Green Card Holders: అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చిందంటే చాలు.. జీవితంలో ఇక సాధించాల్సింది ఏదీ లేదు అనేంతగా ఆనందిస్తారు చాలా మంది. ఒక విధంగా అది నిజం కూడా. గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో పర్మినెంట్ రెసిడెంట్ అయినట్లే లెక్క. ఉద్యోగం ఉన్నా లేకపోయినా అమెరికాలో హాయిగా జీవించడానికి వీళ్లు అర్హులు. అయితే, ఇప్పుడు వీళ్లను కూడా కలవరానికి గురిచేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. గ్రీన్ కార్డ్ హోల్డర్లను పరిశీలన పేరుతో కంగారు పెడుతున్నారు యూఎస్ అధికారులు. చిన్ని పొరపాట్లు ఉన్నా తరిమేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొందరినైతే బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని సమాచారం. ఇంతకీ, అమెరికాలో ఏం జరుగుతోంది..? గ్రీన్ కార్డ్ హోల్డర్లు టార్గెట్‌గా ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతోంది..? గ్రీన్ కార్డ్ హోల్డర్లు సేఫేనా..?
గ్రీన్ కార్డ్ హోల్డర్లే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం బెదిరింపులు
అమెరికాలో భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ టెన్షన్ పట్టుకుంది. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో భారీ మెజారిటీతో ట్రంప్ రెండోసారి దిగ్విజయం సాధించిన తర్వాత.. వలసదారుల్ని టార్గెట్ చేసింది ట్రంప్ ప్రభుత్వం. మొదటి స్టెప్‌లో.. అక్రమంగా అమెరికాలో ఉంటున్న విదేశీయుల్నీ వారి వారి దేశాలకు పంపించేస్తామనే పేరుతో.. సంకెళ్లు వేసి మరీ తరిమేశారు. ఇప్పుడు, ట్రంప్ ప్లాన్‌లో ఎవ్వరూ ఊహించని రెండో దశ ప్రారంభం అయినట్లుంది. అయితే, ఇది మరింత దారుణంగా అమెరికా చట్టాలను కూడా వ్యతిరేకించడం విశేషం. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
భారతీయులుపై ఈ ప్రభావం అధికం
అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చిందంటే అక్కడ శాస్వత నివాసానికి అనుమతి దక్కినట్లే..! అమెరికా పౌరులకున్న హక్కులే దాదాపు వీరికీ వర్తిస్తాయి. నిజానికి, అమెరికన్ డ్రిమ్‌లో గ్రీన్ కార్డ్ సాధించడమే తుది విజయమని అనుకుంటారు చాలా మంది వలసదారులు. అయితే, ఇప్పుడు ఆ కల మొత్తానికి ట్రంప్ ఎసరుపెడుతున్నారు. ట్రంప్ వలస విధానం వల్ల గ్రీన్ కార్డ్ హోల్డర్లు అమెరికాలో బట్టలు విప్పి తనిఖీ చేయించుకోవాల్సి వస్తోంది. కొన్ని నెలలు సొంత దేశంలో ఉండి, తిరిగి అమెరికా వెళ్తుంటే.. తీవ్రమైన విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎయిర్ పోర్ట్‌లోనే కఠినమైన పరిశీలనకు గురౌతున్నారు. ముఖ్యంగా, అమెరికా వలసదారుల్లో అధికంగా ఉన్న భారతీయులుపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
దశల వారీగా తనిఖీల సంఖ్యను పెంచుతూ ఇబ్బందులు
ఇటీవల, బయట నుండి యుఎస్‌కు తిరిగి వెళ్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లలో కొంతమందిని, యుఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు పలు మీడియా నివేదికలు వెల్లడించాయి. భారతీయులతో సహా గ్రీన్ కార్డ్ హోల్డర్లను ఎయిర్ పోర్టుల్లో రాత్రిపూట నిర్బంధిస్తున్నారనీ.. దశల వారీగా తనిఖీల సంఖ్యను పెంచుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆందోళనలు వస్తున్నాయి. దీనికి తోడు.. ఇటీవల, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సహా అమెరికాలోని అగ్ర రాజకీయ నాయకులు కొందరు.. గ్రీన్ కార్డ్ హోల్డర్లకు యుఎస్‌లో ఉండటానికి నిరవధిక హక్కు లేదంటూ సంచలన కామెంట్లు చేశారు.
యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) ప్రకారం..
అమెరికా ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే వారిని బహిష్కరించే హక్కు ఉందని కూడా హెచ్చరించారు. ఈ మాటను కేవలం వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మాత్రమే కాదు.. ఆయన భార్య, భారతీయ-అమెరికన్ అయిన ఉషా బాలా చిలుకూరి వాన్స్ కూడా చెప్పడం విశేషం. నిజానికి, గ్రీన్ కార్డ్‌ని అధికారికంగా శాశ్వత నివాసానికి అర్హతగా చెబుతారు. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్-USCIS ప్రకారం.. ఒక వ్యక్తి యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వతంగా నివసించడానికి, పని చేయడానికి ఈ కార్డ్ అనుమతి ఇస్తుంది. అయినప్పటికీ.. గ్రీన్ కార్డ్ హోల్డర్లపై ఎందుకు ఎక్కువ పరిశీలన జరుగుతోందనేది ఇప్పుడు ఆందోళనకు కారణం అవుతోంది.
భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లలో ఎక్కువ ఆందోళన
ప్రస్తుతం, అమెరికాలో ఎవరెవరికి గ్రీన్ కార్డ్ ఉందీ అనే దానిపై యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇది ముఖ్యంగా భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లను ఎక్కువ ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.. ఇటీవల, ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్‌ను ఎయిర్ పోర్టులోనే బట్టలు ఊడదీసి, నిర్బంధించారనే వార్త వైరల్ అయ్యింది. ఈ క్రమంలో, “సెకండరీ తనిఖీలు”, “హింసాత్మక విచారణలు” జరుగుతున్నాయని, మీడియా నివేదికలు రావడంతో భయం ప్రారంభమైంది. ఇలాంటి ఒక కేసు ఇటీవల సంచలనంగా మారింది. ఫాబియన్ ష్మిత్ అనే ఒక జర్మనీ జాతియుడు 2023లో చట్టబద్ధంగా తన గ్రీన్ కార్డ్‌ను రెన్యూవల్ చేయించుకున్నారు.
ష్మిత్‌పై మాదక ద్రవ్యాల ఆరోపణలున్నాయన్న అధికారులు
అయితే, అతని గ్రీన్ కార్డ్ స్టేటస్‌ను.. ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించలేదు. ఎక్కడికో వెళ్లి అమెరికా తిరిగొచ్చిన అతన్ని ఎయిర్ పోర్ట్‌లోనే నిర్బంధించారు. అతని తల్లి చెప్పిన వివరాలకు మేరకు.. ష్మిత్‌ని నగ్నంగా మార్చి, హింసాత్మకంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అతడు మందులు తీసుకోడానికి కూడా అధికారులు నిరాకరించారు. పైగా, ఐస్ వాటర్‌తో స్నానం చేయించి మళ్లొకసారి విచారించారని ష్మిత్ తల్లి ఆస్ట్రిడ్ సీనియర్ మీడియాకు వెల్లడించారు. అయితే, ష్మిత్ గ్రీన్ కార్డ్‌ను ఎందుకు నిరాకరించారనే విషయం యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు. అయితే, ష్మిత్‌పై మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు సీబీపీ అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా, ష్మిత్ గ్రీన్ కార్డ్‌ను రద్దు చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి.
