TDP Leaders: పవర్ లేకపోతే బతకలేం అన్నట్లు తయారైంది తిరుపతి నగర పాలక సంస్థలో వైసిపి కార్పోరేటర్ల వ్యవహారం.. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే అప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే భూమనను వీరుడు శూరుడు అని పోగిడిన వారి నోర్లు మూసుకు పోయాయి. టీడీపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ఆ పార్టీలో చేరడానికి వైసీపీ కార్పొరేటర్లు క్యూ కడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ వారితో నామినేషన్లు వేయనీయకుండా అరాచకాలు చేసి ఏకగ్రీవమైన వైసీపీ కార్పొరేటర్లు మనకు అవసరమా? అని తిరుపతి తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నా పార్టీ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదంట. ఆ క్రమంలో తిరుపతి తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారిప్పుడు.
తిరుపతి నగరపాలక సంస్థలో విచిత్ర రాజకీయం నడుస్తుంది. మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ ను పదవి నుంచి దింపడానికి అన్నా రామచంద్రయాదవ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయన తన కూమార్తె అనితా యాదవ్ ను మేయర్ చేయడానికి నిర్ణయించుకుని పావులు కదుపుతున్నారంట. తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లకు గాను 49 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే 20 స్థానాలకు పోలింగ్ పక్రియ జరిగింది. మిగతా అన్ని స్థానాలను అప్పటి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ ఎన్నికలప్పుడు అసలు ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా భయానక వాతావరణం సృష్టించారు. నామినేషన్ల పక్రియ నిర్వహించే అధికారులు సైతం వన్ సైడ్ గా వ్యవహారించారు. ఎన్నికలు అనే పదం గత కార్పొరేషన్ ఎన్నికలకు వర్తించదనే చెప్పవచ్చు.
అదే సమయంలో ఎన్నికల తర్వాత సమావేశాలలో టీడీపీ సభ్యుడిని అటాడుకున్నారు. అందరికంటే ఎక్కువగా డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ,ఎస్ కే బాబు, అజయ్ లాంటి కార్పొరేటర్లు అయితే అతి భక్తి ప్రదర్శించారు. ముద్ర నారాయణ అయితే ఏకంగా భూమన అయన కూమారుడు అభినయ్ ఫోటోలు ఉన్న లాకెట్‌ను ధరించి తన స్వామి భక్తి ని ప్రదర్శించారు. ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం వారి దందాలకు కొదవలేకుండా పోయింది. నగరంలో ఎవ్వరు ఇల్లు కట్టుకోవాలన్నా, కనీసం బోరు వేసుకోవాలన్నా.. స్థానిక డివిజన్ కార్పొరేటర్ కు అమ్యామాలు చెల్లించాల్సి వచ్చేది.
ప్రతి ఒక్క కార్పొరేటర్ తన డివిజన్లో పది నుంచి ముప్పయి మంది యువకులతో ఓటీమ్ ను ఏర్పాటు చేసి కలెక్షన్ సెంటర్లు నడిపించారంటే ఎంత అరాచక పాలన నడిచిందో అర్థమవుతుంది..అప్పట్లో బోరు వేసుకుంటున్న ఓ వ్యక్తి పై దాడి చేసిన వీడియోలు బయటకు రావడం సంచలనం కలిగించింది. దీంతో పాటు ఎస్వీ యూనివర్సిటి స్థలంలో నుంచి మాస్టర్ ప్లాన్ రహాదారులు ఏర్పాటు చేయాలన్నప్పుడు యూనివర్సిటి విద్యార్థి విభాగంతో పాటు తిరుపతిలోని అఖిల పక్షనాయకులు వ్యతిరేకించారు. దీంతో నగర పాలక సంస్థ కార్పొరేటర్లు ఓ శవయాత్ర నిర్వహించి, దిష్టిబొమ్మలకు పాడే కట్టి హీనాతి హీనంగా వాటికి భూమన నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారి పోటోలు అతికించి శ్మశానంలో అంత్య క్రియలు నిర్వహించి స్వామిభక్తి చాటుకున్నారు.
ఇది అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసినా పోలీసులు కనీసం కేసు పెట్టలేదు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు సందర్భంగా దిష్టి బొమ్మ దహనం చేసిన ఎస్వీ యూ విద్యార్థుల మీద ఏకంగా 307 సెక్షన్ కిందా కేసులు పెట్టి బెయిల్ రాకుండా అరు నెలల పాటు జైల్లో పెట్టించారు. మరో కార్పొరేటర్ అయితే తనకూమారుడి కి క్రికెట్ టీమ్‌లో స్థానం కల్పించలేదని అప్పటి రంజీ కెప్టెన్ ను బెదిరించారనే వార్తలు వచ్చాయి. మొత్తం మీద అవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ప్రధాన నాయకుల ఏవిధంగా వ్యవహారించారో కార్పొరేటర్లు సైతం అలాగే వ్యవహారించారు. టిడిఅర్ బాండ్ల ఇష్యూలో కూడా చాలమంది కార్పోరేటర్లు చేతి వాటం ప్రదర్శించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 62 వేల మేజార్టీ వచ్చిందంటే అందుకు కారణం కార్పొరేటర్ల మీదా వ్యతిరేకత కూడా ఓ కారణం అని తిరుపతి వాసులు అంటుంటారు.
