China Hackers Army: డ్రాగన్ చైనా.. హ్యాకింగ్ కోసం ఓ ప్రైవేట్ ఆర్మీని రెడీ చేసుకుంటోంది. చైనాకు అభద్రతాభావం ఎక్కువ. అదే సమయంలో ప్రపంచాన్ని శాసించాలన్న టార్గెట్ పెట్టుకుంది. అది పద్ధతిగానైనా.. లేదంటో రాంగ్ రూట్ లో అయినా.. అందుకే తెరవెనుక కుట్రలకు భారీగానే ప్లాన్ చేసుకుంటోంది. మేం చేసేదే శాసనం.. చెప్పేదే చేయాలి అన్న ధోరణితో వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకునే భారీ కుట్రలు జరుగుతున్నాయి. చైనా హ్యాకర్స్ ఆర్మీ వెనుక కళ్లు చెదిరే వాస్తవాలు బయటికొస్తున్నాయి.
సైబర్ దాడులపై అమెరికా-చైనా ఒప్పందాలు
2015లో మేధోసంపత్తి సమాచారంపై సైబర్ దాడులకు తావివ్వబోమని అమెరికా, చైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని కిందకు వాణిజ్య రహస్యాలు, ఇతర రహస్య సమాచారం కూడా వస్తుంది. అయితే ఆ మరుసటి ఏడాదే ఆ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆరోపించింది. అదీ మ్యాటర్. ఏ ఒప్పందాన్ని కూడా చైనా సరిగ్గా ఫాలో అవదు. ఇప్పుడు ఏకంగా భారీ ఎత్తున హ్యాకర్స్ ఆర్మీని రెడీ చేసుకుంటోంది. ఎందుకు ఈ పని చేస్తోంది? డిలీట్ అమెరికా అని ఎందుకు రెచ్చిపోతున్నారు?
( హ్యాకింగ్ పోటీలు )
చైనా ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు, గూఢచర్యం, డేటా చోరీ కోసం పవర్ ఫుల్ హ్యాకర్స్ ఆర్మీ నిర్మిస్తోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ హ్యాకర్లు చైనా ప్రభుత్వం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఆదేశాల ప్రకారం పనిచేస్తారంటున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్. 2015లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆర్మీలో ఎన్నో మార్పులు చేశారు. అప్పుడే దీన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ఎఫ్‌కు ఇలాంటి దాడులు చేసే పూర్తి పూర్తి సామర్థ్యం ఉంది. సెక్యూరిటీ ట్రెయిల్స్, టూల్స్, అనలిటిక్స్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ సాయంతో చొరబడుతుంటారు. ఎఫెక్ట్ చేస్తారు. సాఫ్ట్ వేర్ లోపాలను పసిగట్టడం, చొరబడడం, బెదిరించడం, స్తంభింపజేయడం ఇదే చైనీస్ హ్యాకర్స్ టార్గెట్. హ్యాకింగ్ ను ప్రోత్సహించేందుకు చైనా హ్యాకింగ్ పోటీలను నిర్వహిస్తుంటుంది. ఇందులో యంగ్ టాలెంటెడ్ హ్యాకర్లను గుర్తించి, వారి స్కిల్స్ పెంచుతారు. గతంలో చైనీస్ హ్యాకర్లు అంతర్జాతీయ పోటీల్లో డామినెంట్ గా ఉండేవారు. అయితే ఆల్ ఆఫ్ సడెన్ గా వారందరినీ కేవలం దేశీయ పోటీల్లో మాత్రమే పాల్గొనాలని బీజింగ్ ఆర్డర్ వేసింది.
( AI వార్ అకాడమీలు )
వుహాన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సైబర్ వార్ అకాడమీలను చైనా స్థాపించింది. ఈ అకాడమీలు… నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ, అలాగే ఆర్మీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ లాంటి సంస్థలను ఒక్కతాటిపైకి తెచ్చి అమెరికా లాంటి దేశాల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే సైబర్ ఆర్మీని ట్రైనప్ చేస్తోందన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఐ-సూన్ లాంటి ప్రైవేట్ సైబర్ సెక్యూరిటీ కంపెనీలు.. చైనా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాయి. ఈ కంపెనీలు హ్యాకింగ్ మెటీరియల్ ను తయారుచేసి, డేటాను సేకరించి, ప్రభుత్వానికి లేదా ఇతర పార్టీలకు అమ్మడం టార్గెట్. అంతే కాదు చైనా ప్రభుత్వం, ఆర్మీ .. ఫ్రీలాన్స్ హ్యాకర్లను ఎంగేజ్ చేస్తారు. ఈ హ్యాకర్లు టార్గెట్ ను ఫిక్స్ చేసుకుని డేటాను చోరీ చేసి, ప్రభుత్వానికి అందిస్తారు.
(చైనా హ్యాకర్లు ఏం చేస్తున్నారు?)
చైనీస్ హ్యాకర్లు ఇప్పటికే చాలా దేశాల్లో తమ నైపుణ్యాలు చూపి ఆ దేశాలను ఎఫెక్ట్ చేశారంటున్నారు. అయితే ఆధారాల్లేని ఆరోపణలతో చైనాను నిందించడం కరెక్ట్ కాదని డ్రాగన్ కంట్రీ ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూనే ఉంది. అయినా సరే చేసేది చేస్తూనే ఉంటున్నారు. 2023 నుండి చైనా హ్యాకర్లు అమెరికాలోని AT&T, వెరిజోన్ లాంటి టెలికాం కంపెనీలను హ్యాక్ చేసి, ట్రంప్, JD వాన్స్, కమలా హారిస్ లాంటి రాజకీయ నాయకుల ఫోన్ డేటాను సేకరించారంటారు. 2024 డిసెంబర్‌లో యూఎస్ ట్రెజరీ డిపార్టమెంట్‌లోని అన్‌క్లాసిఫైడ్ డాక్యుమెంట్‌లను, ఉద్యోగుల వర్క్‌స్టేషన్‌లను యాక్సెస్ చేశారన్న డౌట్లను అమెరికా వ్యక్తం చేసింది. ఈ జులైలో ఏకంగా అమెరికా జర్నలిస్టుల మైక్రో సాఫ్ట్ అకౌంట్లను హ్యాక్ చేయడం, జాతీయ భద్రత, ఆర్థిక విధానాలపై రిపోర్టింగ్ చేసే వారిని టార్గెట్ గా చేసుకున్నారు.
చైనీస్ హ్యాకర్స్ లో రకరకాల గ్రూపులు ఉన్నాయి
చైనీస్ హ్యాకర్లు తమ టాలెంట్ చూపించేందుకు ఏ దేశాన్ని కూడా వదలడం లేదు. రష్యన్ సైనిక సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలనూ టార్గెట్ చేసుకున్న పరిస్థితి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనిక అనుభవం, డ్రోన్ యుద్ధం, రాడార్ డేటా, సాటిలైట్ కమ్యూనికేషన్‌లను చోరీ చేసే ప్రయత్నాలు జరిగాయంటున్నారు. చైనీస్ హ్యాకర్స్ లో రకరకాల గ్రూపులు ఉన్నాయి. వీరంతా కలిసి అమెరికాలోని విద్యుత్, నీరు, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భవిష్యత్తులో అస్థిరత సృష్టించేందుకు రెడీగా ఉన్నాయంటున్నారు. 2024 జులై నుంచి 2025 మార్చి వరకు, చైనా హ్యాకర్లు 75కి పైగా సంస్థలను, టెలికాం, IT సర్వీసెస్, ప్రభుత్వ రంగాలను టార్గెట్ చేసుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కలవరానికి దారి తీస్తోంది.
