Trump – Trudeau: కెనడా కథ మారింది.. కెనడా రాజకీయాల్లో సంచలన ట్విస్ట్ ఏర్పడింది. త్వరలో ఎన్నికలకు వెళ్లబోతున్న తరుణంలో ప్రస్తుత ప్రధాని జస్టీన్ ట్రూడో రాజీనామా ప్రకటించారు. మూడు పర్యాయాలు కెనడాను పాలించిన లిబరల్ పార్టీకి కొత్త నాయకుడు రానున్నారు. పదివి కాపాడుకోడానికి యాంటీ-ఇండియా స్టాండ్ తీసుకున్నప్పటికీ.. ట్రూడో తలరాత మారలేదు. పైగా.. గోతికాడ నక్కలా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కాచుకొని కూర్చున్నారు. కెనడాను యూఎస్‌లో 51వ స్టేట్‌గా చేసుకుంటానని ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు కెనడా పరిస్థితి ఏంటీ..? అసలు, ట్రూడ్ ఫేట్ మారడానికి కారణాలేంటీ..? ట్రూడో రాజీనామాతో వచ్చే మార్పులేంటీ..?
జనవరి 6న మీడియా సమావేశంలో ట్రూడో ప్రకటన
భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్థానీ వేర్పాటు వాదులను చంకనెత్తుకొని.. ఇటీవల కాలంలో భారత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కథ అడ్డం తిరిగింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి కూడా వైదొలగుతున్నట్లు తెలిపారు. ఇక, పార్టీకి తదుపరి నాయకుడిని ఎంపిక చేసుకునే వరకూ ప్రధాని పదవిలో కొనసాగుతానని వెల్లడించారు.
మార్చి 24వ తేదీ వరకూ పార్లమెంట్ స్థంభన
ఇక, పార్టీ పదవితోపాటు ప్రధాని బాధ్యతలు చేపట్టడానికి లిబరల్ పార్టీలో ప్రాసెస్ మొదలవనుంది. ‘కొత్త నేతను పార్టీ ఎన్నుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవితో పాటు, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు.. జనవరి 6న మీడియా సమావేశంలో ట్రూడో పేర్కొన్నారు. అంతేకాదు కొత్త నేతను ఎన్నుకునేదాకా కెనడా పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, మార్చి 24వ తేదీ వరకూ పార్లమెంట్ స్థంభన కొనసాగనుంది.
2013 నుండి లిబరల్ పార్టీకి ట్రూడో నాయకత్వం
రైడ్యూ కాటేజ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రూడో తన నిర్ణయాన్ని వెల్లడించారు. “తన కుటుంబంతో విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు” చెప్పారు. ట్రూడో 2013 నుండి లిబరల్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 2015 నుండి ప్రధానమంత్రిగా ఉన్నారు. కాగా, ఈ రాజీనామా ట్రూడో సుదీర్ఘ పదవీకాలం తర్వాత ఆయనపై వచ్చన వ్యతిరేకతకు అద్దం పడుతుంది. 53 ఏళ్ల ట్రూడో పాలనపై కొంత కాలంగా కెనడా వాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ట్రూడో రాజకీయ ప్రయాణంలో కూడా తీవ్రమైన ఆటుపోట్లు ఎదురయ్యాయి.
తీవ్రంగా దెబ్బతిన్న భారత్, కెనడా ద్వైపాక్షిక సంబంధాలు
రాజీనామా చేయాలని సొంత పార్టీ ఎంపీల నుంచి గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. 2015లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ట్రూడో ఇటీవలి కాలంలో దేశీయంగా, అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలయ్యారు. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని నిరాధార ఆరోపణలు చేసిన తర్వాత.. ట్రూడో గ్రాఫ్ మరింత దిగజారింది. దీంతో భారత్, కెనడా ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనిపై, సొంత పార్టీలోనే గాక.. అటు ప్రతిపక్షం నుండి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కున్నారు.
ట్రూడోతో ఎప్పుడూ సత్సంబంధాలు లేని ట్రంప్
ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్ కూడా ట్రూడో రాజీనామాపై ఒత్తిడి తెచ్చారనే చెప్పాలి. ట్రూడోతో ఎప్పుడూ సత్సంబంధాలు లేని ట్రంప్, తన మొదటి పాలనా కాలం నుండి కూడా ట్రూడో పాలనపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. డ్రగ్స్, అక్రమ వలసలను కెనడా కట్టడి చేయకపోతే, ఆ దేశంపై 25 శాతం పన్ను విధిస్తామని హెచ్చరించారు. దీంతో జస్టిన్ ట్రూడోపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇటీవల ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన క్రిస్టియా ఫ్రీలాండ్ కూడా ప్రధాని ట్రూడో ఆర్థిక విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు.
ట్రూడో వివిధ విధాన నిర్ణయాలపై విమర్శలు
ఇటీవల జరిగిన సర్వేల్లోనూ ట్రూడోకు ఉన్న జనాదరణ భారీగా తగ్గిపోయింది. ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీవైపు 47 శాతం ప్రజలు మొగ్గు చూపితే, కేవంల 21 శాతం మంది మాత్రమే లిబరల్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అలాగే, ఇటీవలి నెలల్లో, ట్రూడోకు ఆమోదం రేటింగ్‌లు క్షీణించాయి. రాజకీయ గందరగోళం, డిప్యూటీ పీఎం క్రిస్టియా ఫ్రీలాండ్ లాంటి సన్నిహిత మిత్రుల రాజీనామాల కారణంగా కేవలం 19%కి ట్రూడో సపోర్ట్ పడిపోయింది. ఇక, ట్రూడో వివిధ విధాన నిర్ణయాలపై విమర్శలు పెరిగాయి. ముఖ్యంగా, వాతావరణ మార్పుతో పాటు ట్రూడో ఆర్థిక వ్యూహాలు… పార్టీ సభ్యులను, నియోజకవర్గాలను దూరం చేసాయి.
SNC-లావలిన్ వ్యవహారం, WE ఛారిటీ కుంభకోణం
ఇక, ట్రూడో పదవీ కాలంలో రాజకీయ కుంభకోణాలు కూడా రాజీనామాలో కీలక పాత్ర పోషించాయి. SNC-లావలిన్ వ్యవహారం, WE ఛారిటీ కుంభకోణం ట్రూడో విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఉన్నతాధికారుల న్యాయ పరిశీలనలో రాజకీయ జోక్యానికి ట్రూడోపై విమర్శలు వచ్చాయి. అలాగే, ఛారిటీ సభల్లో మాట్లాడటానికి ఆర్థిక ప్రయోజనాలను పొందారనే ఆరోపణలతో ట్రూడో నిజాయితీపై మచ్చ పడింది. ఈ రెండు సంఘటనలు రాజకీయంగా వివాదాలకు దారితీసింది. దీనికి తోడు, దేశం ఆర్థిక సమస్యలతో నలిగిపోయింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తీవ్రమైన గృహ సంక్షోభం, పెరుగుతున్న జాతీయ రుణం.. అన్నీ కలిసి ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి.
ఓట్ల కోసం దేనికైనా రెడీ అనేట్లు ట్రూడో వ్యవహారశైలి
మరోవైపు, స్వదేశీ సంబంధాల్లోనూ ట్రూడో విఫలం అయ్యారు. స్వదేశీ కమ్యూనిటీలతో సయోధ్య గురించి ప్రసంగాలు చేసినప్పటికీ.. ట్రూడో చర్యలు మాత్రం దానికి తగ్గట్లు కనిపించలేదు. తన పదవి కాపాడుకోడానికి, భారత వ్యతిరేక ఖలిస్తానీ తీవ్రవాద శక్తులను బుజ్జగించడం నుండి.. ఓట్ల కోసం దేనికైనా రెడీ అనేట్లు ట్రూడో వ్యహరించారు. ట్రూడో ప్రచారం చేసుకున్న ప్రగతిశీల రూపం మసకబారింది. దేశంలో సాధారణ ప్రజానికం నుండి డిస్‌కనెక్ట్ అయ్యారనే భావన అందరిలోనూ పెరిగింది.
