Kashmir Himalaya’s Melting: భారతదేశానికి తలమానికగా ఉన్న కశ్మీర్ త్వరలోనే కనుమరుగు అవుతుందా..? అక్కడి వాతావరణం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కశ్మీర్ కింద భూమి అపాయం అంచులో కొట్టుమిట్టాడుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ.. కశ్మీర్‌లో పరిస్థితులు ఏవీ కలిసిరావడం లేదు. రాజకీయం, పర్యావరణం.. ఏదీ కశ్మీర్‌ను కాపాడే కండీషన్‌లో లేవు. ఒకవైపు అభివృద్ధి పేరుతో పర్యావరణం పాడైపోతుంటే.. మరోవైపు, భూమిపై పెరుగుతున్న వాతావరణ మార్పు కశ్మీర్ ఊపిరిని స్లోగా మింగేస్తుంది. వెరసి, చల్లని ప్రదేశం కాస్తా సెగలు కక్కుతోంది. ఫలితంగా పెద్ద ప్రమాదమే ముంచుకురానుంది. ప్రాణాధారంగా ఉన్న హిమాలయాలే ప్రాణాలు తీసేలా మారనున్నాయి. అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది..? కశ్మీర్‌కు వచ్చిన ఈ కొత్త కష్టం ఏంటీ..?
జమ్మూ కశ్మీర్, లడఖ్‌లో భూమి కుంగిపోయే ప్రమాదం
ఇప్పటి వరకూ కశ్మీర్‌ని చూడని వాళ్లు ఎవరైనా ఉంటే.. త్వరగా వెళ్లి చూసేయండి. ఎందుకంటే, ఇంకొన్ని సంవత్సరాల్లో కశ్మీర్ ఇప్పుడు అనుకుంటున్నంత అద్భుతంగా ఉండకపోవచ్చు. అందమైన మంచు అంతా కరిగిపోయి.. మనం రెగ్యులర్‌గా చూసే కొండలా రాళ్లు రప్పలు మట్టితోనే కనిపించొచ్చు. ఇంకా లేదంటే.. అసలు కొండలన్నీ కూలిపోయి, అల్లకల్లోలంగా మారొచ్చు. పచ్చని భూమి, రహదారులు, వంతెనలన్నీ కుంగిపోయి భారీ గోతులే మిగలొచ్చు. విపరీతమైన భూకంపాలు, దారుణమైన ఉప్పెనలతో కశ్మీర్ కళ తప్పి పోవచ్చు.
సాధారణం కంటే అత్యంత ఎక్కువగా కరుగుతున్న మంచు
అవును.. వినడానికి చాలా కష్టంగా ఉన్నా.. జమ్మూ కశ్మీర్ భూమి కింద పెద్ద అపాయం దాగుంది. స్లో పాయిజన్‌లా అది ఆ ప్రాంతంలో భూమి బలాన్ని నీరుగారుస్తుంది. ఫలితంగా.. ఇంకొన్ని సంవత్సరాల్లో జమ్మూ కశ్మీర్, లడఖ్‌లో భూమి ద్రవంగా మారి, కుంగిపోయే ప్రమాదం ఉంది. కశ్మీర్ హిమాలయాల్లో శాశ్వతంగా పరుచుకున్న మంచు ప్రస్తుతం సాధారణం కంటే అత్యంత ఎక్కువగా కరగడం మొదలయ్యింది. ఇది ఒక ప్రత్యేకమైన పర్యావరణ ముప్పుగా మారుతుందని ఇటీవలి అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
పర్వత ప్రాంతంలోని 193 కిలో మీటర్ల మేర రోడ్లు
హిమాలయాల్లో అందంగా పరుచుకున్న ఈ శాశ్వత మంచు కరిగిపోవడం వల్ల.. పర్వత ప్రాంతంలోని 193 కిలో మీటర్ల మేర ఉన్న రోడ్లు.. 2 వేల 415 గృహాలు.. 903 ఆల్పైన్ సరస్సులు.. 8 జలవిద్యుత్ ప్రాజెక్టులకు ముప్పు పొంచి ఉందని ఒక కొత్త అధ్యయనంలో పరిశోధకులు కనుక్కున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని భూమి కింద కనీసం రెండు సంవత్సరాలుగా నిరంతరం ఘనీభవించిన నేల, అవక్షేపాలు, రాతి మొదలైన వాటితో ఏర్పడిన పెర్మాఫ్రాస్ట్ ఉంది. మంచు గడ్డలా ఘనీభవించిన ఈ భూమిపైన శాశ్వతంగా మంచు కప్పబడి ఉంటుంది. ఈ మంచులో ఎక్కువ భాగం అనేక సహస్రాబ్దాలుగా అలాగే ఉంది.
