BigTV English

BJP Internal Politics: బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి..!

BJP Internal Politics: బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి..!

BJP Internal Politics: హోల్‌సేల్‌గానైనా పర్వాలేదు.. లేదంటే రిటైల్‌గానైనా ఓకే..! అదేంటి హోల్‌సేల్‌, రిటైల్ అనుకుంటున్నారా..? ఇప్పుడు కమలనాథుల కావాలంటోంది ఇదేనట. పార్టీకి కొత్త నాయకత్వంతోపాటు కొత్త తరం సైతం రావాలని కోరుకుంటున్నారాట. అదేంటి ఇప్పటికే ఉన్న వాళ్లలో చాలా మందికి ఒకరితో ఒకరికి పొసగకపోతున్న వేళ.. మళ్లీ ఈ కొత్త తరం, కొత్త రక్తం ట్విస్టేంటని ఆలోచిస్తున్నారా..? మరెందుకాలస్యం.. వాచ్ దిస్ స్టోరీ.


నూతన నాయకత్వం ఎదగాలంటున్న బీజేపీ లీడర్స్

పార్టీలోకి కొత్త తరం రావాలి..కొత్త నెత్తురు రావాలి..! ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఉరకలేసే ఉడుకు రక్తంతో పార్టీ మరింత ఎత్తుకు ఎదగాలి. ఇది వాళ్లో వీళ్లో చెబుతున్న మాట కాదు. స్వయంగా కమలం పార్టీ పెద్దలు అంటున్న మాటలే. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వారిని గమనిస్తే చాలా మంది పెద్ద వయసు ఉన్న వాళ్లు కన్పిస్తారు. దీంతో.. రెండో తరం రావాలని గట్టిగా కోరుకుంటున్నారు కాషాయ పార్టీ నేతలు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కమలం అగ్రనేతలు చెబుతున్నట్లుగా ఆ కొత్తతరం నాయకత్వం ఎవరు..? కొత్త నెత్తురు ఎవరు..? ఉరకలేసే ఉడుకు రక్తం ఎవరు..? దశాబ్దాల చరిత్ర ఉన్న కమలం పార్టీలో ఇప్పటి వరకు ఎంత మంది కొత్త నేతలు పుట్టుకొచ్చారు.. వారిలో ఎంత మంది నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు..? ఎంతమందిని యువనేతలుగా తీర్చిదిద్దారు.. ? ఇలా అనేక ప్రశ్నలు సూటిగా విన్పిస్తున్నాయి.


అసలైన కొత్త తరం అంటే ఎవరు..?

కేవలం ఇవే కాదు.. కొత్త నెత్తురు, కొత్త నేతలు, కొత్త తరం అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనా..? అలా.. వేరే పార్టీల నుంచి వచ్చి బీజేపీ ముసుగు వేసుకున్నంత మాత్రాన కొత్త నెత్తురు అవుతుందా..? అసలైన కొత్త తరం అంటే ఎవరు..? కొత్త నాయకత్వం ఎవరు..? క్షేత్రస్థాయిలో తమ పార్టీ గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎంతో బలంగా ఉందని చెబుతున్న కమలనాథులు ఎందుకు నూతన నాయకత్వాన్ని తయారు చేసుకోలేకపోతున్నారు అన్న వాదన విన్పిస్తోంది. ఇదే సమయంలో ఏళ్ల తరబడి పార్టీలో ఉంటూ, కష్ట నష్టాలకు ఓర్చి.. ప్రత్యర్థి పార్టీలు పెట్టే ఇబ్బందులను తట్టుకొని.. పార్టీ జెండాలు మోస్తూ అనుక్షణం బీజేపీ అభివృద్ధి కోసం పరితపిస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడున్న పెద్దలు సరైన గుర్తింపును ఇస్తున్నారా..? పార్టీ పదవుల్లో ప్రాతినిథ్యం ఎంత మందికి కల్పించారు..? ఎందరి జీవితాలను మార్చేశారు అన్న అంశంపైనా ప్రస్తుతం బలంగా ప్రశ్నలు విన్పిస్తున్నాయి.

రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరికి వారు యమునా తీరే..!

ఇక్కడే మరికొన్ని విమర్శలు కాషాయ పార్టీ విషయంలో విన్పిస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలతో పనిలేకపోయినా, సంఘ్‌ పరివార్‌తో సంబంధం లేకపోయినా కేవలం అర్థ బలాన్ని, అంగ బలాన్ని ఇటీవలి కాలంలో ఎక్కువగా గుర్తించి వారికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారన్న మాటలు నిజమైన కార్యకర్తల నోటి నుంచే విన్పిస్తున్నాయి. ఇతర పార్టీల్లో ఉంటూ నిన్న మొన్నటి వరకు బీజేపీ అంటేనే ఒంటికాలిపై లేచి విమర్శలు చేసిన వాళ్లకు పార్టీలో కీలక పాత్ర అప్పగించడాన్ని ఎప్పటి నుంచో ఉన్న వాళ్లు తప్పుపడుతున్నారు. అంతెందుకు తెలంగాణ బీజేపీలో ఉన్న పరిస్థితినే పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే.. కమలం పార్టీకి రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వీరి వ్యవహార శైలి ఉందన్న విమర్శలున్నాయి. ఇందుకు కారణం వీళ్లలో చాలా మంది మొదటి నుంచీ పార్టీలో ఉన్న వారు కాకపోవడమా లేదంటే అంగబలం, అర్థబలం ఉండి పార్టీని పెద్దగా పట్టించుకోకపోవడమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వీళ్ల సంగతి కాస్త పక్కన పెడితే.. ఇక, అధికార ప్రతినిధుల పరిస్థితి మరోలా ఉందన్న వాదన బలంగా విన్పిస్తోంది. రోజూ పార్టీ ఆఫీసుకు వస్తూ తమ వాయిస్‌ను బలంగా విన్పించకుండా వారం రోజులకు లేదంటే పది రోజులకోసారి అన్నట్లగా వస్తూ పోతుంటారన్న పేరు ఇప్పటికే తెచ్చుకున్నారు చాలా మంది నేతలు అని స్వయంగా కార్యకర్తలే చెబుతున్నారు. ఇంకా మరికొందరికైతే అసలు అధికార ప్రతినిధులు అన్న హోదా వాళ్లకు ఎలా ఇచ్చారని కూడా ఆఫ్‌ ద మైక్ అంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇక, ఏ స్టేజ్ ఎక్కినా నేతలు చెప్పే మాట.. పార్టీకి బలం కార్యకర్తలేనని. వారే లేకుంటే తాము ఈ స్థాయికి వచ్చేవాళ్లం కాదని నేతలు గొప్పగా చెబుతుంటారు. కానీ, వాస్తవంలో చూస్తే.. బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల లెవల్‌లో, నియోజకవర్గం పరిధిలో ఎంత మంది కార్యకర్తలకు న్యాయం జరిగింది..? ఎందరికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం లభించింది అంటే వేళ్లపై లెక్కేసుకోవాల్సిందేనట. ఇక్కడ కూడా ఫలానా పార్టీకి చెందిన వ్యక్తి బలమైన నాయకుడని తెచ్చుకోవడమే తప్పించి ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న వారికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నది సగటు కార్యకర్త ఆవేదన.

పార్టీకి కొత్త నెత్తురు కావాలి అంటూ ప్రసంగాలిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు..

నిజానికి.. పార్టీకి కొత్త నెత్తురు కావాలి అంటూ పదే పదే ప్రసంగాలిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు..ఆచరణకు వచ్చేసరికి ఎందుకు విఫలమవుతున్నారు..? అన్నదే తరచుగా విన్పించే ప్రశ్న. పార్టీకి బలమైన విద్యార్థి సంఘం ఏబీవీపీ ఉన్నప్పటికి అక్కడి నుంచి కొత్త తరాన్ని తయారు చేసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారనే టాక్ రీసౌండిస్తోంది. ఇది సైతం ఏదో ఆషామాషీగా చెబుతున్న అంశం కాదు. గత కొంతకాలంగా పరిస్థితి గమనిస్తే.. ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్లకు కీలకపదవులు పెద్దగా లభించిన పరిస్థితి లేదన్న మాట పార్టీలో అందరికీ తెలిసిందేనన్న కామెంట్లు బహిరంగంగానే విన్పిస్తున్నాయి. ఇందుకు కూడా కారణం.. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిపైనే ఎక్కవగా ఆధారపడడమేనట.

Also Read: వార్‌లోకి US డైరెక్ట్ ఎంట్రీ.. ఇరాన్‌కి దొరికిన లీడ్..

ఇక్కడే మరో ప్రశ్న విన్పిస్తోంది. వాస్తవానికి ఏ పార్టీకైనా సొంత నాయకత్వాన్ని తయారు చేసుకోవాలంటే విద్యార్థి సంఘాన్ని మించిన శక్తి లేదు. కానీ, కమలంలో మాత్రం ఆ పరిస్థితి పెద్దగా లేనే లేదట. ఎందుకని అడుగుతారా కొత్త రక్తం వచ్చినా, నూతన నాయకత్వం ఎదిగినా ఎక్కడ తమ కుర్చీ కిందకు నీళ్లు వస్తాయోనన్న ఆలోచనతోనే..కొందరు నేతలు కొత్త రక్తాన్ని, నూతన నాయకత్వాన్ని రాకుండా, ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఈ విషయంలో హస్తినలో ఉన్న అగ్రనాయకత్వం చర్యలు తీసుకొని జోక్యం చేసుకుంటే నిజమైన కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరుగుతుందన్న వాదన బలంగా విన్పిస్తోంది. అంతేకాదు.. కొత్త తరం, నూతన నాయకత్వం సైతం పార్టీలోకి వచ్చి కమలం మరింగా విరబూయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి.. కమలం అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×