ఎలన్ మస్క్ ఎంత కుబేరుడో.. అంతే, బోల్డ్‌గా మాట్లాడే వ్యక్తి. మస్క్ ట్వీట్లు, వ్యాఖ్యలు చూస్తే.. “ఈ వ్యక్తి ఏదీ మనసులో పెట్టుకోడు.. అన్ని బయటకు చెప్పేస్తాడు” అనుకునే విధంగా ఉంటాయి. కానీ, మస్క్‌పై నిఘా పెట్టిన అమెరికా రక్షణ వ్యవస్థలు మాత్రం దాన్ని నమ్మట్లేదు. జరిగిన పరిణామాలు, ఆయా సందర్భాలు.. అన్నింటినీ పక్కన పెట్టి… ఒకదానితో ఇంకొకటి లింక్ చేస్తుంటే… మస్క్ ఫజిల్ రివీల్ అవుతుందేమో అని ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పటి వరకూ ఎలన్ మస్క్ అంటే అమెరికా… అమెరికా అనగానే ఎలన్ మస్క్ అనుకుంటున్నారు అందరు. కానీ, మస్క్ ప్రపంచానికి మస్కా కొడుతున్నాడనే అనుమానలు వస్తున్నాయ్.. మస్క్ నిజస్వరూపం అతి పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ… తనకు మరో రహస్య జీవితం ఉందని సందేహిస్తున్నాయి అమెరికా రక్షణ వ్యవస్థలు. పెంటగాన్ నుండి అమెరికా ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ విభాగం… చివరికి నాసా కూడా ఎలన్ మస్క్‌పై డౌట్ పడుతున్నాయి. మస్క్ రష్యా గూఢాచారి అనే టాక్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజంగానే మస్క్ రష్యన్ ఏజెంటా…? తన స్టార్ లింక్‌ని ఉపయోగించి రష్యాకు మేలు చేస్తున్నాడా..? మస్క్‌ని వ్యతిరేకిస్తున్న వాదనలు ఏం చెబుతున్నాయ్..?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్. టెస్లా నుండి ఎక్స్… స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, స్టార్ లింక్… ఇలా, టాప్ టెక్నాలజీతో ప్రపంచానికి అత్యంత అవసరమైన వ్యక్తిగా మారిన పెద్ద శక్తి ఎలన్ మస్క్. మస్క్ ఎంత పవర్ ఫుల్ అంటే… ప్రపంచ పెద్దన్నగా పేరున్న అమెరికా అత్యున్నత పదవిపై డొనాల్డ్ ట్రంప్‌ను కూర్చోపెట్టిన ఘనత కూడా ఇప్పుడు ఆయనకే దక్కుతోంది. అంతేనా… అమెరికాని, దాన్ని పాలించబోయే డొనాల్డ్ ట్రంప్‌ని కూడా ఎలన్ మస్క్ వెనకుండి నడుపుతారనే టాక్ వినిపిస్తోంది. అన్ని మాటలెందుకు… ఎలన్ మస్క్‌కి ఇటీవల ప్రపంచ కింగ్ మేకర్ అనే బిరుదులు కూడా వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి.. మస్క్‌కి ఎంత మేటర్ ఉందో! అలాంటి వ్యక్తిని ఇప్పుడు అమెరికా అత్యున్నత సంస్థలు సందేహిస్తున్నాయి. మస్క్ అసలు రూపం వేరనీ… అమెరికా బద్ధ శత్రువైన రష్యాకు ఏజెంట్ అంటూ అనుమానిస్తున్నాయి. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో రహస్యంగా మాట్లాడుతూ… పుతిన్ చెప్పినట్లు మస్క్ చేస్తున్నాడనే డౌట్లు వస్తున్నాయ్.
