Big Stories

New Parliament: కొత్త పార్లమెంట్ భవనం.. కొత్త చర్చ! కొత్త రచ్చ!!

new parliament building

New Parliament: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముందే వివాదాల సుడిగుండలో చిక్కుకుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలనే డిమాండ్ విపక్షాల నుంచి విమర్శిస్తోంది. ప్రారంభోత్సవంపైనే వివాదం రాజుకోవడం.. రాజకీయంగా దుమారం రేపుతోంది. అసలు ఎందుకీ సమస్య వచ్చింది? విపక్షాల వాదనలో నిజముందా?

- Advertisement -

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకుంది. మే 28న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 18న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ప్రధాని మోదీని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు. కొత్త పార్లమెంట్ భవనం భారతదేశ స్ఫూర్తికి ప్రతీక అని లోక్‌సభ సెక్రటేరియట్ ఆకాంక్షించింది.

- Advertisement -

నూతన పార్లమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనుండటం పట్ల తీవ్రస్థాయి రాజకీయ వివాదానికి దారితీస్తోంది. పార్లమెంట్ అంటే రాజ్యాంగానికి ప్రతిక. రాజ్యాంగానికి దేశ రాష్ట్రపతి కేంద్ర బిందువు.ఈ కోణంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ పార్లమెంట్ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కాదని ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా… తొలి దళిత మహిళా రాష్ట్రపతిని అవమానించడమేనని విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రపతి తరువాత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అర్హత లోక సభ స్పీకర్ కు లేదా రాజ్య సభ చైర్మన్ అయిన ఉప రాష్ట్రపతికి ఉంటుందని చెబుతున్నాయి.

అందరి కంటే ముందుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తరువాత క్రమేపీ ఇతర పార్టీల నేతలు కూడా ఇదే వాదన వినిపిస్తున్నాయి. అత్యున్నత స్థాయి రాజ్యాంగ అధినేత దీనిని ప్రారంభించాలి తప్పితే ప్రధాని కాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ క్రమంలో కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతితో చేయించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

ప్రధాని మోదీ ఇమేజ్‌ పెంచడం కోసం మర్యాదలు, నిబంధనలను పక్కన పెట్టేస్తున్నారని సీపీఐ నాయకుడు డీ రాజా విమర్శించారు. ఆయన కార్యనిర్వాహక వ్యవస్థకు అధిపతి కానీ.. శాసన వ్యవస్థకు కాదని రాజా అన్నారు. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని .. లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ ప్రారంభించాలని ఆయన కోరారు. మరోవైపు విపక్షాలతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా గొంతు కలిపారు. కొత్త భవనాన్ని ప్రజాధనంతో నిర్మించారు. కానీ ప్రధాని మోదీ తన స్నేహితులతో లేదా తమ నిధులతో దాన్ని నిర్మించినట్టు ప్రవర్తిస్తున్నారెందుకు అంటూ ఆయన ప్రశ్నించారు.

ఇక కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగానే జరగాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంట్… దేశ అత్యున్నత శాసన వ్యవస్థని… రాష్ట్రపతి ప్రభుత్వంతోపాటు , దేశ పౌరులందరి ప్రతినిధి అని ఖర్గే ట్వీట్ చేశారు. అలాగే దళితులు, గిరిజనులను కేవలం ఎలక్టోరల్స్ కు మాత్రమే బీజేపీ వాడుకుంటోందని ఖర్గే తన ట్వీట్ లో విమర్శించారు. భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కొత్త పార్లమెంట్ భవనానికి ఆహ్వానం ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. కొత్త పార్లమెంట్ భవనం… ప్రారంభానికి రాష్ట్రపతి ముర్ముకు బదులు… ప్రధాని మోదీని ఆహ్వానించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన బాణాలు ఎక్కుపెట్టింది. ఇది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, గిరిజన, వెనుకబడిన తరగతుల సమాజానికి తీరని అవమానమని ఆమ్ ఆద్మీపార్టీ అభివర్ణించింది.

మొత్తంగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ… విపక్షాలు లేవనెత్తిన అంశం వివాదాస్పదమవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాల నేతలు హాజరవుతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

మరోవైపు పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవ తేదీ కూడా వివాదాస్పదంగా మారింది. బీజేపీ, సంఘ్‌పరివార్ భావజాలానికి ప్రతీక అయిన సావర్కర్ జయంతి కూడా అదే రోజు కావడం మరో చర్చకు దారి తీస్తోంది. ఈ తేదీని కావాలనే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంచుకుని ఖరారు చేశారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ రోజునే ఎంచుకోవడం రాజ్యాంగంలోని కీలకమైన లౌకికతకు విరుద్ధం అని పేర్కొంటున్నాయి. అసలు సిసలు రాజ్యాంగ నిర్మాతలు, జాతినేతలు ఎందరినో విస్మరించి ఈ తేదీని ఎందుకు ఎంచుకున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా ఇప్పటికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపించలేదని విమర్శించాయి.

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం విషయంలో విపక్షాలు విమర్శిస్తున్నా… ఈ వివాదంపై స్పందించడానికి బీజేపీ నేతలు కానీ, కేంద్ర మంత్రులు కానీ ముందుకు రావడం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News