AP NEWS: పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర మీద మనసు పారేసుకున్నట్లు కనిపిస్తున్నారు.. జనసేన పార్టీ అధినేతగా, ఎన్నికల్లో గెలవకముందు, ఎన్నికల్లో గెలిచాక, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పిఠాపురం నియోజకవర్గం తరువాత ఎక్కువగా ఉత్తరాంధ్రలోనే పర్యటనలు చేపడుతున్నారు.. పవన్ కళ్యాణ్ పర్యటనలతోనే సరిపెట్టలేదు.. సొంత అన్న నాగబాబును ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా నియమించారు.. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు సమస్యలను తెరమీదకి తీసుకొచ్చి పరిష్కరిస్తున్నారు.. లా అండ్ ఆర్డర్ నుండి శాఖ ఏదైనా,సమస్య ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి తన మార్కు చూపిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేయడానికి అసలు కారణం ఏంటి? తన శాఖలకు సంబంధంలేని అంశాలు ఫోకస్ చేస్తూ రాజకీయ నాయకుల్లో అలజడి సృష్టించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి?.. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని గోదావరి జిల్లాల స్థాయిలోబలపరచడానికి పవన్ ప్లాన్ చేస్తున్నారా?
2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో 2014 ఎన్నికల్లో టిడిపి కూటమికి మద్దతు ఇచ్చారు.. ఆ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. మధ్యలోనే టిడిపి కూటమికి రామ్ రామ్ చెప్పిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేయడానికి నిర్ణయించుకుని ఉత్తరాంధ్రను ఎంచుకున్నారు.. విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఓటమి చెందినా కూడా ఎక్కడ నిరుత్సాహ పడకుండా పడిలేచిన కెరటంలా మళ్లీ తన పవర్ ఏంటో చూపించాలని విశాఖ కేంద్రంగానే భారీ ర్యాలీ చేపట్టి జనసేన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహంతో పాటు నమ్మకాన్ని నింపారు.. ఉత్తరాంధ్ర జనసేన పార్టీకి రాజకీయంగా బలమైన ప్రాంతం.. యువత, మధ్యతరగతి, ఉద్యోగ వర్గాల్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ ఇతర ప్రాంతాల కంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది.. 2024 ఎన్నికల్లో కూటమి విజయంలో ఉత్తరాంధ్ర కీలక పాత్ర పోషించింది.. ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ జనసేనని మరింత పటిష్టం చేయడమే పవన్ తొలి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన యాక్షన్ ప్లాన్ స్పష్టం చేస్తోందంటున్నారు
సీట్ల కోటా పెంచుకోవడానికి ఉత్తరాంధ్ర నుంచి కార్యాచరణ
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా చేస్తున్న ఆలోచనలు చూస్తే కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినా.. పార్టీ పరంగా రానున్న మూడేళ్లలో ఉత్తరాంధ్రను బలోపేతం చేసి 2029 ఎన్నికల్లో సీట్ల కోటా పెంచే ఆలోచన ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడుతున్నట్లు అర్థమవుతుంది.. జనసేన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలు కొండంత బలం.. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతం కావడంతో పవన్ కళ్యాణ్ కు ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయంగా ఎలాంటి ఢోకా లేదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది.. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచి రెండు జిల్లాల్లో కలిపి పోటీ చేసిన 11 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకున్నారు జనసేనాని..
యువత, మహిళ, గిరిజన ఓటర్లపై ఫోకస్
జనసేన పార్టీకి గోదావరి జిల్లాల తర్వాత అంతటి బలమున్న ప్రభావాన్ని చూపించగలిగిన ప్రాంతం ఉత్తరాంధ్ర.. ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసిన ఆరు చోట్ల ఎమ్మెల్యేలు గెలవడంతో పాటు హైయెస్ట్ ఓటింగ్ రావడంతో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో ఉన్న కాపు సామాజిక వర్గ ఓటర్లతో పాటు యువత, మహిళ, గిరిజన ఓటర్లను కూడా ఆకర్షించడానికి ఇప్పుడు ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది.. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఉత్తరాంధ్రలో తన మిషన్ స్టార్ట్ చేశారు.. ముఖ్యంగా గిరిజన ప్రాంత ఓటర్లను ఆకర్షించడానికి రెండు మూడు నెలలకు ఒకసారి ఉత్తరాంధ్ర ప్రాంత గిరిజన జిల్లాల్లో పర్యటించడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో అవసరమైన రోడ్లు, తాగునీరుని అడిగిన వెంటనే సాంక్షన్ చేయిస్తూ, పనులు పూర్తి చేసి జనసేన అంటే ఓ నమ్మకాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు..
గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ సీట్లు
దీంతోపాటు పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా అత్యంత కీలకమైన ఉత్తరాంధ్రకు ఆయన్ని పార్టీ ఇన్చార్జిగా చేయడంతో జనసేన పార్టీ ఉత్తరాంధ్రకు పవన్ కళ్యాణ్ కుటుంబం నుండి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంద.. ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో పర్యటనలు చేయడంతో పాటు ఉత్తరాంధ్రకు కీలకమైన నాయకులుగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.. దీనిని బట్టి చూస్తే రానున్న ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల తర్వాత ఎక్కువ సీట్లు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుండి తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు
ఇచ్చాపురం నుంచి ఇటు పాయకరావుపేట వరకు భారీ పరిశ్రమలు
పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రపై ఫోకస్ చేయడానికి కూడా పెద్ద ప్లానే కనిపిస్తుంది అనే ప్రచారం జరుగుతుంది.. ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ నగరం పోర్ట్ సిటీగా ఇండస్ట్రియల్ హబ్ గా ఐటీకి కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా మరింత ప్రాధాన్యత రోజురోజుకి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఉత్తరాంధ్రలో అటు ఇచ్చాపురం నుండి ఇటు పాయకరావుపేట వరకు భారీ పరిశ్రమలు, పోర్టుల అభివృద్ధి ఐటి కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ని అభిమానించే యువత ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉద్యోగాలతో పాటు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రపై పొలిటికల్ ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది.. విశాఖ నగరాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయ పవర్ సెంటర్ గా మార్చుకోవాలన్న వ్యూహంతోనే కీలకమైన జనసేన పార్టీ సమావేశాలను విశాఖ నగరంలో నిర్వహించడంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఎక్కువ ఫోకస్ పెడుతుండడంతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ మార్కును చూపించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఉత్తరాంధ్రని పవన్ సెంటర్‌గా మార్చుకునే ప్రయత్నం
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల పరంగా చూస్తే కూటమిలో ఉన్న టీడీపీకి బలమైన ప్రాంతాలుగా రాయలసీమ, గోదావరి జిల్లాలు ఉన్నాయి.. బీజేపీ కూటమిలో ఉన్నా ఓటు బ్యాంకు ఎన్నికలను ప్రభావితం చేసే అంతగా లేకపోవడంతో బిజెపి ప్రాధాన్యత ఏపీలో కనిపించదు.. అదే పవన్ కళ్యాణ్‌కు గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన ఆ ప్రాంతాలనుతన పవర్ సెంటర్ గా మార్చుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.. కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఆ గుర్తింపును నిలబెట్టుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకుని రాజకీయంగా మరింత బలపడాలనే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది..
ఉత్తరాంధ్రలో 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న వైసీపీ
దానికి తోడు గత ఎన్నికల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రలో వైసిపి కేవలం రెండు స్థానాలను మాత్రమే గెల్చుకుంది.. ఉత్తరాంధ్రలో వైసీపీ పాలనపై అసంతృప్తి చెందిన ప్రజలు కూటమిని గెలిపించారు కాబట్టి అధికారంలో ఉన్న మరో మూడేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాగా వేస్తే 2029 ఎన్నికలకు సిద్ధం కావచ్చు అని జనసేనాని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.. అందులో భాగంగానే ఉత్తరాంధ్రకు జనసేన పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందంట.. గిరిజన సమస్యల పరిష్కారం, భూ వివాదాలు, పరిశ్రమల్లో యాజమాన్యాల నిర్లక్ష్యం లాంటివి తెరమీదకి తీసుకొస్తూ కూటమి ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెడుతూనే తన మార్క్ రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.. ముఖ్యంగా గిరిజన పేదవర్గాలపై పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలోనూ మాట్లాడడమే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి గిరిజన ప్రజల కోసం, పేదల కోసం జనసేన పార్టీ నిత్యం పోరాటం చేస్తుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.. కేవలం ఎన్నికల సమయంలో హామీలుగా కాకుండా 2029 ఎన్నికలతో పాటు దీర్ఘకాల రాజకీయ వ్యూహాలను అమలుచేసి ఉత్తరాంధ్రను జనసేన కోటగా మార్చడమే టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారని ఆయన స్పీడ్ చూస్తే అర్థమవుతుంది
ఉత్తరాంధ్ర ఇష్యూలపై సీఎం సమక్షంలోనే ప్రస్తావనలు
కూటమిలో అధికార భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర సమస్యలను, అక్కడ చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను స్వయంగా సీఎం సమక్షంలోనూ, ప్రజా వేదికలపైన ప్రస్తావించడంతో కూటమి నాయకులకు కూడా మింగుడు పడడం లేదంట… ముఖ్యంగా కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని… అధికార పార్టీకి చెందిన అనేకమంది ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు భూకబ్జాల్లో భాగస్వాములు అవుతున్నారని సీఎం సమక్షంలోనే వ్యాఖ్యలు చేయడం పెద్ద రాజకీయ దుమారమే రేపింది..
Also Read: ఖమేనీ పని ఖతమేనా..? తగలబడుతున్న ఇరాన్ కారణాలు ఇవే!
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లాకు ఉన్న ఏకైక మంత్రి, హోం మినిస్టర్ వంగలపూడి అనితను టార్గెట్ గా చేస్తుండటం చర్చకు దారితీస్తుంది.. శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు ఉత్తరాంధ్రలో ఎక్కువగా జరుగుతుండడంతో వాటిని కంట్రోల్ చేయలేక పోలీసు వ్యవస్థ కూడా చేతులెత్తేస్తుందన్న ధోరణితో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం హోం మంత్రిని కార్నర్ చేయడానికే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. మొత్తంగా చూస్తే ఉత్తరాంధ్రపై పవన్ కళ్యాణ్ ఫోకస్ భావోద్వేగం మాత్రమే కాదు ఇది స్పష్టమైన రాజకీయ వ్యూహం అంటున్నారు.. పాలన ప్లస్ రాజకీయ లెక్కలు కలిసిన పవన్ స్ట్రాటజీ ఎంతవరకు ఫలిస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి.
Story By Ajay kumar, Bigtv