CM Revanth Reddy: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం మోక్షం కల్పించింది. 10 లక్షల లోపు ఉన్న బిల్లుల్ని ఒకే విడతలో చెల్లించింది. అటు తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డుకు ముందడుగు, దివ్యాంగుల వివాహానికి ప్రోత్సాహం, నల్లమల డిక్లరేషన్ లో భాగంగా ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి శ్రీకారం చుట్టడం ఇలాంటి కీ అప్డేట్స్ ఈ వారం జరిగాయి. ఆ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.
18-05-2025 ఆదివారం ( మన బియ్యానికి ఫిలిప్పీన్స్ ఓకే.. )
బియ్యం విదేశాలకు ఎగుమతి చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి మరో బూస్టప్ వచ్చింది. తెలంగాణ, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఫిలిప్పీన్స్ అంగీకరించింది. ప్రాథమిక ఒప్పందంలో లక్ష టన్నుల బియ్యం దిగుమతికి అంగీకరించిన ఆ దేశం.. బియ్యం క్వాలిటీపై సంతృప్తి చెందిన తర్వాత వార్షిక ఒప్పందం చేసుకోవడంతో ఈ విషయంలో మరో ముందడుగు పడినట్లయింది. తెలంగాణ-ఫిలిప్పీన్స్ మధ్య జరిగిన ఎంవోయూ ప్రకారం.. ఇకపై ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్‌తో గత మార్చి నెలలో ఒప్పందం కుదుర్చుకుంది.
ఐఆర్-64, ఎంటీయూ-1010 రకాల బియ్యం ఎగుమతికి శ్రీకారం
రాష్ట్రంలో ఉత్పత్తయ్యే ఐఆర్-64, ఎంటీయూ-1010 రకాల బియ్యం ఎగుమతికి శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 12,750 మెట్రిక్ టన్నులు, మలివిడతలో 10 వేల టన్నుల బియ్యాన్ని సముద్రమార్గంలో ఫిలిప్పీన్స్‌కు పంపించింది. మరో 6 వేల టన్నుల బియ్యాన్ని జూన్ మొదటివారంలో పంపనుంది. మన బియ్యం నాణ్యత బాగుండడంతో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. తెలంగాణ అన్నం రుచి చూసిన తర్వాతే ఆయన ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతికి ఆమోదం తెలిపారు. బియ్యం ఎగుమతికి ఆదిత్య బిర్లా కంపెనీ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది. తొలి విడతలో పంపిన బియ్యం బిల్లును కూడా ఫిలిప్పీన్స్ సర్కారు చెల్లించింది.
19-05-2025 సోమవారం ( పోడు భూముల్లో సోలార్ వెలుగులు )
తెలంగాణలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే సరికొత్త పథకానికి సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 19న శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 2,30,735 మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యాజమాన్యపు హక్కులు కల్పించే ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి సంబంధించి నల్లమల డిక్లరేషన్ ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలో వచ్చే వంద రోజుల్లో రైతులందరికీ సోలార్ విద్యుత్ పంపుసెట్లను అమర్చాలన్నారు.
నల్లమల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు
ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ను వ్యవసాయానికి, గృహావసరాలకు వినియోగించగా మిగులు విద్యుత్‌ను ప్రభుత్వ గ్రిడ్‌కు లింక్ చేసేలా ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో రైతులకు మరింత ఆదాయం సమకూరనుంది. తెలంగాణను దేశానికే ఆదర్శంగా, నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పదిహేడు నెలల్లో నిరూపించామని, అయితే ఇది సరిపోదని, ఇంకా ఎంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రజలందరూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ప్రతి రైతుకు సోలార్ పంప్ సెట్ ఇవ్వడం ద్వారా కరెంట్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటలో చేసిన తరహాలో తెలంగాణ రాష్ట్రంలో చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. అటు నల్లమల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని, ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేస్తుందన్నారు.
19-05-2025 సోమవారం ( రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. )
సీఎం రేవంత్ ఈనెల 19న తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో కుటుంబ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ముఖ్యమంత్రి రావడంతో గ్రామస్తులు, అభిమానులు దారిపొడవునా నిలబడి ఘన స్వాగతం పలికారు.
20-05-2025 మంగళవారం ( రష్యా కాన్సుల్ జనరల్ భేటీ )
చెన్నైలోని రష్యా కాన్సుల్ జనరల్ వలెరీ ఖుజ్కవ్ ముఖ్యమంత్రి రేవంత్ ను ఈనెల 20న మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
21-05-2025 బుధవారం ( పెండింగ్ బిల్లులు రిలీజ్.. )
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం ఉన్నప్పటికీ ఒక్కో మెట్టు అధిగమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 9,900 బిల్లులను తెలంగాణ ప్రభుత్వం ఈనెల 21న క్లియర్ చేసింది. 10 లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లుల్ని ఒకే విడతలో చెల్లించింది. 2024 ఆగస్ట్ వరకు పెండింగ్‌లో ఉన్న బిల్స్ కు ప్రాధాన్యమిచ్చింది. పంచాయతీలకు 153 కోట్లు, ఎస్‌డీఎఫ్ పనులకు మరో 85 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది.
