Duvvada Srinivas: ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు అవడం అంటే ఇదేనేమో. కాలం కలిసి వచ్చినపుడు ఏది చేసిన కలిసివస్తుంది. కానీ సీన్ రివర్స్ అయితే అదే కాలం.. ఎంతటి వారినైనా అధోగతిపాలు చేస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ అంటే ఉంటుందో చూస్తున్నారు . గతంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లె వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టింది. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ.. పక్కన పెట్టేశారు. నీవలన పార్టీ పరువు పోతుందంటూ.. క్రమశిక్షణ చర్యలు పేరుతో పర్మనెంటుగా పార్టీ నుంచి బహిష్కరించారు. మరి ఇంత సడన్‌గా తన నమ్మిన బంటుని వైసీపీ అధ్యక్షుడు ఎందుకు దూరం చేసుకున్నారు?
వివాదాలతో ఆర్జీవీ కంటే ఫేమస్ అయిన దువ్వాడ శ్రీను
సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్యారెక్టర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రాంగోపాల్ వర్మ. రాజకీయాలలో వివాదాలు అంటే ఆర్జీవీ కంటే ఫేమస్ అయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వైసిపి పార్టీ అధికారంలో ఉండగా అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్నారన్న ఆపకీర్తిని దువ్వాడ శ్రీను మూటగట్టు కున్నారు. రాజకీయలలో సిద్ధాంత పరమైన విమర్శలు చేస్తే ఏ పార్టీ కూడా అడ్డు చెప్పదు. కాని దువ్వాడ వ్యక్తి గత విమర్శలు చేస్తూ రాజకీయ విలువలకు పాతర వేసారన్న చెడ్డపేరుతో ఫేమస్ అయ్యారు.
పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారుస్తున్నారని దువ్వాడపై ఫిర్యాదులు
సీఎం చంద్రబాబు రాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్‌లపై అసభ్యకర భాషతో విమర్శలు గుప్పిస్తూ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నారని .. ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలే అధిషానానికి ఫిర్యాదులు చేశారంట. దువ్వాడ వైసీపీలో చేరినప్పటి నుంచి జగన్‌ను ప్రసన్నం చేసుకుని, ఆయన దృష్టిలో పడేందుకు టీడీపీ, జనసేన అధినేతలపై బూతులతో విరుచుకుపడేవారు. అది నచ్చి వైసీపీ స్థాపించాక ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయిన దువ్వాడకు జగన్ ఆగమేఘాల మీద ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
2014లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన దువ్వాడ
దువ్వాడ 2014లో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019లో టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయన దివ్వెల మాధురి తో సహజీవనం చేయడంపై వ్యతిరేకించిన దువ్వాడ శ్రీను భార్య వాణి, కుమార్తెలు రెండు నెలలు పాటు టెక్కలిలోని అయన ఇంటిముందు నిరసన చేపట్టారు. భార్య, కుమార్తెలను చేరదీయక పోగా.. వారి పైన దువ్వాడ శ్రీను దాడికి దిగడం అప్పట్లో సంచలనం అయింది. దువ్వాడ భార్య పిల్లలు రోడ్డెక్కడంతో ఆయనపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దానిపై జిల్లా వైసిపి నేతలు అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు కుడా చేశారంట. సొంత కుటుంబంపై దాడికి దిగడం.. మరో వైపు దివ్వెల మాధురితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండటంతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని జగన్ దగ్గర జిల్లా నేతలు మొత్తుకున్నారంట.
టెక్కలి ఇన్చార్జిగా క్యాడర్‌కు అందుబాటులో లేకుండాపోయిన దువ్వాడ
ఆ క్రమంలో మాధురితో విహార యాత్రలు, టూర్లకు ఎక్కువ టైమ్ కేటాయిస్తూ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించకపోవడం కూడా దువ్వాడకి మైనస్‌గా మారుతూ వచ్చిందంట. ఓ వైపు ఎమ్మెల్సీగా, మరో వైపు టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా ఉన్న ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడంతో ఆయనపై పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత పెరిగింది. మాధురితో కలిసి టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలకే ఆయన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. దాంతో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తున్న జగన్ టెక్కలిలో నష్ట నివారణ చర్యలకు దిగారు.
దువ్వాడ శ్రీనుని పలకరించడం మానేసిన జిల్లా నేతలు
టెక్కలిలో దువ్వాడ శ్రీను ను కాదని పేదాడ తిలక్‌కు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో చాలా కాలంగా నుంచి పేదాడ తిలక్‌కి, దువ్వాడ శ్రీనుకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. దాంతో తిలక్ టెక్కలి నియోజకవర్గ భాద్యతలు చేపట్టినప్పటి నుంచి దువ్వాడను కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదంట. పేదాడ తిలక్ తో పాటు జిల్లాలోని వైసీపీ నాయకులు ఎవరితో కూడా కూడా దువ్వాడ శ్రీనుకి సత్సంబంధాలు లేవని శ్రీకాకుళం జిల్లాలో బలంగానే వినిపిస్తుంది. దీంతో జిల్లా నేతలు కూడా దువ్వాడను పలకరించడం మానేశారంట
హైదరాబాద్‌లో మాధురితో కలిసి వస్త్రాల వ్యాపారం
చివరికి దువ్వాడ సొంత భార్య వాణి కుడా తిలక్ తో కలిసి పార్టీ కార్యక్రమాలకి హాజరువుతున్నారు. దాంతో దువ్వాడ దైన్యస్థితి చూసి పొంత పార్టీ వారే రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలం లో హైదరాబాద్‌లో మాధురితో కలిసి ఆయన వస్త్రాల వ్యాపారం కూడా ప్రారంభించారు. దాంతో అధిక సమయం హైదరాబాద్‌లోనే గడపడం కూడా దువ్వాడ శ్రీనుని టెక్కలి వైసీపీలో ఒంటరిని చేసిందంటున్నారు. ఈ మధ్య కాలంలో అడపా దడపా టెక్కలి వస్తున్న ఆయన తన వారి శుభకార్యాలకు హాజరై వెళ్లిపోతున్నారంట. ఇటీవల టెక్కలి వచ్చిన దువ్వాడ శ్రీను చేసిన వ్యాఖ్యలు కూడా నియోజకవర్గ నాయకులకి కోపం తెప్పించాయట. స్థానిక నాయకులు ఎవరేం చేసుకున్న తనకేం భయం లేదని, తనకు జగనన్న ఆశీస్సులు ఉన్నాయని బహిరంగంగా ధీమా వ్యక్తం చేశారంట. దాంతో దువ్వాడ శ్రీను కావాలో? తాము కావాలో తేల్చుకోవాలని టెక్కలి క్యాడర్ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చిందంట.
దువ్వాడ ఏ పార్టీలో ఉన్నా వివాదాస్పదుడిగానే ముద్ర పడింది. గతంలో టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలపై తిరుగు బాబు చేసిన సందర్భాలున్నాయి. వైసీపీలో చేరి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను కాదని జిల్లాలో తన మాటకే విలువ పెరిగేలా రాజకీయం చేశారు. అయితే వైసీపీ అధికారం కోల్పో వడం, దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ రచ్చకెక్కడంతో..ఆయన్ని ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు.ఇన్చార్జి బాధ్యతలను తప్పించినా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన మానలేదు. దాంతో పార్టీ నాయకులు మళ్లీ ఆయనపై ఫిర్యాదు చేశారంట.
ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించాక సైతం వివాదాస్పద వ్యాఖ్యలు
అన్నిటికంటే ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ గ్రాఫ్ పడిపోవడం.. నియోజకవర్గం లో దువ్వాడ కు కార్యకర్తలు దూరం కావడంతో .. ఇక ఆయన్ని పార్టీ లో కొనసాగించినా ఉపయోగం లేదని, జగన్ ఆయనపై బహిష్కరణ వేటు వేశారంట. దువ్వాడను ఎక్కవ కాలం పార్టీ లో ఉంచడo వలన మిగిలిన నాయకులు కూడా పార్టీకి దూరం అవుతారని భావించే చెక్ పెట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నిజoగా జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుంచి పంపించేయాలని అనుకుంటే.. చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేసినపుడే ఆ పని చేయవచ్చు. దువ్వాడ ఫ్యామిలీ డ్రామా సోషల్ మీడియాలో ట్రోల్ అయినప్పుడు చర్యలు తీసుకోవడచ్చు. అయితే ఎన్నికల సమయంలో దువ్వాడ శ్రీను అవసరం ఉంది కాబట్టి, పార్టీ కోసం దువ్వాడ ను వాడుకునేoదుకే అప్పట్లో జగన్ ఆయన్ని వెనుకేసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీను సీన్ నియోజకవర్గంలో పూర్తిగా కాలిపోవడంతో ఇక ఆయనతో పనేం లేదని పూర్తిగా పక్కన పెట్టేశారంటున్నారు.
Also Read:హిందువులే టార్గెట్‌గా.. పహల్గాం ఉగ్రదాడి వెనుక కారణం ఏంటి..?
2027 మార్చి వరకు ఉన్న ఎమ్మెల్సీ పదవీ కాలం
మొత్తం మీద దువ్వాడపై వరుస కేసులు నమోదవుతుండటం, ఆయన వ్యక్తిగత జీవితం నవ్వులపాలు అవ్వడం, ఇక ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరణ వేటుతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లేనన్న వాదన జిల్లాలో జోరుగా వినిపిస్తుంది. ఏదైతేనేం 2027 మార్చి వరకు దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీగా పదవి కాలం ఉంది. మరి అది ముగిసే సరికి ఆయన రాజకీయంగా మరో ఉపాధి ఎదుర్కొంటారో? లేదో చూడాలి