Chandrababu Reforms: రాష్ట్రంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ కొరతపై.. సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. సప్లై 10 శాతం పెరిగినా.. ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని, సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9,048 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. భారీ డిమాండ్‌తో పాటు కొరత ఉందనే ఆందోళనతో కొనుగోళ్లు ఎక్కువగా పెరిగాయని వివరించారు. సాధారణ అమ్మకాల కంటే.. ఒక్కసారిగా 50 శాతం పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై తక్షణమే తనకు రిపోర్ట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును.. మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును సీఎం చంద్రబాబు అందుకున్నారు. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో.. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో జ్యూరీ ఈ అవార్డును ప్రకటించింది. ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, వ్యాపార అనుకూల వాతావరణం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుని ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించటం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు, పారిశ్రామిక అనుకూల పాలసీలు తీసుకురావడంలో చంద్రబాబు పోషిస్తున్న పాత్రను ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ ప్రశంసించింది.
సీఎం చంద్రబాబు కూడా కీలక విషయాలను పంచుకున్నారు. ఏప్రిల్ 28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. గూగుల్ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. అంతేకాదు, దేశంలో 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ప్రధాని లక్ష్యం విధిస్తే, అందులో ఏపీనే 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకుందని తెలిపారు. ఇప్పటికే 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా ముందడుగు వేసినట్లు వివరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సంస్కరణలు అమలుచేశామన్న చంద్రబాబు.. విజన్ 2020 మూలంగానే హైదరాబాద్ ఇప్పుడు అభివృద్ధి ఫలాలు అనుభవిస్తోందన్నారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని దేశం ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: మరోసారి చావును జయించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. హిల్టన్ హోటల్లో 8 రౌండ్ల కాల్పులు కలకలం
సాగుకు భద్రత, అధిక ఆదాయం సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలని, రైతన్న పంట పండాలని ఆకాంక్షించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఈ వారం సమీక్ష నిర్వహించి.. అధికారులకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో పరిస్థితులును ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు తీసుకుంటామని, పీఎండీఎస్ అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హెక్టారుకు సగటు యూరియా వినియోగం తగ్గిందని తెలిపారు. ఈ ఏడాది 11 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగయిందన్నారు. 250 ఎకరాల్లో కోకో సిటీ, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ అండ్ బ్లూ సిటీగా, నివాసయోగ్యమైన నగరంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఈ వారం సీఎం అధ్యక్షతన 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు అమరావతి నిలయంగా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు. బిట్స్ పిలాని లాంటి క్యాంపస్‌ల ఏర్పాటుతో.. రాజధాని కీలకమైన విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు మళ్లీ విశ్వాసం కలిగిందన్నారు ముఖ్యమంత్రి. రాజధాని నగరాన్ని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే వంతెనని.. అత్యంత ఆకర్షణీయంగా, ఐకానిక్ నిర్మాణంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా కొలువుదీరుతున్నాయి. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ వారం అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6.5 గిగావాట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న ఇన్ గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. 5,400 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్లలో పూర్తి కానున్న ప్రాజెక్ట్‌తో.. 2,100 మందికి ఉపాధి లభించనుంది. అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని, వరుసగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లా దేశంలోనే నంబర్ వన్‌గా తయారవుతుందన్నారు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు చంద్రబాబు. గడిచిన 22 నెలల్లో 802 ఎంవోయూలు చేసుకున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇస్తున్నామన్నారు సీఎం.
Also Read: నో స్టాక్ మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. ఉమ్మడి జిల్లాలో ఇంధన సంక్షోభం!
బిట్స్ రైట్ రైట్..
సీఎం చంద్రబాబుతో బిట్స్ పిలాని ప్రతినిధులు ఈ వారం కలిశారు. రాజధాని అమరావతిలో 250 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బిట్స్ పిలాని క్యాంపస్ పురోగతిని వివరించారు. క్యాంపస్‌లో క్వాంటం, ఏఐ విభాగాలు ఏర్పాటు చేస్తున్నామని, 2027 నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. మూడు దశల్లో బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్ నిర్మాణం జరగనుంది. 10 వేల మంది విద్యార్థులు చదువుకునేలా క్యాంపస్ నిర్మాణమవుతోంది.
పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు అతి త్వరలో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ వన్ కింద.. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలో.. 4 మెడికల్ కాలేజీలు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. సెకండ్ ఫేజ్‌లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా.. 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-2031ని కూడా త్వరలోనే తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి-వీఈఆర్‌లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్రం పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై సీఎం చంద్రబాబు ఈ వారం రివ్యూ నిర్వహించారు. ఏపీలో జనాభా పెంచేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను పరిశీలించారు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32 శాతంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదు అయినట్లు అధికారులు వివరించారు. ఈ లక్ష్యం 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
Also Read: గుండ్లపోచంపల్లిలో విష విలయం.. వేల సంఖ్యలో చేపలు మృతి.. పట్టించుకోని అధికారులు
ఆంధ్రప్రదేశ్ టూరిజానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. నీతి ఆయోగ్ దివ్యభారత్ రిపోర్టులో.. ఏపీ టూరిజం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అరకు, లంబసింగి, పాపికొండల లాంటి ప్రకృతి సౌందర్యం, సముద్ర తీరాలు, గుహలు, ఆలయాలు, వారసత్వ సంపద, ఆహారం, హస్త కళలు, పండుగల లాంటివాటిని కనులారా చూసేందుకు, తనివితీరా ఆస్వాదించేందుకు.. తప్పకుండా ఏపీని సందర్శించాల్సిన ప్రదేశంగా రికమండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని అందాలను సందర్శించేందుకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి బెస్ట్ టైమ్ అని సూచించారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ఆధ్యాత్మిక ఆనందం నుంచి ప్రశాంతమైన సముద్ర తీరాల దాకా, పచ్చని లోయల నుంచి అద్భుతమైన శిలాకృతుల వరకు.. సుసంపన్నమైన వస్త్ర పరిశ్రమ నుంచి ఉజ్వలమైన సంస్కృతి వరకు.. ఏపీ దివ్య భారత్ నేషనల్ టూరిజం రిపోర్టులో.. ప్రకాశవంతంగా వెలుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తుందన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు తన జన్మదిన వేడుకలను సామాన్యుల మధ్యే జరుపుకున్నారు. పుట్టినరోజున విజయవాడలోని పటమట అన్నక్యాంటీన్‌లో పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. క్యాంటీన్‌కు వచ్చిన వారితోనూ ముచ్చటించారు. ప్రభుత్వం తరఫున వారికి అందుతున్న సంక్షేమంపై ఆరా తీశారు. ఇక.. అదే రోజు సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 7 వేల మందికి పైగా లబ్ధి చేకూరేలా 56 కోట్లు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 22 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మొత్తం లక్షా 43 వేల మందికి పైగా లబ్ధిదారులకు.. దాదాపు 1300 కోట్లు అందజేశారు. గతంలో.. ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించలేదు.
Storey By: Appa Rao Big Tv
Also Read: కొత్తగూడెం న్యాయవాదికి జాతీయ గౌరవం.. ILPA నేషనల్ సభ్యురాలిగా ఎన్నిక..!