21-05-2025 బుధవారం ( ‘తెలంగాణ రైజింగ్’ విజన్ బోర్డ్ )
రాష్ట్ర ఆర్థిక వృద్ధిని, ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించేందుకు, వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డును ఏర్పాటు చేయాలని సర్కార్ డిసైడ్ అయింది. రాష్ట్రం ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా, దేశ జీడీపీలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వాటాను మరింత పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. భవిష్యత్ అంశాలే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు పని చేయబోతోంది. 2023 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి పలు దేశాల నుంచి 3 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. సుమారు లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలు, ఆర్థిక క్రమశిక్షణ, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి వంటి విషయాలపై మేధావులు, ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ అవుతూ వస్తున్నారు. గతంలోనే RBI మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్‌తో సమావేశమయ్యారు. తాజాగా ఎకానమిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీతోనూ భేటీ అయ్యారు.
21-05-2025 బుధవారం ( దివ్యాంగులకు ప్రోత్సాహకం )
సమాజంలోని ప్రతి వర్గానికి మేలు చేసే లక్ష్యంతో పని చేస్తున్న ప్రభుత్వం తాజాగా దివ్యాంగులకు శుభవార్త అందించింది. దివ్యాంగులను వివాహం చేసుకునే వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో నిబంధనలను సడలించింది. ఇప్పటివరకు వివాహం చేసుకున్న జంటలో ఒకరు దివ్యాంగులుంటేనే ప్రభుత్వం 1 లక్ష ఆర్థిక సహాయాన్ని వివాహ ప్రోత్సాహక పథకం కింద అందించేది. అయితే ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ఈ పథకం వర్తించేది కాదు. కానీ ఇక నుంచి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్ర్తీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రాంచంద్రన్ జీవో 7ను జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో దివ్యాంగులను దివ్యాంగులు పెండ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా మరో లక్ష రూపాయలు అందుతాయి. దీంతో ఈ అమౌంట్ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడబోతోంది.
22-05-2025 గురువారం ( సీఎం చొరవతో IPS క్యాడర్ పెంపు )
తెలంగాణ ఐపీఎస్ క్యాడర్‌ను 151కి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐపీఎస్ క్యాడర్ పెంచాలని గతేడాది జనవరి 4న, జులై 4న, అక్టోబర్ 7న కేంద్రానికి లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మొత్తం 29 పోస్టులు పెంచాలని కోరగా, కేంద్ర ప్రభుత్వం కేవలం 12 మాత్రమే పెంచింది. దీంతో ఇప్పుడున్న సంఖ్య 139 నుంచి 151కి పెరిగినట్లయింది. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులను 83కు, సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 33కు, స్టేట్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 20కి, ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులను 2కు, లీవ్ రిజర్వ్, జూనియర్ పోస్టులను 13కు పెంచింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను 105గా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్లకోసారి క్యాడర్ స్ట్రెంత్ సమీక్షించాలి. తెలంగాణలో చివరిసారిగా ఐపీఎస్ క్యాడర్ సమీక్ష 2016లో జరిగింది. తర్వాత 2021లో జరగాల్సి ఉన్నా జరగలేదు. సీఎం చొరవతో ఇన్నాళ్లకు సాధ్యపడింది.
23-05-2025 శుక్రవారం ( కేంద్ర సహకారంతో ముందుకు )
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి 494.67 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని.. ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిధుల కోసం అవసరమైతే ప్రధాని మోడీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధమన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మచునూరులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ కొత్త బిల్డింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
23-05-2025 శుక్రవారం ( కలిసి నడుద్దాం.. )
విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతిలో సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. రైతుల నుంచి ధాన్యం సేకరణ, ప్రజలకు ఆహార భద్రత కల్పించడం, బియ్యం ఎగుమతుల్లో పరస్పరం సహకరించుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. పౌర సరఫరాల శాఖ ఆస్తుల విభజనపై రెండు రాష్ట్రాల మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్‌లు ఈనెల 23న హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని పౌర సరఫరాల భవన్‌లో ఏపీకి కేటాయించిన సగం వాటా భవనాన్ని జూన్ 1 నుంచి తెలంగాణ వాడుకోనుంది. దశలవారీ ఆస్తుల మార్పిడిపై చర్చలు జరిగాయి. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా రెండు రాష్ట్రాలు మరింత నిఘా పెట్టాలని నిర్ణయించాయి.