ఒక వృద్ధ భారతీయుల జంటను ఇలాగే కఠిన పరిశీలన
ఇక, మరో సందర్భంలో.. గ్రీన్ కార్డులు ఉన్న సీనియర్ సిటిజన్లను కూడా అమెరికా అధికారులు టార్గెట్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అమెరికా ఎయిర్ పోర్ట్‌లో ఒక వృద్ధ భారతీయుల జంటను ఇలాగే పరిశీలన పేరుతో బాగా ఇబ్బంది పెట్టారనే వార్తలు వచ్చాయి. వీళ్లకు కూడా యుఎస్ నుండి ఇండియాకు వచ్చి, కొన్ని నెలల తర్వాత అమెరికా వెళ్లగా ఎయిర్ పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురయ్యింది. తరచుగా భారతదేశాన్ని సందర్శించే ఇలాంటి వారిని సీబిపి అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం ఉంది. ఇలాంటి వారిని, స్వచ్ఛందంగా వారి శాశ్వత నివాసాన్ని కోల్పోవడానికి ఫారమ్ I-407పై సంతకం చేయమని బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వారు అమెరికాలో నివాసాన్ని ‘వదిలివేసినట్లు’ ఆరోపణ
అయితే గ్రీన్ కార్డ్‌లు ఉన్న భారత సంతతికి చెందిన సీనియర్ సిటిజన్లు.. సాధారణంగా శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండదని భారతదేశానికి వస్తుంటారు. అమెరికాలో చలి తగ్గిన తర్వాత తిరిగి వెళ్తుంటారు. అయితే, ఇప్పుడు అలా వెళ్లిన వారిని స్య్కూటినీ పేరుతో ఇబ్బందిపెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే, భారతదేశానికి చెందిన ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు.. ఒత్తిడిలో కూడా తమ గ్రీన్ కార్డ్‌లను అప్పగించవద్దని హెచ్చరిస్తున్నారు. “ఒక వ్యక్తి ‘స్వచ్ఛందంగా’ ఫారం I-407లో సంతకం చేయకపోతే సరిహద్దులో అధికారులు గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయలేరు. నిజానికి, అమెరికా బయట 365 రోజులకు పైగా ఉంటే, వారు అమెరికాలో నివాసాన్ని ‘వదిలివేసినట్లు’ ఆరోపణలు రావచ్చు. కానీ, ఇలాంటి పరిస్థితిలో వాళ్లు కోర్టును ఆశ్రయించవచ్చు. కాదని, ఎయిర్ పోర్టులో లొంగిపోతే, వాళ్లకు గ్రీన్ కార్డ్ రద్దు అవుతుంది.
“పబ్లిక్ ఛార్జ్” అనే విధానం కఠినంగా అమలు
నిజానికి, ట్రంప్ ప్రభుత్వం “అమెరికన్లు ఫస్ట్” అనే నినాదాన్ని బలంగా అమలు చేయడానికి కంకణం కట్టకుంది. అందుకే, గ్రీన్ కార్డ్ హోల్డర్లపై కఠిన చర్యలు కూడా ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో భాగంగానే చూడాలి. ట్రంప్ మొదటి సారి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు.. వలసదారులు పర్మినెంట్ రెసిడెన్స్ అర్హత సాధించడాన్ని కష్టతరం చేయడానికి “పబ్లిక్ ఛార్జ్” అనే విధానాన్ని కఠినంగా అమలు చేశారు. కాగా, ప్రస్తుత పాలనలో సీబిపి అధికారులు దీని అమలుపై మరింత దూకుడుగా వ్యవహరించడానికి అధికారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
గ్రీన్ కార్డ్ రద్దు అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ
అందుకే, ఈసారి, గ్రీన్ కార్డ్ హోల్డర్లలో భయం మరింత పెరిగింది. వాస్తవానికి, గ్రీన్ కార్డ్ రద్దు అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ. గ్రీన్ కార్డు ఉన్న ఒక వ్యక్తి వలస చట్టాలను ఉల్లంఘించాడని అమెరికా ప్రభుత్వం నిర్ధారించినప్పుడు.. చట్టపరంగా దాన్ని రద్దు చేయొచ్చు. అయితే, ఇప్పుడు నడుస్తున్న ప్రక్రియ దానికి విరుద్ధంగా.. నిరంకుశంగా మారిందన్నది అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్న అంశం.
అసలు గ్రీన్ కార్డ్‌ను ఏయే సందర్భాల్లో రద్దు చేయొచ్చు..?
