Sankranti Cockfights: బెంగళూరులో స్థిరపడ్డ చేపల వ్యాపారి భీమవరం సుబ్బరాజు చెప్పే మాట ఏంటంటే.. సంక్రాంతి వస్తే చాలు.. సొంతూరుకు చేరుకుంటాం. ఓడినా గెలిచినా తగ్గేదేలే.. పందెం కాసి తీరాల్సిందే. అలా చేయకుంటే ఆ ఏడంతా నాకు పెద్దగా కలిసి రాదు. ఇదీ ఈ బెట్టింగ్ బంగార్రాజు అనే మాట. ఇక అమలాపురం స్వామినాయుడైతే.. ఇదో సెంటిమెంటుగా చెబుతారు. ఉత్తరాంధ్రలో పెద్ద గ్రానైట్ కంపెనీ ఓనరైన నాయుడికి వరంగల్లో కూడా క్వారీలున్నాయ్. కోడిపందేలతో తమది విడదీయరాని అనుబంధంగా.. చెబుతారీయన. సంక్రాంతి కోడి పందేల్లో పాల్గొనకుంటే.. వ్యాపారంలో భారీ నష్టం వస్తుందని భావిస్తారీ పందెం నాయుడు.
ఈ ఏడాది మాత్రమే కాదు.. గతకొన్ని తరాలుగా తాము పందెం వేస్తూనే ఉన్నామనీ. ఇందులో లాభనష్టాలన్నది పెద్దగా పట్టదనీ. పందెం ఆడ్డం అనేది.. తమకొక సెంటిమెంటుగా చెప్పుకొస్తారు ఇలాంటి ఎందరో పందెం రాయుళ్లు. చేతిలో ఐదు రూపాయలున్నా సరే లెక్క చేయక ఆ ఏడాది పందెం కాయకుంటే.. వీరికి నిద్ర పట్టదు. ముద్ద దిగదు. పందేలంటే.. తమ దృష్టిలో అదో కుటీర పరిశ్రమ. ఇక్కడ ఎందరో దీన్నో జీవనాధారం చేసుకుని బతుకుతున్నారు. పండగ పూట ఒక పందెం కాయడం అంటే తమ చుట్టుపక్కల వారి జీవనోపాధికి తాము సహకరించడమేనని.. ఇదొక తరతరాల ఆచారమనీ అంటారు. అంతే కాదు.. ఇది మన సంప్రదాయమనీ.. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధ కాలం నాటి సంప్రదాయమనీ. ఒక రకంగా చెబితే.. ఈ కోడి పందేలు కూడా సరిగ్గా అలాంటి యుద్ధాలేననీ. యుద్ధం శాంతికి చిహ్నమనీ తత్వాలు పలికే పందెం రాయుళ్లున్నారీ ప్రాంతంలో. వీరే కాదు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, సింగపూర్ వంటి పలు ప్రాంతాల నుంచి ఈ కోళ్ల పందేలకు క్యూ కడతారంటే అతిశయోక్తి కాదు.
తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర చోట నుంచి బెట్టింగ్‌బాబులు గోదావరి జిల్లాల్లో మకాం వేశారు. దీంతో ఈ ప్రాంతాల్లోని హోటళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగానూ కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. వేల సంఖ్యలో తరలివచ్చిన జనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా షామియానాలు, టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ సౌకర్యాలతో కోడి పందాల బరులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు.
మరోవైపు.. కోడి పందాలపై పోలీసులు సైతం స్పెషల ఫోకస్ పెట్టారు. సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని.. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరిస్తున్నారు. అయినా సరే లెక్క చేయక.. పందెంరాయుళ్లు రెచ్చిపోదాం బ్రదర్ అంటున్నారు. అందులో భాగంగా.. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో కోడి పందాలు కొనసాగుతున్నాయి. పందాల బరుల దగ్గర కోలాహలం నెలకొంది. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బుల్లెట్ వాహనాలను బహుమతిగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
ప.గో జిల్లా తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా పందుల పందేల నిర్వహణ ప్రత్యేక ఆకర్షణ. గ్రామంలో పండుగ నేపథ్యంలో ఉత్సాహంగా పందుల పోటీలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండం పందెరాయుళ్లు రూ.కోట్లల్లో బెట్టింగులు కాస్తున్నారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పందుల పందేలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇది తమ తరతరాల ఆచారమని అన్నారు.
ఏలూరు జిల్లా చెందిన గుడివాడ ప్రభాకర్, రంగాపురం రత్తయ్య ఏకంగా కోటి రూపాయలతో పందెం వేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంది. ఈ ఇరువురూ.. కోటి పందెం కాస్తే.. ఇలాంటి కనిపించని కోడి పందేల రాయుళ్లు ఇంకెంది మంది ఉంటారో అంచనా వేయడం కష్టమనీ.. ఈ నాలుగైదు రోజులు పూర్తయితేనే.. లెక్క మొత్తం బయటకు వస్తుందని. సుమారు 300 నుంచి 500 కోట్ల మేర టర్నోవర్ జరిగినా పెద్ద ఆశ్చర్యం లేదనీ. దానికి తోడు గోదావరి జిల్లాలకు మాత్రమే కాదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా.. ఈ పందేలు జోరుగా సాగడం, కొత్త బరుల కారణంగా.. ఈ మొత్తం రెండింతలయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు స్థానిక పందేల నిపుణులు.
Also Read: GRSEL Recruitment: ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేదు.. భారీ శాలరీ.. జస్ట్ ఈ అర్హతలుంటే చాలు..!
మరోవైపు కోడి పందేలతో పాటు గుండాట, ఇతర జూద క్రీడలు బహిరంగంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వేలకు వేలు పందేంగా కాస్తున్నారు. విజేతలకు రూ.25లక్షల విలువైన మహీంద్రా థార్ వాహనాన్ని బహుమతిగా ఇస్తున్నారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చంటున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన పందెం రాయుళ్ల నుంచి భారీ స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కూడా పందేలు నిర్వహించడానికి ఆసక్తి చూపడంతో తమ పంట పండుతోందని అంటున్నారు. ఒక్కో బరిలో సుమారు రూ.5 కోట్ల మేర పందేలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఒక్క బరిలోనే ఇంత మొత్తం పందెం వేస్తుంటే.. ఇక ఇతర బరుల్లో ఈ మొత్తం కలిపితే ఎంత మొత్తం ఉంటుందో.. ఊహించుకోవచ్చని అంటున్నారు పందెం రాయుళ్లు.