23-05-2025 శుక్రవారం ( మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ బి- DPRలు రెడీ )
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ బి కింద ప్రతిపాదించిన మూడు కారిడార్‌లకు డీపీఆర్‌లు రెడీ అయ్యాయి. నార్త్‌సిటీలో ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్, శామీర్‌పేట్ రూట్‌లలో, ఇటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మూడు కారిడార్‌లలో మెట్రో నిర్మాణానికి రెండో దశలోనే ప్రతిపాదించారు. మొదటి ఐదు కారిడార్‌లతో పాటు ఈ మూడు కారిడార్‌లను సైతం రెండో దశలో భాగంగా చేపట్టనున్నారు. మొదటి ఐదు కారిడార్‌ల డీపీఆర్‌లు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో నాలుగు నెలల క్రితమే కేంద్రానికి అందజేశారు. డీపీఆర్‌లను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌మెట్రో రైల్ బోర్డు ఈ నెల 8న ఆమోదించింది. ఈ మూడు కారిడార్‌ల నిర్మాణం పూర్తయ్యే నాటికి ప్రతిరోజూ సుమారు 3 లక్షల మందికి పైగా రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2028 నాటికి రెండో దశలోని అన్ని రూట్లలో 10 లక్షల మందికి పైగా ప్రయాణించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు మొత్తం 24.5 కిలోమీటర్ల మార్గంలో 18 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కి.మీల కారిడార్‌లో 14 మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.
24-05-2025 శనివారం ( తెలంగాణ రైజింగ్ విజన్-2047 )
తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రజా ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు ఢిల్లీ వేదికగా ఆవిష్కృతం అయ్యాయి. 2047 నాటికి తెలంగాణ సాధించదలచుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్-2047ను సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఆవిష్కరించారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై తెలంగాణ తరఫున ప్రత్యేక నివేదిక సమర్పించారు. వికసిత్ రాజ్య్.. వికసిత్ భారత్ ఎజెండాగా ఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి ఎలా ముందుకు వెళ్తున్నామనే అంశంతోపాటు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రైజింగ్ నినాదం గురించి సీఎం రేవంత్ తెలియజేశారు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా చేపడుతున్న పనుల గురించి కూడా తన ఆలోచనలు పంచుకున్నారు.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం మోక్షం కల్పించింది. 10 లక్షల లోపు ఉన్న బిల్లుల్ని ఒకే విడతలో చెల్లించింది. అటు తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డుకు ముందడుగు, దివ్యాంగుల వివాహానికి ప్రోత్సాహం, నల్లమల డిక్లరేషన్ లో భాగంగా ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి శ్రీకారం చుట్టడం ఇలాంటి కీ అప్డేట్స్ ఈ వారం జరిగాయి. ఆ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.
24-05-2025 శనివారం ( మినీ మీ-సేవ కియోస్క్ స్పెషల్ )
ఇకపై మీ సేవ సౌలభ్యం మరింత ఈజీ కాబోతోంది. బర్త్, డెత్, ఇన్ కం, రెసిడెన్స్ సహా ఇతర సర్టిఫికెట్ల కోసం మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం మరో కొత్త ఆలోచనను జనం ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ ఏటీఎం మాదిరి కనిపిస్తున్న ఈ మెషిన్ మినీ మీ సేవ కేంద్రంగా పని చేస్తుంది. దీంతో అప్లై చేసుకున్న వారి వెయిటింగ్ టైమ్ చాలా తగ్గబోతోంది. జిల్లాల్లోని ప్రజాపాలన కేంద్రాలు, ఎంపికచేసిన ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అక్కడికి వెళ్లనవసరం లేకుండా.. కియోస్క్‌ల ద్వారా ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించి నిమిషాల్లో సర్టిఫికెట్లు పొందవచ్చు.
ఆన్ లైన్ లో, లేదంటే స్కానర్ ద్వారా 35 రూపాయలు కడితే చాలు
ఈ మేరకు ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్లు, ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంతోపాటు బేగంపేటలో మీ-సేవ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ఇది ఏటీఎం మాదిరి పని చేస్తుంది. ఆన్ లైన్ లో, లేదంటే స్కానర్ ద్వారా 35 రూపాయలు కడితే చాలు సర్టిఫికెట్ బయటకు వస్తుంది. అక్కడున్న నిర్వాహకులు ఆయా ధ్రువపత్రాలపై సంతకం, అధికారిక ముద్ర వేసి ఇస్తారు. కరెంట్, నల్లా బిల్లులను కూడా ఇందులోనుంచే చెల్లించేందుకు వీలుంది. టెక్నికల్ సపోర్ట్ ను NIC అందిస్తోంది. మున్ముందు డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయడం, ఫోటోల కోసం కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలోనే వీటిలో డ్రైవింగ్ లైసెన్స్, రేషన్‌కార్డు, వివిధ ధ్రువపత్రాలకు అప్లై కూడా చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.