Sharmishta Panoli Case : శర్మిష్ట పనోలి. ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్. అంతగా ఆమె పోస్ట్ లో ఏముంది? దీనిపై ఒక డచ్ ఎంపీతో పాటు ఏపీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించేంతగా ఆమె ఏం చేశారు? ఆ డీటైల్స్ ఏంటి? అసలీ వివాదం ఎప్పుడు చెలరేగింది? విద్యార్ధి, రాజకీయ వర్గాల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరింది?
బెంగాల్ టు డచ్
డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్. ఈయన 22 ఏళ్ల లా స్టూటెండ్ శర్మిష్ట పనోలిని కో కత పోలీసులు అరెస్టు చేయడం కరెక్టు కాదంటూ స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఆధారంగా అన్నేసి సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేయడం సరి కాదన్నారు. అంతే కాదు ఇది వాక్ స్వాతంత్రానికే భంగం కలిగించే చర్య అంటూ విమర్శించారు. ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్ణను విడుదల చేయాలని.. ఆ మేరకు అధికారులు ఆదేశించాలని.. ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అందరి దృష్టి శర్మిష్టపైనే ఉందంటూ ఆమె ఫోటోను షేర్ చేశారు. అక్కడెక్కడో ఉన్న డచ్ ఎంపీకి ఇక్కడి భారతీయ యువతి శర్మిష్టకీ సంబంధమేంటి? ఏంటీ ఫాలోయింగ్.. పైపెచ్చు శర్మష్టకు లక్షా 75 వేల మంది ఫాలోయర్లుండగా.. వారిలో ఆయన లేరు కూడా. అయినా ఏంటీ మద్ధతు? అందరిలోనూ ఆశ్చర్యం.
పవన్.. నేను సైతం..
ఇదిలా ఉంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం శర్మిష్ట అరెస్టుపై తీవ్రంగా రియాక్టయ్యారు. ఐ స్టాండ్ విత్ శర్మిష్ట, ఈక్వల్ జస్టిస్ అనే హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియా పోస్టులు చేయడంతో ఇప్పుడు శర్మిష్ట వ్యవహారం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. లౌకిక వాదం కొందరి కవచం కాదు- మరి కొందరి కత్తి కాదు. ఇది అందరూ నడిచే విశాలమైన రహదారి. బెంగాలీ పోలీసులు అత్యుత్సాహం దేశమంతా చూస్తోంది. సమన్యాయంతో వ్యవహరించండి.. #IstandwithSharmistha. #EqualJustice అంటూ ఆయన ట్వీట్ ద్వారా తెలియ చేశారు. అంతే కాదు, సనాతన ధర్మం ఒక గంధా ధర్మం అంటూ అప్పట్లో బెంగాలీ సీఎం మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ వీడియోలను షేర్ చేశారు పవన్.
అసలేం జరిగిందంటే..
శర్మిష్ట పనోలి హర్యానాలోని గుర్గావ్ కి చెందిన యువతి. పూనే లా వర్శిటీలో న్యాయవాద విద్యనభ్యసిస్తోంది. ఈమెను బెంగాలీ పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్టు చేశారు. ఎందుకంటే ఆపరేషన సిందూర్ టైంలో ఉగ్రవాదులకు, పాకిస్థాన్ కు, మత ఛాందస వాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఇన్ స్టాలో ఒక పోస్టు పెట్టారామె. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు స్పందించరని నిలదీశారు. అయితే ఈ వ్యాఖ్యలు కొందర్ని బాధిస్తున్నాయని గుర్తించి.. తన పోస్ట్ డిలీట్ చేశారామె. తన తప్పు తెలుసుకుని వీడయో తొలగించారు. అంతే కాదు సారీ కూడా చెప్పారామె. శర్మిష్ట చేసిన ఈ పోస్టుపై కోల్‌కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో.. ఆమెను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగానే కాక ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలోనూ పెను దుమారం చెలరేగేలా చేస్తోంది.
వివాదం ఎలా రాజుకుందంటే..
మే 14న ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిథి వారిస్ పఠాన్ తన X పోస్ట్ లో .. పనోలీ వీడియోను ఫ్లాగ్ చేశారు. ఇది ఇస్లామ్ ను అవమానించడమేనని.. మత సామరస్యానికి వ్యతిరేకమని తన పోస్ట్ లో తీవ్రంగా ఆరోపించారు. అంతే కాదు ఈ పోస్టు ద్వారా.. హోం మంత్రిని సైతం ట్యాగ్ చేశారు. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వెలుగులోకి వచ్చిందీ కేసు. తాను బేషరతుగా క్షమాపణలు చెప్పి కంటెంట్ తొలగించినా.. ఒక మతాన్ని అవమానించారన్న కోణంలో అరెస్టు చేయడం ఏం బాగోలేదంటారు పనోలి. ఎప్పుడైతే ఈ కేసు హోం మంత్రికి కూడా ట్యాగ్ చేశారో.. అప్పుడే ఇది దేశ వ్యాప్తంగా ఒక అలజడికి కారణమైంది. దీంతో ఆమెపై ఎన్నో ఎఫ్‌ఐఆర్ లు నమోదయ్యాయి. లీగల్ నోటీసులు కూడా అందాయి.
14 రోజుల రిమాండ్
శర్మిష్ట పనోలిపై ఒక వర్గం నుంచి కోల్‌కతా లోని, గార్డెన్ రీచ్ అనే పోలీస్టేషన్ లో FIR నమోదయ్యింది. ఆమె కుటుంబం పరారీలో ఉండటంతో.. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తర్వాత కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. శనివారం ఆమెను గుర్గావ్ లో అరెస్టు చేసి బెంగాల్ తరలించారు పోలీసులు. BNS సెక్షన్ 196(1) (ఎ) , 299 (ఏ),352, 353(1)(సి)వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శర్మిష్ట మొబైల్, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం శర్మిష్టను కోల్ కతాలోని అలీపూర్ కోర్టు ముందు హాజరు పరచడంతో రిమాండ్ విధించింది కోర్టు. జూన్ 13 వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కోర్టుకు నుంచి బయటకొస్తున్న ఆమె ప్రజాస్వామ్యంలో ఈ వేధింపులు సరికాదు. అసలిది ప్రజాస్వామ్యమే కాదని కామెంట్ చేశారు.
రంగంలోకి బీజేపీ
శర్మిష్ట అరెస్టుపై బీజేపీ మండిపడుతోంది. మహువా మొయిత్రాపై కూడా 200 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని.. మరి ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయరంటూ నిలదీశారు బెంగాలీ బీజేపీ లీడర్ సువేందు అధికారి. మహోవా మొయిత్రా ఒక టాక్ షోలో కాళీ మాతపై అవమానకరమైన భాషను వాడారు. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే శర్మిష్టలాంటి ఒక అమాయకురాలిని మాత్రం వెంటనే అరెస్టు చేశారు. ఇది ఎంత మాత్రం సరైనది కాదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సువేందు అధికారి. సనాతన ధర్మం ఆచరించే వారిపై మాత్రమే చర్యలు తీసుంకుంటారని ఆరోపించారాయన.
కంగనా సపోర్ట్
శర్మిష్టకు మద్ధతుగా కంగనా రౌనత్ సైతం స్పందించారు. శర్మిష్ట తన భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగిస్తూ.. సర్వ సాధారణంగా వాడే పదాలనే వాడారు. ఇలాంటి మాటలు చాలా మంది యువత మాట్లాడుతూనే ఉన్నారు. ఆమెను బెదిరించడం, వేధించడం వంటి అవసరమేంటో తనకు అర్ధం కావడం లేదని అన్నారామె.
Story By : Adi Narayana, BIG TV