Trump Attack: చూస్తున్నారుగా ఈ గందరగోళం.. ఇదంతా.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న హోటల్‌లోని సీన్లు. బుల్లెట్ల సౌండ్ వినిపించగానే.. సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అవడం, అధ్యక్షుడిని టేబుల్ కింద కూర్చోబెట్టడం, నెమ్మదిగా అక్కడి నుంచి తరలించిన దృశ్యాలు.. వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయ్.వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన కాల్పుల ఘటన అమెరికానే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వైట్ హౌజ్‌కు సమీపంలోని హోటల్‌లో.. అగ్రరాజ్య అధ్యక్షుడి భద్రతను ఛేదించి మరీ జరిగిన ఈ దాడి తీవ్ర కలకలం రేపింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో.. ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దాంతో.. ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. అంతా.. భయంతో కుర్చీల నుంచి దిగి నేలపై కూర్చుండిపోయారు. ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెక్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోను సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు.
అయితే, కాల్పుల శబ్దం వినపడగానే.. సీక్రెట్ సర్వీస్, ఇతర సెక్యూరిటీ సిబ్బంది బ్యాంకెట్ హాల్‌లోకి ప్రవేశించడంతో వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. 8 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించినట్లు అక్కడున్న వాళ్లు చెబుతున్నారు. హోటల్ లోపల కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, దుండగుడు ఎలా లోపలికి ప్రవేశించాడనేది ఇప్పుడు డిబేట్‌కు దారితీసింది. హోటల్‌లో ట్రంప్ వేదికపై ఉన్నప్పుడే ఒక్కసారిగా కాల్పుల అలజడి రేగడంతో.. ఆయన్ని వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. బుల్లెట్ శబ్దాలు వినిపించగానే.. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అంతా కిందకు వంగండి అని అరుస్తూ.. రక్షణ కవచంలా మారి ట్రంప్‌ని వేదిక వెనుక వైపునకు తీసుకెళ్లారు. డిన్నర్‌కు హాజరైన వాళ్లంతా భయంతో అక్కడే ఉండిపోయారు. ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్లిపోయిన తర్వాత కూడా వారి హోటల్ లోపలే ఉండిపోయారు.
వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల ఘటనపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారన్నారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించారని తెలిపారు. కాల్పులకు పాల్పడిన షూటర్‌ని అదుపులోకి తీసుకున్నారని, తామంతా సురక్షితంగా ఉన్నామని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు. అయితే, కాల్పులు జరిపేందుకు హిల్టన్ హోటల్‌లోనే నిందితుడు ఆయుధాన్ని సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయ్. బార్ కార్ట్స్ ఉంచే గది సమీపంలో భద్రతా ఏర్పాట్లు పెద్దగా లేవని, నిందితుడు కోలో టామోస్ అలెన్ అదే గదిలో ఉన్నట్లు చెబుతున్నారు. అతను ఓ బ్యాగ్ తీసి పొడవైన గన్‌ని బయటకు లాగాడని, ఆ తర్వాత అతడు హఠాత్తుగా డిన్నర్ జరుగుతున్న బాల్ రూమ్ వైపు గన్ తీసుకొని పరిగెత్తినట్లు కొన్ని సీసీటీ ఫుటేజీల్లో కనిపిస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని తప్పించుకునే క్రమంలో.. ఎటు పడితే అటు అన్ని వైపులా కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో.. సీక్రెస్ సర్వీస్, సెక్యూరిటీ సిబ్బంది.. అతన్ని పట్టుకునేందుకు పరుగులు పెట్టారు. నిందితుడి దగ్గర ఓ షాట్‌గన్, హ్యాండ్ గన్, అనేక కత్తులు ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ఆధారంగా, అతను ఆ హోటల్‌లో ముందుగానే గెస్ట్‌గా దిగి ఉంటాడని భావిస్తున్నారు.
Also Read: గుండ్లపోచంపల్లిలో విష విలయం.. వేల సంఖ్యలో చేపలు మృతి.. పట్టించుకోని అధికారులు
వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లోని ఓ చెక్‌పాయింట్ దగ్గర నిందితుడు కోలో టామోస్ అలెన్.. ఓ సీక్రెస్ సర్వీస్ ఏజెంట్‌పై షాట్ గన్‌తో కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి కాల్పులు జరిపినా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కారణంగా అతను ప్రాణాలతో బయటపడ్డాడని ట్రంప్ చెప్పారు. 31 ఏళ్ల కోలో టామోస్ కాలిఫోర్నియాకు చెందినవాడిగా గుర్తించారు. అతన్ని హోటల్‌లోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే, ట్రంప్ టార్గెట్‌గానే ఈ కాల్పులు జరిగాయా? అని ప్రశ్నిస్తే.. ట్రంప్ ఔనని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ అధికారులు నిందితుడి మోటివ్ ఏంటనే దానిపై దర్యాప్తు చేస్తున్నారన్నారు. దాడి చేసిన వ్యక్తి.. బహుశా ఒంటరి వాడై ఉండొచ్చన్నారు ట్రంప్. అయితే, దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే ఛార్జ్ షీట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రపంచంలో అమెరికా ఎంత పాపులరో.. ట్రంప్ అనే పేరు అంతే ఫేమస్. అయితే, అగ్రరాజ్యం అధ్యక్షుడి చుట్టూ జరుగుతున్న పరిణామాలు.. ఇప్పుడు భూగోళమంతా చర్చకు దారితీశాయ్. యూఎస్ హిస్టరీలో ఎంతో మంది అధ్యక్షులు ప్రాణాంతక దాడులు ఎదుర్కొన్నారు. కానీ, ట్రంప్ నాలుగు సార్లు ప్రాణపాయం నుంచి తప్పించుకోవడం కొత్త చర్చకు తెరదీసింది. ట్రంప్ చుట్టూ ఎంత బలమైన సెక్యూరిటీ ఉన్నా, దుండగులు ఆ వలయాన్ని ఛేదించే ప్రయత్నాలు చేయడమే అనేక ప్రశ్నలకు తావిస్తోంది. అయితే, వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌కు ఇలాంటి సంఘటనల చరిత్ర ఉంది. 1981లో నాటి ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్‌పై జరిగిన హత్యాయత్నానికి ఇది వేదికైంది, ఆ ఘటనలో ఆయన హోటల్ వెలుపల కాల్పులకు గురై గాయపడ్డారు.
2024లో ట్రంప్ టార్గెట్‌గా రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయ్. ఇప్పటికే ఆయన భద్రతపై పెరిగిన ఆందోళనల మధ్య.. మరోసారి వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో కాల్పులు ఘటన జరగడం ప్రపంచం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. 2024 జులైలో.. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై కాల్పులు జరిగినప్పుడు అమెరికా మొత్తం షేక్ అయితే, ప్రపంచం మొత్తం షాక్ అయింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో.. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరిగింది. రైఫిల్‌తో పొదల్లో దాక్కున్న ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ముందుగానే గుర్తించారు. అతను కాల్పులు జరపకముందే.. అతడిని పట్టేసుకున్నారు. దాంతో.. ట్రంప్ సేఫ్‌గా బయటపడ్డారు. కొద్ది రోజుల క్రితమే.. ఓ దుండగుడు ట్రంప్ ఇంట్లోకి చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడ్డాడు. అతని చేతిలో ఆయుధంతో పాటు ఇంధనం క్యాన్ ఉంది. వాటిని కిందపడేయాలని హెచ్చరించినా.. అతను వెనక్కి తగ్గలేదు. దాంతో.. ట్రంప్‌కు ఏమీ అవకుండా భద్రతా సిబ్బంది అతన్ని కాల్చి చంపేశారు. అప్పుడే.. ట్రంప్ తాను ఇంకా ఎంతకాలం ఉంటానో తెలియదని కామెంట్ చేశారు. ఇప్పుడు.. హిల్టన్ హోటల్‌లోనూ దుండగుడి కాల్పులు చూశాక.. అసలు ప్రెసిడెంట్ ట్రంప్ చుట్టూ ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.
Also Read: మిర్యాలగూడలో నేర నియంత్రనకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన డీఎస్పీ..!
గతంలోనే.. తనపై జరుగుతున్న వరుస హత్యాయత్నాలపై.. ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తనని హత్య చేసేందుకు చాలా మంది ట్రై చేస్తున్నారని, తాజా పరిస్థితులు చూస్తుంటే తానెంత కాలం ఉంటానో కూడా తెలియట్లేదన్నారు. ఈ షూటర్లు కేవలం అసాధారణ విజయాలు సాధించే ప్రెసిడెంట్లనే టార్గెట్ చేసుకుంటారని అప్పుడే చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్.కెన్నడీ హత్య ఘటనల్ని ఎగ్జాంపుల్‌గా చెపారు ట్రంప్. అయితే, ఇంతటి భద్రతని దాటుకొని ప్రెసిడెంట్ ట్రంప్ దాకా ఎలా రాగలుగుతున్నారనేదే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర కోణం ఉందా? అనే చర్చ జరుగుతోంది. ట్రంప్‌పై జరుగుతున్న హత్యాయత్నాలు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయ్. ముఖ్యంగా.. సీక్రెట్ సర్వీస్ లాంటి అత్యున్నత భద్రతా సంస్థల వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయ్. అయితే, ట్రంప్ చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు అమెరికాలో పెరిగిపోతున్న రాజకీయ అసహనానికి నిదర్శనమనే చర్చ జరుగుతోంది. ప్రెసిడెంట్‌ని భౌతికంగా తొలగించాలనుకోవడం, ఆయనొక టాప్ టార్గెట్‌గా మిగిలిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
ప్రెసిడెంట్ ట్రంప్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఓ వ్యక్తికి సంబంధించినవి కావు. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాలు, మారుతున్న భద్రతా సమీకరణాల వెనుక అసలేం జరుగుతుందనే డౌట్ అందరిలోనూ మొదలైంది. ట్రంప్ టార్గెట్‌గా ఇప్పటికే స్పష్టమైన దాడులు, కుట్రలు జరిగాయ్. పెన్సిల్వేనియా ర్యాలీలో కేవలం కొన్ని మిల్లీమీటర్ల తేడాతో ట్రంప్ బుల్లెట్ నుంచి తప్పించుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డారు. ఇది భద్రతా వైఫల్యమే కాదు, అమెరికా రాజకీయాల్లో పెరిగిపోయిన హింసకు నిదర్శనం. ఇరాన్ లాంటి దేశాల నుంచి కూడా ట్రంప్‌కు ముప్పు ఉన్నట్లు.. అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీ వల్ల తీవ్రంగా నష్టపోయే కొన్ని వర్గాలు, గ్రూపులు ఆయనని భౌతికంగా తొలగించాలనే ఆలోచనలో ఉన్నాయనే చర్చ కూడా ఉంది. ట్రంప్ లేకపోతే.. రాజకీయంగా తమకు రూట్ క్లియర్ అవుతుందని భావించే ప్రత్యర్థులు అమెరికాలో తక్కువేమీ లేరు. ప్రస్తుతం ఈ దాడుల వెనుక ఉన్న లోతైన కుట్రలను, భద్రతా వైఫల్యాలను దర్యాప్తు సంస్థలు ఛేదించే పనిలో పడ్డాయ్.
Storey By: Anup Big Tv
Also Read: కొత్తగూడెం న్యాయవాదికి జాతీయ గౌరవం.. ILPA నేషనల్ సభ్యురాలిగా ఎన్నిక..!