ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వ వెన్నుపోటు సంగతి అటు ఉంచితే ఈ నిరసనలలో వైసీపీలోని అంతర్గత వెన్నుపోట్లు బయటపడ్డాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు వర్సెస్ జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ మధ్య గ్రూప్ వార్ బహిర్గతమైంది.
కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు నర్తు రామారావు. ఎప్పటికైనా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన కోరిక. 2009లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఇచ్చాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు ఆయన్ని ఆశీర్వదించలేదు. 2019లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉన్నారు. కానీ వైసీపీ హయాంలో 2021లో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా, 2023లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయినా ఎమ్మెల్యే కావాలన్న కోరికతో గత ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అధిష్టానం నర్తు రామారావుకు అవకాశం కల్పించలేదు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశాల మేరకు ఇచ్చాపురం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధిని పిరియా విజయకు నర్తు రామారావు సపోర్ట్ చేశారని ఓ వర్గం చెబుతున్నా.. పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేదన్నవాదన కూడా ఉంది. ఎన్నికల ముగిసిన తర్వాత నుంచి నియోజకవర్గంలో వైసీపీ పిరియా విజయ వర్సెస్ నర్తు రామారావు వర్గాలుగా విడిపోయిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. పలు సార్లు బహిరంగ విమర్శలు కూడా చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో విడివిడిగానే పాల్గొంటున్నారు. ఈ గ్రూప్ వార్ అధిష్టానం దృష్టికి కూడా చేరింది.
దాంతో సమస్య తీవ్రతను గుర్తించడానికి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, జిల్లా వైసీపీ పరిశీలకులు కుంభ రవిబాబు అధిష్టాన దూతలుగా ఇచ్చాపురంలో జరిగిన వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గానికి అధిష్టాన దూతలు వచ్చినప్పటికీ నర్తు రామారావు తీరు మాత్రం మారలేదు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో నేతలంతా కలిసి వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని జగన్ ఆదేశించినా.. ఆయన మాత్రం తన వర్గంతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే ధర్మాన కృష్ణ దాస్, కుంభ రవిబాబు సూచనలతో వెన్నుపోటు నిరసన ర్యాలీలో అఇష్టంగానే పాల్గొన్నారు. ఏదో ఇలా వచ్చి అలా పోయాం అన్నట్లు హాజరయ్యారు.
Also Read: అనంతపురంలో రగడ.. టీడీపీ వర్సెస్ బీజేపీ ఫైట్.. అసలు కథ ఇదే!
అసలే ఇచ్చాపురం టిడిపి కంచుకోటగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే బెందాళం అ శోక్ 2014 నుంచి వరుస విజయాలు సాధిస్తూ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తొమ్మిది ఎన్నికలు జరిగితే 8 సార్లు తెలుగు తమ్ముళ్లు సత్తా చాటారు. 2004లో కాంగ్రెస్ అత్తెసరు మెజారిటీతో గెలిచింది. 2019లో వైసిపి ప్రభంజనం సమయంలో కూడా టీడీపీ సత్తా చాటింది.
ఇంత వరకు వైసీపీ జెండా ఎగరని ఆ నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పెట్టుకున్న ఆశలు అక్కడ వర్గపోరుతో అడియాసలుగా మారుతున్నాయి. ఇప్పటికైనా క్యాడర్ మొత్తం ఒకే మాట మీద ఉంటే భవిష్యత్తులో పార్టీ బలపడుతుందని పార్టీ అధ్యక్షుడు చెబుతున్నా నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. వైసీపీలో వర్గ విభేదాలను టీడీపీ నేతలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారంట. విపక్షంలోని అంతర్గత కుమ్ములాటలే తమ శ్రీరామరక్ష అని తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారంట.