Conocarpus Trees: పిట్ట వాలదు. గూడు పెట్టదు. ఆక్సిజన్ తీసుకుంటది. కార్బన్-డై-ఆక్సైడ్ వదిలేస్తది. నీళ్లు కూడా అవసరం లేదు. భూమిలో నాటితే చాలు. అలా పాతుకుపోతుంది. మన ప్రాణాలకే ఎసరు తెస్తుంది. ఇదంతా.. ఓ చెట్టు చేస్తుందంటే నమ్ముతారా? చెట్లంటే ఆక్సిజన్ బ్యాంకుల్లాగే మనకు తెలుసు. కానీ.. ఇది అలా కాదు. దీని వల్ల మేలు జరగకపోగా.. విపరీతమైన నష్టం వాటిల్లుతోంది. అదే.. కోనోకార్పస్. ఇది పక్కనుంటే.. మనకే హెల్త్ లాస్.
ఆక్సిజన్ తీసుకుని కార్బన్‌డయాక్సైడ్ వదిలే చెట్లు
విన్నారుగా.. ఇదీ కోనోకార్పస్ కహానీ. కార్బన్ డై ఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇవ్వాల్సిన చెట్టు.. ఉల్టా ఆక్సిజన్ తీసేసుకుంటోంది. కనీసం పిట్ట కూడా వాలని చెట్లని.. తెలంగాణ వ్యాప్తంగా గత ప్రభుత్వం నాటించిందని.. వాటిని వెంటనే తొలగించాలని.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ చెట్లు పర్యావరణానికి హానికరమని, వాటిని నిర్మూలించాలని కోరారు.
తెలంగాణలో యమ డేంజర్‌గా కోనోకార్పస్ చెట్లు
తెలంగాణలో ఎక్కడ చూసినా.. ఈ చెట్లు కనిపిస్తాయి. రోడ్ల వెంబడి డివైడర్ల మధ్యే వీటిని నాటారు. ఈ కోనోకార్పస్ చెట్లకు నీళ్లు అవసరం లేదు. ఎక్కడపడితే అక్కడ వేగంగా పెరుగుతుంది. చూసేందుకు అందంగా కనిపించినా.. పర్యావరణానికి అస్సలు మేలు చేయదు. పైగా.. ఆక్సిజన్ తీసుకుని.. కార్బన్‌డయాక్సైడ్ వదులుతుంది. ఇవేవీ తెలియకుండానే.. అప్పట్లో హరితహారంలో భాగంగా ఎడా పెడా నాటేశారు. నగర సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచారు. పల్లెలు, పట్టణాల్లో ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదట్నుంచీ ఈ మొక్కల పెంపకంపై వివాదం నెలకొంది. ఇప్పుడు వీటిని పూర్తిగా తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పర్యావరణవేత్తలు కూడా ఈ కోనోకార్పస్ మొక్కల పెంపకాన్ని ఆపాలంటున్నారు.
మొదట్నుంచీ కోనోకార్పస్ మొక్కల పెంపకంపై వివాదం
కోనోకార్పస్ చెట్లపై ఇది కొత్తగా జరుగుతున్న చర్చేమీ కాదు. వీటిని తొలగించాలన్న డిమాండ్ ముందు నుంచే ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో.. అప్పట్లోనే కోనోకార్పస్‌పై విస్తృతమైన చర్చ సాగింది. పుణె కార్పొరేషన్ నిర్వహించే పబ్లిక్ పార్కుల్లో.. కోనోకార్పస్ మొక్కల పెంపకాన్ని చేపట్టొద్దని.. అక్కడి పర్యావరణవేత్తలు.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలోనూ గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరిత వనం నర్సరీల్లో కోనోకార్పస్ మొక్కల్ని పెంచొద్దని.. 2022లోనే అప్పటి తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ చెట్ల గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత.. మరోసారి ఈ కోనోకార్పస్‌పై చర్చ మొదలైంది.
తెలంగాణలో పెద్ద సంఖ్యలో కోనోకార్పస్ చెట్లు
ప్రస్తుతం తెలంగాణలో ఈ కోనోకార్పస్ చెట్లు నాలుగైదు మీటర్ల దాకా పెరిగిపోయాయి. ఇది.. మన వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తోందని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పశువులకు, పక్షులకు, మనుషులకు ఏ విధంగానూ ఉపయోగపడని ఈ చెట్లు.. జీవవైవిధ్యానికి ముప్పుగా తయారయ్యాయి. అందువల్లే.. వీటిని తొలగించాలని కోరుతున్నారు. కోనోకార్పస్ చెట్టు విదేశీ మొక్క అయినప్పటికీ.. భారత నేలలో విస్తారంగా పెరిగే గుణాలున్నాయి. ఇది స్థానిక వృక్షజాతులకు, పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తోంది. ఈ చెట్లు భారీగా పుప్పొడిని విడుదల చేస్తాయి. ఇది.. మనుషుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అలర్జీలు, ఆస్తమా లాంటి ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్న కోనోకార్పస్
హరితహారంలో నాటిన ఈ కోనోకార్పస్ చెట్లకు సంబంధించి.. జనంలోనూ కొంతమేర అవగాహన ఉంది. వీటి వల్ల జరిగే నష్టాలు తెలుసుకొని ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా వీటిని నిర్మూలించాలని కోరుతున్నారు. మనుషుల ప్రాణాలు హరించేదిగా తేలడంతో.. కోనోకార్పస్ చెట్లు తమకు హానీ చేస్తాయని కొందరు స్వచ్ఛందంగా వాటిని నరికే ప్రయత్నం చేశారు. దాంతో.. సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో అధికారులు కొందరికి ఫైన్ కూడా వేశారు.
భూగర్భ జలాలని గట్టిగా పీల్చేస్తుంది
పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు.. చాలా దేశాలు గుబురుగా పెరిగే ఈ కోనోకార్పస్ చెట్లని ఎంచుకున్నాయి. భారత్, పాకిస్థాన్, అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఈ మొక్కల్ని.. రోడ్లు, గార్డెనింగ్, కమ్యూనిటీ, అవెన్యూ ప్లాంటేషన్లలో భాగంగా విస్తృతంగా పెంచారు. ఇంతకుమించి.. వీటితో ఎలాంటి లాభం లేదు. నాటిన కొన్నాళ్లలోనే ఏపుగా పెరుగుతుంది. చూసేందుకు కోన్ ఆకారంలో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని ఆకులు పశువులు తినవు. పక్షులు వాలవు. గూళ్లు పెట్టవు. ఈ చెట్టు నీడన.. పచ్చి గడ్డి కూడా మొలవదు. పైగా.. భూగర్భ జలాలని గట్టిగా పీల్చేస్తుంది.
పశువులకు, పక్షులకు, మనుషులకు ఉపయోగపడని చెట్లు
దీని వేర్లు భూమి లోపల అడ్డు వచ్చే డ్రైనేజీ వ్యవస్థల్ని, పైపులైన్లని, కేబుళ్లని కూడా చీల్చుకొని వెళ్లిపోతాయి. వీటన్నింటికి మించి.. కోనోకార్పస్ చెట్లు విడుదల చేసే వాయువులు.. మనుషుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. అందువల్లే.. వీటి పెంపకంపై ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతున్నాయి. కోనోకార్పస్ చెట్లు పర్యావరణానికి, ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని వృక్ష, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో.. ఈ మొక్కల పట్ల వ్యతిరేకత మొదలైంది.
అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో దీనిని దమన్ అని పిలుస్తారు
కోనోకార్పస్.. అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన మొక్క. ప్రధానంగా ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో దీనిని దమన్ అని పిలుస్తారు. పచ్చదనంతో పాటు ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్లకు, వేగంగా వీచే వేడి గాలులకు అడ్డుగోడలా పనిచేస్తాయని.. ఆ దేశాల్లో వీటిని విస్తృతంగా నాటారు. అయితే.. కువైట్, ఖతార్, యూఏఈ లాంటి దేశాలు.. నర్సరీల్లో దీని పెంపకం, దిగుమతుల్ని నియంత్రించాయి. కానీ.. పట్టణాల్లో వేగంగా గ్రీనరీని పెంచేందుకు ఈ మొక్కే బెటర్ అని.. చాలా దేశాలు దీని వైపు మొగ్గుచూపాయి.
శ్వాసకోశ వ్యాధులు, అనేక రకాల ఎలర్జీలకు కోనోకార్పస్ కారణమవుతాయి
ఏపుగా పెరుగుతుందని కాబట్టి.. ఆ ప్రాంతాలను సందర్శించిన నర్సరీల నిర్వాహకులు, మన ప్లాంటేషన్ నిపుణులు ఈ కోనోకార్పస్‌ని భారత్‌కు తీసుకొచ్చారు. మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాల్లో నాటారు. ఇది.. మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు కాబట్టి.. పర్యావరణ సంబంధమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అంతేకాదు.. శ్వాసకోశ వ్యాధులు, అనేక రకాల ఎలర్జీలకు కోనోకార్పస్ కారణమవుతోంది. ఈ మొక్కలు విడుదల చేసే వాయువులు పీలిస్తే శ్వాసలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయ్. ఇప్పటికే ఆస్తమా, చర్మసంబంధ అలర్జీలు ఉన్నవారిపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయ్.
ఆస్తమా పేషంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం.. ఈ మొక్కలే
ఇరాక్‌లోని మిసాన్ ప్రావిన్స్‌లో.. కోనోకార్పస్ చెట్ల వల్ల అక్కడి మౌలిక వసతులకు ఎదురైన పరిస్థితులు, కలిగిన నష్టాలపై జరిపిన ఓ రీసెర్చ్‌లో షాకింగ్ విషయం బయటపడింది. ఈ మొక్క వల్ల.. స్థానిక నివాస ప్రాంతాల్లోని వాటర్ పైప్‌లైన్, డ్రైనేజీలకు నష్టం వాటిల్లినట్లు తేలింది. అయితే.. ఈ మొక్క వేర్లు భూగర్భంలో లోతుగా చొచ్చుకుపోయి, నిర్మాణాలకు నష్టం చేయకుండా ఉండేలా రోజువారీగా నీళ్లు పట్టాలని చెప్పారు. మొక్క ఆకుల పెరుగుదలను ప్రూనింగ్ పద్ధతిలో నియంత్రించడం వల్ల.. మొక్కకు అవసరమయ్యే నీటి వినియోగం తగ్గించాలని, నిర్మాణాలకు దూరంగా పెంచాలని సూచించారు. చివరకు.. పాకిస్థాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌లోనూ ఈ మొక్కలను భారీ సంఖ్యలో పెంచడంపై స్థానిక పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కోనోకార్పస్ వల్ల అక్కడి వాతావరణంలో.. గాలి నాణ్యతపై ప్రభావం పడుతోందని ఏరోబయాలజిస్ట్‌లు పరిశోధనలు నిర్వహించారు. కరాచీలో ఆస్తమా పేషంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం.. ఈ మొక్కలేనని తేలింది. దాంతో.. దేశవాళీ చెట్లనే పెంచాలని అక్కడి వృక్ష శాస్త్రవేత్తలు సూచించారు.
మాంగ్రూవ్ జాతి మొక్కలు బలమైన వేర్లు కలిగి ఉంటాయి
సహజంగానే.. మాంగ్రూవ్ జాతి మొక్కలు బలమైన వేర్లు కలిగి ఉంటాయి. అవి భూగర్భంలో చొచ్చుకుపోయి అండర్ గ్రౌండ్ గుండా వేసిన కమ్యూనికేషన్, తాగునీరు, డ్రైనేజీ పైపులైన్‌లకు నష్టం చేస్తాయి. వీటి వేర్లతో గోడలు, ఇతర నిర్మాణాలు సైతం దెబ్బతింటాయి. వీటి పండ్లు, పూలు కూడా ఎందుకూ పనికిరావు. అందం, ఆకర్షణ తప్ప.. ఇంకే ఉపయోగమూ లేదు. కోనోకార్పస్ చెట్లు స్థానిక పర్యావరణ వ్యవస్థలకు అనుగుణంగా లేని ప్రాంతాల్లో పెంచినప్పుడు, అవి స్థానిక మొక్కల జాతులను అణిచివేసి.. జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ చెట్ల పుప్పొడి కూడా అలర్జీలకు కారణమవుతోందని కొన్ని రీసెర్చ్‌ల్లో తేలింది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి.. ఇవి మరింత ఇబ్బంది కలిగిస్తాయి.
ఈ చెట్లు పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి
వీటికి ఉండే దట్టమైన ఆకులు.. గాలి ప్రసరణని అడ్డుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే చాన్స్ ఉంది. ఈ చెట్లు నీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల.. వీటి సమీపంలోని మిగతా చెట్లకు సరిపోనూ నీరు అందదు. మొత్తంగా.. ఈ చెట్లు పర్యావరణం, మనుషుల ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయ్. అనేక.. అనర్థాలను కలిగిస్తున్నాయ్. భారత్‌లోనూ భారీ ఎత్తున మొక్కలు నాటే హరితహారం లాంటి కార్యక్రమాల్లో.. దేశవాళీ మొక్కలనే నాటాలంటున్నారు. భూగర్భ జలాలను ఎక్కువగా తీసుకునే ఈ కోనోకార్పస్ చెట్లకు బదులు.. స్వదేశీ మొక్కలైన చింత, వేప, మర్రి, పొగడ, ఆకాశమల్లె లాంటి చెట్లను నాటాలని.. వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.