అభివృద్ధి పేరుతో భారీగా మౌళిక సదుపాయాల నిర్మాణం
అయితే, భూమిపై నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ శాశ్వత మంచు నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమైంది. అందులోనూ, ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, ఆ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో చాలా మౌళిక సదుపాయాలను నిర్మిస్తున్నారు. రోడ్లు, టన్నెల్స్, భారీ వంతెనలు, భవనాలు, పవర్ ప్రాజెక్ట్‌ల వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. ఆ ప్రాంతంలో ఉన్న అటవి సామర్థ్యం చాలా వరకూ నాశనం అవుతుందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఇక, ఇప్పటికే ఉన్న భూతాపం… అభివృద్ధి పేరుతో జరుగుతున్న డీఫారెస్టేషన్ జమ్మూ కశ్మీర్‌ను ఆపదలో పడేస్తోంది.
శాశ్వత మంచులో చాలా టన్నుల సేంద్రీయ కార్బన్
హిమాలయాల్లో పేరుకుపోయిన ఈ శాశ్వత మంచులో చాలా టన్నుల సేంద్రీయ కార్బన్ కూడా నిల్వ అయి ఉంటుంది. అయితే, అక్కడ పెరుగుతున్న పరిస్థితుల మార్పు వల్ల హిమాలయాల్లో వేడి పెరిగి, అవి కరుగుతున్నప్పుడు, మంచులో నిల్వ ఉన్న కార్బన్ పర్యావరణంలోకి విడుదల అవుతుంది. అయితే, ఈ కార్బన్.. చాలా బలమైన గ్రీన్‌హౌస్ గ్యాస్.. వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే మీథేన్ రూపంలో కూడా ఉంటుంది. కాబట్టీ, హిమాలయాల్లో మంచు కరుగుతున్న కొద్దీ ఈ కాలుష్య కారకాలన్నీ బయటపడతాయి. అందుకే, హిమాలయాల్లో శాశ్వతంగా ఉన్న మంచు ఇలా కరిగిపోతూ ఉండటం చాలా ఆందోళన కలిగిస్తుంది. “రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్: సొసైటీ అండ్ ఎన్విరాన్‌మెంట్”లో ప్రచురించిన కొత్త అధ్యయనం దీనికి సంబంధించి విస్మయానికి గురిచేసే వివరాలను వెల్లడించింది. కశ్మీర్ యూనివర్సిటీ, IIT-బాంబే పరిశోధకుల అధ్యయనంలో ఈ అంశాలను గుర్తించారు.