అమెరికాలో ఎంతో మంది వలసదారులు ఉంటే భారతీయులకు మాత్రమే ఇంత ఆందోళన ఎందుకు..? అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అలాగే గ్రీన్ కార్డ్ అనేది ఒక హక్కు కదా.. దాన్ని అధికారులు ఎలా రద్దు చేస్తారనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇది అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ పాలన. ఇక్కడ చిన్న అవకాశం దొరికినా.. తరిమేయడానికి ట్రంప్ ప్రభుత్వం రెడీగా ఉంది. అందులోనూ.. అమెరికాలోని వలసదారుల మొత్తంలో భారతీయులు రెండో స్థానంలో అత్యధికంగా ఉన్నారు. అందుకే, ట్రంప్ కన్ను భారతీయులపై పడింది. అయితే, రాత్రికి రాత్రే వీళ్ల గ్రీన్ కార్డులు రద్దు చేయడం అంత సులువా..? అసలు గ్రీన్ కార్డ్‌ను ఏయే సందర్భాల్లో రద్దు చేయొచ్చు..? అలా రద్దు కాకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి..?
వలస చట్టాలను ఉల్లంఘిస్తేనే గ్రీన్ కార్డు రద్దు
యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. గ్రీన్ కార్డ్ హోల్డర్లు అనేక కారణాల వల్ల వారి చట్టబద్ధమైన పర్మినెంట్ రెసిడెంట్ హోదాను కోల్పోయే అవకాశం ఉంది. అయితే, గ్రీన్ కార్డ్ రద్దు అనేది అమెరికా ప్రభుత్వం వలస చట్టాల ఉల్లంఘనను నిర్ధారించినప్పుడు మాత్రమే జరిగే చట్టపరమైన ప్రక్రియ. ఇది సాధారంగా జరిగే తనిఖీలు, చట్ట అమలులో భాగంగా చేసే దర్యాప్తులు, విజిల్‌బ్లోయర్‌ల ద్వారా జరుగుతుంది. ఉదాహరణకు.. యూఎస్ గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఆరు నెలలకు పైగా విదేశాల్లో ఉంటే.. వాళ్లు తిరిగి అమెరికాకు వచ్చినప్పుడు వాళ్లను ప్రశ్నించవచ్చు.
తరచుగా ఎక్కువ కాలం అమెరికా బయట ఉంటే హెచ్చరికలు
అయితే, రీ-ఎంట్రీ పర్మిట్ లేకుండా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం బయట ఉంటే.. వాళ్లు, INA 101(a)(13)(C) కింద ఆటోమేటిక్‌గా వారి హోదాను కోల్పోయే అవకాశం ఉంది. ఇక, రీ-ఎంట్రీ పర్మిట్ ఉన్నప్పటికీ, తరచుగా ఎక్కువ కాలం అమెరికా బయట ఉన్నా కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయొచ్చు. సరిగ్గా, ఇదే పాయింట్‌ని ప్రస్తుతం అమెరికన్ అధికారులు అవకాశంగా మార్చుకున్నారు. స్వదేశాల్లో ఎక్కువ కాలం గడిపే చాలా మంది వృద్ధుల గ్రీన్ కార్డ్‌లను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ పోర్టుల్లోనే వారి పర్మినెంట్ రెసిడెంట్ కార్డును అప్పగించమని ఒత్తిడి చేస్తున్నారు.
జాతీయ భద్రతా సమస్యలను కారణంగా చూపి గ్రీన్ కార్డ్ రద్దు
ఇక, మరొక ప్రధాన ప్రమాద అంశం పరిశీలించాలి. ఒక వేళ గ్రీన్ కార్డును రద్దు చేయాల్సి వస్తే.. జాతీయ భద్రతా సమస్యలను కారణంగా చూపి కూడా అధికారులు అలా చేయొచ్చు. INA 237(a)(4)(B) కింద, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారనో.. లేదంటే, పాల్గొనే అవకాశం ఉందనే ఆరోపణలు ఉంటే.. గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణకు గురవుతారు. ఇలాంటి సందర్భంలో.. వారి క్రైమ్ రికార్డులు, మోసపూరిత ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలు కూడా చాలా మందిని ప్రమాదంలో పడేస్తాయి.
తీవ్రమైన నేరాలు, గృహ హింసకు సంబంధించిన నేరాలు
అలాగే, నైతికత లేకపోవడం, మాదకద్రవ్యాల నేరాలు, తీవ్రమైన నేరాలు, గృహ హింసకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వారి హోదా కూడా INA 237(a)(2) ప్రకారం తొలగించవచ్చే. అయితే, ఈ ఇలాంటి పరిస్థితుల్లో.. చట్టాన్ని దాటి ఏ చిన్న ఉల్లంఘన బయటపడినా.. అమెరికాలో వారి నివాసాన్ని రద్దు చేస్తారనే భయంలో గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
గ్రీన్ కార్డులు ఉన్న విదేశీయుల్లో భారతీయులే ఎక్కువ
అయితే, గ్రీన్ కార్డ్ రద్దు గురించి భారతీయులు ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే.. అమెరికాలో గ్రీన్ కార్డులు ఉన్న విదేశీయుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. పర్మినెంట్ నివావం ఉన్న రెండవ అతిపెద్ద సమూహం భారతీయులే. ఉపాధిపై ఆధారపడిన వర్గాల్లో పది లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు ప్రస్తుతం అమెరికా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో.. గ్రీన్ కార్డ్‌లకు సంబంధించిన ఇంత తీవ్రమైన స్క్రూటినీ జరిగితే.. ఇంత భారీ సంఖ్యలో ఉన్న వారిలో చాలా మందిని బహిష్కరించే అవకాశం ఉంది.
గ్రీన్ కార్డులు ఎప్పుడైనా రద్దు చేయవచ్చనే భయాలు
అందుకే, ప్రస్తుత పరిస్థితుల్లో.. చట్టబద్ధమైన శాశ్వత నివాసం చాలామంది ఊహించినంత సురక్షితం కాదనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధిచి తీవ్రమైన చర్చలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా, సిటిజన్‌షిప్ కాకుండా గ్రీన్ కార్డులను ఎలా రద్దు చేస్తారనే దానిపై సూచనలు, సలహాలు విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే, ప్రస్తుతం, NRIలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ.. గ్రీన్ కార్డులను అమెరికా విదేశాంగ శాఖ ఏ కారణం చూపి అయినా, ఎప్పుడైనా రద్దు చేయవచ్చనే భయాలు పెరిగాయి.
అమెరికాలో 20,80,000 మంది భారతీయులకు గ్రీన్ కార్డ్‌లు
ప్రస్తుతం అమెరికాలో 20 లక్షల 80 వేల మంది భారతీయులకు గ్రీన్ కార్డ్‌లు ఉన్నాయి. ఒక్క 2024లోనే 50 వేల మంది భారతీయులకి గ్రీన్ కార్డులు మంజూరయ్యాయి. ఆ ఏడాది వచ్చిన గ్రీన్ కార్డుల్లో ఇది 6 శాతానికి పైగానే ఉంది. ఇక, గ్రీన్ కార్డు పొందడం కోసం అమెరికాలో పుట్టిన వాళ్లలో పది దేశాల నుండి 54 శాతం మంది ఉండగా వారిలో… 7 శాతం వాటా భారత్‌కు ఉంది. 15 శాతం వాటాతో ఇందులో మెక్సికో ముందుండగా.. 7 శాతంతో క్యూబా, భారత్‌లు తర్వాతి స్థానంలో ఉన్నాయి. అలాగే, అమెరికా గ్రీన్ కార్డుల్లో 2023 సంవత్సరానికి మొత్తం 10 లక్షల 20 వేల గ్రీన్ కార్డులు ఇవ్వగా… అందులో, 7శాతం భారతీయుల వాటా ఉంది.