ట్రూడోకు వ్యతిరేకంగా పోల్ సంఖ్యలు
ఇక, ట్రూడోపై నానాటికీ పెరుగుతూ వచ్చిన వ్యతిరేకత వల్ల… అంతర్గతంగా పార్టీ నుండి ఒత్తిడి పెరిగింది. బహిరంగంగా, ప్రైవేట్‌గా చాలా మంది లిబరల్ ఎంపీలు.. ట్రూడోను రాజీనామా చేయాలని కోరారు. నాయకత్వ మార్పు కోసం పిలుపునిచ్చారు. అలాగే, పోల్ సంఖ్యలు కూడా ట్రూడోకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ప్రతిపక్ష పియరీ పోయిలీవ్రే నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ల కంటే అధికార లిబరల్ పార్టీ వెనుకబడింది. మరోవైపు, కెనడా ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అయ్యింది. ముఖ్యంగా, భారత్, చైనాతో కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెనడా దౌత్యపరంగా బలహీనంగా మారింది. అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగింది.
దౌత్యపరంగా బలహీనంగా మారిన కెనడా
అటు, అమెరికా నుండి ట్రంప్ కూడా ట్రూడోపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ ప్రధానిలా కాకుండా.. యూఎస్‌లోని ఒక రాష్ట్రానికి గవర్నర్ అనే ధోరణిలో ట్రూడోను పేర్కొన్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశమైన కెనడా ప్రధానిని ట్రంప్ అలా వ్యవహరించడం ట్రూడో చేతగాని తననానికి నిదర్శనంగా నిలిచింది. ప్రతిపక్ష పార్టీలతో పాటు కెనడా ప్రజలు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అందుకే.. తన రాజీనామా ప్రకటనలో ట్రూడో ఒక కీలక వ్యాఖ్య చేశారు. “దేశ అంతర్గత పోరాటాల్లో తాను ఉత్తమ ఎంపిక కాదని స్పష్టం అయ్యిందనీ.. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో కెనడా ప్రజలు నిజమైనదాన్ని ఎంచుకోవాలని కోరారు.
కెనడా తదుపరి ప్రధాని రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు
అయితే, జస్టిన్ ట్రూడో వైదొలిగిన తర్వాత, కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ఇద్దరు భారత సంతతి నేతల పేర్లూ వినిపిస్తున్నాయి. ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్‌తో పాటు భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, జార్జ్ చాహల్ లిబరల్ పార్టీ లెజిస్లేటీవ్ కాకస్‌లో తాత్కాలిక మెంబర్ కావడం వల్ల ఆయన ప్రధానిగా పోటీ చేయలేరు.
రేసులో అనిత ఆనంద్‌కు అవకాశం
కాబట్టి, రేసులో అనిత ఆనంద్‌కు అవకాశం ఉంది. అయితే, కెనడాలో ముందస్తు ఎన్నికలు రాకపోతే.. అక్టోబర్‌లోనే షెడ్యుల్ అవ్వొచ్చు. మే నెల కంటే ముందు మాత్రం ఎన్నికలు సాధ్యం కాకపోవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతం కెనడా కథ మారిందనే చెప్పాలి. అయితే, కొన్ని రోజుల్లో అమెరికా గద్దెనెక్కుతున్న ట్రంప్ కెనడాను యూఎస్‌లో కలుపుకుంటారా లేదో చూడాలి. అలాగే, భారత్‌తో కెనడా సంబంధాలు మెరుగుపడతాయా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది.
జనవరి 8న నిర్వహిచబోయే జాతీయ కాకస్ సమావేశం
2015లో లిబరల్ పార్టీ గెలుపు తర్వాత కెనడా పురోగతికి జస్టీన్ ట్రూడో టార్చ్ బేరర్ అవుతారని అంతా అనుకున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశాన్ని అగ్రదేశంగా మార్చుతాడేమోనని ఊహించారు. అయితే, కథ మారింది. మూడు పర్యాయాలు అజేయుడిగా నిలిచిన ట్రూడో కీలక సమయంలో డ్రాప్ అయ్యారు. జనవరి 8న నిర్వహిచబోయే జాతీయ కాకస్ సమావేశానికి ముందు పదవి నుండి వైదులుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఎన్నికల వరకూ లిబరల్ పార్టీ నుండీ అధికారాన్ని ఎవరు భర్తీ చేసినప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం ఈసారి లిబరల్ పార్టీకి ఎదురుదెబ్బ ఉందని అంతా అంచనా వేస్తున్నారు.