2022 నుండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఎలన్ మస్క్ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు కొత్తగా ఒక సంచలన నివేదిక పేర్కొంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో డిసెంబర్ 19, రాత్రి ప్రచురించిన ఒక కథనంలో ఈ ఆరోపణలు వచ్చాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రస్తుత, మాజీ రష్యన్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ రిపోర్టు రూపొందించినట్లు నివేదిక పేర్కొంది. ఇందులో చాలా స్పష్టంగా… మస్క్, పుతిన్ మధ్య రహస్య చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. వీరిద్దరి మధ్య, వ్యాపారం, భౌగోళిక రాజకీయాల నుండి వ్యక్తిగత అంశాల వరకు ప్రతి అంశంపై సంభాషణ జరుగుతున్నట్లు ధృవీకరించాయి. ఒకానొక సందర్భంలో… చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అనుకూలంగా పుతిన్ ఇచ్చిన విజ్ఞప్తుల మేరకు మస్క్ పని చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. చైనా ఆక్రమించాలని చూస్తున్న తైవాన్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను యాక్టివేట్ చేయకుండా ఆపాలని పుతిన్, ఎలన్ మస్క్‌ని కోరినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. అయితే, పుతిన్ అభ్యర్థనను మస్క్ అంగీకరించారా లేదా అన్నది మాత్రం తెలియదని, నివేదిక తెలిపింది.
అయితే, మస్క్, పుతిన్ మధ్య బంధానికి వెనుక అమెరికా గద్దెనెక్కబోయే డొనాల్డ్ ట్రంప్ హస్తం ఉందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నట్లు… అమెరికా, రష్యా మధ్య శత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టి, ట్రంప్ రష్యన్ ప్రెసిడెంట్‌తో టచ్‌లోనే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ట్రంప్ మొదటి అధ్యక్ష పదివిని విడిచిపెట్టిన తర్వాత పుతిన్‌తో మాట్లాడటం కొనసాగించారనే ఆరోపణలు గతంలోనే వచ్చాయి. అయితే, వాటిని ట్రంప్ బృందం వ్యతిరేకించింది. అయితే, ట్రంప్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన ఎలన్ మస్క్‌ను ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసే కొత్త శాఖకు చీఫ్‌గా ట్రంప్ నియమించారు. రాబోయే ట్రంప్ పాలనలో ఈ శాఖ అన్ని విషయాల్లోనూ సూచనలు చేయనుంది. అమెరికా ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు తగ్గించాలి అనేది ఎలన్ మస్క్ నిర్ణయించబోతున్నారు. ఒక విధంగా, ట్రంప్ పాలన మొత్తాన్నీ మస్క్ వెనకుండి నడుపుతారనే టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో… మస్క్, రష్యాకు సహకరిస్తే… అమెరికా భద్రతకు ముప్పు ఏర్పడుతుందని కొందరు వాదిస్తున్నారు.
ఇటీవలి పరిణామాల్లో…. ఎలన్ మస్క్, అతని ఏరోస్పేస్ కంపెనీ, స్పేస్‌ఎక్స్ కంపెనీలపై ప్రస్తుతం మూడు వేర్వేరు అమెరికా సైనిక శాఖలు విచారణ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మస్క్ కంపెనీలు అమెరికా నిబంధనలకు విరుద్ధంగా రష్యాతో వ్యవహరించాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని నిబంధనల ప్రకారం… రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సహా పలు దేశాల అధినేతలతో సమావేశం అయినప్పుడు మస్క్ అమెరికాకు ఈ విషయాన్ని వెల్లడించాలి. కానీ, మస్క్ మాత్రం రష్యన్ ప్రెసిడెంట్‌తో టచ్‌లో ఉన్నట్లు బహిర్గతం చేయలేదనీ…. ఈ అంశంలో ఎన్ని సార్లు హెచ్చరించినా మస్క్ పట్టించుకోలేదని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. అందుకే, యూఎస్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్, ఎయిర్ ఫోర్స్, పెంటగాన్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ కార్యాలయాలు మస్క్ కార్యకలాపాలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అమెరికా భద్రతకు సంబంధించి రాబోయే ప్రమాదాల గురించి ఆందోళనల మధ్య ఈ పరిశోధన జరుగుతుందని నివేదిక చెబుతోంది. ఈ నేపధ్యంలో… ఇటీవల, ఉన్నత-స్థాయి భద్రతా క్లియరెన్స్ కోసం మస్క్ చేసిన అభ్యర్థనను కూడా అమెరికా వైమానిక దళం తిరస్కరించింది.
