Big Stories

High Tension At Pithapuram: పిఠాపురంలో అల్లర్లు!! హైటెన్షన్!

High Tension at Pithapuram & Kakinada(AP political news): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయితే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాకాండ అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరి మీద దాడులు జరుగుతాయో అన్న భయాందోళనలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి కాకినాడ జిల్లాలో ఎక్కువగా కనబడుతోంది. జిల్లాలోని పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో పోలీస్ శాఖ ఒకసారిగా అప్రమత్తమైంది. అసలు అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా.? అక్కడ ఏం జరుగుతోంది?

- Advertisement -

కాకినాడ జిల్లాలో అధికార యంత్రంగానికి కంటిమీద కునుకు కరువైంది. ఈ క్షణాన ఏం జరుగుతుందో అని యావత్తు సిబ్బంది అప్రమత్తమవుతున్నారు. ఈ జిల్లాలో కీలకమైన పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్దం నడిచింది. వైసీపీ అల్లరి మూకలను పెంచి పోషిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు… దానికి బదులుగా దమ్ముంటే నిరూపించాలని వైసీపీ నేతలు ప్రతి సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల వారు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు.

- Advertisement -

దానికి తోడు పోలింగ్ సమయంలో ఈ రెండు నియోజకవర్గాలలోను అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు జరిగాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఎక్కడికక్కడ అల్లర్లను అణచివేశారు … అంతా ప్రశాంతంగా ముగిసింది అనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాకాండ .. కౌంటింగ్ రోజున కాకినాడ, పిఠాపురంలలో రిపీట్ అయ్యే పరిస్థితి ఉందని ఇంటలిజెన్స్ విభాగం పోలీసులను అలెర్ట్ చేసింది..ఇప్పటికే మేము గెలుస్తున్నాం అంటే.. మేము గెలుస్తున్నాం అంటూ ఎవరికి వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.. ఆ రెండు సెగ్మెంట్లలో పోలింగ్ సమయంలో పెద్దగా అల్లర్లు జరగకపోయినా ఒకింత టెన్షన్ వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయి.

Also Read: సీదిరికి సినిగిపోద్దా? సిత్తరాల సిరపడా!?

కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసిపి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి టిడిపి అభ్యర్థిగా వనమాడి కొండబాబు పోటీ చేశారు. ఇరువురి మధ్య పోటీ హోరా హూరిగా జరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కౌంటిగ్ రోజు, ఫలితాల వెల్లడి తర్వాత టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం భావిస్తోంది. ఈ మేరకు డీజీపీకి కూడా నివేదిక అందించింది. కాకినాడలో గంజాయి, డ్రగ్స్ ముఠాలను ద్వారంపూడి పెంచి పోషిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ పెద్ద దుమారమే రేపింది.

ఇటీవల కాకినాడ పోర్టులో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. కాకినాడ పోర్ట్ ద్వారా బియ్యం అక్రమ రవాణా గంజాయి సరఫరా జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస ఆరోపణలు గుప్పించారు. ఆ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడి.. అవి అధికారపక్షానికి ప్రతికూలంగా ఉంటే ఆ పార్టీ వారు రెచ్చిపోయి. అల్లర్లు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఇంటలిజెన్స్ నివేదిక లో పేర్కొన్నట్లు తెలిసింది. దానికి తోడు ల్యాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా తదితర సిండికేట్లు కాకినాడలో మకాం వేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీపై పోలీసు డిపార్ట్‌మెంట్ స్పెషల్ ఫోకస్ పెడుతుంది.

ఇక రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం పిఠాపురం. ఇక్కడ కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ శాఖ చాలా స్పష్టంగా నివేదిక అందజేసింది. సాధారణంగా మిగతా నియోజకవర్గాలలో గెలుపు ఓటములు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ గెలుపు ప్రధాన పక్షాలకు పరువు, ప్రతిష్టల సమస్యగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని జనసేన, ఆరు నూరైనా జనసేనను ఓడించాలని వైసిపి పిఠాపురంలో సర్వశక్తులు ఒడ్డాయి. రెండు పార్టీలు తాడోపేడో తేల్చు కుందామని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించారు. అయినప్పటికీ అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న ఘటనలు ఇక్కడ కూడా జరిగే అవకాశం లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు.

ముందుగా పిఠాపురంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు వైసిపి బ్లేడు బ్యాచులు గంజాయి బ్యాచ్ లను దింపిందని జనసేన నేతలు ఆరోపించారు. వీరితో పాటు రాయలసీమ నుంచి రౌడీ మూకలను మాఫియా ముఠాలను పిఠాపురంలో దింపారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. వైసిపి గెలవలేని పరిస్థితుల్లో పిఠాపురంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని అని ఆయన ఆరోపించారు. పోలింగ్ ముగిసిందని రిలాక్స్ అవ్వకుండా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద జనసైనికులు అప్రమత్రంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

Also Read: పెద్దిరెడ్డి పెత్తనమా? మా ప్రతాపమా

ఆ క్రమంలో ఓటమి జీర్ణించుకోలేక ఎవరైనా దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న పిఠాపురంలో భయానక వాతావరణం సృష్టించి ఈ నియోజకవర్గంపై ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అరాచక శక్తులను సంఘవిద్రోహులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ సమయాల్లో దరిదాపుల్లోకి రానివ్వమని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. అవసరం అయితే ముందుగానే బైండోవర్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని రౌడీషీటర్లకు వార్నింగ్ ఇస్తున్నారు.

అలాగే కఠినమైన నిబంధనలు కూడా అమలులోకి తీసుకొచ్చారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకూడదని ప్రకటించారు. ముఖ్యంగా బాటిళ్లలో పెట్రోలు పోయకూడదని బంకులకు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ పూర్తి అయిన వారం రోజుల వరకు సెక్షన్ 144 కూడా అమలులో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఇంటలిజెన్స్ రిపోర్ట్‌లతో అలెర్ట్ అయ్యారు .. కోనసీమలో ఇటీవల జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఆయా నియోజకవర్గాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News