Annamayya District: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు రోజుకో మలుపు తిరుగుతూ తమ్ముళ్లను టెన్షన్ పెడుతున్నాయంట. ఏకంగా ఇన్చార్జ్ మంత్రి సమక్షంలో గొడవలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ను మార్చాలన్న సిగపట్లతో ఆయా సెగ్మెంట్లలో వర్గ రాజకీయం ఎవరికీ అంతుపట్టకుండా తయారైందంట.. ఆ క్రమంలో అసలు పార్టీలో ఎవ్వరున్నారో తెలియని స్థితి నెలకొందని క్యాడర్ దిక్కులు చూడాల్సి వస్తోందంట.. కీలక నియోజకవర్గాలలో నాయకులు తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోతుండటంతో.. రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిందనే ప్రచారం జరుగుతోంది.. అసలు అన్నమయ్య జిల్లా టీడీపీలో ఏం జరుగుతుంది?.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది?
అన్నమయ్య జిల్లాలో పాగా వేసిన టీడీపీ
రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గాన్ని తప్పించి మిగతా అరు అసెంబ్లీ నియోజకవర్గాలతో గతంలో అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది వైసిపి ప్రభుత్వం.. అప్పట్లో వైసీపీకి మంచి పట్టున్న ఆ కొత్త జిల్లాల్లో గత ఎన్నికల్లో టిడిపి పాగా వేయగలింది. అరు నియోజకవర్గాల్లో రాజంపేట, తంబళ్లపల్లి మినహా మిగతా నాలుగు అయిన రైల్వే కోడూరు, రాయచోటి, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాలలో టీడీపీ విజయం సాధించింది. మిగతా రెండు చోట్ల కూడా గెలవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో అయోమయంతో పాటు అప్పటి వరకు ఇన్చార్జులుగా వ్యవహరించిన పార్టీ నేతల సహకారం కొత్త అభ్యర్ధులకు లభించకపోవడంతో ఓటమి పాలయిందన్న ప్రచారం ఉంది.
పీలేరులో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కూమార్‌రెడ్డి చెప్పిందే వేదం
అయితే ఒక్క పీలేరులో తప్ప మిగతా అన్ని చోట్ల టీడీపీ గ్రూపులతో కొట్టు మిట్టాడుతోంది. పీలేరులో ఏక వ్యక్తి నాయకత్వం అవ్వడం, అక్కడి ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు నల్లారి కిషోర్‌కూమార్‌రెడ్డి గ్రూపులను ఎంటర్‌టెయిన్ చేయకపోవడంతో పాటు, ఆయన క్యాడర్‌తో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉంటడంతో అక్కడ గ్రూపుల గోల కనిపించడం లేదంట.. ముందు నుంచి పీలేరు నల్లారి కుటుంబం ఇలాకా కావడంతో పార్టీలో కిషోర్‌కుమార్‌రెడ్డి చెప్పిందే వేదంగా నడుస్తోందంటున్నారు
అత్యంత వివాదాస్పదంగా మారిన తంబళ్లపల్లె నియోజకవర్గం
జిల్లాలో అత్యంత వివాదాస్పదంగా మారిన నియోజకవర్గం తంబళ్లపల్లి. అక్కడ గత ఎన్నికలలో పోటీ చేసి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి చేతిలో పరాజయం పాలైన టీడీపీ అభ్యర్ధి జయచంద్రారెడ్డిని మరో వర్గం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఎన్నికలు ముగిసిన పది నెలలు అయినప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఎదో ఒక చోట తెలుగు తమ్ముళ్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తంబళ్లపల్లి టీడీపీ ఇన్చార్జ్‌గా జయచంద్రారెడ్డిని తప్పించాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం గట్టిగా పోరాటం చేస్తోంది. దానికి తోడు జయచంద్రారెడ్డి సైతం వైసీపీ వారిని ప్రోత్సాహిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2014 ఎన్నికల్లో తంబళ్లపల్లెలో విజయం సాధించిన శంకర్‌యాదవ్
2014 ఎన్నికలలో పడమటి మండలాలలో మొత్తం అన్నిచోట్ల ఓటమి పాలయితే తంబల్లపల్లిలో మాత్రం టీడీపీ పార్టీ విజయం సాధించింది. శంకర్‌యాదవ్ టీడీపీ నుంచి గెలిచారు. అయితే తాజాగా జరిగిన 2024 ఎన్నికలలో జయచంద్రరెడ్డి కోవర్డు రాజకీయం చేసారని అందుకే అక్కడ ఓటమి పాలయ్యాయమని అతని వ్యతిరేక వర్గం అరోపిస్తుంది. తర్వాత జయచంద్రారెడ్డి అంగల్లలో చంద్రబాబుపై రాళ్ల దాడి చేసిన వారిని సైతం పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. తాజాగా హార్స్‌లీ హిల్స్ ఇన్‌చార్జ్ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి రివ్యూ చేయాలని ప్రయత్నించగా అయన ఎదురుగా రెండు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. తీవ్రస్థాయిలో బూతులు తిట్టుకుంటూ కలపడ్డారు. దాంతో బీసీ జనార్ధన్‌రెడ్డితో పాటు పార్టీ సమన్యయ కర్త దీపక్ రెడ్డి, పార్టీ అబ్జర్వర్ అయిన గురవారెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2019లో పోటీ చేసి ఓడిపోయిన బత్యాల చెంగల్రాయుడు
రాజంపేట అసెంబ్లీలోనూ అదే పరిస్థితి. అక్కడ బత్యాల చెంగల్రాయుడు ఎన్నికల ముందు వరకు టీడీపీ ఇన్చార్జ్‌గా ఉన్నారు. 2019లో అయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో అనుహ్యంగా సుగవాసి సుబ్రమణ్యంకు టీడీపీ టికెట్ ఇచ్చారు. ఎంపి అభ్యర్థిగా అప్పటి వరకు ఫోకస్ అయిన సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చారు. రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కూమార్‌రెడ్డిని బరిలో దింపడంతో గత్యంతరం లేక సుగవాసి సుబ్రమణ్యం రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు.
6వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన సుబ్రమణ్యం
సుబ్రహ్మణ్యం గెలుపు కోసం రాజంపేట టీడీపీ క్యాడర్ బలంగా పనిచేసినప్పటికి నాయకుల వెన్ను పోటు కారణంగా 6వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రాజు వర్సెస్ సుబ్రమణ్యం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సుబ్రమణ్యాన్ని ఇన్ చార్జ్ పదవి నుంచి తప్పించి రాజు కివ్వాలని కొందరు.. మరి కొందరు మేడా మల్లిఖార్జునరెడ్డిని పార్టీలోకి తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో ఇక్కడ కూడా ఇన్చార్జ్ మంత్రి రివ్యూ సందర్భంగా గొడవ జరిగింది.
మదనపల్లి టీడీపీలో మూడు ముక్కలాట
రాయచోటిలో సైతం మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను పట్టించుకోకుండా వైసీపీ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని టిడిపి క్యాడర్ బహిరంగంగా అరోపణలు గుప్పిస్తుంది. మదనపల్లి నియోజకవర్గం టీడీపీలో సైతం మూడు గ్రూపులు అరు తగదాలు అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎమ్మెల్యే షాజహాన్‌దో వర్గం, మాజీ ఎమ్మెల్యే రమేశ్ దో వర్గం. ఇక మూడోది తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు వర్గం. ఆ క్రమంలో మదనపల్లి టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తూ అన్ని వర్గాలు నిత్యం సిగపట్లకు దిగుతున్నాయి
రైల్వే కోడూరు జనసేన నుంచి గెలిచిన అరవ శ్రీధర్
రైల్వే కోడూరు నియోజక వర్గంలో కూడా తాజాగా జరిగిన రివ్యూ సమావేశం గందరగోళంగా మారిపోయింది. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన నుంచి గెలిచారు. ఆయన టీడీపీ ఇన్చార్జ్ అయిన రూపానందరెడ్డి వర్గీయుడు అన్న ముద్ర ఉంది. ఇంతకు ముందు రైల్వేకోడూరు ఇన్చార్జిగా ఉన్న విశ్వనాథ్‌నాయుడితో వారికి పొసగడం లేదంట. ఈ నేపధ్యంలో ఇన్చార్జి మంత్రి అయిన బిసి జనార్ధన్ రెడ్డి సమక్షంలో జరిగిన రివ్యూ రసాభసగా ముగిసింది. నేను డబ్బులు పెట్టాను.. నేను చెప్పిందే జరగాలని రూపానందరెడ్డి బావిస్తున్నాడని టీడీపీ క్యాడర్ అంటోంది.
Also Read: ఏపీలో సీనియర్లకు మొండిచేయి.. అన్నామలైకు ఛాన్స్! వెనుక ఏం జరిగింది?
సమన్వయ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్న క్యాడర్
వైసిపి నుంచి వచ్చిన రూపానందరెడ్డి వారికి పెద్దపీట వేస్తున్నాడని అంటున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ సైతం రూపానందరెడ్డి వర్గం కావడంతో ఇక్కడ పెత్తనం అంతా అయనదే నంటున్నారు. అందుకే అక్కడ టీడీపీకి సంబంధించి సమన్వయ కమిటీ వేయాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. మొత్తం మీద అక్కడ నేతల ఆధిపత్యం పోరుతో పార్టీ అవిర్బావం నుంచి ఉన క్యాడర్ అయెమయంలో పడుతోంది
అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని ఆరోపణలు
జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతల విభేదాలతో క్యాడర్‌ను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దానికి తోడు జిల్లా మంత్రి వైఖరి కారణంగా అధికారులు సైతం తమ ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి స్థితిలో జిల్లా పార్టీ నాయకులు పార్టీ పటిష్టతకు కృషి చేయాల్సింది పోయి.. ఎవరికి వారు తమ గ్రూపులను ప్రోత్సాహిస్తున్నారని అంటున్నారు. అక్కడ మారుతున్న ఈక్వేషన్లతో అన్నమయ్య జిల్లాలో నువ్వు పాత టిడిపి వాడివా అయితే నీతో పనిలేదు.. నువ్వు కొత్త టిడిపి అయితే మాతో ఉండు అని నాయకులు అంటున్నారంట.. మొత్తానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాగా లాంటి అన్నమయ్య జిల్లాలో అలా తయారైంది టీడీపీ పరిస్థితి.