మస్క్ వ్యవహారంలో ఇప్పుడు అమెరికా సీరియస్ నిర్ణయాలు తీసుకునే దిశగా పావులు కదుపుతోందని సమాచారం. దీనిపై, సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌కు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. అమెరికా వైమానిక దళం భద్రతా విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటుందనీ… ఆర్మీ ఆందోళనలను ఎయిర్ ఫోర్స్ కూడా పంచుకుంటుందని, డిసెంబర్ 13న బ్లూమ్ బర్గ్ ప్రచురించిన లేఖ పేర్కొంది.
సెనేటర్లు కూడా దీనిపై ఓ లేఖను రాసినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రత్యర్థి దేశం రష్యాకి… అమెరికా ప్రభుత్వం నుండి బిలియన్ల డాలర్లు పొందుతున్న మస్క్‌కి మధ్య… తరచూ జరిగే సంభాషణలు అమెరికాకు ముప్పుగా మారతాయనే సందేహాన్ని ఇందులో వ్యక్తం చేశారు. అందులోనూ, అమెరికా సైనిక వ్యవస్థ కోసం మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ ఉపగ్రహాలు వాడుతున్నారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీకి చెందిన పలు ఆపరేషన్లకు సంబంధించిన సమాచారం స్పేస్‌ఎక్స్ దుర్వినియోగం చేస్తుందనే ప్రశ్నలు లేవనెత్తారు. అందుకే, జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఒకే ప్రొవైడర్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలనే వాదనలు వస్తున్నాయి. అలాగే, కమర్షియల్ స్పేస్ ఇండస్ట్రీలో పోటీని ప్రోత్సహించాలనే సూచనలు కూడా చేస్తున్నాట్లు… సెనేటర్లు తమ లేఖలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
నివేదికల ప్రకారం, సెనేటర్లు నవంబర్‌లోనే మస్క్, రష్యా మధ్య సంబంధం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రష్యన్ అధ్యక్షుడు పుతిన్‌తో 2022 ప్రారంభంలో చాలా సార్లు, ఉన్నత స్థాయి సంభాషణలు జరిపారనీ… అలాగే, పుతిన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, సెర్గీ కిరియెంకోతో పాటు ఉన్నత స్థాయి రష్యన్ అధికారులతో సంబంధాలను కొనసాగించారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన రష్యా.. అలాంటి చర్చలేమీ జరగలేదని ఖండించింది. మరోవైపు, మస్క్ కూడా ఇలాంటి మీడియా కథనాలను ఎగతాళి చేశారు. “ఛా… నిజమా! ‘ట్రంప్ ఈజ్ హిట్లర్’, ఇలాంటివి ఆయన దగ్గర చెల్లవు” అంటూ ట్వీట్ చేశారు. రెండు నవ్వుతున్న ఎమోజీలను కూడా జోడించారు. అలాగే, “ఎలోన్ ఈజ్ ఎ రష్యన్ ఏజెంట్” అని ఎవ్వరైనా ఊదరగొట్టొచ్చు” అంటూ సైటైరిక్ ట్వీట్ పెట్టారు మస్క్.
