Telangana BJP: ఫ్యూచర్ కోసం బిజెపి పార్టీ రెడీ అవుతోంది. ఇప్పటికే, 60 శాతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుల పదివీ కాలం ఎక్స్‌పైర్ కావడం.. జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా మార్పు కోరడంతో దేశవ్యాప్తంగా బిజెపి పార్టీలో నాయకత్వ మార్పు కోసం కసరత్తు షురూ అయ్యింది. మరో కొన్ని రోజుల్లో కొత్త తరానికి బాధ్యతలు అప్పజెప్పేందుకు రంగం సిద్ధమయ్యింది. జాతీయ అధ్యక్షుడితో పాటు కీలకమైన రాష్ట్రాల్లోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడోసారి, కేంద్ర అధికారాన్ని చేజిక్కించుకున్న బిజెపి.. రాబోయే రోజుల్లో మరింత బలం పెంచుకునే దిశగా రచించే వ్యూహాల్లో ఇది కీలకమైన స్టెప్‌గా భావిస్తున్నారు.
పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడానికి కొత్త నాయకత్వం
దశాబ్ధ కాలంగా వరుసగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ.. ప్రస్తుతం, దేశంలోనే అత్యంత పెద్ద పార్టీగా అవతరించింది. మూడో పర్యాయం కాస్త ఓటు బ్యాంక్ తగ్గినప్పటికీ ఎన్డీయే కూటమితో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడిక, పార్టీ అధిష్టానంలో మార్పుకు సమయం ఆసన్నమైంది. బిజెపి భవిష్యత్తు వ్యూహ ప్రణాళికతో పాటు, పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడం కోసం కొత్త నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, కొత్త అధ్యక్షుడిని నియమించడానికి పార్టీ సన్నాహాలు చేస్తోంది.
పార్టీ బాధ్యతలను కొత్త తరం చేతిలో పెట్టడం
జాతీయ స్థాయిలోనే కాక అనేక రాష్ట్రాల్లోనూ అధ్యక్షుల మార్పుకు బిజెపి సిద్ధమ్యింది. ప్రస్తుతం, ఉన్న రాష్ట్ర అధ్యక్షుల్లో దాదాపు 60 శాతం రాష్ట్ర అధ్యక్షులకు పదివి కాలం ముగిసింది. కాగా, రాష్ట్రాలను నిర్వహిస్తున్న ఈ నాయకులను మార్చే దిశగా చర్యలు చేపట్టారు. అయితే, వీళ్లందరూ, వారి వారి అనుభవం, పార్టీకి చేసిన సేవను బట్టి భవిష్యత్తులో కీలక బాధ్యతల కోసం చూస్తున్నారు. ఇక, పార్టీ బాధ్యతలను కొత్త తరం చేతిలో పెట్టడంతో పాటు.. ఈ ఏడాది మధ్యలో మంత్రివర్గ విస్తరణ కూడా జరగనున్నట్లు తెలుస్తోంది.
జనవరి చివరి నాటికి పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు
ప్రస్తుతం, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పదవీకాలం ముగియడంతో.. జనవరి చివరి నాటికి పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఉండబోతున్నారు. ఇప్పటికే, కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. అదే క్రమంలో.. దేశవ్యాప్తంగా, 29 రాష్ట్రాల్లో పార్టీ కొత్త రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారులను కూడా పార్టీ నియమించింది. ప్రస్తుతం, సభ్యత్వ డ్రైవ్ పూర్తయిన రాష్ట్రాల్లో పార్టీ కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తోంది. ఇక, రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకున్న తర్వాత, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగనుంది.
కొత్త ఆఫీస్ బేరర్ల టీమ్‌ని నియమించే కొత్త అధ్యక్షులు
అయితే, జనవరి చివరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుందనీ.. జనవరి చివరి నాటికి లేదా ఫిబ్రవరి ప్రారంభంలో పార్టీకి కొత్త అధ్యక్షుడు ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కొత్త అధ్యక్షులు బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొత్త నాయకులకు అవకాశం కల్పించడానికి ఈ కొత్త అధ్యక్షులు.. కొత్త ఆఫీస్ బేరర్ల టీమ్‌ని కూడా నియమిస్తారు. దీనితో.. మండల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు మొత్తం పార్టీలో గ్రాస్ రూట్ లెవల్ నుండీ కొత్త మలుపు తిరగుతుంది. గత కొన్ని సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీకి ఈ పరిణామం అతిపెద్ద మలుపు కాబోతుంది.
నాయకత్వ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పార్టీలోకి కొత్త శక్తి
దశాబ్ద కాలంగా అజేయంగా నిలిచి, కేంద్రంలో బిజెపి పార్టీ మూడవసారి ప్రభుత్వంలోకి వచ్చింది. అయితే, రాబోయే కాలంలో కూడా.. నాయకత్వ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పార్టీలోకి కొత్త శక్తిని నింపాల్సిన అవసరం ఉందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, రాష్ట్ర అధ్యక్షులు సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో ప్రాధాన పాత్ర పోషించనున్నారు. అందుకే, రాష్ట్ర అధ్యక్షుల అంశంపై బిజెపిలో తీవ్ర చర్యలు జరుగుతున్నాయి. గతంలో బిజెపి పార్టీలో ప్రాంతీయ అగ్ర నేతలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చింది పార్టీ. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర నాయకులకు జాతీయ స్థాయిలో పదోన్నతి లభించింది.
ప్లేస్ దక్కించుకున్న మొదటి బిజెపి ముఖ్యమంత్రి మోడీ
దీనికి అతిపెద్ద ఉదాహరణగా నరేంద్ర మోడీనే నిలుస్తారు. గుజరాత్‌లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ.. ఇప్పుడు, మూడుసార్లు దేశ ప్రధానిగా అత్యంత సెలబ్రిటీ లీడర్ అయ్యారు. ఒక్క దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా పాపులర్ నేతగా గుర్తింపు పొందారు. నిజానికి, బిజెపి పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో ప్లేస్ దక్కించుకున్న మొదటి బిజెపి ముఖ్యమంత్రి కూడా మోడీనే! తర్వాత, ఈ గౌరవం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు దక్కింది. చౌహాన్ ఇప్పుడు పార్లమెంటరీ బోర్డులోనూ, CECలోనూ భాగంగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గత కొన్ని సంవత్సరాలుగా, భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రక్రియను ప్రారంభించింది. దీనితో, ప్రస్తుతం రాష్ట్రా బాధ్యతలు నిర్వహిస్తున్న యువకులు, ఆశావహులైన నాయకులు చాలా మంది ఉన్నారు. వీళ్లంతా పార్టీ వ్యూహం, భవిష్యత్తు ప్రణాళికలో కీలక పాత్ర పోషించనున్నారు. అందులో, దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి.. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైని.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్… వీళ్లతా రెండవసారి ముఖ్యమంత్రులుగా ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి
ఇక, ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ CECలో భాగంగా ఉన్నారు. వీరితో పాటు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఇంకొందరు దేశంలో ముఖ్యమైన రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రులు. ఇప్పుడు వీరంతా బిజెపి పార్టీలో తర్వాతి తరం నాయకత్వంలో ఉన్నారు. అలాగే, భవిష్యత్తులో కీలక బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు.
కేబినెట్‌లోకి కొత్త ముఖాలు వచ్చే అవకాశం
ఇక, బిజెపి పురోగతి, విస్తరణ ఆయా రాష్ట్రాలలో న్యూ జనరేషన్ నాయకుల పనితీరుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, బిజెపి అధిష్టానం కూడా సామర్థ్యమున్న లీడర్ షిప్‌ను తీసుకురావాలని అనుకుంటోంది. ఈ కసరత్తులో భాగంగా..కేబినెట్‌లోకి కూడా కొత్త ముఖాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మోడీ ప్రభుత్వంలో కొత్తగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఈ సంవత్సరం మధ్యలో ఉండొచ్చు. అందులోనూ, బీహార్ ఎన్నికలకు కొంచెం ముందు జరిగొచ్చని అనుకుంటున్నారు. బీహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కొంతమంది నాయకులకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
ప్రభుత్వం, పార్టీ రెండింటిలోనూ నాయకుల సమతుల్యత
పాలనలోకి కొత్త ప్రతిభను తీసుకురాడానికి ఈ పునర్వ్యవస్థీకరణను పార్టీ వినియోగించనుంది. ఇక, ప్రతిభ ఉన్న లీడర్ల కోసం పార్టీ లోపల, బయట చేస్తున్న వేట గతంలో మంత్రివర్గంలో కొన్ని సక్సెస్‌ఫుల్ ప్రయోగాలకు దారితీసింది. అందులో, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎస్ జైశంకర్‌లు మంచి ఉదాహరణలు. ఇక, పార్టీకి ఎక్కువ సమయం కేటాయించడం కోసం ఇప్పటికే ఉన్న కొంతమంది నాయకులను ప్రభుత్వం నుండి తొలగించనున్నట్లు తెలుస్తోంది. మార్పు కోసం చేస్తున్న ఈ కసరత్తులో… ప్రభుత్వం, పార్టీ.. రెండింటిలోనూ సరైన నాయకుల సమతుల్యతను సాధించడానికి పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది.
బిజెపి పనితీరే ప్రమాణంగా భవిష్యత్ వ్యూహాలు
వికసిత్ భారత్ అనే పెద్ద లక్ష్యంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తున్న నేపధ్యంలో… కేంద్రంలో 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా దేశ ప్రజల్లో అభిమానాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి పార్టీ తనను తాను బలోపేతం చేసుకుంటోంది. ప్రస్తుతం, కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పనితీరే ప్రమాణంగా భవిష్యత్ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత పార్టీ ప్రయోగాలు చేయడానికి ఏ మాత్రం భయపడట్లేదన్నది అర్థమవుతోంది. ఈ క్రమంలోనే, భారతీయ జనతా పార్టీ గ్రాస్ రూట్ నుండీ కీలకమైన వ్యక్తులపై దృష్టి సారిస్తోంది.
జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్
ఇందులో భాగంగా.. గ్రాస్ రూట్స్ స్థాయిలో యువతను పార్టీ బహిరంగ సమావేశాల్లో పాలుపంచుకోడానికి ప్రోత్సహిస్తోంది. రాజకీయ కుటుంబానికి చెందినవారైనా, సామాన్యులైనా.. మొత్తంగా లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే పార్టీ లక్ష్యమని ఇప్పటికే మోడీ చెబుతున్నారు. అందుకే, జనవరి 11, 12 తేదీల్లో… ఢిల్లీలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మోడీ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఉత్సహవంతులైన యువతను గుర్తించి, ప్రోత్సహించే దిశగా పార్టీ ఆలోచిస్తోంది.
బిజెపి ఖాతాలో ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాలు
భారతీయ జనతా పార్టీ నియమాల ప్రకారం.. పార్టీ జాతీయ అధ్యక్షుణ్ని ఎన్నుకోడానికి ముందు, దేశంలోని కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే దాని ప్రక్రియ మొదలయ్యింది. అయితే, ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలను బిజెపి ఖాతాలో వేసుకున్న పార్టీ.. ఈసారి, దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన నాయకత్వాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది. ముఖ్యంగా, కర్నాటక, కేరళతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధ్యక్షుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త అధ్యక్షులపై ఉత్కంఠ
ఈ క్రమంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త అధ్యక్షులను ఎన్నుకోడానికి ఎన్నికల అధికారుల్ని కూడా పార్టీ నియమించింది. అయితే, ఏపీతో పోల్చుకుంటే.. తెలంగాణలో బిజెపికి బలం ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆశావాహులు అధికంగానే ఉన్నారు. దీంతో ఎవరిని అధ్యక్ష పదవి వరిస్తుందనే ఆసక్తికరంగా మారింది.
ఎంపీలు ఈటల రాజేందర్ , రఘునందన్‌రావు, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్
ప్రస్తుత తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త సారధి ఎన్నిక అనివార్యమైంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందిన వారిలో ఈటల రాజేందర్ , రఘునందన్‌రావు, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌లు అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతుండగా.. మరోవైపు ఎమ్మెల్యేలలో రాజాసింగ్, పాయల్ శంకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే పార్టీ అధ్యక్షుడు ఎవరనే అంశంపై అధిష్టానం నుండి ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ బీసీ సీఎం నినాదం
దీంతో పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నట్టు వినిపిస్తోంది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. అయితే, పెద్దగా రాణించలేకపోయింది. కాబట్టి, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబట్టే అవకాశం ఉంది. అదే జరిగితే, ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌లకు ఛాన్స్ ఉంది. అయితే, వీరిద్దరిలో కాస్త దూకుడుగా ఉండేది అర్వింద్ కాబట్టి, తెలంగాణ అధ్యక్షపీఠం ధర్మపురి అర్వింద్‌ను వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి కోసం నలుగురు నేతల్లో పోటీ
మరోవైపు, ఏపీలోనూ అధ్యక్షుల్ని మార్చడానికి రంగం సిద్ధమయ్యింది. గతంలో కంటే అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు కావడంతో ఏపీ బిజెపిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక, ప్రస్తుతం రాష్ట్రా పార్టీ అధ్యక్షులుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరీ స్థానంలో కొత్త అధ్యక్షుణ్ని సంక్రాంతి తర్వాత ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు. కాగా, ఏపీలో రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి కోసం నలుగురు నేతలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
పార్థసారథికి కానీ, సుజనా చౌదరికి కానీ ఎక్కువ అవకాశం
అయితే, పార్టీ అధిష్టానం మాత్రం మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న నేత కోసం జల్లెడ పడుతోంది. ఈ స్క్రూటినీలో.. ఆదోని ఎమ్మెల్యే పీవీ పార్థసారథి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేత రఘు రామ్ పేర్లు వినిపిస్తున్నట్లు సమాచారం. వీరిలో కూడా పార్టీ అధ్యక్షుడిగా.. పార్థసారథికి కానీ.. సుజనా చౌదరికి కానీ ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వీరిలో ఎవరికి అధ్యక్ష పదవి దక్కుతుందనేది మరి కొన్ని రోజులకు క్లారిటీ వస్తుంది.
