China J-36 Fighter Jet: ప్రపంచ దేశాలకు చైనా మరో పెద్ద షాకిచ్చింది. అమెరికా కళ్లు బయర్లు కమ్మెలా డ్రాగన్ కంట్రీ కొత్త వెపన్ రూపొందించింది. 6th జనరేషన్ ఫైటర్ జెట్ J-36ను రంగంలోకి దింపింది. ఈ సూపర్ జెట్ వల్ల చైనా దూకుడు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాల్లో ఇది కూడా కీలకంగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలన్నీ ఆరవ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో.. అమెరికాతో పాటు చైనా పోటీగా వీటిని తయారు చేస్తోంది. ఈ
సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూ మీదుగా చక్కర్లు
ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటికీ రక్షణ సవాళ్లు ఎక్కువవుతున్న తరుణంలో చైనా షాక్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్‌గా పనిచేసే కొత్త స్టెల్త్ ఫైటర్ జెట్‌ను రూపొందించింది. J-36 అని పేరుతో చైనా, 6th జనరేషన్ సూపర్ వెపన్ అత్యాధునిక డిజైన్‌తో తయారుచేయబడింది. ఇటీవల, ఈ యుద్ధ విమానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూ మీదుగా పట్టపగలు ఆకాశంలో ఎగిరిన ఈ విమానం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
వైమానిక ఆధిపత్యం కోసం తయారుచేసిన J-36 ఫైటర్ జెట్
ఇక, ఈ యుద్ధ విమానం ఛేజ్ ప్లేన్‌గా చెంగ్డూ జె-20ఎస్ ఫైటర్ జెట్ కూడా ఉన్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక తెలిపింది. అయితే, పగలు సమయంలో దీన్ని ఎగరేయడంపైన చైనా ఉద్దేశమేమిటనే చర్చ కూడా జరుగుతోంది. పెరుగుతున్న చైనా యుద్ధ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికే పగటి వేళ J-36ని ఎగరేసినట్లు అంతా భావిస్తున్నారు. J-36 అధునాతన లక్షణాలు, తోకలేని దాని డిజైన్ వల్ల ఇది రాడార్‌లకు కూడా అందని విధంగా రూపొందించినట్లు తెలుస్తోంది. వైమానిక ఆధిపత్యం కోసం తయారుచేసిన ఈ ఫైటర్ జెట్.. గ్లోబల్ బ్యాలెన్స్‌ను మార్చగల సామర్థ్యం గలదని అభిప్రాయాలున్నాయి.
మావో జెడాంగ్ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా టెస్టింగ్
అయితే, ఈ అధునాత ఫైటర్ జెట్ గురించి, చైనా ప్రభుత్వం గానీ, చైనా మిలటరీ గానీ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కానీ, దాని అరంగేట్రం సమయం మాత్రం ఉద్దేశపూర్వకంగా చేసిందనే సందేహాలకు కారణం అయ్యింది. మావో జెడాంగ్ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా ఈ టెస్ట్ ఫ్లైట్‌ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇది మొదటి నుండీ.. సైనిక సాంకేతికతలో చైనా వేగవంతమైన పురోగతిని హైలైట్ చేసే సింబాలిక్ చర్యగా నిపుణులు భావిస్తున్నారు. J-36 ఆవిర్భావం చైనా సైనిక వైమానిక సామర్థ్యాలలో ఒక పెద్ద అడుగుకు సంకేతంగా చూస్తున్నారు.
దక్షిణాసియాలోని అమెరికా అనుబంధ ఆస్తులకు ప్రమాదం
ఈ స్టెల్త్ జెట్ అత్యాధునిక డిజైన్‌లో మెరుగుపరిచిన స్టెల్త్ ఫీచర్లు, హై-స్పీడ్ ఎండ్యూరెన్స్, అసాధారణమైన టెయిల్‌లెస్ ట్రైయాంగులర్ కాన్ఫిగరేషన్‌లు ఉన్నాయి. ఇది ఇప్పటికే ఉన్న యూఎస్ వైమానిక ఆధిపత్యానికి ఒక ముఖ్యమైన సవాలుగా మారనుంది. ఈ ఫైటర్ జెట్ సామర్థ్యాలు చూస్తుంటే… దక్షిణాసియాలోని అమెరికా అనుబంధ ఆస్తులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి గతంలో అందుబాటులో లేని ఇలాంటి సూపర్ వెపన్ పాశ్చాత్య దేశాలను అప్రమత్తం చేస్తోంది.
