New Tension To Congress : గద్వాల నియోజకవర్గ రాజకీయం విచిత్రంగా తయారైంది.. అక్కడి పాలిటిక్స్ నిత్యం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయట. బీఆర్ఎస్ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ తర్వాత కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతలోనే ఏమైందో ఏమో యూ టర్న్ తీసుకుని గులాబీ పార్టీలోనే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయినా ఆయన అధికార పార్టీ నేతలతో సన్నిహితంగా మెలుగుతుండటంతో అసలు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాక రెండు పార్టీల వారిలో తికమత వాతావరణం నెలకొందట. అసలు బండ్ల రాజకీయం ఏంటి? అనర్హత వేటు భయంతో ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నారా?
కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారిన గద్వాల రాజకీయం
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడు భిన్నంగా ఉంటాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయా పరిణామలు కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయంట. గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన రాజకీయ గురువైన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశారు. దాంతో ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేల లిస్టులో చేరిపోయారు
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిసానని ప్రకటన
ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయన తాను కాంగ్రెస్‌లో చేరలేదని..నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని ప్రకటించుకున్నారు. అంత లావున గులాబీ పార్టీ పట్ల తన ప్రకటించుకున్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో మాత్రం సన్నిహితంగా మెలుగుతుండటం నియోజవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలకు బదులుగా బండ్ల అనుచరులైన బీఆర్ఎస్ నేతల హవా నడుస్తోందంట. ఇందిరమ్మ గృహాల కేటాయింపులోనూ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఉన్నారట అధికార పార్టీ నేతలు.
సరితా తిరపతయ్య వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల మధ్య పోటాపోటీ రాజకీయం
గద్వాల నియోజకవర్గంలో మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సరితా తిరపతయ్య వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల మధ్య పోటాపోటీ రాజకీయం నడుస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున బండ్లపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మళ్లీ వారిద్దరు ఒకే పార్టీలో చేరినట్లైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహితంగా ఉండడం సరితా తిర్పతయ్యకు ఇబ్బందికరంగా మారిందట. అందుకే ఆయన ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి కల్పించుకోవడంతో కొంత వెనక్కి తగ్గినప్పటికీ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోందంట
కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేలా బండ్ల వ్యవహరిస్తున్నారని విమర్శలు
గత కొంత కాలంగా స్థబ్దతుగా ఉన్న గద్వాల రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేలా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని సరితా తిరుపతయ్య బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరానని ఓ సారి… చేరలేదని మరోసారి ఇలా గందరగోళ రాజకీయాలతో బండ్ల రెండు పార్టీల వారిని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని రెండు పార్టీల శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయన నియోజకవర్గంలో అన్నీ తానై నడుపుతున్నారని.. బీఆర్ఎస్‌లోనూ తానే, కాంగ్రెస్‌లోనూ తానే సుప్రీమ్ అంటూ రాజకీయాలు చేస్తున్నారని రెండు పార్టీల క్యాడర్ గుర్రుగా ఉంది.
బండ్ల డబుల్‌గేమ్ రాజకీయంపై సరిత అసహనం
బండ్ల వ్యవహార శైలి కాంగ్రెస్‌తో పాటు సరితా తిరుపతయ్య రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఆమె వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన వారిని అధిష్టానం నిర్లక్ష్యం చేస్తోందని, ఆ వైఖరితో తాము నష్టపోతున్నామని సరిత వర్గీయులు అంటున్నారు. ముఖ్యంగా సరితా తిరుపతయ్య కూడా బండ్ల డబుల్‌గేమ్ రాజకీయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశానని చెబుతున్న ఎమ్మెల్యే .. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం కనీసం కాంగ్రెస్ పార్టీ ఊసే ఎత్తడం లేదంట. ఆయనే అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేస్తుండటం నియోజకవర్గంలో చర్చినీయంశంగా మారిందట.
Also Read: ముహూర్తం ఫిక్స్! బీజేపీలోకి విజయసాయిరెడ్డి?
అనర్హత వేటు భయంతో బీఆర్ఎస్ జపం చేస్తున్నారా?
బండ్ల వైఖరితో పార్టీకి ఎనలేని నష్టం వాటిల్లుతోందని గద్వాల కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారంట. తన వర్గీయుల చేత ఫ్లెక్సీలో ఫోటోలు వేయించుకుని, తిరిగి తనకు తెలియకుండానే ఫోటోలు వేయించారంటూ పోలీస్ స్టేషన్లో కేసుల పర్వానికి తెర లేపడం ఏంటని కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారట. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై గులాబీ అధిష్టానం పార్టీ బహిష్కరణకు సిద్ధమవడం, అనర్హత వేటు వేయించాలని చూస్తుండటంతో గులాబీ ముళ్లు గుచ్చుకోకుండా ఆయన బీఆర్ఎస్ మంత్రం జపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టకపోతే నియోజకవర్గంలో పార్టీ మనుగడకే ప్రమాదమని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.
వేచి చూసే ధోరణిలో ఉన్న సరిత తిరుపతయ్య
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానంపై నమ్మకంతో మరి కొంతకాలం సర్దుకుపోవాలని సరిత తిరుపతయ్య భావిస్తున్నారంట. మరో రెండు నెలలు వేచి చూద్దామని… పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతూ అప్పటికీ బండ్ల కృష్ణమోహన్ రాజకీయమే నడిస్తే గట్టి నిర్ణయం తీసుకోవాలని తన అనుచరులతో ఆమె చెబుతున్నారంట. మొత్తానికి గద్వాలలో బండ్ల మార్ పాలిటిక్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.