AP Development: ఏపీ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం నుంచి క్రమం తప్పకుండా నిధులు రాబడుతోంది. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సాధించేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది.
తొలి విడతగా విశాఖపట్నం, మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో 1,990 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన నాలుగు తాగునీటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. ఇందులో యూసీఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం 497 కోట్ల రూపాయలు అలోకేట్ చేసింది. మిగతా నిధుల్లో 25% రెండు నగరపాలక సంస్థలు, మిగిలిన 50% మొత్తాలకు మున్సిపల్ బాండ్లు జారీ చేయనున్నారు. ప్రాజెక్టుల ద్వారా రెండు నగరాల్లోనూ ప్రజలకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయి. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం రాష్ట్రం నుంచి 14 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రతిపాదించారు.
అంచనా వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 3,600 కోట్లు అంటే 25% అందించనుంది. ఐటీ, పారిశ్రామిక, డేటా హబ్‌గా ఎదుగుతున్న విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ నిధులు కేటాయించడం పాజిటివ్ వైబ్ గా మారింది. విశాఖలో రోజూ 45-60 నిమిషాల పాటు ప్రజలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. పెరిగిన తాగునీటి అవసరాలతో రాబోయే రోజుల్లో 24 గంటలూ సరఫరా అయ్యేలా ప్రాజెక్టు చేపట్టనున్నారు. నగరంలో బల్క్ వాటర్ సరఫరా ప్రాజెక్టును ఆధునీకరించనున్నారు. రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న మంగళగిరి-తాడేపల్లిలో 33,842 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేలా 303 కిలోమీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు.
ఏపీ ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వైద్య రంగంలో సంస్కరణల దిశగా అడుగులు వేసింది. చిత్తూరు జిల్లా కండ్రిగ కేంద్రం సంజీవని ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తర్వాత సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. సంతగేటు వద్ద నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.
ఏపీలో వైద్యసేవలను సమర్థంగా అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత డిజిటల్ ఆరోగ్య వ్యవస్థే ఈ సంజీవని. ప్రతి ఒక్కరికీ హెల్త్ సర్వీసెస్ ను ఈజీ అందుబాటులోకి తేవడం, వ్యాధి నిర్ధారణ నుంచి కోలుకునే దాకా పర్యవేక్షించడం, అలాగే ముందస్తు పరీక్షలతో వ్యాధి తీవ్రత, మెరుగైన ఆరోగ్యసేవలు అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5.20 కోట్ల జనాభాకు డిజిటల్ హెల్త్ సర్వీసెస్ దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కీలక సాగునీటి ప్రాజెక్టులను 2028లోపు పూర్తి చేయాలని భావిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇందుకు కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకంతో పాటు ప్రపంచ బ్యాంకు రుణం, ఇతర మార్గాల ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. రాయలసీమలో ఉద్యాన సాగును విస్తరించేందుకు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలనుకుంటోంది. పూర్వోదయలో హార్టికల్చర్ ప్రణాళిక కింద రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సాగునీటి వసతి కల్పించి పంటల విస్తీర్ణం, ఉత్పత్తి పెంచాలని అనుకుంటోంది.
ప్రాజెక్టుల పూర్తికి ఇప్పటికే క్యాలెండర్‌ను రెడీ చేసింది. దాదాపు 25,884 కోట్లు వెచ్చించనుంది. విదేశీ ఆర్థిక సాయం, ప్రపంచ బ్యాంకు లోన్లతో రాయలసీమ ఉద్యాన హబ్‌ను ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. దీనిపై డీపీఆర్ ను రెడీ చేసి కేంద్రానికి సమర్పించింది. అటు కేంద్ర ప్రభుత్వం తూర్పు భారతదేశ అభివృద్థి పథకం కింద బిహార్, ఝార్ఖండ్, బెంగాల్, ఒడిశా, ఏపీలకు వర్తించేలా పూర్వోదయ పథకాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీనికింద వ్యవసాయం, ఉద్యానం, రోడ్లు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధికి నిధులు ఇవ్వనుంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపొందించే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. త్వరలో చేపట్టే 2.50 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం సక్సెస్ అయ్యేలా చూడాలని అటవీశాఖ అధికారులకు క్లారిటీ ఇచ్చారు. జూన్‌లో సీడ్ బాల్స్ రెడీ చేసి, జులై, ఆగస్ట్‌లో పంపిణీ చేయాలని సీఎం నిర్దేశించారు. ఇందులో విద్యార్ధులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాముల్ని చేయాలన్నారు.
రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడ గాలుల నుంచి రక్షణ పొందేందుకు సన్నద్ధత చర్యలపై CM చంద్రబాబు ఈనెల 22న సమీక్ష నిర్వహించారు. హీట్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొనేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు, చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో రిలీఫ్ మెజర్స్ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
కంపెనీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులను ఈ ఏడాది సెప్టెంబరులోగా గ్రౌండింగ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2028 డిసెంబర్ నాటికి ఆయా సంస్థలు ఆఫీసులను ప్రారంభించాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో సీఎం ఈనెల 21న సమీక్షించారు. ఎంవోయూల స్టేటస్ పై ఆరా తీశారు. ఈ ఒప్పందాలపై మంత్రి లోకేశ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రుల కమిటీ తీసుకున్న చర్యలను సీఎంకు వివరించారు. ఎస్ఐపీబీ ద్వారా ఇప్పటికి 11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని చంద్రబాబు గుర్తుచేశారు. వీటిలో 114 ప్రాజెక్టులు గ్రౌండ్ అయినట్టు సీఎంకు మంత్రుల కమిటీ ఛైర్మన్ లోకేశ్ వివరించారు.
ఏమాత్రం వీలు దొరికినా సొంత నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నారు సీఎం చంద్రబాబు. తాజాగా ఈనెల 20న కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అదే రోజు కాన్వాయ్ ఆపి తాటి ముంజలు అమ్ముతున్న కల్లుగీత కార్మికుల వద్దకు వెళ్లారు. వారితో ఆత్మీయంగా మాట్లాడి, ముంజలను కొనుగోలు చేసి రుచి చూశారు కల్లుగీత కార్మికులు, గ్రామీణ స్వయం ఉపాధిదారులతో మాట్లాడిన సందర్భంలో.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇలాంటి సహజ సిద్ధమైన స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ ప్రత్యేక బ్రాండింగ్ కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. అదే రోజు బెంగళూరులో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ తో కలిసి గోశాలను సందర్శించారు.
మత్స్యకారుల సంక్షేమంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం తాజాగా మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో ఈనెల 19న నిర్వహించిన మత్య్సకారుల సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ కోసం జాయింట్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫర్ సీ పెట్రోలింగ్ కేంద్రాన్ని సీఎం సందర్శించారు.
మెరైన్ పోలీస్, మత్స్యశాఖ, అటవీశాఖ, స్థానిక మత్స్యకారులతో సంయుక్తంగా సీ పెట్రోలింగ్ జాయింట్ యాక్షన్ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల మత్స్యకారుల బోట్లు చొరబడకుండా గస్తీ కోసం శాటిలైట్ చిత్రాల సాయం కూడా తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. మత్స్యకారుల సేవలో బహిరంగ సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లను కూడా సీఎం చూశారు. అదే రోజు కావలి మండలం తుమ్మలపెంటలో తానంగారి బాబు అనే మత్య్సకారుడి కుటుంబంతో కలిసి వారి ఇంట్లో భోజనం చేశారు. మార్కెట్‌లో స్వయంగా చేపలు కొని మత్స్యకారుడి ఇంటికి వెళ్లి వండించుకుని తిన్నారు.
జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బంది సుమారు 40 వేల మందితో సీఎం చంద్రబాబు ఈనెల 18న ఆర్టీజీఎస్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, అందరి సహకారం వల్లే బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతీ ఒక్కరి సహకారం వల్లే వ్యవస్థలు గాడిలో పడ్డాయని, 2047 స్వర్ణాంధ్ర సాధనకు లక్ష్యాలు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే పది సూత్రాలను అమలు చేస్తున్నామని, 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు. 24 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు వచ్చాయని, గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ వంటి కీలక ప్రాజెక్టులు వచ్చాయని, త్వరలో బీపీసీఎల్ వంటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకుంటామని సీఎం వివరించారు. కిందిస్థాయి ఉద్యోగులు సీఎంతో నేరుగా మాట్లాడినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
పోలవరం సహా రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 18న సమీక్ష నిర్వహించారు. ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్ కు తగ్గట్లుగా నిర్దేశిత గడువుకు ప్రాజెక్టులు పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు. వాటర్ మేనేజ్మెంట్ లో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల్ని రెడీ చేయాలని ఆదేశించారు.
ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉద్యమంగా మార్చేలా ప్రణాళికలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈనెల 18న మాట్లాడారు. రాష్ట్రంలో స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆ కార్యాలయాల సిబ్బందికి అందించాలని సీఎం నిర్దేశించారు.
ఈనెల 18న రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాల వద్ద 2500 కోట్ల రూపాయల పెట్టుబడితో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక తయారీ యూనిట్‌తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండార్ పార్క్ ఎకోసిస్టమ్ కూడా నిర్మిస్తారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 9 లక్షల బుల్లెట్ మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రాజెక్టును బుల్లెట్ వేగంతో ముందుకు తీసుకువెళ్లి, 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి బుల్లెట్ మోటార్ సైకిల్ ఉత్పత్తి ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు.
Also Read: కాళేశ్వరం మేడిగడ్డ ఆఫీసులో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు దగ్ధం
Story by: Anup, Big Tv