‘రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్: సొసైటీ అండ్ ఎన్విరాన్‌మెంట్’ స్టడీ
ఈ తాజా అధ్యయనం ప్రకారం, జమ్మూ కశ్మీర్-లడఖ్‌లోని మొత్తం భౌగోళిక ప్రాంతంలో 64.8% శాశ్వత మంచు ఆవరించి ఉంది. ఇందులో, 26.7% ఎప్పుడూ శాశ్వత మంచు కింద నేల గడ్డకట్టుకొని ఉంటుంది. అలాగే, 23.8% నిరంతరాయంగా కరుగుతూ గడ్డకడుతూ ఉంటుంది. అంటే, ఇందులో సగానికి పైగా నేల గడ్డకట్టి ఉంటుంది. ఇక, 14.3% అప్పుడప్పుడు ఘనీభవిస్తూ.. అడపాదడపా పాచెస్‌లా మారుతుంది. అయితే, ప్రాంతాల వారీగా, లడఖ్ పీఠభూమిలో అత్యధిక విస్తీర్ణంలో 87% శాశ్వత మంచు ఉంటుంది. అలాగే, జమ్మూ, షిగర్ లోయ, సివాలిక్‌ల పర్వత మైదానాలలో ఇలాంటి శాశ్వత మంచు ఉండదు. అయితే, శాశ్వత మంచు ఉన్న ప్రాంతాల్లో ఘనీభవించిన భూమి నిదానంగా కరిగిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని వల్ల కశ్మీర్, లడఖ్‌లోని మంచు పర్వాతాలు.. ఘనీభవించిన నేల కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మొత్తం భౌగోళిక ప్రాంతంలో 64.8% శాశ్వత మంచు
అయితే, ఈ అధ్యయనంలో భాగంగా.. 2002 నుండి 2023 వరకు ఉపరితల ఉష్ణోగ్రతల ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి ఉపగ్రహ డేటాను విశ్లేషించగా ఈ విషయం వెల్లడయ్యింది. 21 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరానికి 56కి పైగా చిత్రాలను పరిశీలించారు పరిశోధకులు. మొత్తం 11 వందల 76 భూ ఉపరితల ఉష్ణోగ్రత చిత్రాల డేటాసెట్ ద్వారా ఒక అంచనాకు వచ్చారు. ఈ డేటా మోడిస్ అని పిలిచే టెర్రా, ఆక్వా ఉపగ్రహాలపై ఉన్న నాసా సెన్సార్ నుండి సేకరించింది. అయితే, ఈ చిత్రాల్లో ప్రతి పిక్సెల్ 1 చదరపు కిలో మీటర్ల వైశాల్యాన్ని చూపిస్తుంది. ఈ ప్రకారం.. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లోని సుమారు 222,236 పిక్సెల్‌లను విశ్లేషించారు.
టెర్రా, ఆక్వా ఉపగ్రహాలపై ఉన్న నాసా సెన్సార్ నుండి సేకరణ
ఈ విస్తృతమైన డేటాసెట్ ఆధారంగా.. ఘనీభవించిన ఉష్ణోగ్రతలు, ఘనీభవన పరిస్థితులు లేని ప్రాంతాలు, అడపాదడపా ఘనిభవించే ప్రాంతాలను గుర్తించారు. కాగా.. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత… ఇప్పటి వరకూ కశ్మీర్‌లో శాశ్వత మంచు క్షీణిస్తున్న విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదని అర్థం అయ్యింది. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి పరిశోధనలు నిర్వహించలేదు. ఇక, ఉత్తరాఖండ్‌లో దీనికి సంబంధించిన కొన్ని స్టడీలు జరిగినప్పటికీ.. శాశ్వత మంచు క్షీణతతో సంబంధం ఉన్న ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి కావాల్సిన పరిశోధనలు చేయలేదు.
ప్రధాన కారణం ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కశ్మీర్ ప్రాంతంలో శాశ్వత మంచు క్షీణతకు ప్రధాన కారణం ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనే అని తెలుస్తోంది. కశ్మీర్ విశ్వవిద్యాలయంలోని భౌగోళిక, విపత్తు నిర్వహణ విభాగం అభిప్రాయం ప్రకారం.. ఇక్కడ శాశ్వత మంచు కరిగిపోతూ ఉండటానికి సహజ కారణాలతో పాటు, మానవ కారకాలు కూడా ప్రభావం చూపిచాయని తెలుస్తోంది. ముఖ్యంగా, జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అటవీ నిర్మూలన, భూ వినియోగంలో మార్పు, పెరిగిన వైల్డ్ ఫైర్ వంటి కార్యకలాపాలు శాశ్వత మంచుతో కప్పబడిన నేల స్థిరత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు అర్థమవుతుంది.
