Megha Engineering and Infrastructure Limited (MEIL)
స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం: నిర్మాణ రంగంలో దిగ్గజ సంస్థగా చెప్పుకుంటున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ వరుస వైఫల్యాలు ఒక్కొక్కటీ ఇప్పుడు బయటికొస్తున్నాయి. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా నిర్మించిన వంతెనలు దెబ్బతినటం, కాళేశ్వరం పంపుహౌసులు నీట మునగటం, సుంకిశాల రిటైనింగ్ వాల్ నిలువునా కూలిపోవటం వంటి ఘటనలు సంస్థ వైఫల్యాలను, నాశిరకపు ప్రమాణాలను తెలియజేస్తున్నాయి. మరోవైపు.. తాను చేపట్టిన జగదల్‌పూర్ స్టీల్ ప్లాంట్ల నిర్మాణపు బిల్లుల మంజూరుకు అధికారులకు లంచాలిచ్చిన కేసులో సీబీఐ నోటీసులు అందుకుని అప్రతిష్టనూ మూటగట్టుకుంది. ఇంకోవైపు భారత్-మంగోలియాల మధ్య సత్సంబంధాలు పెంపొందించుకోవాలనే విదేశాంగ విధానంలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టుల కాంట్రాక్టులను దక్కించుకున్న మేఘా సంస్థ, మూడేళ్లయినా పూర్తి చేయకపోవటంతో కేంద్రం చేత చివాట్లు తినాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నవారి అండతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రభుత్వ ప్రాజెక్టులను చేజిక్కించుకుని అందిన కాడికి ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, ఎన్నికల వేళ ఎలక్షన్ బాండ్ల రూపంలో పార్టీల జేబులు నింపే విద్యలో ఆరితేరిపోయిన ఈ సంస్థ ప్రస్థానంలో మెరుపుల కంటే మరకలే ఎక్కువ.
కర్ణాటకలోని కైగా వద్ద 1400 మెగావాట్ల ఎలక్ట్రికల్ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) టెండర్లను ఆహ్వానించింది. దీనికి ఎల్ అండ్ టీ, భెల్ వంటి అనేక పేరున్న సంస్థలు పోటీ పడగా, రూ.12,799.92 కోట్లతో ఎల్-1గా నిలిచిన మేఘాకు కాంట్రాక్ట్ దక్కింది. అణు విద్యుత్ రంగంలో ఎలాంటి అనుభవం లేకున్నా, తొలిసారి దీని నిర్మాణానికి మేఘా రెడీ అయింది. అయితే, గత చరిత్రలో ఎన్నో ప్రమాదాలున్న నేపథ్యంలో కర్ణాటకలోని కైగా అణు విద్యుత్ కేంద్రంలోనూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటని నేడు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్మించాలని, ఉక్రెయిన్ (నాటి సోవియట్ యూనియన్)లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో 1986 ఏప్రిల్ 26న జరిగిన ప్రమాదంతో వందలమంది చనిపోగా, 2.8 లక్షల మందిని ఆ ప్రాంతం నుంచి శాశ్వతంగా తరలించారు. ఈ నేపథ్యంలో కైగా నిర్మాణం మేఘాకు దక్కటంతో స్థానికులలో కొత్త భయాలు మొదలయ్యాయి.