అధిక ఎత్తు, విస్తృతమైన పరిధి సామర్థ్యం
ఇక, ఈ J-36 ఫైటర్ జెట్ అధిక ఎత్తులో, విస్తృతమైన పరిధిలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది, ట్యాంకర్ మద్దతు అవసరం లేకుండా చైనాకు దూరంగా ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే, ట్యాంకర్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, విస్తరించిన మిషన్ల కోసం నిఘా విమానాలపై ఆధారపడే.. అమెరికా, దాని అనుబంధ దళాలకు ఈ ఫైటర్ జెట్ కొత్త సవాళ్లను కలిగిస్తుంది. అందులోనూ, దీన్ని పగటిపూట, బహిరంగంగా, అందరూ గమనించే ప్రదేశంలో ఎగరేయడం అమెరికాను ఉద్దేశపూర్వకంగా ఉడికించడానికే అనే అభిప్రాయాలు వస్తున్నాయి.
అమెరికా నెక్ట్స్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ చొరవకు పోటీ
ఈ జెట్‌ను హై-ప్రొఫైల్ పద్ధతిలో ఎగరవేయాలనే చైనా నిర్ణయం భారత్ లాంటి ప్రపంచ ప్రత్యర్థులకు.. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌కు..పెరుగుతున్న చైనా సైనిక పరక్రమాన్ని చూపించడంలో భాగమేనని అంటున్నారు. చైనా సైన్యం వ్యూహాత్మక ఉద్దేశ్యం లేకుండా ఇలాంటి అధునాతన సామర్ధ్యాలను చాలా అరుదుగా ప్రదర్శిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే, ఈ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయడం అనేది. అమెరికా నెక్ట్స్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ చొరవకు పోటీగా తలపెట్టిన “సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్” విధానంలో భాగమని నిపుణులు భావిస్తున్నారు.
విమాన టెక్నాలజీ, మానవరహిత వైమానిక వ్యవస్థలు
అధ్యక్షుడు జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా సైన్యాన్ని ఆధునీకరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా J-36 అభివృద్ధి జరిగింది. ఇటీవల పెంటగాన్… చైనా వైమానిక దళం, నావికాదళాన్ని “ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద వైమానిక దళం”గా అభివర్ణించింది. విమాన టెక్నాలజీ, మానవరహిత వైమానిక వ్యవస్థలు, సమగ్ర సైనిక వ్యూహాల్లో చైనా వేగవంతమైన పురోగతిని ప్రస్తావిస్తూ… యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్.. చైనాను దాని టాప్ పేసింగ్ ఛాలెంజ్‌గా పేర్కొంది.
AI-ఆధారిత నిర్ణయం తీసుకునే ఆయుధాలు..
6th జనరేషన్ ఎయిర్ పవర్‌పైన చైనా దృష్టి సారించడం.. అమెరికా నెక్ట్స్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేస్తున్న అమెరికా, ఇతర ప్రపంచ దేశా ప్రయత్నాలకు ఉంటుంది. NGAD ఇనీషియేషన్ అనేది అధునాతన ఫైటర్ జెట్‌లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా అమెరికా చేపట్టిన చర్య. ఇవి అత్యాధునిక స్టెల్త్, అడాప్టివ్ ఇంజన్‌లు, AI-ఆధారిత నిర్ణయం తీసుకునే ఆయుధాలు, డ్రోన్‌లకు కమాండ్ నోడ్‌లుగా పనిచేయడానికి వీలు కల్పించే ఆయుధాలను తయారు చేయడంలో భాగంగా ఉంది. అందుకే, దీనికి సమాంతరంగా చైనా ఇలాంటి అత్యాధునిక ఆయుధాలను రూపొందించడంపై ఆసక్తి చూపిస్తోంది.
J-20 కంటే మరింత ఆధునికంగా J-36 జెట్
J-36 ముఖ్య లక్షణాలు చూస్తే.. వార్ జోన్ నివేదిక ప్రకారం… చైనా గతంలో తయారుచేసిన తన మొదటి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ J-20 నుండి మరింత ఆధునికంగా J-36ని రూపొందించారు. ఇందులో ప్రధాన ప్రత్యేకత దీని టెయిల్‌లెస్ డిజైన్. ఈ ఫ్లైట్ ప్రత్యేకంగా కనిపించే త్రిభుజాకార కాన్ఫిగరేషన్‌తో తయారు చేశారు. రాడార్లు కూడా గుర్తించలేని విధంగా పనిచేస్తుంది. అధునాతన థ్రస్ట్-వెక్టరింగ్ ఇంజన్‌లు లేకపోయినప్పటికీ, ఈ డిజైన్ లాంగ్-రేంజ్ కార్యకలాపాల కోసం ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, మూడు-ఇంజిన్ కాన్ఫిగరేషన్‌తో ఇది పనిచేస్తుంది. మూడు WS-10C టర్బోఫ్యాన్‌ల ద్వారా శక్తిని పొందుతుంది.
ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్‌లు
ఇది, సాంప్రదాయేతర ఇంజిన్‌తో అత్యంత ఎత్తులో, అధిక వేగంతో చేసే కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీని, మెరుగైన పేలోడ్, రేంజ్ కూడా అంతే ప్రత్యేకంగా నిలుస్తుంది. భారీగా కనిపించే ఈ జెట్ పరిమాణంతో పాటు ఇంధన సామర్థ్యం కూడా అధికంగా ఉంటుంది. అధునాతన ఆయుధాలు, అడ్వాన్స్డ్ సెన్సార్‌లు కూడా ఇందులో ఉంటాయి. ఇది దీర్ఘకాలిక మిషన్‌లకు అనుకూలంగా తయారుచేశారు. ఇక, స్టెల్త్, సర్వైవబిలిటీ కూడా ఎక్కువగానే ఉంది. సైడ్-లుకింగ్ ఎయిర్‌బోర్న్ రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్‌లు, అధునాతన లో-అబ్జర్వబుల్ టెక్నాలజీలు వంటి దీని లక్షణాలు.. J-36కి నిఘా, పోరాటంలో భారీ ప్రయోజనాన్ని ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
1949లో చైనాలో కేవలం 17 రుడిమెంటరీ విమానాలు
1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపన సమయంలో.. చైనాలో కేవలం 17 రుడిమెంటరీ విమానాలు మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు చైనా వైమానిక దళం ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన ఎయిర్ ఫోర్స్‌లలో ఒకటిగా తయారయ్యింది. ఇక, తాజాగా J-36ను తీసుకురావడంతో.. చైనాకున్న తైవాన్, సౌత్ చైనా సముద్ర ప్రాదేశిక వివాదాలు, టెక్నలాజికల్ పోటీ వంటి సమస్యలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అలాగే, చైనా, యూఎస్‌ల మధ్య రగులుతున్న ఉద్రిక్తతలను కూడా ఇది రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే, రాబోయే నెలల్లో ఈ ఫైటర్ జెట్‌ను మళ్లీ మళ్లీ ప్రదర్శించే అవకాశం కూడా ఉంది.
చైనాకున్న తైవాన్, సౌత్ చైనా సముద్ర ప్రాదేశిక వివాదాలు
రక్షణరంగ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. J-36 కేవలం 6th జనరేషన్ యుద్ధవిమానం మాత్రమే కాకుండా స్టెల్త్ బాంబర్లు, మానవరహిత వైమానిక వాహనాలతో పాటు మల్టీ ప్లాట్‌ఫారమ్‌లలో మోహరించే సాంకేతికతలకు కూడా టెస్ట్‌బెడ్‌గా నిలుస్తుంది. అదే సమయంలో, అమెరికా, దాని NGAD ప్రోగ్రామ్‌ను వేగవంతం చేస్తుంది. రాబోయే ముప్పును ఎదుర్కోడానికి అమెరికా ప్రస్తుత వాయు సామర్థ్యాలను మరింతగా మెరుగుపరుస్తుంది. ఈ నేపధ్యంలో… రెండు అగ్రదేశాల మధ్య వైమానిక ఆధిపత్యం రేసు స్పీడ్ అందుకోనుంది.
2000 తర్వాత రష్యా, చైనాల స్వదేశీ సైనిక సామర్ధ్యం
యుద్ధ సామర్థ్యంలో అమెరికాను మించిన దేశం ప్రస్తుతం ఏది లేదు. 1945 ఆగష్టులో అణుబాంబు వేసి, హిరోషిమా, నాగసాకిని నాశనం చేసిన తర్వాత యూఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక దళంగా పేరు సంపాదించుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే.. అమెరికా ఆకాశాన్ని పరిపాలించింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో, ప్రపంచవ్యాప్తంగా దాని మల్టీ-మిలటరీ చర్యల నేపథ్యంలో.. అమెరికా, మొత్తం పౌర, సైనిక మౌలిక సదుపాయాలను నాశనం చేసింది.
5th జనరేషన్ యుద్ధ విమానాల అభివృద్ధిలో చైనా స్పీడ్
వియత్నాం నుండి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వరకు తన శత్రువులపై విరుచుకుపడింది. 2000 తర్వాత, రష్యా, చైనాలు కూడా తమ స్వదేశీ సైనిక సామర్ధ్యంతో ప్రపంచ రక్షణ రంగంలో ఉనికిని చాటుకున్నాయి. ఇవి, యునైటెడ్ స్టేట్స్ అసమానమైన ఆధిపత్యానికి గట్టి పోటీ ఇవ్వగలవనే విధంగా మారాయి. ఈ క్రమంలోనే.. 5th జనరేషన్ యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో చైనా స్పీడ్ పెంచింది. చైనా సైనిక శక్తిని 2024 వార్షిక నివేదికలో పెంటగాన్ ప్రత్యేకంగా గుర్తించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వైమానిక దళం “స్పీడుగా అభివృద్ధి చెందుతోంది” అని అంచనా వేసింది.
భారత్ దగ్గర స్టెల్త్ ఫైటర్ జెట్ లేదు
మరోవైపు, చైనా J-36ని రంగంలోకి దించడం భారతదేశంపై కూడా గణనీయమైన ప్రభావానికి కారణం అవుతోంది. ప్రస్తుతం, భారత్ దగ్గర స్టెల్త్ ఫైటర్ జెట్ లేదు. చైనా ఇప్పటికే తన J-20 స్టెల్త్ ఫైటర్లను సిక్కింలోని భారతదేశ సరిహద్దులకు దగ్గరగా మోహరించింది. ఇప్పుడు, J-36 చేరిక భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలను మరింత పెంచుతుందనే సందేహాలు వస్తున్నాయ్. ఇటీవల, చైనా J-20 జెట్‌లు భారతదేశ సరిహద్దు నుండి 150 కి.మీ కంటే తక్కువ దూరంలో ఉన్నట్లు శాటిలైట్ ఫోటోల ద్వారా తెలిసింది.
36 ఫ్రెంచ్-మేడ్ రాఫెల్ యుద్ధ విమానాలతో భారత్ కౌంటర్
అయితే, చైనా చర్యలకు.. పశ్చిమ బెంగాల్‌లోని హసిమారాలో ఉన్న 36 ఫ్రెంచ్-మేడ్ రాఫెల్ యుద్ధ విమానాలతో భారత్ కౌంటర్ ఇచ్చింది. హసిమారా.. J-20 జెట్‌లు ఉన్న షిగాట్సేతో సహా టిబెట్‌లోని చైనా ఎయిర్‌బేస్‌లకు సమీపంలోనే ఉంది. అయితే, చైనా J-36 ఇప్పటికీ దాని ప్రారంభ పరీక్ష దశలోనే ఉన్నప్పటికీ… ఆకాశంలో ఒక బలీయమైన ప్రత్యర్థిగా ఉండగల సామర్థ్యం స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ, దీన్ని భారత్-చైనా సరిహద్దులో మోహరిస్తే, భారత వైమానిక రక్షణకు పెద్ద ముప్పు అనే చెప్పాలి. ప్రస్తుతం, 4th జనరేషన్ రాఫెల్ జెట్‌లు, పాత విమానాలపై ఆధారపడుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అతి పెద్ద సవాలుగా మారుతుంది.
అమెరికా F-16కు పోటీగా చైనా 4వ తరం ఫ్లైట్ చెంగ్డు J-10
ప్రస్తుతం, మిలిటరీ ఏవియేషన్ టెక్నాలజీలో చైనా చాలా స్పీడ్ పెంచింది. ఇది, భారతదేశ స్వదేశీ ఫైటర్ జెట్‌లను దాటేసి చాలా దూరం వెళ్లింది. అమెరికాకు చెందిన F-16కు పోటీగా రూపొందించిన 4th జనరేషన్ ఫ్లైట్ చెంగ్డు J-10తో ప్రయాణం ప్రారంభించిన చైనా… సైనిక విమానయానంలో సొంత బలాన్ని పెంచుకుంది. కేవలం పదమూడేళ్ల కాలంలో, US F-22 రాప్టర్‌కు పోటీగా 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ అయిన చెంగ్డు J-20ని ప్రవేశపెట్టింది. స్టెల్త్ ప్లాట్‌ఫారమ్‌కి ఈ వేగవంతమైన పురోగతి ఏరోస్పేస్ టెక్నాలజీలో చైనా అభివృద్ధికి అద్దం పట్టింది.
