Akhil Zainab Wedding : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)ఇంట్లో తాజాగా పెళ్లి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈయన తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) వివాహాన్ని జైనాబ్(Zainab) అనే అమ్మాయితో ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు అఖిల్ జైనాబ్ మెడలో మూడు ముళ్ళు వేశారు. ఇక ఈ పెళ్లి వేడుక తక్కువ మంది సినిమా సెలబ్రిటీలు, సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగింది.. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వివాహ రిసెప్షన్…
ఇలా అఖిల్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెబుతూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టడంతో ఎంతో మంది అభిమానులు ఈయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. అఖిల్ వివాహం కొంతమంది సమక్షంలో జరిగినప్పటికీ ఈయన వివాహ రిసెప్షన్ ని మాత్రం చాలా ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. జూన్ 8వ తేదీ అఖిల్, జైనాబ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరగబోతుంది. ఈ రిసెప్షన్ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే నాగార్జున పలువురు రాజకీయ నాయకులను, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి ఆహ్వానం అందజేశారు.
పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం లేదా …
ఇక ఈయన సతీసమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన కొడుకు పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానం చేశారు. అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా ఆహ్వానించారు. వీరితోపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ఆహ్వానం అందజేశారు. ఇలా ఈ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నాగార్జున మాత్రం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ని ఆహ్వానించలేదనే ఒక వార్త బయటకు వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి వెళ్లి డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాంటి వ్యక్తిని నాగార్జున తన కొడుకు పెళ్లికి ఆహ్వానించకపోవడం ఏంటి? అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
నాగార్జున ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ ను తన కొడుకు పెళ్లికి ఆహ్వానించలేదా? ఈ విధంగా పవన్ కళ్యాణ్ ను నాగార్జున అవమానించారా? అంటూ అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం, నాగార్జున జగన్మోహన్ రెడ్డికి చాలా సానుకూలం. దీంతో నాగార్జున పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించలేదనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలను కొంతమంది అక్కినేని, మెగా అభిమానులు కొట్టి పారేస్తున్నారు. నాగార్జున పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారని అయితే ప్రస్తుతం ఆయన ఓజీ సినిమా(OG Movie) షూటింగ్ కోసం ముంబైలో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా కలవలేకపోయిన ఫోన్ చేసి మరీ ఆహ్వానించారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ రిసెప్షన్ కి కూడా హాజరు కాకపోవచ్చు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన ఓజి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో వివాహ రిసెప్షన్ వేడుకకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.