భారత్-మంగోలియాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే దౌత్య నీతిలో భాగంగా కేంద్రం మంగోలియాలో రూ.7000 కోట్ల విలువైన తొలి గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఈ రిఫైనరీ అందుబాటులోకి వస్తే ఆ దేశానికి రష్యా నుంచి చమురు దిగుమతి అవసరముండదు. కేవలం 35 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలనే షరతుకు కట్టుబడి మేఘా సంస్థ 2021లో ఈ పనులను దక్కించుకుంది. 2024 నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు పనులు కేవలం 14 శాతం మాత్రమే కావటంతో మేఘా సంస్థకు కేంద్రం మొట్టికాయలు వేసింది. అయితే, ఆ తర్వాతి రెండేళ్లలో అదే దేశంలో 189 మిలియన్ల అమెరికన్ డాలర్లతో క్యాప్టివ్ పవర్ ప్లాంట్, మరో రిఫైనరీ పనులనూ మేఘా సంస్థే దక్కించుకుంది. ఈ మూడు పనుల విలువ మొత్తం రూ.11,900 కోట్లు. అయితే, మంగోలియా ప్రాజెక్టులతో బాటు అనేక మేఘా ప్రాజెక్టుల నిర్మాణంలోనూ అంతులేని జాప్యమే జరుగుతోంది.
మేఘా సంస్థ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే అనామక బ్యాంక్ నుంచి వేల కోట్ల బ్యాంక్ గ్యారెంటీలతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణపు పనులు చేజిక్కించుకుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం రాగానే హడావుడిగా దేశీయ బ్యాంకుల గ్యారెంటీలను అధికారులకు చూపించే యత్నం చేసినా అడ్డంగా దొరికిపోయింది. అయితే, ఇలా ఎన్ని ప్రాజెక్టుల్లో ఇలాంటి ఉత్తుత్తి బ్యాంకుల గ్యారెంటీలు సమర్పించిందనే అనుమానాలు ఇప్పుడు వ్యాపిస్తున్నాయి. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ విషయంలో శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం ఏకంగా ఆ బ్యాంక్ గ్యారెంటీలను ఆమోదించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌కు లేఖ రాయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
2019 ఆగస్టులో లక్ష్మీపూర్ పంప్‌హౌస్ వద్ద ప్రొటెక్షన్ వాల్ దెబ్బతిని నీళ్లు లీకయ్యాయి. మరుసటి నెల 3న కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రొటెక్షన్ వాల్ దెబ్బతిని మోటార్లపై నీళ్లు పడి పాడయ్యాయి. కన్నెపల్లి పంప్ హౌస్‌లోకి భారీగా వరద నీరు చేరింది. 2వ మోటార్‌ను ఆన్ చేయగా గేట్‌వాల్వ్ లీకై నీరు ఆకాశం వైపు ఎగజిమ్మి ఆ నీళ్లు, వర్షపు నీటికి తోడై పంప్‌హౌస్ మునిగి వందల కోట్ల నష్టం వాటిల్లింది. నాణ్యత లేమితోనే 2019 అక్టోబర్ 9న అన్నారం బ్యారేజీ గేట్లు లీకయ్యాయి. 2020 ఆగస్టు 23న కాస్త వానకే కాళేశ్వరం దగ్గర గ్రావిటీ కెనాల్ లైనింగ్ కూలింది. త్వరగా ప్రారంభోత్సవం చేయాలన్న నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగి, హడావుడిగా పనులు చేయటంతో ఇలా జరిగిందని తేలింది. 2021 జులై 23న సుందిళ్ల బ్యారేజీ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువ వచ్చి, జల్లారం వాగు పొంగి అన్నారం పంప్ హౌస్ మోటార్లు నీట మునిగాయి. 2022 జులై 14న వచ్చిన వరదలకు కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు మునిగాయి. కన్నెపల్లి పంప్‌హౌస్ రిటైనింగ్ వాల్ కూలి 17 మోటార్లు, విద్యుత్ సామగ్రి దెబ్బ తిన్నాయి. ఆరు మోటార్లు తుక్కుతుక్కు కాగా, అన్నారం పంప్‌హౌస్‌లోని 12 మోటార్లు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా పంపింగ్ కేంద్రాల్లోకి చేరిన నీటిమట్టం కేంద్ర జల సంఘం ఆమోదించిన దానికంటే తక్కువే ఉందని తర్వాత రుజువైంది. ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్ల రూపకల్పనలో మేఘా కంపెనీ వైఫల్యాలే ఆ ప్రమాదానికి కారణమని నాటి ఇంజనీర్లు సైతం అభిప్రాయపడ్డారు.
మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా మేఘా కంపెనీ 2020 జులైలో నాగర్ కర్నూల్‌లో నిర్మించిన ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్ నిలువునా కుప్పకూలింది. ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు నిర్మించ తలపెట్టిన ఈ ట్యాంకు కూలిపోవటానికి నాశిరకం మెటీరియల్ వాడటమేననే వార్త అప్పట్లో చర్చగా నిలిచింది.
2022 అక్టోబర్‌లో 66వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనదారుల అండర్ పాస్ కూలిపోయింది. 2024, మే నెలలో కేరళలోని ఇదే హైవే మీద కాసరగోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనపై ఓ భారీ కాంక్రీట్ బీమ్ జారిపడింది. ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టింది మేఘా కంపెనీయే. ఎంతో పకడ్బందీగా నిర్మించాల్సిన హైవే మీద వరుసగా ఇలాంటి ఘటనలు జరగటంతో మేఘా సంస్థపై కేంద్రం క్రమశిక్షణా చర్యల కింద షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. తర్వాత కేంద్రం జరిపిన విచారణలో నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించలేదని నిర్ధారణ కావటంతో సొంత ఖర్చులతో ఆయా నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించటమే గాక రూ.35 లక్షల జరిమానా కూడా విధించింది.
హైదరాబాద్‌కి తాగు నీరందించేందుకు నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సుంకిశాల వద్ద రూ.2,215 కోట్ల అంచనా వ్యయంతో భారీ పంప్‌హౌస్ నిర్మాణానికి 2022 మే 14న కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నామినేషన్ పద్ధతిలో మేఘాకి కాంట్రాక్ట్ అప్పగించారు. మూడోసారి అధికారంలోకి రాగానే 2024 జూన్‌లో దీనిని ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు. దీంతో హడావుడిగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీర్ల మీద ఒత్తిడిచేయటం, ఈ హడావుడిలో క్వాలిటీని పక్కనబెట్టటంతో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయిందని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి.
రూ. 315 కోట్లతో ఛత్తీస్‌గడ్‌లోని జగదల్‌పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులను దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ, ఆ పనుల తాలూకు రూ.174 కోట్ల బిల్లులను క్లియరింగ్ చేసేందుకు ఎన్‌ఐఎస్‌పీ, ఎన్‌ఎండీసీకి చెందిన ఎనిమిది మంది అధికారులకు, అలాగే మెకాన్ కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులకు రూ.78 లక్షలు లంచం ఇచ్చింది. ఈ కేసులో మేఘా కృష్ణారెడ్డితోపాటు మరో 8 మంది అధికారులపై 120బీ ఐపీసీ, ఐపీసీ 465, సెక్షన్ 7,8 &9 కింద 2024 ఏప్రిల్ 13న సీబీఐ కేసు నమోదు చేసింది.
ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులనూ ఈ సంస్థే చేపట్టింది. రాష్ట్ర విభజనకు ముందు దీని అంచనా వ్యయం రూ.1500 కోట్లు కాగా, బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.22,981 కోట్లకు పెంచారు. అయితే, మూడోసారి మళ్లీ బీఆర్ఎస్ వస్తుందని భావించిన మేఘా సంస్థ అడ్వాన్సులు పుచ్చుకున్నా వేగంగా పనులు చేపట్టలేదు. కానీ, ఎన్నికల నాటికి సీన్ మారటంతో వడివడిగా పనులు మొదలు పెట్టటం, కాంగ్రెస్ సర్కారు రాగానే పనుల పర్యవేక్షణ పెరగటంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సి వచ్చింది. ఇందులో కనీసం 30 శాతం డబ్బు నేతలతో కలిసి ఈ సంస్థ కొట్టేసిందనే వార్తలూ వచ్చాయి.