2024లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి తేజస్ Mk-1A
ఇదే వేగాన్ని కొనసాగిస్తూ, చైనా ఇటీవల 6th జనరేషన్ ఫైటర్ జెట్ J-36ని ప్రదర్శించింది. ప్రస్తుతం, చైనా AI ఇంటిగ్రేషన్, హైపర్‌సోనిక్ సామర్థ్యాలను సమర్థవంతంగా కలుపుతూ చాలా వేగంగా ముందుకెళ్తుంది. దీనికి విరుద్ధంగా, భారత్.. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ Mk-1 అయిన 4.5 తరం యుద్ధ విమానంపై ఆధారపడింది. 2001లో మొదటి విమానం పొందిన భారత్.. 2024లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి తేజస్ Mk-1A వేరియంట్‌ని ప్రవేశపెట్టింది. అయితే, వీటి పూర్తి స్థాయి ఉత్పత్తి, కార్యాచరణకు రెడీ చేయడానికి ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటోంది.
2026లో తేజస్ Mk-II మొదటి విమానం పూర్తవుతుందని అంచనా
భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా.. భారత్, 2026లో తేజస్ Mk-II మొదటి విమానం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది, 2028 నాటికి ఎగురుతుందని భావిస్తున్నారు. ఇందులో, అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. అయితే, చైనా కొత్త తరాల ఫైటర్ జెట్‌లను పరిచయం చేస్తున్న వేగం కంటే భారత్ చాలా వెనుకబడి ఉన్నమాట వాస్తవం. భారత్ చేపట్టిన తేజస్ ప్రోగ్రామ్, స్వదేశంగా నిర్మించడమే అయినప్పటికీ.. అందులో సాంకేతిక సవాళ్లు, నిధుల పరిమితులు, అధికారిక అడ్డంకుల కారణంగా ఆలస్యం అవుతూనే ఉంది.
2030ల నాటికి, చైనా J-36 ఉత్పత్తి సామర్థ్యం, ఆకాశంలో ఆధిపత్యం
సొంత ఫైటర్ జెట్‌లను అభివృద్ధి చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా.. ప్రాంతీయ వాయు ఆధిపత్యానికి కూడా వ్యూహాత్మక చిక్కులు వస్తున్నాయి. ప్రత్యేకించి, భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల సందర్భంలో ఈ ఆందోళన మరింత ఎక్కువవుతోంది. 2030ల ప్రారంభం నాటికి, చైనా J-36 ఉత్పత్తి సామర్థ్యం, ఆకాశంలో ఆధిపత్యం చెలాయించే రేసులో ముందుకెళ్తుందనే అంచనాల మధ్య భారత్ మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం, ఏరోస్పేస్ అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, సైనిక సాంకేతిక అభివృద్ధి విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది.
భారత్ AMCA కోసం 2024లో రూ.15వేల కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
ప్రస్తుతం, భారత్.. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కోసం 2024లో రూ.15 వేల కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 2026 నాటికి ప్రోటోటైప్, 2030లలో కార్యాచరణను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, దీని కంటే ముందు.. పాకిస్తాన్ చైనా నుండి 40 J-35 స్టెల్త్ ఫైటర్లను కొనుగోలు చేయడం భారత వైమానిక పవర్ డైనమిక్స్‌ను మరింత కష్టంగా మారుస్తుంది. భారత సంప్రదాయ వాయు ఆధిపత్యానికి సవాలుగా మారింది.
రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అడుగులు
అందుకే, చైనా 6th జనరేషన్ ఫైటర్ జెట్‌లతో పాటు పాకిస్తాన్‌కు పెరుగుతున్న వైమానిక సామర్థ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భారత్ పనిచేయాల్సి ఉంది. ఇందులో భాగంగా, రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఇతర సహకారులు, సాంకేతిక బదిలీలు, Su-57తో కూడిన ఏర్పాట్లు వంటి సహ-ఉత్పత్తి అవకాశాలను కూడా భారత్ ఆలోచిస్తోంది. దీనితో పాటు, స్వదేశీయంగా తయారు చేస్తున్న Su-30MKIలను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటుంది. దీనితో పాటు, చైనా మాదిరిగానే వేగవంతమైన ప్రోటోటైపింగ్, ఉత్పత్తి పద్ధతులను అవలంబించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.