HCA Recognition: స్వేచ్చ బ్యూరో: హెచ్సీఏ గుర్తింపు ప్రమాదంలో పడిందా?. స్వయంకృతాపరాధాలే ఈ పరిస్థితికి కారణమా?…అంటే అవుననే చెబుతున్నాయి క్రికెట్ వర్గాలు. కొన్నేళ్లుగా వెలుగు చూస్తున్న అక్రమాలు..నిధుల గోల్ మాల్ వంటి అంశాలపై వేర్వేరు దర్యాప్తు సంస్థలు, సిట్ విచారణలు కొనసాగుతుండటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నాయి.
నిజానికి హెచ్సీఏ గతం ఎంతో ఘనం. ఇక్కడి నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మన్సూర్ అలీఖాన్ పటౌడీ, ఎం.ఎల్.జైసింహ, గులాం అహ్మద్, సయ్యద్ ఆబిద్ అలీ, శివలాల్ యాదవ్, వెంకటపతిరాజు, ప్రజ్ఞాన్ ఓఝాలు క్రికెట్ చరిత్రలో తమ ప్రతభతో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక, మహ్మద్ అజహరుద్దీన్, వీ.వీ.ఎస్.లక్ష్మణ్ వంటి క్రికెటర్లు సృష్టించిన రికార్డులు, సంచలనాలు అందరికీ తెలిసిందే. నేషనల్ టీంలో ఆడిన అంబటి రాయుడు, హనుమ విహారి కూడా హెచ్సీఏ తరపున రంజీ ట్రోఫీల్లో ఆడారు.
ఇంత చరిత్ర ఉన్న హెచ్సీఏ కొన్నేళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. వీటిలో ప్రధానంగా నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలే ఉన్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి చూపించారని, ఫ్లడ్‌లైట్లు, డీజిల్ జనరేటర్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ వంటి పరికరాల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీ కేసులు కూడా నమోదు చేసింది. క్రికెట్ బంతులు, జిమ్ పరికరాలు, బకెట్ కుర్చీల కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగినట్టుగా బయటపడింది. టెండర్లు పిలవకుండా అస్మదీయులకు ఈ ఆర్డర్లు ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ వ్యవహారంలో విచారణ జరిపిన ఈడీ కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
2025 ఐపీఎల్ సీజన్ లో టికెట్ల బ్లాక్ లో అమ్మి కొందరు హెచ్సీఏ పెద్దలు సొమ్ము చేసుకున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్ చేసినన్ని టిక్కెట్లు ఇవ్వలేదని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మేనేజ్ మెంట్ ను బ్లాక్ మెయిల్ కూడా చేసినట్టుగా వార్తలొచ్చాయి. ఓ దశలో సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ హైదరాబాద్ ను వదిలేసి ఆంధ్రప్రదేశ్ కు మారతామని ప్రకటించింది కూడా. ఫోర్జరీ పత్రాలతో హెచ్సీఏ అధ్యక్షునిగా ఎన్నికైన జగన్మోహన్ రావుతోపాటు హెచ్సీఏ కార్యదర్శి దేవరాజ్ రాంచందర్ లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గత ఒక్క సంవత్సరంలోనే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్ రాంచందర్, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ బోస్ కాంటేలు అరెస్ట్ కావటం గమనార్హం.
Also read: రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!
అండర్-19 జూనియర్ సెలక్షన్లలో ప్రతిభ ఉన్న క్రికెటర్లను పక్కకు పెట్టి ముడుపులు చెల్లించిన వారికి చోటు కల్పించారని కొందరు ప్లేయర్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ అన్ని ఆరోపణలపై సీఐడీ సిట్, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఇటీవల హెచ్సీఏ నిర్వహించిన టీజీ 20లీగ్ పై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. లీగ్ పేర 46కోట్లకు పైగా అక్రమ వసూళ్లు చేశారని పలువురు బాహాటంగానే చెప్పారు.
మామూలుగా బీసీసీఐ ఆయా రాష్ట్రాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల గ్రాంట్లను మంజూరు చేస్తుంది. అయితే, నిధుల దుర్వినియోగం, అవినీతి వ్యవహారాలు బయటపడటం, ఆరోపణలు రావటంతో 2017 నుంచి బీసీసీఐ గ్రాంట్లను మంజూరు చేయటం లేదు. ఇన్వాయిస్ ల ఆధారంగా నిధులను సమకూరుస్తోంది.
సుప్రీం కోర్టు ఆమోదంతో ఏర్పాటైన బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్ 3(బీ)(2) ప్రకారం బీసీసీఐ గుర్తింపు ఉన్న ఏ క్రికెట్ అసోసియేషన్ అయినా వరుసగా రెండేళ్లు గ్రాంట్లకు అర్హత సాధించకపోతే సదరు అసోసియేన్ గుర్తింపును రద్దు చేయవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో బీసీసీఐ ఇచ్చే గ్రాంట్లకు హెచ్సీఏ 2017 నుంచి అర్హత సాధించలేక పోవటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే హెచ్సీఏ గుర్తింపు ప్రమాదంలో పడిందని క్రికెటర్లు చెబుతున్నారు.
Also read: మార్కెట్‌లోకి కొత్త మోడల్.. రచ్చ చేస్తున్న ఈ టీవీ మోడల్ గురించి మీకు తెలుసా?