E-Paper
Advertisement

మనిషి పుట్టుకకు కారణం డైనోసార్ల చావేనా? శాస్త్రవేత్తలు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే!

మనిషి పుట్టుకకు కారణం డైనోసార్ల చావేనా? శాస్త్రవేత్తలు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే!
Advertisement

Dinosaur Extinction: డైనోసార్.. మనం చూడలేకపోయిన నిజం. నమ్మి తీరాల్సిన వాస్తవం. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఇదే భూమి మీద మనుగడ సాగించిన డైనోసార్లు.. ఆ కోట్ల ఏళ్ల క్రితమే అంతమైపోయాయ్. అయితే, ఇవాళ మనం స్మార్ట్ ఫోన్‌లో క్లిక్ చేసి.. ఇంటర్నెట్‌లో వాటి గురించి సెర్చ్ చేయగలుగుతున్నామన్నా, భూమిపై అత్యంత తెలివైన జీవులుగా చలామణీ అవుతున్నామన్నా.. దానికి కారణం ఆ డైనోసార్లే! ఎస్.. వాటి అంతమే.. మన ఆరంభానికి పునాది వేసింది. ఆరున్నర కోట్లకు పైగా సంవత్సరాల క్రితం జరిగిన ఆ మహా వినాశనం గురించి, దాని వల్ల మానవజాతికి జరిగిన మేలు గురించి పరిశోధకులు చేసిన రీసెర్చ్.. కళ్లు బైర్లుగమ్మే నిజాలను బయటపెట్టింది. అవే.. ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయ్.

శాస్త్రవేత్తలు వెలికితీసిన నిజాలు

6 కోట్ల 60 లక్షల సంవత్సరాల క్రితం.. 10 కిలోమీటర్ల వెడల్పున్న చీక్సూ లూబ్ అనే ఓ భారీ గ్రహశకలం.. డైనోసార్ల అంతానికి కారణమైంది. ఇది భూమిపై సగం జంతు జీవజాలాన్ని నాశనం చేసింది. ఆ ఘటనే.. చరిత్ర గతిని మార్చేసింది. అసలు.. ఆరోజున సరిగ్గా ఏం జరిగింది? అచ్చంగా.. దీనిమీదే దశాబ్దాలుగా పరిశోధన చేశారు యూకేకు చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైఖేల్ బెన్టన్, ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మోనికా గ్రేడీ. అంతేకాదు.. పాయింట్ టు పాయింట్.. టైమ్ లైన్ కూడా డిజైన్ చేశారు. మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలోనే.. ఆ ఆస్ట్రాయిడ్ పడింది. రాకాసి బల్లుల రాజ్యం అంతమైంది. చరిత్ర గతిని మార్చిన ఈ సంఘటన ఎలా జరిగిందో.. స్టెప్ బై స్టెప్ వివరించారు. అప్పుడేం జరిగిందో.. ఇప్పుడు చూద్దాం..

భూమిని కాల్చేసిన తొలి 30 సెకన్లు

Advertisement

10 కిలోమీటర్ల వెడల్పున్న చీక్సూ లూబ్ ఆస్ట్రాయిడ్ పడటానికి ఒక్క రోజు ముందు వింతైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయ్. ఆరోజు.. 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో.. వాతావరణం వెచ్చగా ఉంది. కొంచెం వర్షం పడటంతో.. అంతా తడితడిగా ఉంది. గ్రహశకలం భూమిని ఢీకొట్టిన రోజున.. ఆకాశం వైపు చూస్తే దూరంగా ప్రకాశవంతమైన వస్తువు ఒకటి భూమివైపు వస్తున్నట్లు కనిపించింది. అదే రోజు రాత్రి సమయంలో.. ఆకాశమంతా వెలుగుతో నిండిపోయింది. చెవులు చిల్లులు పడేలా భయంకరమైన పేలుడు శబ్దం వినిపించింది. ఓ భారీ గ్రహశకలం.. యుకాటన్ ప్రాంతాన్ని ఢీకొట్టింది. తొలి 30 సెకన్ల పాటు.. శబ్ద వేగానికి మించిన వేగంతో భీకర గాలులు వీచాయి. విపరీతమైన వేడి వెలువడింది. అక్కడి నుంచి 2 వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న జంతు జీవజాలమంతా మాడి మసైపోయింది.

భూమిపై నరకం ప్రారంభం

యుకాటన్ ప్రాంతాన్ని ఆస్ట్రాయిడ్ ఢీకొట్టిన 5 నిమిషాల తర్వాత.. ఆ ప్రాంత ఉష్ణోగ్రత ఒక్కసారిగా 227 డిగ్రీలకు పెరిగింది. వాతావరణమంతా బాగా వేడెక్కి ఆవిరితో నిండిపోయింది. 10 నిమిషాల తర్వాత.. భారీ భూకంపాలు సంభవించాయ్. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో తుపానులు చెలరేగాయి. 330 అడుగుల ఎత్తున రాకాసి అలలతో సునామీలు పోటెత్తాయి. విపరీతమైన వేడి భూమిని అతలాకుతం చేసింది. ఈ విలయానికి.. 3 వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతీది నాశనమైంది. ఇదంతా మొదలైన గంటలోనే.. భూమి చుట్టూ ధూళి మేఘం కమ్ముకుంది. చీకట్లు అలముకున్నాయ్. ఎక్కడో సుదూరంగా ఉన్న.. డెన్మార్క్, న్యూజిలాండ్ దాకా దీని ప్రభావం కనిపించింది.

డైనోసార్ల అంతం పూర్తి కథ

Advertisement

గ్రహశకలం సృష్టించిన విలయం, విధ్వంసం తర్వాతి రోజు.. ఆకాశం నుంచి అగ్ని కణాలు కురిశాయ్. అడవులన్నీ తగలబడిపోయాయ్. ధూళి మేఘం వల్ల.. సూర్యకాంతి క్షీణించడంతో.. ఉష్ణోగ్రతలు తగ్గడం మొదలైంది. ఒక వారం తర్వాత.. భూమి అంతటా చీకటి అలముకుంది. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయాయ్. వాతావరణం గడ్డకట్టుకుపోవడంతో మిగిలి ఉన్న రాకాసి బల్లులతో పాటు ఇతర జాతులు చనిపోయాయ్. అంతటా.. యాసిడ్ వర్షాలు కురిశాయ్. ఆస్ట్రాయిడ్ ఢీకొట్టిన తర్వాత సంభవించిన వాతావరణ మార్పులతో కమ్ముకున్న ధూళి ఏడాదైనా తొలగలేదు. భూమి అంతటా ధూళి, బూడిదతో నిండిపోవడం వల్ల.. ఏడాది వరకు సూర్యుడి జాడ లేకుండా పోయింది.

డైనోసార్ల మరణం.. మనిషి పుట్టుకకు కారణమైందా?

ప్రపంచంలో సగానికి పైగా వృక్ష జాతులు అంతరించిపోయాయ్. తర్వాత నెమ్మదిగా ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు చేరుకున్నాయ్. పదేళ్ల తర్వాత కూడా ప్రపంచం మొత్తం చలి గుప్పిట్లోనే ఉంది. చెరువులు, నదులు గడ్డకట్టిపోయాయ్. 15 ఏళ్ల తర్వాత.. పరిస్థితులు మెరుగుపడటం మొదలైంది. వినాశనం సంభవించిన ప్రాంతానికి చాలా దూరంగా తాబేళ్లు, చిన్నసైజు మొసళ్లు, పాములు, బల్లులు, కొన్ని జాతుల క్షీరదాలు మళ్లీ భూమిపై విస్తరించడం ప్రారంభించాయి. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత సంభవించిన డైనోసార్ల అంతం.. క్షీరదాల పరిణామ క్రమానికి, విస్తరణకు సాయపడింది. మన చరిత్రకు నాంది పలికింది. ఆ గ్రహశకలం ఢీకొనకపోయి ఉంటే.. వానరుల నుంచి నరుల పరిణామ క్రమం జరిగి ఉండేది కాదంటారు.

