సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులకు తమకు నచ్చిన పేర్లు పెట్టుకుంటుంటాయి అధికార పక్షాలు ఆ విషయంలో పక్కా మూస ధోరణిలో పేర్లు పెట్టుకుని అమలు చేశారు మాజీ సీఎం జగన్ మొదట్లో తన తండ్రి వైఎస్ఆర్ పేరుతో పథకాలు నిర్వహించిన జగన్.. ఏళ్లు గడిచేకొద్దీ దివంగత నేతకు ప్రాధాన్యత తగ్గించి తన పేర్లతోనే పథకాలు అమలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పథకాలను తానే ప్రారంభించినట్లు పేర్లు మార్చి అమలు చేసిన జగన్ దాదాపు అన్నిటికీ జగనన్న అంటూ తన జపం తానే చేసుకున్నారు.
అయితే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఎఫెక్ట్‌తో ఆ మూసధోరణికి బ్రేక్ పడి.. కొత్త ట్రెండ్ మొదలవ్వడం విశేషం.. గోదావరి జిల్లాలకు చెందిన నిత్యాన్నదాత, అపర అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మను పవన్‌కళ్యాన్ తరచూ ప్రస్తావిస్తుంటారు. ఎలాంటి ప్రయోజనాల్ని ఆశించకుండా.. అన్నదానానికి మించిన దానం లేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా ‘అతిథి దేవోభవ’ అన్నపదానికి ఉదాహరణగా నిలిచిన మహిళా మణి డొక్క సీతమ్మ.
ఆ మహానుభావురాలి గొప్పతనం ఇప్పటితరానికి తెలియజేయటానికి ప్రయత్నిస్తూ ఉండే వపన్.. అన్నా క్యాంటీన్ల మాదిరే డొక్కా సీతమ్మ క్యాంటీన్ల పేరుతోనూ నిర్వహించాలన్న ప్రతిపాదన పెట్టారు. అయితే టీడీపీ ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు జనానికి ఎంత దగ్గరయ్యాయో.. అన్నా క్యాంటీన్ల విషయంలో టీడీపీ కమిట్‌మెంట్ గురించి అందరికి తెలిసిందే. అయినప్పటికీ అన్నా క్యాంటీన్ల తరహాలోనే డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు నిర్వహించాలన్న పవన్ సూచనను చంద్రబాబు మరోలా పూర్తి చేశారు.
తాజాగా డొక్కా సీతమ్మ పేరును ప్రభుత్వం నిర్వహించే కీలక పథకానికి పెట్టి పవన్‌కు కూటమిలో ఎంత ప్రయారిటీ ఉందో చెప్పకనే చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరు ముద్దు పేరు పెట్టుకుంది వైసీపీ ప్రభుత్వం. దాన్ని మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. డొక్కా సీతమ్మ గురించి ఈ తరానికి తెలియజేయాలన్న పవన్ ఆశయాన్ని నెరవేర్చారు.
Also Read: కడపలో చంద్రబాబు యాక్షన్ 2.0.. ఎలా ఉండబోతుంది ?
గత ప్రభుత్వంలో అమలు చేసిన పలు పథకాల పేర్లను మారుస్తూ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. జగనన్న అమ్మఒడి పేరు ‘‘తల్లికి వందనం’’ అని మార్చారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని ‘‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’’ గా జగనన్న గోరుముద్దు కార్యక్రమాన్ని ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’’గా జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని ‘‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’’గా మారుస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉత్తర్వులు జారీ చేశారు.
దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు జగన్ తన పేరునే పెట్టుకున్నారని. ఆ దుస్సంప్రదాయానికి మంగళం పాడి.. విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే ప్రముఖుల పేర్లతో పథకాలు అమలు చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని ఇప్పుడు ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ అని ఆమె దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయని పవన్ ఎక్స్ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు.