Summer Special Trains From Visakhapatnam: వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పెరగడంతో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి అనుగుణంగా జూన్ 1 నుంచి జూలై 31 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం నుంచి 44 వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఈ సర్వీసులు కీలక నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచనున్నాయి. అదే సమయంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నాయి. సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు విశాఖపట్నం నుంచి బెంగళూరు, తిరుపతి, చర్లపల్లి మధ్య నడవనున్నాయి.
విశాఖపట్నం నుంచి నడిచే ప్రత్యేక రైళ్లు
⦿ విశాఖపట్నం – SMVT బెంగళూరు: రైలు నం. 08581/08582 విశాఖపట్నం నుంచి బెంగళూరులోని శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ వరకు రాకపోకలు కొనసాగించనుంది. ఈ రైలు జూన్ 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. జూన్ 30 వరకు సర్వీసులు అందించనుంది. ప్రతి ఆదివారం, సోమవారం ఈ రైలు నడుస్తుంది. రెండు నగరాల మధ్య మొత్తం 10 ట్రిప్పులు నడవనుంది.
⦿ విశాఖపట్నం – తిరుపతి: రైలు నం. 08547/08548 విశాఖ నుంచి తిరుపతి మధ్య రాకపోకలు కొనసాగించనుంది. జూన్ 4 నుంచి ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. జూలై 31 వరకు కొనసాగుతుంది. ప్రతి బుధవారం, గురువారం నాడు ఈ రైలు నడుస్తుంది. మొత్తం 18 సర్వీసులు ప్లాన్ చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
⦿ విశాఖపట్నం – చర్లపల్లి: రైలు నం. 08579/08580 విశాఖపట్నం నుంచి చర్లపల్లి నడుమ రాకపోకలు కొనసాగించనుంది. జూన్ 6 నుంచి జూలై 26 వరకు ఈ రైలు నడుస్తుంది. ప్రతి శుక్రవారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 16 ట్రిప్పులు నడవనుంది.
⦿ విశాఖపట్నం – షాలిమార్: రైలు నం. 08508/08507 జూన్ 3 నుంచి 25 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం, బుధవారం నడుస్తుంది. మొత్తం 8 ట్రిప్పులు వేయనుంది.
Read Also: సికింద్రాబాద్ to ఢిల్లీ.. తెలంగాణ ఎక్స్ ప్రెస్, వందే భారత్ స్లీపర్ లో ఏది బెస్ట్? ఏది ఫాస్ట్?
ఆంధ్రాలోని ప్రధాన నగరాలు కవర్!
సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు విజయవాడ, రాజమండ్రి, గుంటూరుతో సహా ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. ఈ ప్రాంతం అంతటా విస్తృతమైన కవరేజీని అందిస్తాయి. వేసవి కాలంలో ప్రయాణీకులు సజావుగా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులు ఈ రైళ్లకు సంబంధించిన షెడ్యూల్‌లు, బుకింగ్ సమాచారం, ఈ ప్రత్యేక రైలు సేవలకు సంబంధించిన వివరాల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. లేదంటే, రైల్వే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఈ సమ్మర్ స్పెషల్ రైళ్లను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Read Also: హైదరాబాద్ మెట్రో.. కొత్త రేట్ల లిస్ట్ ఇదే.. ఎన్ని కిలోమీటర్లకు ఎంత ఛార్జ్ చేస్తారంటే?