ఒక్క రోజు.. భూమి తలరాతను మార్చేసిన ఘటన

ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 16 కోట్ల సంవత్సరాల పాటు ఈ భూమిని ఏకఛత్రాధిపత్యంగా ఏలాయి డైనోసార్లు. ఆ రాక్షస బల్లుల ముందు నిలబడే శక్తి అప్పట్లో ఏ జీవికీ లేదు. కానీ, కాలమే వాటిని మింగేసింది. ఒక్క రోజు.. ఒకే ఒక్క రోజు జరిగిన ఆ ఘటన భూమి తలరాతను మార్చేసింది. ఆ ఆస్ట్రాయిడ్ భూమిని బలంగా ఢీకొట్టిన తర్వాత.. మొత్తం సీనే మారిపోయింది. కొన్ని వందల అణుబాంబులు ఒకేసారి పేలితే ఎంత శక్తి విడుదలవుతుందో.. అంతకన్నా ఎక్కువ విధ్వంసమే జరిగింది.

నిమిషాల్లోనే 80% జీవరాశి అంతం

గ్రహశకలం ఢీకొట్టిన కొన్ని నిమిషాల్లోనే.. వందల డిగ్రీల వేడి పుట్టి, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవులన్నీ మాడి మసైపోయాయ్. సముద్రాలు అల్లకల్లోలమై.. వందల అడుగుల ఎత్తున సునామీలు భూమిని ముంచేశాయ్. భూమి నుంచి లేచిన దుమ్ము, ధూళి, సల్ఫర్ ఆకాశాన్ని కమ్మేసి.. సూర్యరశ్మి భూమికి చేరకుండా అడ్డుకున్నాయి. దీనివల్ల కొన్ని నెలల పాటు భూమిపై న్యూక్లియర్ వింటర్ ఏర్పడింది. మొక్కలు నశించాయ్. వాటిని తినే శాకాహార డైనోసార్లు, ఆ తర్వాత మాంసాహార డైనోసార్లు ఆకలితో అలమటించి అంతమైపోయాయ్. మొత్తం భూగోళంపై ఉన్న జీవరాశిలో 80 శాతానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది.

క్షీరదాల ఎదుగుదలకు శ్రీకారం

డైనోసార్లు ఉన్నంత కాలం.. భూమిపై క్షీరదాల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. క్షీరదాలు అంటే.. పిల్లల్ని కని పాలిచ్చే జీవులు. ఇవి ఆ సమయంలో ఎలుకల పరిమాణంలో ఉండేవి. డైనోసార్లకు భయపడి అవి కేవలం రాత్రి పూట మాత్రమే బయటకు వచ్చేవి. అనుక్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతికేవి. వాటి ఎదుగుదలకు ఎక్కడా అవకాశం లేకుండా ఉండేది. కానీ, ఎప్పుడైతే డైనోసార్లు అంతరించిపోయాయో.. క్షీరదాలకు ఉన్న పెద్ద అడ్డంకులన్నీ తొలగిపోయాయ్. డైనోసార్ల అంతం.. ఈ ప్రకృతిలో ఓ భారీ ఎకోలాజికల్ వాక్యూమ్‌ని సృష్టించింది. ఆ ఖాళీని భర్తీ చేసేందుకు.. చిన్న క్షీరదాలు భూగర్భంలో నుంచి బయటకు వచ్చాయి. ఆహారం, స్థలం పుష్కలంగా దొరకడంతో.. అవి పరిణామ క్రమంలో వేగంగా విస్తరించాయ్. డైనోసార్లు చనిపోయాక భూమిపై వాతావరణం మళ్లీ సాధారణ స్థితికి ఏళ్లు పట్టింది. ఆ సమయంలో తట్టుకుని నిలబడిన చిన్న క్షీరదాలు.. కాలక్రమేణా పెద్ద జీవులుగా మారాయి.

ప్రకృతి రాసిన అద్భుత పరిణామ గాథ

ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతమయ్యాక.. క్షీరదాల మనుగడ పూర్తిస్థాయిలో మొదలైంది. ఐదున్నర కోట్ల ఏళ్ల తర్వాత.. చెట్లపై నివసించే కోతి లాంటి జీవులు ఆవిర్భవించాయ్. 2 కోట్ల ఏళ్ల తర్వాత.. తోకలు లేని మానవరూప కోతుల రూపాంతరం మొదలైంది. 3 లక్షల ఏళ్ల క్రితం నుంచే.. ఆధునిక మానవుడిగా పరిణామం చెందడం, మేధస్సు పెరగడం ప్రారంభమైంది. అంటే, ఆనాడు డైనోసార్లు అంతం కాకపోయి ఉంటే, క్షీరదాల పరిణామ క్రమం సాధ్యమయ్యేది కాదు. కోతులు, వాటి ద్వారా మానవుడు పుట్టేవాడే కాదు. ఇప్పుడు మనం నిర్మించుకున్న టెక్నాలజీ ప్రపంచం, వాడుతున్న ఇంటర్నెట్.. అసలు ఉనికిలోకే వచ్చేవి కావు. ప్రకృతి నియమం ప్రకారం.. ఏ జాతి కూడా భూమిపై శాశ్వతం కాదు. నాడు ప్రకృతి సృష్టించిన బీభత్సానికి డైనోసార్లు బలికావడం వల్లే.. ఈరోజు ప్రకృతిని శాసించే స్థాయికి మానవుడు చేరాడు. అనంత విశ్వంలో జరిగే కొన్ని అద్భుతాలు చరిత్రను పూర్తిగా మార్చేస్తుంటాయి. అలాంటి ఓ అద్భుతమే మానవ పరిణామానికి దారితీసింది.

మానవ నాగరికతకు కారణమైన ఆ ఒక్క ఢీకొట్టు

ఆ రోజు గనక ఆ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టకపోయినా, కొద్దిగా దిశ మారి భూమిని తప్పించుకున్నా.. ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేవి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. కీలక మార్పులు చోటు చేసుకొని ఉండేవి. మొట్టమొదటగా.. డైనోసార్ల సామ్రాజ్యం కొనసాగేది. అవి అంతరించిపోయే సమయానికి కూడా చాలా బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. కాబట్టి, ఆస్ట్రాయిడ్ పడకపోతే, అవి ఇంకొన్ని కోట్ల సంవత్సరాల పాటు భూమిపై అత్యంత శక్తివంతమైన జీవులుగా కొనసాగేవి. దీనికంటే మరో చేదు నిజమేమిటంటే.. మనుషులనే వారు పుట్టేవారే కాదు. డైనోసార్లు జీవించి ఉంటే, క్షీరదాలు ఎప్పటికీ పెద్ద జీవులుగా ఎదిగేవి కాదు. అవి కేవలం.. భూగర్భంలోనే దాక్కునే స్థాయిలోనే ఉండిపోయేవి. ఫలితంగా.. కోతులు, వాటి నుంచి మానవుల పరిణామం అసలు జరిగి ఉండేదే కాదు. ఈ రోజు భూమిని ఏలడానికి మనుషులనే జీవులే ఉండేవారు కాదు.

డైనోసార్లలోనే మేధో జీవులు పుట్టేవారా?

ఇంకొందరు శాస్త్రవేత్తల ప్రకారం.. డైనోసార్లలోనే మేధో జీవి పుట్టేదేమో? అనే ఆలోచనలు కూడా ఉన్నాయ్. ట్రూడాన్ లాంటి కొన్ని చిన్న రకం డైనోసార్లకు పెద్ద మెదడు, రెండు కాళ్లపై నడిచే సామర్థ్యం, వస్తువులను పట్టుకునే వేళ్లు ఉండేవి. కాలం కలిసొచ్చి.. కోట్ల సంవత్సరాల పరిణామంలో మనుషులలాగే డైనోసార్లలోనూ తెలివైన డైనోసాయిడ్ అనే మేధో జీవులు పుట్టి, సొంత నాగరికత నిర్మించుకునేవేమోననే అంచనాలు కూడా ఉన్నాయ్. ప్రకృతి సృష్టించిన ఆ ఒక్క ప్రమాదం.. డైనోసార్లకు శాపంగా మారినా, మానవజాతి పుట్టుకకు మాత్రం వరంగా మారింది. ఆ రోజు అంతరిక్షం నుంచి వచ్చిన ఆ ఆస్ట్రాయిడ్ భూమిని తాకింది కాబట్టే.. ఈరోజు ఆనాటి చరిత్రని తెలుసుకోగలుగుతున్నాం.

Also Read: చికెన్ నెక్ ముప్పుకు ఎండ్ కార్డ్.. డ్రాగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే భారత్ నిర్ణయం!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×