Balineni Influence: బలపడుదాం అనుకుంటున్న ఆ పార్టీకి కొత్తగా వచ్చి చేరిన ఒక బలమైన నేత బలహీనంగా మారాడట. ఏదో ఆశించి చేస్తే అది కాస్త పార్టీని అభాసుపాలు చేస్తుందట. జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టు ఉందని…ఆ బడా నేతను ఎందరు చెప్పినా కాదని పార్టీలోకి ఆహ్వానిస్తే అతనే ఆ జిల్లాలో పార్టీకి శాపంగా మారాడట. సదరు లీడర్ వెంట పార్టీలోకి వచ్చిన వారి కంటే, పార్టీలో వర్గపోరే ఎక్కువైందంట. అధికారం ఉన్నన్ని రోజులు ఆ నేత బలమైన వాడే… పార్టీ మారడం తో ఆ నేతను పలకరించే వాళ్ళు కరువయ్యారట . వెంట వచ్చేవారు లేకపోవడంతో ఉన్న పార్టీలోనే గ్రూపులు తీసుకువస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా బలా నేత? ఆ పార్టీ కథేంటి?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పార్టీ బలాబలాలను తెలుసుకొని పార్టీ భవిష్యత్తు కోసం ఒక మెట్టు తగ్గి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చాక జనసేనను బలోపేతం చేయడానికి తగిన నిర్ణయాలను తీసుకుంటూ ముందడుగు వేస్తున్నారు… అయితే ఆ నిర్ణయాల్లో కొన్ని మిస్ ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి.
జనసేనకు బలంగా మారతారని చేర్చుకున్న నేతలు, తమ ప్రాబల్యం కోసం పార్టీ లో వర్గ పోరుకు కారకులవుతున్నారట. అలాంటి వారి లిస్టులో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, తర్వాత ఒంగోలు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఫస్ట్ కనిపిస్తున్నారు. ఓటమి తర్వాత బాలినేని తన వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసమో? ఇతరాత్ర ప్రయోజనాల కోసమో జగన్‌కు ఝలక్ ఇచ్చి జనసేనలో చేరిపోయారు. ఆయన చేరికతో ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా అర్ధం కాకుండా తయారైందంటున్నారు. గ్రూపు రాజకీయాలు పెరిగిపోయి, ఎవరికి వారే యమునాతిరే అన్నట్లు నాయకులు, కార్యకర్తలు తయారవుతున్నారట.
అధికారం ఉంది, క్యాడర్ బలం ఉంది… ఇలాంటి సమయంలో సంస్థాగతంగా బలోపేతం అవ్వాల్సింది పోయి, జనసేన గ్రూపు రాజకీయాలతో ముక్కలయ్యే పరిస్థితి నెలకొందంట. ప్రధానంగా ప్రకాశం జిల్లా లో గడిచిన కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనింస్తే అది స్పష్టమవుతుంది.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కీలక నేతగా వెలుగొందారు. సామాజికవర్గం బలం లేకపోయినా, ప్రజలలో ఉంటూ ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించారు..
వైఎస్ కుటుంబానికి బంధువైన బాలినేని ఒంగోలు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారి, వైసీపీ మంత్రివర్గంలో రెండో సారి మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్‌లో మంత్రిగా ఉంటూ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ కోసం మంత్రి పదవి వదులుకుని వైసీపీ బాట పట్టారు. తర్వాత జగన్ ప్రభుత్వంలోనూ మూడేళ్లు మాత్రమే మంత్రిగా కొనసాగారు. పూర్తి కాలం ఎప్పుడూ మంత్రిగా పనిచేయకపోయినా జిల్లాలో తన పట్టు పెంచుకున్నారు.
అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో ఊహించని రీతిలో పరాజయం పాలవ్వడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు… ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో మినహా బలమైన క్యాడర్ లేని జనసేన పార్టీకి ఆయనే బలమవుతారని భావించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందరు ఎన్ని చెప్పినా వినకుండా, పార్టీ బలోపేతం కోసం బాలినేనిని పార్టీలోకి ఆహ్వానించారు. తన సత్తా చూపిస్తూ సుమారు 20 మంది వైసీపీ కార్పొరేటర్లను జనసేనలో చేర్పించారు. దీంతో ఒంగోలు రాజకీయం పూర్తిగా మారిపోతుందని అంతా భావించారు.
50 డివిజన్లు ఉన్న ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి 43 మంది కార్పొరేటర్లు ఉంటే 20 మంది కార్పొరేటర్లు బాలినేని వెంట జనసేన వైపు నడిచారు. మరో 19 మంది టీడీపీలో చేరారు. దాంతో వైసిపి బలం నాలుగు కు చేరింది. ఎన్నికల్లో గెలిచిన వారితో కలిపి టీడీపీకి 25 మంది కార్పొరేటర్లు అయ్యారు. జనసేనకు 21, వైసీపీకి నాలుగుగా బలాబలాలు మారిపోయాయి. అయితే త్వరలో స్థానిక సంస్థలు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల బాలినేని, ఒంగలో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పోటాపోటీ మీడియా సమావేశాలు పెడుతుండటంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి.
జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెడితే.. పార్టీలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమవుతున్నాయి.. సభ్యత్వ పరిశీలకుడిగా వచ్చిన వ్యక్తి కూడా పరిస్థితిని అదుపు చేయలేకపోయారట… ప్రకాశం జిల్లా పరిశీలకుడిగా వచ్చిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణుడు .. ఏం చేయాలో పాలుపోక.. బాలినేని ముఖ్యమే ఇతర నాయకులు ముఖ్యమే అంటూ సభ్యత్వాలు పెంచండి అని చెప్పి వెళ్లాల్సి వచ్చిందంట. బాలినేని శ్రీనివాసరెడ్డి తన వ్యక్తిగతం అంటూ టీడీపీ ఎమ్మెల్యేని విమర్శించడం… జనసేన పార్టీలో మొదటి నుంచి ఉన్న మరో వర్గం ఎమ్మెల్యే వెంట ఉండటంతో జనసైనికులకు పార్టీ పరిస్థితి అంతుపట్టడం లేదంట…
2019 ఎన్నికలలో ఒంగోలు నియోజక వర్గంలో ఒంటరిగా పోటీ చేసిన జనసేనకు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేనికి మెజార్టీతో సమానంగా కూడా ఓట్లు పడలేదు. అలాంటి పార్టీలో పాత, కొత్త నాయకులు మధ్య సమన్వయం చేయలేక పోవటంతో వర్గ పోరు పెరిగిపోతోంది.. దాంతో బాలినేని విషయంలో జనసేనాని ఆలోచనలో పడిపోయే పరిస్థితి ఏర్పడిందట… వ్యక్తిగత అజెండాతో టీడీపీ ఎమ్మెల్యేపై కస్సుబుస్సులాడుతున్న బాలినేనిని బుజ్జగించి పార్టీని ఏకం చేసే దిశగా జనసేన పార్టీ నేటి వరకు ప్రయత్నమే చేయలేదు…
రెండు సార్లు మంత్రిగా పనిచేసిన తమ నేతకి జనసేనలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలినేని వర్గీయులు తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు.. అదే సమయంలో మరో వర్గం మాత్రం చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి జనసేనలో చేరారు తప్ప … కూటమి నేతలతో కలిసి నడవటం బాలినేనికి ఇష్టం లేదని .. అవసరమైతే బాలినేని తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం చేస్తున్నారట… ఆ క్రమంలో జిల్లాలో సరైన బలం లేని జనసేనలో ఈ వర్గ పోరేందంటూ సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారట… మొత్తమ్మీద జిల్లాలో జనసేన పరిస్థితి.. కరవమంటే కప్పకు కోపం …వదలమంటే పాముకు కోపం అన్నట్లు మారిందట.
ముందు నుంచి జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ వెనక ఉండాలా…లేక కొత్తగా వచ్చిన నేత బాలినేని తో కలిసి నడవాలో అర్థం కాక జనసైనికులు జుట్లు పీక్కుంటున్నారంట.. ఎటు ఉంటే ఏమవుతుందో అనే అయోమయంలో క్యాడర్ కనిపిస్తోంది. మాజీ మంత్రి బాలినేని వెంట నడుద్దామంటే ఆయన ఎన్ని రోజులు పార్టీలో ఉంటారనే గ్యారంటీ లేదనే అనుమానం ఒకవైపు ఉందట. దీంతో నిజమైన జనసేన కార్యకర్త ఏమి చేయాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నారంట.
అయితే ఇంత జరుగుతున్నా విభేదాలు సెట్ రైట్ చేయడానికి పార్టీ పెద్దలు ప్రయత్నించకపోవడం విమర్శలపాలవుతోంది. వర్గ పోరు ఏ రోజుకైనా ఇబ్బందేనని ఇప్పటికైనా అధిష్టానం కలుగజేసుకొని వర్గ పోరుకు తెరదించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సామాన్య జనసేన పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. మరి రానున్న రోజులలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత ప్రయత్నం చేస్తారా?… తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అనట్లు వదిలేస్తారో చూడాలి.
Story by: Apparao, Big Tv