హ్యాకర్స్ కేవలం లోపాలను పసిగట్టి చొరబడడమే కాదు
హ్యాకర్స్ కేవలం లోపాలను పసిగట్టి చొరబడడమే కాదు.. నకిలీ ఇమెయిల్స్, మెసేజెస్ పంపడం ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. ఈ ఇమెయిల్స్‌లో ట్రాకింగ్ లింక్‌లు ఉంటాయి, ఇవి బాధితుడి లొకేషన్, ఐపీ అడ్రస్, వాడుతున్న పరికరాలేంటో తెలుసుకుంటారు. ఏదైనా సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఏవైనా ఉంటే సిస్టమ్‌లలోకి ఈజీగా చొరబడతారు. షార్ట్‌లీష్, కోట్‌హాంగర్, డీడ్ RAT లాంటి బ్యాక్‌డోర్‌లను ఉపయోగించి రూటర్లు, సర్వర్లలోకి చొరబడతారు. ఈ బ్యాక్‌డోర్‌లు లాంగ్ టర్మ్ యాక్సెస్‌ను అందిస్తాయి.
( హ్యాకింగ్ తో ఏం చేస్తారు? )
చైనా తన సైనిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి సైబర్ వార్ కెపాసిటీని డెవలప్ చేసుకుంటోంది. అమెరికా, యూరప్, ఇతర దేశాల మౌలిక సదుపాయాలను అస్థిరపరచడం దీని అసలు లక్ష్యం. ఈ డ్రాగన్ హ్యాకర్లు అమెరికా, యూరప్ కంపెనీల నుంచి టెక్, ట్రేడ్ సీక్రెట్స్ ను చోరీ చేస్తున్నారు. ఇది చైనా సంస్థలకు ఖర్చు, సమయాన్ని ఆదా చేస్తుంది. వీటికి తోడు ఇతర దేశాలలో రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడం, అస్థిరత సృష్టించడం, లేదా విమర్శకులను టార్గెట్ చేసుకునేందుకు కూడా ఈ హ్యాకింగ్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. లేటెస్ట్ వార్ ఫేర్ లో సైబర్ యుద్ధం కీలకం. సో భారత్, తైవాన్, యూరప్, అమెరికా సంస్థలే లక్ష్యంగా డ్రాగన్ హ్యాకింగ్ ఆర్మీ తెగబడుతోంది. ఈ ఏడాది జూన్ లో చైనీస్ హ్యాకర్స్ పై తైవాన్ విమర్శించింది. ఆర్మీ, ఏరోస్పేస్, ఇంధన రంగాలను లక్ష్యంగా చేసుకున్నారన్నది.
సైబర్ ఎటాక్స్ కోసమే.. ఈ హ్యాకింగ్ ఆర్మీని బిల్డ్ చేస్తోంది చైనా
సైబర్ ఎటాక్స్ కోసమే.. ఈ హ్యాకింగ్ ఆర్మీని బిల్డ్ చేస్తోంది చైనా. అన్ని దేశాలను చిన్న క్లిక్ తో గుప్పిట్లో పెట్టుకునేలా స్ట్రాటజీ రెడీ చేసుకుంటోంది. ఇప్పటికే శాంపిల్ గా చాలా దేశాల్లో చిన్న చిన్న గా వ్యవస్థలను స్తంభింపజేస్తోంది. చివరికి ఈవీ ఛార్జింగ్ తో కూడా పవర్ గ్రిడ్ లను పరేషాన్ చేసే స్థాయికి వెళ్లింది చైనీస్ హ్యాకర్స్ ఆర్మీ.
చిక్కరు.. దొరకరు.. లోపాలు పసిగడుతారు..
చైనాకు చెందిన హ్యాకర్లు, ముఖ్యంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సంబంధం ఉన్నవారు, అత్యంత లేటెస్ట్ సైబర్ ఎటాక్స్ నిర్వహిస్తారు. అందరు వాడే టెక్నిక్స్ ను వీళ్లు వాడరు. చిక్కరు దొరకరు. లోపాలను ముందే పసిగడుతారు. ఎటాక్ చేస్తారు. ఇదీ సంగతి. ప్రపంచదేశాల దృష్టిలో మాత్రం సైబర్ పవర్ హబ్ ముసుగు. కానీ లోలోపల చేసేదంతా ఇదే కథ. అమెరికా, యూరప్, ఆసియా దేశాలలోని ప్రభుత్వ సంస్థలు, డిఫెన్స్ కంపెనీలు, టెక్ కంపెనీల నుంచి సెన్సిటివ్, కీ ఇన్ఫర్మేషన్ చోరీ చేయడమే లక్ష్యం అంటున్నారు. చైనా ఈ దాడులు తమవి కావు అంటోంది. కానీ యూఎస్, యూకే, ఇతర దేశాలు ఈ దాడులను చైనా స్టేట్ స్పాన్సర్డ్ గ్రూపుల పనే అని కౌంటర్ ఇస్తోంది.
i-Soon డేటా లీక్ ఇటీవలే సంచలనం
i-Soon డేటా లీక్ ఇటీవలే సంచలనం సృష్టించింది. ఇది చైనాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఈ కంపెనీ డేటా లీక్ 2024 ఫిబ్రవరిలో బయటికొచ్చింది. ఈ లీక్‌లో 500కు పైగా ఫైళ్లు, చాట్ లాగ్‌లు, మార్కెటింగ్ మెటీరియల్స్, కాంట్రాక్ట్‌లు, ప్రొడక్షన్ మాన్యువల్స్, క్లయింట్, ఉద్యోగుల జాబితాలు బయటికొచ్చాయి. ఈ లీక్ చైనా సైబర్ గూఢచర్యం, హ్యాకర్ ఫర్ హైర్ ఇకోసిస్టమ్ ఎలా పని చేస్తోందో అందరికీ అర్థమైంది. అంతెందుకు ఈవీ ఛార్జింగ్ ద్వారా కూడా గేమ్ ఆడుతున్నారు చైనీస్ హ్యాకర్లు. EV ఛార్జింగ్ స్టేషన్‌లు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన పరికరాలు. ఇవి డేటా సేకరణ, చెల్లింపులు, పవర్ మేనేజ్‌మెంట్ కోసం క్లౌడ్ ఆధారిత సిస్టమ్‌లతో కమ్యూనికేట్ చేస్తాయి. ఈ కనెక్టివిటీ సైబర్ దాడులకు ఒక మార్గంగా చెబుతున్నారు. హ్యాకర్లు ఛార్జింగ్ స్టేషన్‌లను రిమోట్‌గా ఆఫ్ చేయడం లేదా ఛార్జింగ్ సెషన్‌లను అడ్దుకోవడం ద్వారా జనానికి అసౌకర్యం కలిగించడం టార్గెట్. 2022లో రష్యాలోని EV ఛార్జింగ్ స్టేషన్‌లను హ్యాక్ చేసి యాంటీ పుతిన్ మెసేజ్ లను డిస్ ప్లే చేశారు.
ఈవీలను తమ కంట్రోల్ లోకి తీసుకోవడం
అంతే కాదు EV ఛార్జింగ్ స్టేషన్‌లు పవర్ గ్రిడ్‌తో లింకప్ అయి ఉంటాయి. ఒకేసారి వేలాది ఛార్జర్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయడం ద్వారా హ్యాకర్లు గ్రిడ్‌ను డ్యామేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇది ఏ దేశానికైనా జాతీయ భద్రతకే ముప్పు. ఛార్జింగ్ టైమ్ లో హ్యాకర్లు వెహికిల్ ఫర్మ్‌వేర్‌లోకి చొరబడి, వాహనాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకోవడం, రిమోట్ యాక్సెస్ తీసుకునేలా చేయడం, ఆటో పైలెట్ సహా ఇతర ఆప్షన్లను డిస్టర్బ్ చేయడం వంటివి చేయొచ్చు. ఈ ఆందోళన ఎందుకంటే EV ఛార్జింగ్ రంగంలో చైనా గ్లోబల్ లీడర్. ప్రపంచంలోని 70% ఫాస్ట్ ఛార్జర్‌ల స్టాక్‌ను కలిగి ఉంది. చైనీస్ కంపెనీలు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లలో భారీగా పెట్టుబడి పెడుతున్నాయి. DC ఫాస్ట్ ఛార్జర్‌లు వాహనం, ఛార్జర్ మధ్య డేటా బదిలీ కోసం PLCని ఉపయోగిస్తాయి. ఈ లేయర్‌లో ఎన్‌క్రిప్షన్ లేకపోవడం లేదా అన్ సేఫ్ కీ జనరేషన్ వల్ల హ్యాకర్లు నెట్‌వర్క్ కీలు, డిజిటల్ అడ్రస్‌లను యాక్సెస్ చేయవచ్చంటున్నారు.
2020 అక్టోబర్‌లో ముంబయిలో పవర్ బ్లాకవుట్
2020 అక్టోబర్‌లో ముంబయిలో పవర్ బ్లాకవుట్ కావడానికి చైనా లేదా పాకిస్తాన్‌కు చెందిన ఏదైనా సైబర్ దాడే కారణమన్న ప్రచారం జరిగింది. అమెరికా కూడా చైనీస్ హ్యాకర్స్ హస్తం ఉండొచ్చని రిపోర్ట్ కూడా ఇచ్చింది. అయితే ఇవన్నీ నిరాధారమని చైనా కొట్టి పారేసింది. సో చైనా అడ్వాన్స్ అవుతుంటే.. ఇతర దేశాలు వీటిని తట్టుకునే కెపాసిటీ ఉందా అన్న చర్చ జరుగుతోంది. మన దగ్గర సైబర్ దాడులను తిప్పికొట్టడానికి రెండు సంస్థలు ఉన్నాయి. వీటిలో ఒకటి భారత్ కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. దీనిని 2004లో ఏర్పాటుచేశారు. క్రిటికల్ ఇన్‌ఫర్మేషన్ పరిధిలోకి రాని సైబర్ దాడులపై ఈ సంస్థ వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోది నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ . ఇది 2014 నుంచి పనిచేస్తోంది. ఇది క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద జరిగే దాడులపై దర్యాప్తు చేయడం, వాటికి రియాక్ట్ అవడం, న్యూట్రలైజ్ చేయడం వంటివి చేస్తుంది. కెనడా కూడా ఇటీవలే చైనీస్ హ్యాకర్స్ ఆర్మీ నుంచి ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో అలర్ట్ అయింది.
చైనా గూఢచర్యం మరీ ఎక్కువైందన్న ఆరోపణలు
చైనా సైబర్ హ్యాకర్ ఆర్మీ పవర్ పెరుగుతుండడంతో అమెరికా నిపుణుల్లో ఆందోళన పెరుగుతోంది. గూఢచర్యం మరీ ఎక్కువైందంటున్నారు. ఈ క్రమంలోనే చైనా విద్యార్థులపై అమెరికా నిఘా పెడుతోంది. ఇటీవలే ఓ డేంజర్ ఫంగస్ ను అమెరికా తీసుకొచ్చిన ఇద్దరు చైనీయులను అమెరికా FBI అరెస్ట్ చేసింది. ఈ హ్యాకింగ్ అయితే కంటికి కనిపించకుండా చైనా నుంచే యాక్సెస్ చేసే ప్రమాదం ఉండడంతో మరింత జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయంలోనే అమెరికా-చైనా సంబంధాలు దెబ్బతింటున్నాయి కూడా. ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో చైనాకు కళ్లెం వేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. చైనా ఈ టెక్నాలజీతో భద్రతా పరమైన సవాళ్లు విసురుతోందని అమెరికా భావిస్తోంది. అమెరికా టూల్స్, సాఫ్ట్‌వేర్‌తో తయారుచేసిన చిప్‌లను చైనాకు ఎగుమతి చేసే కంపెనీలు ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాలన్నది. ఇంకా చాలా విధాలుగా ట్రాక్ చేస్తున్నారు.