High-Speed Internet: ఇకపై పల్లెల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రాబోతోంది. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు.. రైతులు తమ పొలంలో నుంచే ప్రభుత్వ సేవలు.. వైద్యం కోసం ప్రతిసారీ పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా టెలీమెడిసిన్ సేవలు.. ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే పట్టణాలకే పరిమితమైన సదుపాయం. కానీ ఇప్పుడు అదే ఇంటర్నెట్‌ను తెలంగాణలోని మారుమూల పల్లెల్లోకి తీసుకెళ్లేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. ఏకంగా 3,189 కోట్లతో తెలంగాణ వ్యాప్తంగా 12 వేల 769 గ్రామ పంచాయతీలకు నెట్‌వర్క్ కనెక్టివిటీ.. దాదాపు 3 లక్షల గ్రామీణ ఇళ్లకు ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్లు.. ఇవ్వనున్నారు. అసలు ఈ ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది? ఇంటింటికీ నెట్ ఎలా వస్తుంది? గ్రామీణ ప్రజలకు దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి?
ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు..
తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని డిజిటల్ భారత్ నిధి, తెలంగాణ ప్రభుత్వం మధ్య సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం అమలుకు ఒప్పందం కుదిరింది. ఇప్పటికే సంతకాలు కూడా అయిపోయాయి. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 3 వేల 189 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్.. అంటే ట్రైసిల్ ద్వారా అమలు చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, బీఎస్‌ఎన్‌ఎల్, టీ ఫైబర్ కూడా భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. అంటే ఇది కేవలం కేబుళ్లు వేయడానికి సంబంధించిన ప్రాజెక్టు కాదు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే భారీ కార్యక్రమం.
36 గ్రామ పంచాయతీలకు రింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు..
ఇప్పుడు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం నెట్‌వర్క్ నిర్మాణం. తెలంగాణలో మొత్తం 12 వేల 769 గ్రామ పంచాయతీలను ఈ కార్యక్రమం పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఇందులో 10 వేల 787 గ్రామ పంచాయతీలు భారత్‌నెట్ రెండో దశ పరిధిలోకి వస్తాయి. మరో 1,946 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ఉన్న లీనియర్ నెట్‌వర్క్‌ను రింగ్ టోపాలజీ విధానంలోకి అప్‌గ్రేడ్ చేస్తారు. ఇంకా కొత్తగా ఏర్పడిన 36 గ్రామ పంచాయతీలకు కూడా రింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తారు.
రింగ్ టోపాలజీ అంటే ఏంటి..?
అసలు ఈ రింగ్ టోపాలజీ అంటే ఏంటి అనే కదా మీ డౌట్. సింపుల్‌గా చెప్పాలంటే.. ఒక గ్రామానికి ఇంటర్నెట్ వచ్చే కేబుల్ మార్గంలో ఎక్కడైనా సమస్య వస్తే, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా కనెక్టివిటీ కొనసాగించేలా నెట్‌వర్క్‌ను రూపొందించడం. ఉదాహరణకు ఒక రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయితే మరో రోడ్డులో వెళ్లినట్లుగా అనుకోవచ్చు. దీంతో కేబుల్ దెబ్బతిన్నా లేదా ఒక మార్గంలో అంతరాయం ఏర్పడినా, మరో మార్గం ద్వారా డేటా కొనసాగించే అవకాశం ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మరింత పక్కాగా పనిచేసేలా నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడేషన్ చేయడం.
గ్రామ పంచాయతీ వరకు ఇంటర్నెట్ వస్తే సరిపోతుందా..?
ఇప్పుడు అందరిలోనూ ఉన్న అసలు ప్రశ్న.. గ్రామ పంచాయతీ వరకు ఇంటర్నెట్ వస్తే సరిపోతుందా? మన ఇంట్లోకి ఎలా వస్తుంది? అనే క్వశ్చన్ రావొచ్చు. ఇక్కడే ఫైబర్ టు ది హోమ్.. అంటే FTTH కాన్సెప్ట్ కీలకంగా మారుతుంది. గ్రామ పంచాయతీకి చేరిన ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను అక్కడి నుంచి ఇళ్ల వరకు విస్తరించి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 2.93 లక్షల గ్రామీణ ఇళ్లకు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఒక్కో కనెక్షన్‌కు సుమారు 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడానికి అవసరమైన ప్రారంభ మౌలిక సదుపాయాల ఖర్చును తగ్గించడంలో ఈ సాయం ఉపయోగపడుతుంది.
ప్రభుత్వ సేవలు విషయానికొస్తే..
ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గ్రామీణ జీవితంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. రైతులు వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, పంటల సాగుకు సంబంధించిన సలహాలు, ప్రభుత్వ పథకాల వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఇక ప్రభుత్వ సేవల విషయానికొస్తే.. సర్టిఫికెట్లు, దరఖాస్తులు, ఇతర పౌర సేవలను డిజిటల్ విధానంలో పొందే అవకాశం పెరుగుతుంది. రైతు వేదికలు, గ్రామ పంచాయతీలు కూడా మెరుగైన డిజిటల్ కనెక్టివిటీతో పనిచేయడానికి వీలుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇంటర్నెట్ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, ప్రభుత్వ సేవలకు ఒక కీలక సాధనం.
ప్రాజెక్టు అమలులో ట్రెసిల్ కీలక పాత్ర..
ఈ ప్రాజెక్టు అమలులో ట్రైసిల్ కీలక పాత్ర పోషించనుంది. జిల్లా, మండల కేంద్రాల వరకు ఉన్న నెట్‌వర్క్‌ను టీ ఫైబర్ నిర్వహిస్తుండగా, అక్కడి నుంచి గ్రామ పంచాయతీల వరకు భారత్‌నెట్ నెట్‌వర్క్ విస్తరణ, నిర్వహణను ట్రైసిల్ పర్యవేక్షిస్తుంది. డిజైన్, నిర్మాణం, నిర్వహణ బాధ్యతల కోసం పోటీ బిడ్డింగ్ ద్వారా సంస్థలను ఎంపిక చేయనున్నారు. అలాగే ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొత్త ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ఏర్పాటుకు కూడా టెండర్లు పిలవనున్నారు. వీటి నిర్వహణను పదేళ్లపాటు చేపట్టేలా ప్రణాళిక ఉంది.
ఎప్పటి నుంచి అమలవుతుంది..?
మొత్తానికి తెలంగాణలో డిజిటల్ కనెక్టివిటీని పల్లెపల్లెకూ, ఇంటింటికీ తీసుకెళ్లేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. అయితే ఇక్కడ అసలు సవాల్ ఒక్కటే. కాగితాలపై ఉన్న ఈ ప్రణాళిక క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా అమలవుతుంది? గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి? ఎందుకంటే డిజిటల్ తెలంగాణ అంటే కేవలం గ్రామానికి కేబుల్ చేరడం కాదు.. ప్రతి ఇంటికీ ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ఇంటర్నెట్ అందడం. మరి ఈ ఇంటర్నెట్ విప్లవం తెలంగాణ పల్లెల రూపురేఖలను ఎంతవరకు మార్చబోతుందో చూడాలి.
Also Read: 2028లో అమెరికాను ఏలేది ఎవరు? ట్రంప్ స్థానంలో ఈ ముగ్గురిలో ఒకరా?