రష్యా ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలు పెట్టిన తర్వాత… అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి… పుతిన్‌ను ఒంటరి చేశాయి. అయినప్పటికీ… ఎలన్ మస్క్, పుతిన్‌తో రహస్యంగా మాట్లాడటంపై ఆందోళనలు గతంలోనే బయటకొచ్చాయి. అయితే, రాబోయే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ పెత్తనం పెరిగిన తర్వాత దీనిపై అమెరికా భద్రతా వ్యవస్థలన్నీ సీరియస్‌గా ఫోకస్ పెట్టాయి. అందులోనూ, ఇటీవల మస్క్ సైటిరికల్ ట్వీట్లు, వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. అక్టోబర్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మస్క్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. “నాకు అత్యంత రహస్య క్లియరెన్స్ ఉందనీ.. దానిని అత్యంత రహస్యంగా ఉంచడానికి కారణం, అదో పెద్ద బోరింగ్ అంశం” అని వెళ్లడించారు. మరోవైపు, రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ… రష్యాకు మస్క్‌తో ఉన్న ఏకైక కమ్యూనికేషన్ టెలిఫోన్ కాల్ అని… అందులో, మస్క్, పుతిన్‌లు స్పేస్‌కు సంబంధించిన అంశాలు… ప్రస్తుత, భవిష్యత్తు సాంకేతికతలపై” చర్చించినట్లు తెలిపారు. అయితే, మస్క్, పుతిన్‌లు తరచుగా సంప్రదింపులు జరుపుతున్నారనే వాదనలను పెస్కోవ్ ఖండించారు.
అయితే, ఈ అంశంలో పలు నివేదికలు బయటకొచ్చిన తర్వాత “ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురించినవి పూర్తిగా తప్పుడు సమాచారం” అని.. మస్క్ 2022 లో తన ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. తాను పుతిన్‌తో ఒక్కసారి మాత్రమే మాట్లాడానని చెప్పారు. అది కూడా 2021లో జరిగిందనీ… ఆ సందర్భంగా, “స్పేస్” గురించి మాట్లాడుకున్నట్లు తెలిపారు. అయితే, అమెరికాకు శత్రువైన పుతిన్ కార్యక్రమాన్ని ఎక్స్‌లో ప్రచారం చేయడానికి మస్క్ అనుమతులు ఇచ్చారు. 2024 ఫిబ్రవరిలో టక్కర్ కార్ల్‌సన్‌తో రష్యా అధ్యక్షుడి ఇంటర్వ్యూను ప్రసారం చేసారు. ఈ ఇంటర్వ్యూలో, మస్క్‌ను ఉద్దేశిస్తూ పుతిన్… ” మస్క్ ఈజ్ స్మార్ట్ పర్సన్” అని అన్నారు. అలాగే, “ఎలన్ మస్క్‌ని ఆపలేమనీ… మస్క్ ఏం చేయాలని అనుకుంటాడో అది చేసేస్తాడంటూ” వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి, మస్క్‌కు, పుతిన్‌కు మధ్య సాన్నిహిత్యం వ్యక్తిగత వైఖరిని కూడా అర్థం చేసుకునే స్థాయిలో ఉందని స్పష్టం చేస్తోంది.
ఇక, రష్యాతో మస్క్‌కు ఉన్న అనుబంధం గురించి మస్క్‌పై మరో ఆరోపణ కూడా వచ్చింది. 2022లో ఖతార్ వరల్డ్ కప్ ఫైనల్స్ రోజు ఎలన్ మస్క్, రష్యాకు అనుకూలంగా మాట్లాడే ఓ టీవీ జర్నలిస్ట్‌తో సెల్ఫీ దిగారు. ఆమె పేరు నైల్యా అస్కర్-జేద్. అప్పటికే, అస్కర్-జేద్ పైన అమెరికాతో సహా పలు పాశ్చాత్య దేశాలు నిషేధం విధించాయి. అలాంటి వ్యక్తితో మస్క్ సెల్ఫీ చర్చనీయాంశమయ్యింది. అయితే, తన సెల్ఫీని టెలిగ్రామ్‌లో షేర్ చేసుకున్న జేద్… ఆ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ గురించి మస్క్ అభిప్రాయాలు కరెక్ట్ అయ్యాయనీ… తనకి కూడా చాలా అభిప్రాయాలు ఉన్నాయనీ… త్వరలో వాటిని పంచుకుంటాను అని పోస్ట్‌లో వెల్లడించారు. ఆల్-రష్యా స్టేట్ టెలివిజన్, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలో ప్రెజెంటర్‌గా ఉన్న అస్కర్-జేద్‌పై యూకే ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమెకు రష్యన్ బ్యాంకింగ్ అధినేత ఆండ్రీ కోస్టిన్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానించింది. రష్యా ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఇది ఉండటం వల్ల అస్కర్-జేద్‌పైన యూకే ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. అయితే, మరో సందర్భంలో… అస్కర్-జాద్‌తో పాటు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌లతో మస్క్ సెల్ఫీ దిగారు. ఇది కూడా అప్పుడు భారీ చర్చకు దారి తీసింది. దీనిపై, మీడియా ప్రశ్నించగా.. మస్క్ ఎలాంటి సమాధానం చెప్పలేదని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అయితే, రష్యా లాంటి యూఎస్ శత్రువులతో మస్క్ సంబంధాలపై నివేదికలు గత సంవత్సరం నుండీ బయటకొస్తున్నాయి. వీటిపైన, కొంతమంది అమెరికా అధికారులు కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు నివేదించారు. అప్పటి నుండీ యూఎస్ గూఢచార విభాగం మస్క్ చర్యలను పరిశీలిస్తూ ఉంది. అలాగే, ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ఈ తీవ్రతను మరింత పెంచింది. అంతేగాక, నాసా, యూస్ మిలిటరీతో మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు ఉన్న సంబంధాల వల్ల… అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం, అమెరికా నిఘా సమాచారం మస్క్ యాక్సెస్ చేసే అవకాశం ఉండవచ్చు కాబట్టి, ఇది అమెరికా జాతీయ భద్రతా సమస్యగా పరిగణించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అనుమానాలకు సంబంధించి, మస్క్ ఇప్పటి వరకూ ఎక్కడా స్పందించలేదు.
నిజానికి, ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం తర్వాత మస్క్, పుతిన్ మధ్య బంధం పెరిగింది. మస్క్ స్టార్‌లింక్ నుండి అందిన ఇంటర్నెట్ సేవలు… ఉక్రెయిన్ చిన్న సైన్యానికి భారీగా ఫ్రంట్‌లైన్ ప్రయోజనాన్ని అందించాయిని ప్రపంచ మీడియా వెల్లడించింది. పలు యూనిట్ల మధ్య రియల్-టైమ్ డ్రోన్ ఫీడ్‌లను పంచుకోడానికి, యుద్ధభూమిలో సెల్‌ఫోన్ సేవకు అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లో కమ్యూనికేట్ చేయడానికి ఉక్రెయిన్ దళాలకు స్టార్ లింక్ సేవలు ఉపయోగపడ్డాయి. దీనికి, మస్క్ మరో కంపెనీ స్పేస్ ఎక్స్ నుండి నిధులు అందాయి. అయితే, ఆ సేవలను అందించడానికి అయ్యే ఖర్చుపై మస్క్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉక్రెయిన్‌తో