Hyderabad Water Crisis: ఐటీ కంపెనీలు, భారీ అపార్ట్‌మెంట్లు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు.. ఇలా జెట్ స్పీడ్‌గా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో ఇప్పుడు నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది. స్నానం చేయడానికి నీళ్లు లేవు.. వంట చేసుకోవడానికి నీళ్లు లేవు.. చివరికి టాయిలెట్లకు వెళ్లడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. సమ్మర్‌లో ఇలాంటి నీటి కష్టాలు సహజమే అనుకుంటాం. కానీ ఈసారి వేసవి ఇంకా రాకముందే.. అదీ అక్టోబర్‌లోనే ట్యాంకర్ల కోసం జనం పరుగులు పెట్టాల్సి వచ్చింది. అసలు హైదరాబాద్‌లో నీటి సమస్య ఇంత తీవ్రంగా ఎందుకు మారింది? నగరానికి సరిపడా నీళ్లు లేవా? భూగర్భ జలాలు ఎక్కడికి పోతున్నాయి? రాబోయే వేసవిలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? అన్నింటి గురించి తెలుసుకుందాం.
గచ్చిబౌలి నుంచి కూకట్‌పల్లి వరకు..
హైదరాబాద్‌లో నీటి కష్టాలు వచ్చాయి. ఈ స్టేట్‌మెంట్‌ను ప్రూవ్ చేసేందుకు ఇప్పుడు మీకు కొన్ని లెక్కలు చెబుతా. జలమండలి చరిత్రలోనే తొలిసారిగా అక్టోబర్‌లో 2.2 లక్షల ట్యాంకర్లు బుక్ అయ్యాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన బుకింగ్స్ కేవలం 87 వేలు మాత్రమే. అంటే ఒక్క ఏడాదిలోనే డిమాండ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోండి. ప్రస్తుతం రోజుకు 7 వేలకు పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. సాధారణ వర్షాకాలంలో రోజుకు 1,500 నుంచి 2,000 ట్యాంకర్ల బుకింగ్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆల్ మోస్ట్ ట్రిపుల్ అయ్యింది ఈ సమస్య. మెయిన్‌గా మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరింత టెన్షన్ పెడుతోంది.
వందల సంఖ్యలో ట్యాంకర్లు బారులు..
ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర వందల సంఖ్యలో ట్యాంకర్లు బారులు తీరుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బుక్ చేసిన ట్యాంకర్ రావడానికి రెండు మూడు రోజులు పడుతోంది. ఒక్కసారి డిమాండ్ పెరిగిందంటే ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్‌లు చేసే పని తెలుసుగా. ఇదే చాన్స్ అనుకొని ధరలు కూడా పెంచేశారు. ఒక్కో ట్యాంకర్‌కు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంటే భాగ్యనగరంలో ఇప్పుడు నీళ్లు కేవలం అవసరం మాత్రమే కాదు.. ఖరీదుగా కూడా మారింది.
నీటి సంక్షోభం.. ఎవరిపై ఇంపాక్ట్ చూపిస్తుందో తెలుసా?
ఈ నీటి సంక్షోభం ఇప్పుడు ఎక్కువగా ఎవరిపై ఇంపాక్ట్ చూపిస్తుందో తెలుసా? స్టూడెంట్స్, ఎంప్లాయీస్. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో పీజీలు, హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఉండే స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు ఇప్పుడు నీళ్ల కోసం తిప్పలు పడుతున్నారు. బోర్లు ఎండిపోవడంతో హాస్టల్ మేనేజ్‌మెంట్స్ కూడా ట్యాంకర్లపైనే డిపెండ్ అవుతున్నాయి. కానీ ట్యాంకర్ల డిమాండ్ పెరగడంతో అవసరమైనంత నీరు అందడం లేదు. కొన్ని హాస్టళ్లలో ఉదయం నీళ్లు రాకపోవడంతో స్నానం చేయకుండానే ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు కొందరు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ఈ నీటి కొరత భరించలేక కొన్ని పీజీలు టెంపరరీగా మూసేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా చర్చ నడుస్తోంది.
నీటి కొరతకు ప్రధాన కారణం ఏంటి?
మరి నగరంలో నీటి కొరతకు ప్రధాన కారణం ఏంటి? దీనికి ఒక కారణం మాత్రమే లేదు. వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం, చెరువులు కనుమరుగవడం.. కానీ మెయిన్ విలన్ మాత్రం ఎల్‌నినో. ఇలా అనేక కారణాలు కలిసి ఇప్పడు ఈ కష్టాలు తెచ్చిపెట్టాయి. మరో కంగారు పెట్టే విషయం ఏంటంటే.. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే నీటిమట్టం మరో 3.86 మీటర్లు పడిపోయింది. దీనికి ఎల్‌నినోతో పాటు మనం చేసిన పాపం కూడా ఉంది. హైదరాబాద్‌లో ఒకప్పుడు వందల సంఖ్యలో చెరువులు, కుంటలు ఉండేవి. వర్షం పడితే ఆ నీటిలో కొంత భాగం చెరువుల్లో నిల్వ ఉండేది. అక్కడి నుంచి క్రమంగా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరిగేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చెరువులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటి చుట్టూ నిర్మాణాలు పెరుగుతున్నాయి. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్‌గా మారుతోంది. వర్షం పడితే ఆ నీరు భూమిలోకి ఇంకడం కంటే రోడ్లపై నుంచి వరదలా ప్రవహించడమే కనిపిస్తోంది.
మరో విషయం ఏంటంటే..
మరో విషయం ఏంటంటే.. నగరంలో ఎక్కడ చూసినా బోర్లు వేస్తున్నారు. ఇళ్లకు, అపార్ట్‌మెంట్లకు, హాస్టళ్లకు, మాల్స్‌కు.. ఇలా అన్నింటికి బోర్‌లే ప్రధాన ఆధారంగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ ట్యాంకర్ ఆపరేటర్లు అత్యంత లోతుగా బోర్లు వేసి భారీ మోటార్లతో నీటిని తోడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ఒకవైపు భూమిలోకి నీళ్లు చేరే అవకాశాలు తగ్గిపోతుంటే.. మరోవైపు ఉన్న నీటిని కూడా భారీగా తోడేస్తున్నారు. ఇదే దారుణం అంటే.. ఉన్న నీటిని కూడా ఇండస్ట్రియల్ వేస్టేజ్, మురుగునీటి పుణ్యమా అని క్వాలీటీ లేకుండా పోతున్నాయి. అంటే హైదరాబాద్‌లో నీళ్లు లేకపోవడం ఒక సమస్య అయితే.. ఉన్న నీటిని కూడా కాపాడుకోలేకపోవడం మరో సమస్య.
ఈ నీటి సమస్య ఇప్పుడే వచ్చిందా?
ఈ సమస్య ఇప్పుడే వచ్చిందా? అంటే కానే కాదు. హైదరాబాద్‌కు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే రిజర్వాయర్లు ఉన్నాయి. బట్ ఇప్పుడు అందులో కూడా నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఎల్‌నినో దెబ్బకు వర్షాలు లేకపోవడంతో ఇప్పుడు అది కూడా సమస్యగా మారింది. ఇప్పటికైనా కాస్త వరణుడు కరుణించకపోతే ఈ కష్టాలు మరింత తీవ్రం కావడం ఖాయం. అంటే ప్రస్తుతం కనిపిస్తున్న ట్యాంకర్ల క్యూ.. ఫ్యూచర్‌లో పెద్ద సమస్యకు ఇస్తున్న వార్నింగ్.
ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి..?
అన్ని సమస్యలే చెబుతున్నారు.. మరి సొల్యూషన్ సంగతేంటి? అని క్వశ్చన్ చేస్తారా? దానికి కొన్ని సొల్యూషన్స్ సజెస్ట్ చేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ముందుగా భూగర్భ జలాలు తిరిగి పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి అపార్ట్‌మెంట్, ఇంట్లో సాధ్యమైన చోట వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. చెరువులు, కుంటలు, సహజ నీటి ప్రవాహ మార్గాలను కాపాడాలి. కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే టైమ్‌లో ఆ ఏరియాలో నీరు అవలబుల్‌గా ఉందా? లేదా? అని కూడా చూసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం.. ప్రతి అవసరానికీ తాగునీటినే ఉపయోగించాల్సిన అవసరం లేదు. కార్లు కడగడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి, భవన నిర్మాణాల్లో క్యూరింగ్‌కు శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించవచ్చు. జలమండలి కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా నీటిని వృథా చేయకుండా వాడుకోవాలి.
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలి..
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని మనం కోరుకుంటున్నాం. భారీ భవనాలు రావాలి.. ఐటీ కంపెనీలు పెరగాలి.. ఉద్యోగ అవకాశాలు విస్తరించాలి. కానీ ఇవన్నీ జరగాలంటే ముందుగా నగరానికి అవసరమైన కనీస వనరు నీరు అందుబాటులో ఉండాలి కదా.. ఒక నగరం ఎంత డెవలప్ అయ్యింది అనేది అక్కడి భారీ బిల్డింగ్‌లను బట్టి మాత్రమే కాదు.. అక్కడ నివసించే ప్రజలకు కనీస అవసరాలు ఎంత సులభంగా అందుతున్నాయన్న దానిని బట్టి కూడా నిర్ణయించాలి. ఎందుకంటే బిల్డింగ్‌లను మళ్లీ కట్టుకోవచ్చు.. రోడ్లను మళ్లీ వేసుకోవచ్చు.. కానీ అడుగంటిన భూగర్భ జలాలను తిరిగి నింపడానికి మాత్రం చాలా టైమ్ పడుతుంది.
Also Read: ఒక్కొక్కరికి 50 వేల డాలర్లు.. యూట్యూబర్లకు ఇన్‌స్టా బంపరాఫర్!