“హీ విల్ బి గాన్ ఇన్ ద అప్‌కమింగ్ ఎలక్షన్” అంటూ మస్క్ రిప్లై
అంతగా, ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ట్రూడో. ఆ మధ్య ఓ ఎక్స్ యూజర్.. ఎలన్ మస్క్‌ను ఉద్దేశిస్తూ.. కెనడాలో ట్రూడో బాధ పోవడానికి మీ హెల్ప్ కావాలని ఒక పోస్ట్ పెట్టారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. “హీ విల్ బి గాన్ ఇన్ ది అప్‌కమింగ్ ఎలక్షన్” అంటూ రిప్లై ఇచ్చారు. దీనితో ఈ పోస్ట్‌పై తీవ్రమైన చర్చ నెలకొంది. కొంతమంది యూజర్లు, రాబోయే ఎన్నికల వరకూ ఆగలేము.. ఈ లోపే ఏదైనా చెయ్యండంటూ కామెంట్లు పెట్టారు. అనుకున్నట్లే.. ఎన్నికల కంటే ముందే ట్రూడో మిడిల్ డ్రాప్ అయ్యారు. ఇక, “2025 ఈజ్ లుకింగ్ గుడ్” అంటూ తనదైన శైలిలో సెటైర్ పేల్చారు.
కెనడాను అమెరికాలో విలీనం చేసుకుంటానన్న ట్రంప్
ఇక, ఇప్పుడు అమెరికాకు కాబోయే ప్రెసిండెంట్ డొనాల్డ్ ట్రంప్ కెనడా ఉన్న పరిస్థితులను వాడుకోవాలని చూస్తున్నారు. ఈ సమయంలో కెనడాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కెనడాను అమెరికాలో విలీనం చేసుకుంటానని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్‌లో కెనడా 51వ రాష్ట్రంగా చేరాలనే ప్రతిపాదనను ట్రంప్ మరోసారి గుర్తుచేశారు. ఈ మేరకు, ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో దీనిపై సంచలన పోస్ట్ పెట్టారు.
“రెండు దేశాలూ కలిస్తే, అత్యంత గొప్పదేశంగా యూఎస్”
అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటం కెనడాలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారనీ.. ఆ దేశానికి అధిక రాయితీలు ఇచ్చి, అమెరికా నష్టపోవాల్సిన అవసరం లేదని..’ అందులో పేర్కొన్నారు. అలాగే, ‘కెనడా ప్రధాని ట్రూడోకు ఈ విషయం తెలుసు కాబట్టే ఆయన రాజీనామా చేసినట్లు’ వెల్లడించారు. ‘ఇప్పుడు కెనడా అమెరికాలో విలీనమైతే దిగుమతి సుంకాలు ఉండవనీ.. పన్నులు తగ్గుతాయనీ.. అంతేగాక, రష్యా, చైనాలకు చెందిన నౌకల నుంచి ఎలాంటి ముప్పు కూడా ఉండదు’ అని ట్రంప్ హామీ ఇచ్చారు. ‘రెండు దేశాలూ కలిస్తే… అత్యంత గొప్పదేశంగా యూఎస్ నిలబడుతుందని’ ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ మాటలకు కెనడా ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి రాజీనామా
నిజానికి, 2017-2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మొదటి పదవీకాలంలో కూడా ట్రూడో-ట్రంప్ మధ్య మంచి సంబంధాలు లేవు. 2024 డిసెంబరులో కూడా.. యూఎస్ సబ్సిడీలు కెనడాకు కావాలని అనుకుంటే.. అమెరికాలో భాగం కావాలని ట్రంప్ అన్నారు. కెనడా తమ భూభాగాల గుండా అక్రమ వలసదారుల ప్రవాహాన్ని అరికట్టకపోతే… భారీ సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. అయితే, దీనిపై ట్రూడో ఆశించినంత స్పందించలేదు. ట్రంప్ మాటలకు కెనడా ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ట్రూడో బలహీనమైన నాయకుడు అనడానికి నిదర్శనమన్న ప్రతిపక్షం
ఈ పరిస్థితికి ప్రధాని ట్రూడో వ్యవహార శైలి కారణమంటూ విమర్శించి, తన పదవికి క్రిస్టియా రాజీనామా చేశారు. అయితే, కెనడియన్ కన్జర్వేటివ్ నాయకుడు, ట్రూడో ప్రత్యర్థి అయిన పియరీ పొయిలీవ్రే.. ట్రంప్ వ్యాఖ్యపై స్పందించారు. జస్టిన్ ట్రూడో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి ఎటువంటి గౌరవాన్ని పొందలేదనడానికి… ట్రూడో బలహీనమైన నాయకుడు అనడానికి ఇది నిదర్శనమని అన్నారు. కన్జర్వేటివ్‌లు అధికారంలోకి వస్తే, ట్రూడో ఆధ్వర్యంలో బలహీనంగా మారిన దేశాన్ని బలమైన దేశంగా మారుస్తామని అన్నారు. బలవంతంగానైనా అమెరికాతో చర్చలకు వెళ్తామని చెప్పారు. “కెనడా ఎప్పటికీ స్వతంత్రంగా ఉంటుంది” అని అన్నారు.