తమిళనాడులో అన్నామలైనే కొనసాగించే అవకాశం
ఇక, కర్నాటకకు గతేడాదే కొత్త అధ్యక్షుణ్ని ఎన్నుకున్నారు కాబట్టి, ఆ రాష్ట్రానికి మరో రెండేళ్లు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఇక, తమిళనాడు బిజెపికి కె.అన్నామలై అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదివీ కాలం ముగియడంతో.. ఇప్పుడు, కొత్తగా ఎన్నుకోవాల్సి ఉంది. అయితే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమిళనాడు రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల పార్టీ సీనియర్ నాయకులతో కూడా చర్చోపచర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో.. ఈసారి కూడా తమిళనాడులో అన్నామలైనే అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
కేరళలో కె. సురేంద్రన్ పదవీకాలాన్ని పొడిగించే ఛాన్స్
ఇక, కేరళలోనూ బిజెపి అధ్యక్ష పదవీ కాలం ముగింది. అయితే, కేరళ బిజెపి అధ్యక్షుడు కె. సురేంద్రన్ పదవీకాలాన్ని మరింత పొడిగించే దిశగా పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ… సురేంద్రన్, పార్టీ జాతీయ నాయకత్వం మద్దతును పొందుతూనే ఉన్నారు. రాష్ట్ర పార్టీలో సురేంద్రన్‌పై కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ.. 2025లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు సురేంద్రన్‌నే కొనసాగించాలనే ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్…
ఇక, రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలతోపాటు.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కూడా అధ్యక్షులు మారే అవకాశాలున్నాయి. ఇవన్నీ పూర్తైన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో.. బీజేపీ చీఫ్‌గా మనోహర్‌ఖట్టర్ లేదా శివరాజ్ చౌహాన్ అధ్యక్ష పదవిని అధిరోహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి రేసులో వారణాసి రాంమాధవ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
బిజెపి చీఫ్‌గా మనోహర్‌ఖట్టర్ లేదా శివరాజ్ చౌహాన్
ఒకవేళ, ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారణాసి రాంమాధవ్ అధ్యక్ష స్థానానికి వెళ్లకపోతే… బీఎల్ సంతోష్ స్థానంలో ఆయనకు సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతమున్న సమాచారం మేరకైతే.. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఖట్టర్, శివరాజ్ చౌహాన్ మధ్యనే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. వచ్చే నెలాఖరులోగా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక, ఆఫీస్ బేరర్ల పునర్వ్యవస్థీకరణ పూర్తవనుంది. అంతేకాదు.. వచ్చేనెల మొదటి వారానికి రాష్ట్రాల వారీగా అధ్యక్షుల నియామకాలన్నీ పూర్తవుతయ్యే అవకాశం ఉంది.
కొత్త ఆలోచనలు, కొత్త నాయకులకు ప్రోత్సాహం
ప్రస్తుతం బిజెపి వ్యూహంలో భాగంగా.. అతిపెద్ద పార్టీగా అవతరించిన దాని బలాన్ని తగ్గించేవారిని కొత్త నాయకత్వ డ్రైవ్‌లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ప్లాన్ వల్ల బిజెపి ఇతర రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ప్రయోజనం పొందాలని అనుకుంటుంది. అందులో భాగంగానే, కొత్త ఆలోచనలు, కొత్త నాయకుల ప్రవేశాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో… ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలనుకునే యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.
బిజెపి పరివర్తనను దేశ పరివర్తనతో తెలివిగా అనుసంధానం
ఒక రకంగా.. బిజెపి పరివర్తన దశను దేశ పరివర్తన దశతో తెలివిగా అనుసంధానించే ప్రయత్నం కూడా చేస్తుంది. కొత్త క్యాడర్‌ని పెంచుకోవడం కోసం బహిరంగం సమావేశాల్లో పార్టీ గురించి తక్కువ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన భారత్ పార్టీ లక్ష్యం కావాలనే అంశాన్ని బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. చివరికి, ఇదంతా పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు పాత కేడర్‌ను చెక్కుచెదరకుండా జాగ్రత్త పడుతున్నారు.