జమ్మూ కశ్మీర్‌లో 332 ప్రో-గ్లాసియల్ సరస్సులు
ప్రకృతిని ఎంత కాపాడితే ఆపదలు అంత దూరంగా ఉంటాయి. కానీ, పెరుగుతున్న భూతాపం దానికి విరుద్ధంగా ఉంది. అయితే, ఇందులో నష్టపోయేది మనమే అని పరిశోధకులు చెబుతున్నారు. నష్టాన్ని ఎదుర్కునే మార్గాలు కూడా సూచిస్తున్నారు. ఇప్పుడు, జరిగిన నష్టాన్ని గురించి ఆలోచించడం కంటే.. రాబోయే కష్టాన్ని తప్పించడం ఎలా అన్నదే గుర్తించాలి. లేకపోతే, దేశ రక్షణ నుండీ దేశ ప్రజల పరిరక్షణ వరకూ ఆపదలో పడే అవకాశం ఉంది. ఇండియన్ హిమాలయన్ ఆర్క్‌లో ఉన్న వేల కొద్దీ హిమనదీయ సరస్సుల్లో ఈ శాశ్వత మంచు కరిగిపోవడం వల్ల కలిగే నష్టాలు భారీగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లోనే ఇలాంటి 332 ప్రో-గ్లాసియల్ సరస్సులను గుర్తించారు పరిశోధకులు.
ఇతర నీటి వనరుల వ్యాప్తి 33% పెరిగిందన్న డేటా
వాటిలో 65 సరస్సులు నాన్-ట్రివియల్ గ్లేషియల్ లేక్ అవుట్‌బస్ట్ ప్లడ్-GLOF ప్రమాదాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. అంటే, కరిగే మంచు నుండి నీరు సహజ వనరుల్లో చేరినప్పుడు ప్రో-గ్లాసియల్ సరస్సు ఏర్పడుతుంది. ఇలా, 2011-2024 మధ్య, హిమాలయాల్లోని మంచుకరిగి ఏర్పడిన సరస్సులు.. ఇతర నీటి వనరుల వ్యాప్తి 33% పెరిగిందని సెంట్రల్ వాటర్ కమిషన్ గత సంవత్సరం నివేదించింది. ఇక, నిటారుగా ఉన్న హిమనీ నదీయ ప్రకృతి దృశ్యాలు ఉన్న ప్రదేశాల్లో.. వేగంగా కదిలే మంచు కొన్నిసార్లు లోపల ఉన్న మంచు శిలలను తుడిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితి శాశ్వత మంచును మరింత దిగజారుస్తుంది. ఫిబ్రవరి 2021లో ఉత్తరాఖండ్‌లోని చమోలిలో జరిగిన రాకీస్ హిమపాతం దీనికి ఒక ఉదాహరణగా ఉంది.
శాశ్వత మంచు క్షీణత వల్ల భూగర్భ జలాలు…
ఇక, సిక్కింలోని దక్షిణ లోనాక్ సరస్సు, అక్టోబర్ 2023లో ఇలాంటి పరిస్థితులలోనే భారీ నాన్-ట్రివియల్ గ్లేషియల్ లేక్ అవుట్‌బస్ట్ ప్లడ్‌ని ఎదుర్కొంది. సరస్సు చుట్టూ శాశ్వత మంచుతో నిండిన పదార్థంతో కూడిన మొరైన్‌లు ఉన్నాయి. కాలక్రమేణా, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు క్షీణించిన ఈ శాశ్వత మంచు వల్ల కొండవాలు పూర్తిగా కూలిపోయింది. ఇలా శాశ్వత మంచు క్షీణత వల్ల భూగర్భ జలాలు, నది నీటి లభ్యత కూడా ప్రతికూల ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక, రాతి హిమానీనదాల రూపంలో శాశ్వత మంచు, నది ప్రవాహానికి దోహదం చేస్తుంది.
కశ్మీర్, లడఖ్‌లో మౌలిక సదుపాయాలకు ప్రమాదం
కొన్ని ప్రాంతాల్లో అయితే, దాని క్షీణత నదుల మూల ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే, భారతదేశంలో ఈ ప్రభావాలను ఖచ్చితంగా గుర్తించడానికి సమగ్ర అధ్యయనాలు ఇప్పటి వరకూ జరగలేదు. కాబట్టి, ఈ విషయంపై ఖచ్చితమైన ప్రకటనలు ఇప్పడప్పుడే చేయలేమన్నది పరిశోధకుల అభిప్రాయం. అయితే, ఒక్కటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. శాశ్వత మంచుకు వస్తున్న ఈ నష్టం వల్ల కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది.