భారత్‌పై నిరాధార ఆరోపణలు చేసిన ట్రూడో
ఏది ఏమైనప్పటికీ.. ట్రూడో పదవికి ఎసరు పెట్టడంలో స్వీయ తప్పిదాలు ఎంత ప్రభావం చూపాయో భారత్‌తో ట్రూడో పెంచుకున్న శత్రుత్వం కూడా ప్రభావాన్ని చూపిందనడంలో సందేహం లేదు. ట్రూడో నాయకత్వంలో భారత్‌తో క్షీణించిన సంబంధాలు, హోం వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలపై ట్రూడో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా, కెనడియన్ గడ్డపై ఖలిస్తానీ కార్యకర్త హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపధ్యంలో.. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేశారు ట్రూడో. ఈ వాదనను భారత్ స్థిరంగా ఖండించింది. ట్రూడో వ్యవహార శైలితో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు వచ్చాయి.
సిక్కుల ఓట్ల కోసం నిస్సిగ్గుగా వితండవాదం
దీనిని మరింతగా పెంచడానికి ప్రయత్నించారు ట్రూడో. కెనడాలోని భారతీయ విద్యార్థులను సర్టిఫికేట్ల రీ-వెరిఫికేషన్ విషయంలో ఇబ్బందులకు గురిచేయడం నుండి వీసాలను కఠినతరం చేయడం వరకూ కక్ష్య సాధింపు చర్యలకు దిగారు. కెనడాలో భారీగా ఉన్న సిక్కుల ఓట్ల కోసం నిస్సిగ్గుగా వితండవాదం చేశారు ట్రూడో. తన పదవిని కాపాడుకోవడం కోసం భారత వ్యతిరేక చర్యలపై ఫోకస్ పెట్టారు. అదే, తన పదవికి ఎసరు పెట్టింది. అయితే, ట్రూడో రాజీనామ తర్వాత భారత్ పట్ల కెనడా వైఖరి మారుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.
కెనడాలో నాయకత్వ మార్పిడితో దౌత్య సంబంధాల్లో కొత్త పుంతలు
ట్రూడో రాజీనామాతో కెనడా-భారత్ సంబంధాలు తిరిగి మెరుగుపడే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య మరింత నిర్మాణాత్మకమైన బంధం ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కెనడాలో నాయకత్వ మార్పిడి దెబ్బతిన్న దౌత్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా, ట్రూడో నాయకత్వంలో… కొంత మేర, కెనడా-భారత్ మధ్య వాణిజ్యం వృద్ధి కనిపించింది. మార్చి 2024 నాటికి ఇది సుమారు $8.4 బిలియన్లకు చేరుకుంది.
కొత్త నాయకత్వంలో వాణిజ్య సంబంధాలకు ప్రాధాన్యత
అయితే, 2023 నుండి కొనసాగుతున్న ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలకు కారణం అయ్యింది. దీనితో సహా భవిష్యత్ చర్చలను కూడా ఇది ప్రభావితం చేసింది. కాబట్టి, రాబోయే కొత్త నాయకత్వంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. అలాగే, కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపే ట్రూడో అంతర్జాతీయ విద్యార్థుల అనుమతి విధానం కూడా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం కెనడాలో ఉన్న సుమారు 4 లక్షల 27 వేల మంది భారతీయ విద్యార్థులు, కొత్త ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులను ఆశిస్తున్నారు.
ట్రూడో రాజీనామాతో కెనడా రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలయ్యింది. పదేళ్ల తర్వాత… సమూలంగా మారిన కెనడా పాలనా విధానాన్ని రాబోయే రోజుల్లో ప్రపంచం చూడబోతోంది. మరి, ఈ కొత్త కెనడా కథ ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తిని రేపుతోంది.