Balineni vs Damacharla: కూటమి పార్టీల్లో భాగస్వామ్యులైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జానార్ధన్ ఉప్పు నిప్పులాగా చిటపటలాడుతున్నారు. సందర్భం ఏదైనా దొరికితే చాలు విమర్శలు ప్రతి విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. దాంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. త్వరలో స్థానిక ఎన్నికలు రానున్న నేపధ్యంలో జనసేన, టీడీపీలో కీలకంగా ఉన్న ఆ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిరేనా? పార్టీల పెద్దలు కలుగజేసుకుని వ్యవహారాన్ని శాంతింప చేస్తారా? లేకపోతే బాలినేని, దామచర్ల బద్ద శత్రువుల్లానే వ్యవహరిస్తారా? అసలు వారి మధ్య గ్యాప్‌పై టీడీపీ, జనసేన శ్రేణుల్లో వినిపిస్తున్న టాక్ ఏంటి?
ఒంగోలులో బాలినేని, దామచర్లల మధ్య ఆధిపత్య పోరు
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తాజా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా, అవకాశం దొరికినా, లేదా అవకాశాన్ని అందిపుచ్చుకునైనా ఒకరిపై ఒకరు నిరంతరం ఘాటు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. బాలినేని ఒంగోలు నియోజక వర్గంలో ఉపఎన్నికలతో కలిపి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. దామచర్ల జనార్ధన్ నాలుగు సార్లు ఎన్నికలలో పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇద్దరు ఒంగోలు నియోజకవర్గంలో తమదైన ముద్ర ఉన్న నేతలే.
2012 బైపోల్స్‌లో తొలిసారి పోటీపడ్డ దామచర్ల, బాలినేని
గడిచిన నాలుగు ఎన్నికలలో ప్రత్యర్ధులుగా పోటీపడ్డ బాలినేని, దామచర్లలు చెరో రెండు సార్లు విజయం సాధించారు 2012లో జగన్ ఎఫెక్ట్‌త ఉప ఎన్నికలలో తొలిసారిగా దామచర్ల జనార్ధన్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తొలిసారి పోటీపడ్డారు . ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌లో మంత్రి పదవి వదులుకుని వైసీపీ బాట పట్టిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు . తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలలో దామచర్ల, బాలినేనిని ఓడించి తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికలలో కూటమి పార్టీలు కలిసి పనిచేశాయి. 2019 ఎన్నికలలో ఆ ఇద్దరు మూడో సారి పోటీ పడినప్పుడు విజయం బాలినేనిని వరించింది. అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీలు విడివిడి పోటీ చేయడం వైసీపీకి కలిసి వచ్చింది.
గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనార్థన్
2024 ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీలు జట్టు కట్టాయి. కూటమి అభ్యర్ధిగా దామచర్ల జనార్ధన్ భారీ విజయం సాధించారు. అయితే పోటీ ఎలా ఉన్నా ఆ ఇద్దరిదీ ఎవరు పని వారు చేసుకోయే తత్వం అంటుంటారు. అయితే 2020 తర్వాత దామచర్లపై బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. సందర్భం దొరికినప్పుడల్లా వ్యక్తిగత దూషణలు కూడా చేస్తూ ఒంగోలు రాజకీయాల్ని వవేడెక్కిస్తూ వచ్చారు. బాలినేని విమర్శలకు దామచర్ల జనార్ధన్ సైతం ఘాటుగానే రిప్లై ఇచ్చేవారు. అలా ఇద్దరి మధ్య వైరం తారా స్థాయికి చేరింది. ఒకరోజు ఒకరు మాట్లాడితే వెంటనే మరొకర దానికి కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ అయింది.
జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్
అయితే అప్పుడు ఇద్దరు వేరువేరు పార్టీలలో ఉండేవారు. అయితే 2024 ఎన్నికల తర్వాత మారిన పరిణామాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి బై బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఘాటు విమర్శలు చేసుకున్న దామచర్ల, బాలినేనిలు మిత్రపక్షాల నాయకులయ్యారు. అయితే బాలినేని జనసేనలో చేరటాన్ని జీర్ణించుకోలేని జనార్ధన్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. దొరికినప్పుడల్లా అటు టీడీపీ అధిష్టానంతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పదేపదే ఫిర్యాదులు చేశారు .అయితే ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ బాలినేని జనసేన పార్టీలో చేరటాన్ని మాత్రం ఆపలేకపోయారు.
తండ్రీ కొడుకులకు వదిలిపెట్టేది లేదని బాలినేనికి వార్నింగ్
బాలినేని పార్టీ మారినప్పుడు కూడా దామచర్ల జనార్ధన్ దూకుడు తగ్గించలేదు. చేసిన పాపాలు ఊరికే పోవని పార్టీ మారిన తండ్రీకొడుకులకు వదిలిపెట్టేది లేదని బాలినేనికి వార్నింగులిచ్చారు. దానికి రియాక్ట్ అయిన బాలినేని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే లేఖ రాస్తూ, తనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, తప్పుంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమని కౌంట్ ఇచ్చారు. బాలినేని జనసేనలో చేరిన తర్వాత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో రెండు వర్గాల మధ్య వార్ నడిచింది. ఒంగోల నగర పాలక సంస్థలో పట్టు కోసం వారు పావులు కదిపారు. టిడిపి పట్టు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే జనసేన కూడా బాలినేని సారథ్యంలో 20 మంది కార్పొరేటర్ లను తన వైపుకు తిప్పుకోగలిగింది. అందరూ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగానే ఉన్నా ఒంగోలులో బాలినేని, దామచర్లల మధ్య ఆధిపత్యపోరు మాత్రం అలాగే కొనసాగుతోంది. ఆ క్రమంలో ఒంగోలు మినీ మహానాడులో మరోసారి దామచర్ల జనార్ధన్ తనదైన శైలిలో బాలినేనిపై విమర్శలతో విరుచుకుపడ్డాడు.
Also Read: బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
దాంతో మళ్లీ ఒంగోలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దామచర్ల కామెంట్స్‌పై బాలినేని ఎలా స్పందిస్తారనేది చూడాలి. 2024 ఎన్నికల తరువాత ఒంగోలుకు దూరంగా ఉంటున్న బాలినేని తన వర్గానికి మాత్రం అందుబాటులోనే ఉంటున్నారు. అదలా ఉంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని పట్టు పెంచుకోవాలంటే పార్టీల నేతలు కలిసి పనిచేయాలని, అయితే ఒంగోలులో ఆ పరిస్థితి లేకుండా పోయిందని కూటమి శ్రేణులు వాపోతున్నాయి. కూటమి బలోపేతానికి ఇద్దరు నేతలు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. మరి టీడీపీ, జనేసేన అధినేతలు వారిని కంట్రోల్ చేస్తారో?లేదో చూడాలి.