ఐదు దేశాలకు చెందిన శరణార్థులు 53 శాతం ఉంటే…
ఇక, 2020 నుండి 2023 వరకూ అమెరికాలో చదువుతున్న కాలేజ్ గ్రాడ్యుయేట్‌లలో 87 శాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. ప్రస్తుతం, అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారిలోనూ 2 లక్షల 91 వేల మందితో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. అంతేకాదు.. అమెరికాలో శరణార్థులుగా ఉండటం కోసం దరకాస్తు చేసుకున్న వారిలో.. భారత్ ఐదవ స్థానంలో ఉంది. ఐదు దేశాలకు చెందిన శరణార్థులు 53 శాతం ఉంటే అందులో భారత్ వాటా 5 శాతం ఉంది. ఇప్పుడు, వీళ్లలో చాలా మంది గ్రీన్ కార్డులు వస్తాయని ఆశపడుతుంటే.. గ్రీన్ కార్డులు ఉన్నవాళ్లు పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుత ఆందోళనల మధ్య గ్రీన్ కార్డుకు ఎక్కడ రెడ్ సిగ్నల్ పడుతుందనే భయం అందిరిలోనూ నెలకొంది.
రాత్రికి రాత్రే గ్రీన్ కార్డ్ రద్దు అంత సులువు కాదు
అయితే, అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్ల అందరికీ థ్రెట్ ఉందా అంటే.. కచ్ఛితంగా కాదు. రాత్రికి రాత్రే గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయడం కూడా అంత సులువేమీ కాదు. ఎందుకంటే, ముందుగా చెప్పుకున్నట్లు గ్రీన్ కార్డ్ రద్దు చేయాలంటే.. దానికి చట్టబద్దమైన ప్రక్రియ ఒకటి ఉంది. ట్రంప్‌తో సహా ఏ అధ్యక్షుడు కూడా చట్టపరమైన చర్య లేకుండా ఒకరి గ్రీన్ కార్డ్‌ను తొలగించలేరు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అండ్ ఇమ్మిగ్రేషన్ కోర్టులు ఈ విషయాలను పర్యవేక్షిస్తాయి.
హక్కు కోసం ఇమ్మిగ్రేషన్ న్యాయవాదితో మాట్లాడటం మంచిది
అలాగే, గ్రీన్ కార్డ్ హోల్డర్లకు.. ఇమ్మిగ్రేషన్ జడ్జి ముందు తమను తాము సమర్థించుకునే హక్కు ఉంటుంది. గ్రీన్ కార్డు ఉన్నవారు, తమ రెసిడెన్సీని సరిగ్గా నిర్వహించుకుని, చట్టాన్ని సక్రమంగా పాటిస్తే.. వారి గ్రీన్ కార్డ్ హోదాకు ఎలాంటి ప్రమాదం లేదు. కానీ, గతంలో ఎలాంటి సమస్యలున్నా.. లేదంటే, వారి ప్రయాణాల గురించి ఖచ్చితమైన సమాచారం తెలియకపోతే.. అలాంటి వారు.. వారి హక్కు కోసం ఇమ్మిగ్రేషన్ న్యాయవాదితో మాట్లాడటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
గ్రీన్ కార్డు హోల్డర్లు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి
ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈ పరిణామాల నేపధ్యంలో.. భారత సంతతికి చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్లు.. వారి హోదాను కాపాడుకోడానికి కొన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ కార్డు ఉన్న వాళ్లు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా.. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ఉంటే, వెంటనే న్యూట్రలైజ్ ప్రాసెస్‌ని ప్రారంభించాలి. అలాగే, చట్ట ప్రకారం.. స్పష్టమైన రికార్డులు ఉంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అవి, యూఎస్ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
అమెరికా నుండి ఎక్కువ రోజులు బయట ఉండొద్దు
ఇక, అమెరికా నుండి ఎక్కువ రోజులు బయట ఉండటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇంకా ఏవైనా ఇబ్బందుల ఉంటే.. వెంటనే ఇమ్మిగ్రేషన్ న్యాయవాదిని సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే, అమెరికాలో అనూహ్యంగా మారుతున్న పాలసీలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ.. జరిగే మార్పుల గురించి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు.