఆదాలకు అండగా నిలిచారు. దానికి తోడు జగన్ నవరత్నాలపై ఆదాల ధీమాగా కనిపిస్తున్నారు.

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లోని 26 డివిజన్లతో పాటు 18 గ్రామపంచాయతీలు రూరల్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. అలాంటి చోట సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీలు ప్రత్యర్ధులుగా పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. మరి ఆ సిటీ, రూరల్ మిక్స్‌డ్ ఓటర్లు ఈ సారి ఎవరికి పట్టం కడతారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News