వివాదాల కొండా సురేఖకు మరోసారి ఊరట లభించిందా? మల్లిఖార్జున ఖర్గేతో ఆమె నడిపిన రాయబారం ఫలించిందా? అధిష్టానం మరోసారి సురేఖకు క్షమాభిక్ష ప్రసాదించినట్టేనా? తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదంపై చేసిన నర్మగర్బ వ్యాఖ్యల వెనుక మర్మం ఇదేననిపిస్తుంది. సీఎం నోటి వెంట ఈ విషయంపై ఏదైనా ప్రకటన వస్తుందని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు.
కానీ దీన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా భావించిన సీఎం.. దీనిపై బహిరంగంగా ఏమీ మాట్లాడలేనని చెబుతూనే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అంతా కట్టబడి ఉండాలని షరతు విధించినట్టుగా మాట్లాడారు. అంతే కాదు.. ఊహాజనిత కథనాలు వద్దు అని ఆయన వారించినట్టు మాట్లాడిన మాటల వెనుక పరమార్థం… మంత్రి బర్తరఫ్ లాంటి చర్యలు ఉండబోవనే పరోక్ష సంకేతాలిచ్చినట్టేననే అభిప్రాయాలూ వెల్లడవుతున్నాయి.
ఇది వరకు ఓ సారి అధిష్టానం కొండా సురేఖను క్షమించి వదిలేసింది. మంత్రి హోదాలో ఉండి .. నటి సమంత పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. హీరో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేసి కోర్టుకీడ్చిన అంశం కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా కొండా సురేఖకు తోడుగా నిలిచారు.
ఆమెపై అప్పుడే వేటు పడుతుందని అంతా భావించారు. అంతకు ముందు ఆమె తన కూతురు సుష్మితతో మాట్లాడిన వీడియో కాల్ కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. వెంట వెంటనే ఆమె చుట్టూ వివాదాలు ముసురుకోవడంతో .. ఇక వేటు తప్పదనుకున్నారు. కానీ సర్కార్ ఏర్పడిన తొలినాళ్లలోనే ఇలాంటి ఒడిదుడుకులు పాలనాపరంగా ఆటంకాలు వస్తాయనే కోణంతో పాటు.. దీన్ని పెద్దగా చర్చకు తీసుకురావడం ద్వారా ప్రతిపక్షాలకు అస్త్రం కానివ్వొద్దనే వ్యూహంలో భాగంగా ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది అధిష్టానం.
దీంతో ఆమె సారీ చెప్పడంతో సరిపెట్టుకున్నారు. కానీ అంతర్గతంగా ఆమెకు క్లాస్ తీసుకున్నారు. అయినా కొండాలో వైఖరి మారలేదు. మధ్యలో ఆమె ఓఎస్డీ వివాదంలో తలదూర్చిన కూతురు సుష్మిత.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీ మంత్రికి గౌరవమే లేదా? అంటూ కులం కార్డును కూడా ప్రయోగించారు. సీఎంను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీనిపైనా సారీతో సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఇది మూడోసారి.
కొండా సురేఖ ఏం కామెంట్స్ చేయకున్నా.. కూతురు చేసిన రచ్చను ఆమె సమర్థించడమే పెద్ద వివాదమై కూర్చుంది. కూతురు రాజకీయ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదనే విధంగా ఆమె లేఖ రాయడం, నోటీసు ఉపసంహరించుకోవాలని తిరిగి అధిష్టానానికే సూచన చేసే విధంగా ఆమె వ్యవహారం ఉండటంతో అగ్గిమీద గుగ్గిలంలా మారింది వ్యవహారం.
ఓవైపు ఈ వేడి రాజుకుంటుంటుండగానే.. కూతరుతో కలిసి బాల్కానీలో నవ్వుతూ కనిపించడం.. మీడియాతో మాట్లాడటం కాంగ్రెస్ వర్గీయులను మరింత కోపానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పరిస్థితి తీవ్రతను గుర్తించి వెంటనే ఖర్గేను కలిసి ఓ గంట పాటు చర్చించినట్టు తెలిసింది. దాసుడి తప్పులు దండంతో సరి .. అన్నట్టుగా ఈసారీ క్షమాభిక్ష పెట్టి.. క్లాస్ తీసుకుని వదిలేసి ఉంటారనే ప్రచారం జరుగుతున్నది.
తాజాగా సీఎం వ్యాఖ్యలతో ఈ వివాదానికి బ్రేక్ వేయాలని, దీన్ని ఇకపై సాగదీయొద్దనే యోచనలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది.