BigTV English

Chilly Pepper: ఆ మిరప ఘాటు.. ‘గిన్నిస్’లో చోటు

Chilly Pepper: ఆ మిరప ఘాటు.. ‘గిన్నిస్’లో చోటు

Chilly Pepper: గుంటూరు మిర్చి మంట ఏ పాటిదో రుచి చూసే ఉంటారు. నాగాలాండ్ భూట్ జోలోకియా మిరపకాయ ఘాటు గురించీ తెలిసే ఉంటుంది. ఈ విషయంలో పదేళ్లుగా గిన్నిస్‌లో ప్రపంచ రికార్డు కరోలినా రీపర్ చిల్లీది. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేసే హాట్ చిల్లీ వచ్చేసింది.


పెప్పర్ ఎక్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ. పెప్సర్ ఎక్స్ ఘాటు ఎంతో తెలుసా? 2.69 మిలియన్ స్కోవిల్లే హీట్ యూనిట్లు(SHU). కరోలినా రీపర్ చిల్లీ, పెప్పర్ స్ప్రే ఘాటు 1.6 మిలియన్ ఎస్ హెచ్‌యూలే. వాటిని మించి ఘాటు ఉండబట్టే పాత రికార్డులను చెరిపేసి.. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నదీ మిర్చి.

ఇక్కడ విశేషం ఏమిటో తెలుసా? కరోలినా రీపర్ చిల్లీ, పెప్పర్ ఎక్స్‌ను సాగు చేసింది ఒకరే. పకర్బట్ పెప్పర్ కంపెనీ వ్యవస్థాపకుడు , దక్షిణ కరోలినాకు చెందిన ఎడ్ కర్రీ అత్యంత ఘాటైన మిర్చి రకాలను పండిస్తుంటారు. పెప్పర్ ఎక్స్‌ను సాగు చేయడం ద్వారా అత్యంత ఘాటైన మిరప తన రికార్డును తానే అధిగమించినట్టయింది.


ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ ఘాటైన మిర్చి రకాన్నిసృష్టించానని ఎడ్ కర్రీ చెబుతున్నారు. అయితే ఇంతవరకు బయటపెట్టలేదు. కరోలినా రీపర్ మిర్చి కన్నా ఘాటైన రకాన్ని ఇతరులెవరైనా పండిస్తారా? అని ఆయన ఎదురుచూశారట. పదేళ్లుగా అదే రికార్డు కొనసాగడంతో.. పెప్సర్ ఎక్స్‌ను బయటపెట్టక తప్పలేదు.

కాప్సేసిన్ అనే పదార్థం వల్ల మిర్చికి ఘాటు వస్తుంది. కాప్సేసిన్ మోతాదు పెరిగే కొద్దీ మిరప మంట పెరుగుతుంటుంది. ఈ ఘాటును స్కోవిల్లే స్కేల్‌తో కొలుస్తారు. ఫార్మకాలజిస్టు విల్బర్ స్కోవిల్లే దీనిని 1912లో ఆవిష్కరించారు. మిరప ఘాటును పూర్తిగా తగ్గించడానికి ఎంత నీరు అవసరం అవుతుందన్నది ఈ స్కేల్ ద్వారా లెక్కిస్తారు.

పెప్సర్ ఎక్స్ ఘాటును దక్షిణ కరోలినాకు చెందిన వింత్రాప్ యూనివర్సిటీ పరీక్షించింది. అది 2,693,000 స్కోవిల్లే హీట్ యూనిట్లు అని తేల్చింది. ఎడ్ కర్రీకి మిరప సాగు అంటే సరదా. 1990 నాటికే 800 రకాల మిరప మొక్కలను పెంచారు. పెప్సర్ ఎక్స్ ను పదేళ్లుగా సాగు చేస్తున్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు తెలిపారు.

ఇంత ఘాటైన మిర్చి ఆవిష్కరణ కోసం ఎడ్ కర్రీ.. హైబ్రిడ్ పద్ధతిని అనుసరించాడు. కాప్సేసిన్ మోతాదును పెంచేందుకు.. అత్యంత ఘాటు ఉన్న మొక్కలతో అంటు కట్టారు. నాగాలాండ్‌లో సాగయ్యే భూట్ జోలోకియా మిరప ఘాటు 1 మిలియన్ స్కోవిల్లే హీట్ యూనిట్లు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×