South Korea President Arrest | దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తన అధ్యక్ష పదవిలో ఉండగానే అరెస్టు కావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఆయన తీసుకున్న ఎమర్జెన్సీ మార్షల్ లా (Emergency Martial Law) నిర్ణయం, అభిశంసనతో కూడిన రాజకీయ పరిణామాలు.. ఇప్పుడు ఆయన అరెస్ట్ కు కారణమయ్యాయి.
బుధవారం జనవరి 15, 2025 తెల్లవారుజామున.. వందలాది మంది దర్యాప్తు అధికారులు, ప్రత్యేక భద్రతా బృందాలు అధ్యక్షుడి నివాసానికి చేరుకున్నాయి. అక్కడ అధ్యక్ష భద్రతా దళాలు అధికారులను అడ్డగించేందుకు ప్రయత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన తర్వాత, అధికారులు భద్రతా వ్యవస్థను దాటుకొని అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య మరో ప్రాంతానికి తరలించారు.
ఇంతకుముందు కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నం
గతంలోనూ ప్రెసిడెంట్ యూన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పెద్ద ఎత్తున విధ్వంసకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగానే పోలీసులు ఈసారి మరింత జాగ్రత్తగా ఉదయం వేళ అయనను అరెస్టు చేశారు. పైగా అధ్యక్షుడి చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
మార్షల్ లా వివాదం
2024 డిసెంబర్ లో, దక్షిణ కొరియాలో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉండడంతో, యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లా (మిలిటరీ పాలన) ప్రకటించారు. దీంతో దేశ ప్రజల్లో ఆయన పట్లు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధ్యక్షుడు మిలిటరీ పాలన విధించడంతో.. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా విమర్శించాయి. అందుకే ఈ చట్టం అమలు అయిన వెంటనే, పార్లమెంటులో దీనిని రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. అందుకు పార్లమెంటు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు లభించింది. దీంతో పార్లమెంట్ స్పీకర్ మార్షల్ లా చట్ట విరుద్ధం అని ప్రకటించారు.
అభిశంసన తీర్మానం
మార్షల్ లా నిర్ణయం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అందుకే ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి
తీర్మానానికి 204 మంది మద్దతు తెలపగా, 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. ఫలితంగా యూన్ సుక్ యోల్ తన అధ్యక్ష అధికారాలను కోల్పోయారు.
Also Read: టిక్ టాక్ ఇక మస్క్ చేతికి?.. విక్రయించే యోచనలో చైనా
మార్షల్ లా చట్టవిరుద్ధం కావడంతో ప్రెసిడెండ్ యూన్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి గతంలో పలుమార్లు ఆయనకు సమన్లు జారీ చేశారు. ఆయన్ని విచారణకు హాజరుకావాలని కోరినప్పటికీ, ఆయన స్పందించకపోవడంతో కోర్టులో పిటీషన్ వేశారు. ఆ వెంటనే కోర్టు ఆయనను అరెస్టు చేయాలని వారెంట్ జారీ చేసింది. దీంతో, ఈసారి భారీ భద్రత నడుమ ఆయనను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా ప్రభావం
యూన్ సుక్ యోల్ అరెస్టు దక్షిణ కొరియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజలు, రాజకీయ నేతలు ఈ పరిణామాలపై విధి విధానాలను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ప్రజాస్వామ్య విలువలు అణచివేసి ప్రభుత్వ విధానాలను గౌరవించడంలో విఫలమైనందుకు యూన్ సుక్ యోల్‌పై ఇప్పుడందరూ తప్పుబడుతున్నారు. పైగా ప్రెసిడెంట్ అభిశంసనకు గురై అధికారం కోల్పోవడంతో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు ప్రధాన మంత్రి హాన్ డుక్ చేపట్టారు. కానీ ప్రెసిడెంట్ ని న్యాయస్థానంలో విచారణ చేయాలంటే అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అవసరం. ఈ అయిదుగురి న్యాయమూర్తులను తాత్కాలిక అధ్యక్షుడు నియమించాలి.
అయితే న్యాయమూర్తుల నియామకానికి ప్రధాన మంత్రి హాన్ నిరకరించడంతో ఆయనపై కూడా అభిశంసన తీర్మానం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీంతో ఆయన కూడా అభిశంసనకు గురి కావడంతో.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు ఆర్థిక మంత్రి చేపట్టారు. ఈ పరిణామాలతో సౌత్ కొరియాలో ఒకరకంగా రాజకీయ సంక్షోభం నెలకొంది.
కానీ ఒక దేశ అధ్యక్షుడ తప్పుచేస్తే చట్టం ప్రకారం ఆయనను కూడా అరెస్ట్ చేసే అధికారం ప్రజాస్వామ్యం కల్పిస్తుంది. దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్యం బలంగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి భారత దేశంలో ఇది సాధ్యపడుతుందా.. మీరే మంటారు.