Internal War in Ponnur: గుంటూరు జిల్లా కూటమి నాయకుల మధ్య వివాదాలతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్ధులుగా ఒకరిపై ఒకరు చెలరేగిపోయిన నాయకులు తర్వాత మిత్రపక్షాల్లో చేరినా.. వారి మధ్య ఆధిపత్యపోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో పొన్నూరు కూటమి నేతల ఫైట్ రచ్చగెక్కిందని చెప్పొచ్చు… 2019 ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్రపై విజయం సాధించిన కిలారిరోశయ్య మొన్నటి ఎన్నికల్లో నియోజకవర్గం మారినా వారి మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఫలితాల తర్వాత రోశయ్య జనసేన పంచకు చేరారు. అయినా ఇద్దరు నేతలు తగ్గేదేలే… అన్నట్లు చేస్తున్న రాజకీయంతో పొన్నూరు పాలిటిక్స్ హీట్ ఎక్కి పోతున్నాయంట.. అసలింతకీ అక్కడ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
గుంటూరు జిల్లాల్లో కూటమి పక్షాల్లోనే విభేదాలు
గుంటూరు జిల్లా రాజకీయాలు గుంటూరు మిర్చిలాగే ఎప్పుడూ హాట్ హాట్ గా వుంటాయి.. ప్రస్తుతం అధికారకూటమి, ప్రతిపక్ష వైసీపీల మధ్య రాజకీయ విబేదాలు ఏమో గాని కూటమి పక్షాల్లోనే విభేదాలు రచ్చకెక్కుతున్నాయట. పొన్నూరు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర, వైసిపి నుండి జనసేనలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య మధ్య ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోందట. తాజాగా దూళిపాళ్ళ నరేంద్ర పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు కిలారి రోశయ్య.. తన రాజకీయ భవిష్యత్తును ఇబ్బంది పెట్టే విధంగా కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తాను ఎమ్మెల్యే గా వున్నపుడు జరిగిన రేషన్ డీలర్ బర్నబాస్ హత్యకేసుతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా.. తనపై బురద జల్లేందుకు సిఐడి నోటీసులంటూ ఓ వర్గం తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడుతున్నారు.
జనసేన బలోపేతం కాకుండా కుట్రలు చేస్తున్నారని రోశయ్య విమర్శలు
పొన్నూరు నియోజకవర్గం లో తాను ఎమ్మెల్యే గా వున్న సమయంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేశానని అందుకే నియోజకవర్గం ప్రజలు ఇంకా తనను ఆదరిస్తున్నారని రోశయ్య అంటున్నారు…తాను పొన్నూరులో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటే, పార్టీని ఎదగనీయకుండా చేయడానికి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తప్పకుండా ఈ అంశాలను పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్ దృష్టి కి తీసుకెళ్తానని, ధూళిపాళ్ల వర్గాన్ని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. జనసేన నేతగా కిలారి రోశయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు పొన్నూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయంశంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి రోశయ్య వ్యాఖ్యలు చేశారనే దానిపై నేతలు చేవులు కోరుక్కుంటున్నారట. ఇన్ ఇన్ డైరెక్ట్ గా ధూళిపాల వర్గంపై కిలారి రోశయ్య అగ్గి మీద గుగ్గిలమయ్యారనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోందట.
రోశయ్య వర్గానికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్న నరేంద్ర వర్గం
అయితే కిలారి రోశయ్య వ్యాఖ్యలకు ధూళిపాళ్ల వర్గం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. కావాలనే తమ నేతని ప్రజల్లో తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర మీద చేస్తున్న విమర్శలు మానుకోవాలని రోశయ్యకు హితవు పలుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియా ఘాతకాలతో బర్న్ బసు హత్యకు గురయ్యారని.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తుండటంతో.. ఈ కేసులో కిలారి రోశయ్యకి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారన్న ప్రచారం జరిగింది. అయితే దానికీ టిడిపి నేతలకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే వర్గం అంటోంది. ఆ క్రమంలో కిలారి రోశయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత వాప్యారాలు మాత్రమే చేసుకున్నారని.. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం షెల్టర్ కోసం మాత్రమే జనసేనలోకి వచ్చారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
నరేంద్ర అరెస్ట విషయంలో కీలక పాత్ర పోషించిన రోశయ్య
కిలారి అంశంలో దూళిపాళ్ళ వర్గం సీరియస్‌గానే వ్యవహరిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా కిలారి వున్నప్పుడు టిడిపి నాయకులపై కేసులు పెట్టి వేధించారని టిడిపి వర్గం ఆరోపిస్తోంది.. సంగం డెయిరీ వ్యవహారంలోను, దూళిపాళ్ళ అరెస్ట్ విషయంలోను కిలారి కీలకంగా వ్యవహరించారని టిడిపి నేతలు చెబుతున్నారు.. మట్టి మాఫియాకు సంబంధించి అనేక సార్లు దూళిపాళ్ళ నరేంద్ర క్వారి వద్దకు వెళ్లి నిరసనలు చేశారు. అప్పుడు కూడా తమపై తప్పుడు కేసులు పెట్టారని, అభివృద్ధి పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, వాటిపై విచారణ చేయాలని నాయకులు అంటున్నారు. ఆయన షెల్టర్ కోసం జనసేనలో చేరినా.. చేసిన అక్రమాలపై విచారణ ఎదుర్కొవలసిందేనని టిడిపి వర్గం చెబుతోంది..
Also Read:ఆ పదవి కోసం జనార్ధునుల మధ్య కుమ్ములాట..
గత ఎన్నికల్లో రోశయ్యకు పొన్నూరు టికెట్ ఇవ్వని జగన్
ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాలు పొన్నూరు రాజకీయాల్లో గరంగరంగా మారుతున్నాయి.. గత ఎన్నికల్లో పొన్నూరు టికెట్ దక్కించుకోలేక గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన రోశయ్య, తిరిగి పొన్నూరులో పాలిటిక్స్ చేయాలని చూస్తుండటాన్ని టీడీపీ శ్రేణులు యద్దేవా చేస్తున్నాయి. మొత్తమ్మీద వైసీపీని ఎండగట్టాల్సిన కూటమి శ్రేణుల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్‌పై పెద్ద చర్చే నడుస్తోందిప్పుడు.
Story By Venkatesh, Bigtv