జలవిద్యుత్ విద్యుత్ ప్రాజెక్టుల వంటి భారీ ప్రాజెక్టులు
ఈ శాశ్వత మంచును పరిరక్షించడం కోసం ఇప్పటికే ప్లాన్ చేసిన రోడ్లను ఆపకపోయినప్పటికీ.. భవిష్యత్‌లో ప్లాన్ చేసే నిర్మాణాలను శాశ్వత మంచు ఉన్న ప్రదేశాల్లో నిర్మించకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పర్యావరణ పరంగా పెళుసుగా ఉండే ప్రాంతాల్లో స్థిరమైన నిర్మాణాలు చేపట్టకపోవడం మంచిదని అంటున్నారు. ఇక, జలవిద్యుత్ విద్యుత్ ప్రాజెక్టుల వంటి భారీ ప్రాజెక్టులకు పర్యావరణ ప్రభావాలు ఎలా ఉంటాయనే అంచనాలు వేస్తున్నప్పటికీ.. అవి నాన్-ట్రివియల్ గ్లేషియల్ లేక్ అవుట్‌బస్ట్ ప్లడ్‌కి, ఇతర క్రయోస్పిరిక్ ప్రమాదాలను తెస్తాయా లేదా అనేది కూడా పరిశీలించాలనే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే, గతంలో జరిగిన పెద్ద విపత్తుల తర్వాతే ఈ శాశ్వత మంచు సంబంధిత ప్రమాదాల గురించి అవగాహన పెరిగింది. గతంలో, నాన్-ట్రివియల్ గ్లేషియల్ లేక్ అవుట్‌బస్ట్ ప్లడ్‌లు ప్రధానంగా నేపాల్‌లో సంభవించేవి. అయితే, కేదార్‌నాథ్ విపత్తు, దక్షిణ లోనాక్ సరస్సు విస్ఫోటనం, లడఖ్‌లో జరిగిన సంఘటనలు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి.
లడఖ్‌లోని మిలటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ప్రమాదం
అయితే, రాబోయే ప్రమాదాన్ని తగ్గించడానికి.. పరిశోధకులు చెబుతున్న సూచనలు పాటించడం చాలా కీలకమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శాశ్వత మంచు ఉన్న ప్రదేశాల్లో దీన్ని తక్షణమే అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే, శాశ్వత మంచు అధికంగా ఉన్న ప్రాంతాలలోని ఇళ్లు.. పలు స్థాయిల్లో ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంది. లడఖ్‌లో, శాశ్వత మంచు ఉన్న నిటారైన కొండవాలుల్లో ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. వీటికి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. అలాగే, లడఖ్‌లోని మిలటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి, కశ్మీర్, లడఖ్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం జాతీయ భద్రతకు కూడా ఆందోళనలను కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో.. అనేక వ్యూహాత్మక రోడ్లు.. శాశ్వత మంచు మండలాల గుండా వెళతాయి. అలాంటి చోట.. శాశ్వత మంచు కరిగిపోతే.. రోడ్లు కుంగిపోయి కనెక్టివిటీకి కూడా తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయనడంలో సందేహం లేదు.
ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్‌పై ఆధారపడి అధ్యయనాలు
ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఎప్పటికప్పుడు భూ ఉపరితల ఉష్ణోగ్రతలను పర్యవేక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్‌పై ఆధారపడి అధ్యయనాలు జరుగుతున్నాయి.. అయితే, ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఇన్సిటు పర్యవేక్షణ లేదు. కాబట్టి, ఒకే క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో డేటా లాగర్‌లను మోహరించడం వల్ల ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను మరింత ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి వీలు కలుగుతుంది.
మంచు పర్యవేక్షణలో మరింత ఖచ్చితమైన సమాచారం
ఈ డేటా లాగర్లు ఉపగ్రహ డేటాను క్రమపద్ధతిలో విశ్లేషించడంలో.. ఏవైనా మార్పులు ఉంటే వాటిని గుర్తించడంలో కూడా సహాయపడతాయి. శాశ్వత మంచును పర్యవేక్షించడంలో ఇవి మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. కాబట్టి, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో ప్రభుత్వం దీని దిశగా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పర్యావరణాన్ని కాపాడుకోడానికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన చేయాలని కూడా చెబుతున్నారు.