మస్క్ సంబంధం మధ్యలో దెబ్బతింది. ఈ నేపథ్యంలో… రష్యా-ఆక్యుపైడ్ క్రిమియా వంటి ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలు పరిమితం అయ్యాయి. తర్వాత, జూన్ 2023లో, ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవల కోసం పెంటగాన్ నిధులు ఇస్తుందని ప్రకటించింది. అయితే, అప్పటికే ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను వాడుతున్న రష్యన్ దళాలు, యుద్ధంలో ఉక్రెయిన్‌లో కీలక యుద్ధ ప్రదేశాలను శాటిలైట్ ఇంటర్నెట్‌తో రష్యా వినియోగిస్తుందనీ… దీనికి, స్టార్ లింక్ ప్రభావం ఉందని పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఈ అనుమానానికి మద్దతు ఇస్తూ… 2023లో మస్క్ జీవిత చరిత్రను రాసిన వాల్టర్ ఐజాక్సన్, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఒక కీలక సందర్భాన్ని వెల్లడించారు. రష్యా నావికాదళంపై ఉక్రేనియన్ స్నీక్ దాడి చేయాలని నిర్ణయించుకున్న సమయంలో… దానికి అంతరాయం కలిగించడానికి 2022లో క్రిమియన్ తీరానికి సమీపంలో స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఆపివేయమని మస్క్ తన ఇంజనీర్లకు రహస్య ఆదేశాలు పంపించినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయం వెనుక బలమైన కారణం కూడా లేకపోలేదు. క్రిమియాపై ఉక్రెయిన్ దాడి చేస్తే… రష్యా అణ్వాయుధ దాడికి దిగుతుందనే భయం వల్లనే మస్క్ అలా చేశారనే వాదన ఉంది. అయితే, స్టార్‌లింక్ సేవలు క్రిమియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా లేవనీ… అక్కడ ఇంటర్నెట్ సర్వీస్‌ని ఆన్ చేయమని ఉక్రెయిన్ ప్రభుత్వం తనకు “ఎమర్జెన్సీ రిక్వెస్ట్” పంపిందని మస్క్ ఒక సందర్భంలో చెప్పడంతో ఇది జరిగి ఉండొచ్చని చాలా మంది నమ్మారు. అయితే, అస్పష్టమైన మస్క్ వ్యవహారాల నేపధ్యంలో… రష్యాతో మస్క్‌కి ఉన్న సంబంధాల గురించి ఆందోళనలు పెరుగుతూ వచ్చాయి.
Also Read: రష్యాకు ఉక్రెయిన్ ఊహించని షాక్.. ఏకంగా ఆ ప్రాంతంపైకి డ్రోన్ల దండు.. భారీ నష్టం
అయితే, ఇటీవల అమెరికా ఎన్నికల ప్రచారంలో మస్క్‌ను ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఒక కామెంట్ చేశారు. “ఈ యుగానికి ఒకే ఒక్క పరిశ్రమ నాయకుడు” అని ప్రశంసించారు. మరోవైపు, ట్రంప్ ట్రాక్ రికార్డ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. “ఈ ఎన్నికల రేసులో ఒకే ఒక్క అభ్యర్థి మాత్రమే పుతిన్ మరొక దేశంపై దాడి చేయకుండా ఆపగలడనీ… అది అధ్యక్షుడు ట్రంప్ అని… రష్యా దూకుడును అరికట్టడానికి, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ గద్దెనెక్కుతారనీ అన్నారు”. అయితే, ఇప్పటి వరకూ యుద్ధం అయితే ఆగలేదు. అటు, అమెరికా నుండి ఉక్రెయిన్‌కు ఇప్పటి వరకూ అందుతున్న బలమైన సహకారం ఇకపై అందుతుందా అనే అనుమానాలు వస్తున్నాయ్. మరోవైపు, ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఎలన్ మస్క్ ప్రమేయం పెరుగుతోంది. ఇది మస్క్ వ్యాపార సామ్రాజ్యం కంటే మించి ఉంది. అందుకే, అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ రహస్యా సంబంధం వెనుక లక్ష్యం ఏంటీ..? దీని వెనుక ఎవరున్నారు…? ప్రపంచాన్ని వీళ్లు ఏం చేయబోతున్నారు..? అన్న ప్రశ్నలకు ఇప్పుడైతే సమాధానాలు అస్పష్టంగానే ఉన్నాయ్. మరి, భవిష్యత్తులో ఈ ఊహాగానాల వెనుకున్న నిజానిజాలు బయటపడతాయేమో చూడాలి మరి.