Also Read: ఆ మంత్రులు పోస్ట్ ఊస్ట్.. సీఎం చేతిలో లిస్ట్..!!
ఆ క్రమంలో ఎన్నికల ముందే అన్నా రామచంద్రయ్య కూమార్తెలు ఇద్దరితో పాటు మొత్తం ఐదుగురు కార్పొరేటర్లు టిడిపి జనసేనలో చేరారు. పలితాల తర్వాత మొత్తం టీమ్ టీడీపీ, జనసేనల్లో చేరడానికి ప్రయత్నించగా తిరుపతి టిడిపిలోని కీలక నాయకులు వ్యతిరేకించారు . ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడని వారు మనకేందుకు అని అధిష్టానం వద్ద తమ వాదనలు వినిపించారు. అయినా వైసీపీ కార్పొరేటర్లు తమ ప్రయత్నాలు మానడం లేదు. జనసేనలో షాడో ఎంఎల్ ఎ గా వ్యవహారిస్తున్న ఓ నాయకుడు వీరి వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు టిడిపి నుంచి ఓ నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నా రామచంద్రయ్య సైతం వారిని చేర్చుకోవడానికిసీరియస్ గా తన వంతు ప్రయత్నాలు ప్రారంబించారంట. మొదట్లో మేయర్ గా శిరీషా యాదవ్‌నే కొనసాగించాలని టిడిపి తిరుపతి పార్లమెంటు నాయకుడు నరసింహా యాదవ్ అభిప్రాయపడినప్పటికీ.. ఇప్పుడు అయన కూడా అన్నా వర్గానికి మద్దతు పలుకుతున్నాడని అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల చట్ట సవరణ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. టిడిపి లోని జెబి శ్రీనివాస్, దేవనారాయణ రెడ్డిలతో పాటు క్యాడర్ మొత్తం వ్యతిరేకిస్తున్నా వైసిపి కార్పొరేటర్లు మాత్రం తమ ప్రయత్నాలు మానడం లేదంట. బీసీ నేత అన్నా రామచంద్రయ్య, వైసీపీ సీనియర్ నేత దొడ్డారెడ్డి సిద్దారెడ్డి నేతృత్వంలో 10 మందికి పైగా కార్పొరేటర్లు విజయవాడలో ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీలోకి వస్తామన్న వారి ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
త్వరలో తిరుపతికి వస్తున్నామని, తమ పార్టీలో చేరికలను వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడతానని మంత్రి అనగాని హమీ ఇచ్చారంట. అంతా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతుందని , పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకోవాలని సూచించారంట. ఆ క్రమంలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయిన వారి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ల విభజన జరగనుందని, మరో 15 నుంచి 20 డివిజన్లు పెరిగే అవకాశం ఉందని, అందువల్ల కూటమిలో కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని మంత్రి అభిప్రాయపడ్డారంట. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లతో పాటు కొత్తగా వచ్చేవారితో కలిపి 24 మంది కార్పొరేటర్లు పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారని అన్నా రామచంద్రయ్య మంత్రితో చెప్పారంట.
కాగా ఎక్కువ మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది. మంత్రిని కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు పొన్నాల చంద్ర, కుడితి సుబ్రమణ్యం, పెంచలయ్య, దూది కుమారి, సీకే రవి, అన్నా అనిత, అన్నా సంధ్య ఉన్నారంట. టిడిఅర్ బాండ్స్ లో అత్యంత వివాదంగా మారిన మరో కార్పొరేటర్ బిజెపిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంట.
వైసిపి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. తిరుపతి నగర పాలక సంస్థ పరిణామాల నేపథ్యంలో అయన సైలెంట్ గా ఉంటున్నారు. దాంతో కార్పొరేటర్ ఎస్ కే బాబు.. భూమన మౌనం ఎందుకు? అంటూ ఓ పోస్టును సోషియల్ మీడియాలో పెట్టారు. అది వైసీపీ వర్గాలలో చర్చనీయాంశంగా మారడంతో భూమన టీమ్ జోక్యం చేసుకుని ఆ పోస్టును వెంటనే తీయించారంట. మొత్తం మీద టిడిపిలోని క్యాడర్ వ్యతిరేకిస్తున్నప్పటికీ.. వైసీపీ కార్పొరేటర్లతో అవసరం లేదని అభ్యంతరం చెప్తున్నప్పటికీ.. ఆ పార్టీ కార్పొరేటర్లను చేర్చుకుని, మేయర్‌ను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ చేరికలు కూటమి పార్టీలకు ఏ మాత్రం లాభం చేస్తాయో చూడాలి.