E-Paper
Advertisement

ఇరాన్ దెబ్బకు గ్లోబల్ మార్కెట్ షేక్.. నవంబర్ వరకు ఆర్థిక సునామీ తప్పదా?

ఇరాన్ దెబ్బకు గ్లోబల్ మార్కెట్ షేక్.. నవంబర్ వరకు ఆర్థిక సునామీ తప్పదా?
Advertisement

Hormuz Crisis: ప్రపంచ ఇంధన, వాణిజ్య రంగాలకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిలో టెన్షన్ మళ్లీ పీక్స్‌కు చేరింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో నెలకొన్న ఉద్రిక్తతలతో.. ఈ వ్యూహాత్మక జలసంధి పూర్తిగా ఇరాన్ చేతుల్లోకి వెళ్ళిపోవడం, సముద్ర రవాణా 90 శాతానికి పైగా స్తంభించిపోవడం ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే.. అంతర్జాతీయ సప్లై చైన్ అతలాకుతలమవుతోంది. ప్రస్తుత పరిస్థితులు, నివేదికలను పరిశీలిస్తే… ఈ సంక్షోభం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. రాబోయే నవంబర్ వరకు దిగ్బంధనం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.

హర్మూజ్ జలసంధి మూసివేత

ఫిబ్రవరి చివర్లో.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులతో.. హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణా ప్రశ్నార్థకంగా మారిపోయింది. మార్చి ప్రారంభంలోనే.. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. సీజ్ ఫైర్ తర్వాత అమెరికా కూడా ఇరాన్ రేవులపై ప్రతీకార నౌకా దిగ్బంధనం విధించగా, ఇరాన్ దానికి కౌంటర్‌గా.. హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది. ఈ సంక్షోభంలో ఇప్పటివరకు అనేక వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, అందులోని సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో.. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు భయభ్రాంతులకు గురయ్యాయ్.

గల్ఫ్‌లో చిక్కుకున్న వేల నౌకలు

Advertisement

సాధారణ రోజులతో పోలిస్తే.. ప్రస్తుత రిపోర్ట్స్ ప్రకారం హర్మూజ్ గుండా 90 నుంచి 94 శాతం నౌకా రవాణా ఆగిపోయింది. పైగా.. అంతర్జాతీయ బీమా సంస్థలు కూడా.. హర్మూజ్ మార్గంలో వెళ్లే నౌకలకు వార్ రిస్క్ బీమాను రద్దు చేశాయ్. ఇన్సూరెన్స్ లేనిదే.. ఏ పెద్ద షిప్పింగ్ లైనర్ కూడా నౌకలను ముందుకు కదపదు. ఇప్పటికీ.. గల్ఫ్ ప్రాంతంలో 1500 పైగా నౌకలు, 22 వేల మందికి పైగా నావల్ సిబ్బంది ఇరుక్కుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో.. హర్మూజ్ జలసంధి ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది.. మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

భారత్ జీడీపీపై మూడీస్ హెచ్చరిక

హోర్ముజ్‌ జలసంధి దిగ్బంధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించటం లేదని మూడీస్‌ రేటింగ్స్‌ రిపోర్ట్ ఇచ్చింది. వచ్చే నవంబర్ వరకు ఈ దిగ్భందం కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. దాంతో.. భారత్‌తో పాటు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రధాన దేశాల జీడీపీ వృద్ధి రేటు కూడా 0.2 శాతం నుంచి 0.8 శాతం తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతం నుంచి 6 శాతానికి కుదించింది.

భారత్ ఆర్థిక వ్యవస్థపై డబుల్ ఎఫెక్ట్

Advertisement

గత ఆర్థిక సంవత్సరం 3.5 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం.. ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతానికి ఎగబాకే ప్రమాదం ఉందని తెలిపింది. దాంతో.. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌‌కి ద్రవ్య పరపతి విధాన రూపకల్పన కూడా కష్టమవుతుందని మూడీస్‌ అంచనా వేసింది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారత్‌, చైనా, జపాన్‌, సౌత్ కొరియా దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా హర్మూజ్ జలసంధిని తెరిచేలా ఒప్పించుకునే అవకాశం ఉందని కూడా తెలిపింది. అయితే, అమెరికా.. ఇరాన్‌పై విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే తాము వెనక్కి తగ్గుతామని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఏప్రిల్‌లో జరిగిన రాయబార చర్చలు విఫలమవడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Also Read: సీఎం విజయ్‌కు తొలి పరీక్ష.. త్రిభాషా ఫార్ములాను ‘దళపతి’ ఎలా డీల్ చేయబోతున్నారు?

భారత్‌కు చమురు సంక్షోభ హెచ్చరిక

భారత్‌ దిగుమతి చేసుకునే ముడి చమురులో 46 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తోంది. అందువల్ల.. దానిని తెరిచే వరకు బ్యారల్‌ బ్రెంట్‌ క్రూడ్ ఆయిల్ ధర 90 నుంచి 110 డాలర్ల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అయితే, నవంబర్ ఎందుకు కీలకమంటే.. అమెరికాలో రాజకీయ సమీకరణాలు, అంతర్జాతీయంగా కొత్త ఒప్పందాలు కుదిరితే తప్ప ఇరాన్ వెనక్కి తగ్గేలా లేదు. అందుకే కార్పొరేట్ కంపెనీలు, లాజిస్టిక్స్ రంగాలు 2026 ద్వితీయార్థం వరకు ప్రత్యామ్నాయ మార్గాలనే చూసుకోవాలని డిసైడ్ అయ్యాయి.

ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు హెచ్చరిక

కానీ.. హర్మూజ్ జలసంధి మూసివేత కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాలేదు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సామాన్యుడిపై పడుతోంది. ప్రపంచవ్యాప్త ముడి చమురు రవాణాలో 20 శాతం, ఎల్ఎన్‌జీలో 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతోంది. ఖతార్ ఎనర్జీ లాంటి దిగ్గజాలు సప్లై నిలిపివేయడంతో.. చమురు ధరలు మళ్లీ 30 ఏళ్ల గరిష్ఠానికి చేరే ప్రమాదముంది. క్రూడ్ ఆయిల్ కొరత వల్ల ప్లాస్టిక్స్, పైపులు, ఇన్సులేషన్ మెటీరియల్స్ ధరలు 30 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగాయి. దాంతో.. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలో అనేక భారీ ప్రాజెక్టులు నిలిచిపోయాయ్. ఎలక్ట్రానిక్స్, చిప్స్ సప్లై సైతం నిలిచిపోయింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ హెచ్చరిక

హర్మూజ్ జలసంధి మూసివేత కేవలం మిడిల్ ఈస్ట్ లాంటి ఓ ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండెల్లో రేపుతున్న వణుకు. ప్రపంచ చమురు మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద సప్లై చైన్ బ్రేక్‌గా చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఓ వైపు, సంక్షోభం నవంబర్ వరకు కొనసాగొచ్చనే అంచనాలు.. మరింత గుబులు రేపుతున్నాయ్.

కొత్త అథారిటీ ఏర్పాటు

పరిస్థితి పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకునేందుకు.. ఇరాన్ వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించింది. హర్మూజ్ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ప్రకటిస్తూ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ అనే కొత్త వ్యవస్థను అధికారికంగా ప్రారంభించింది. ఒమన్ దేశంతో కలిసి ఉమ్మడిగా దీన్ని నడుపుతామని చెబుతున్నా, అసలు నియంత్రణ అంతా ఇరాన్ చేతుల్లోనే ఉంది. ఉచిత రవాణా అనే పాత పద్ధతికి ఫుల్ స్టాప్ పెడుతూ.. స్పెషలైజ్డ్ సర్వీసెస్ పేరిట ఇరాన్ భారీగా ఫీజులు వసూలు చేయనుంది. కొన్ని నౌకలు ఒక్కసారి దాటడానికి ఏకంగా 2 మిలియన్ డాలర్ల వరకు చెల్లించాయ్.

Also Read: బేగంబజార్ పోలీసుల వలలో మోస్ట్ వాంటెడ్ దొంగ.. భారీగా నగదు, నగలు రికవరీ

ప్రపంచ షిప్పింగ్‌కు డబుల్ షాక్

హర్మూజ్ జలసంధి దిగ్బంధంలో ఉండటం, మరోవైపు.. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరగడంతో నౌకలకు దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు నౌకలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుంటూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గంలో వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం 10 నుంచి 14 రోజులు పెరుగుతోంది. సమయం పెరగడం వల్ల ఇంధన ఖర్చులు, కంటైనర్ల కొరత ఏర్పడి అంతర్జాతీయ సరుకు రవాణా ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. హర్మూజ్ జలసంధిలో సంక్షోభం నవంబర్ దాకా కొనసాగితే.. ప్రపంచం ఏమైపోతుందనే ఆందోళన నెలకొంది.

హర్మూజ్ బంద్ ఎఫెక్ట్

ఒకప్పుడు రోజుకు సగటున 130 నౌకలు తిరిగే మార్గంలో.. ఇప్పుడు పట్టుమని పది కూడా తిరగట్లేదు. ఇదే పరిస్థితి వచ్చే నవంబర్ దాకా కొనసాగితే.. ప్రపంచం ఊహించని ఆర్థిక విపత్తును చూస్తుంది. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా జరిగే చమురు వ్యాపారంలో 20 శాతం ఈ జలసంధి గుండానే జరుగుతుంది. అలాంటి రూట్‌ ఇప్పుడు క్లోజ్ అవడమంటే ఇంధన ధరలు మరింత మండిపోతాయ్. ఫిబ్రవరిలో బ్యారెల్‌కు 71 డాలర్లు ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర, ఇప్పటికే 120 డాలర్లు దాటింది. నవంబర్ వరకు ఇలాగే కొనసాగితే.. 150 డాలర్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్‌జీ పూర్తిగా నిలిచిపోవడంతో.. యూరప్, ఆసియా దేశాల్లో పవర్ ప్లాంట్లు మూతపడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే.. ఖతార్ ఎనర్జీ చేతులెత్తేసింది.

గల్ఫ్‌లో ఆహార సంక్షోభం

ఇది కేవలం పెట్రోల్, డీజిల్ సమస్య కాదు, నిత్యవసరాలు, ఆహార సంక్షోభానికి సంబంధించింది కూడా. గల్ఫ్ దేశాలు తమ ఆహార అవసరాల కోసం 80 శాతం ఈ జలసంధిపైనే ఆధారపడతాయ్. ఇప్పటికే.. అక్కడ నిత్యవసరాల ధరలు 40 శాతం నుంచి 120 శాతం పెరిగాయి. ప్రపంచంలో వాడే నైట్రోజన్ ఎరువుల్లో 46 శాతం ఈ ప్రాంతం నుంచే ఎగుమతి అవుతుంది. ఇది ఆగితే భారత్, బ్రెజిల్ లాంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో.. పంటల దిగుబడి పడిపోయి, ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతుంది.

భారత్‌పై వేల కోట్ల అదనపు భారం

పరిశ్రమలకు అవసరమైన అల్యూమినియం, మిథనాల్, గ్రాఫైట్ లాంటి ముడి సరుకులు నిలిచిపోవడంతో.. కెమికల్, స్టీల్, కార్ల తయారీ రంగాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఆర్థిక వృద్ధి రేటు పడిపోయి, ధరలు విపరీతంగా పెరిగే స్థితికి ప్రపంచ దేశాలు చేరుకుంటాయి. ముఖ్యంగా.. ఇండియాకు ఈ సంక్షోభం పెద్ద తలనొప్పిగా మారింది. మన దేశానికి అవసరమయ్యే ముడి చమురులో 88 శాతం దిగుమతి చేసుకుంటాం. అందులో 40 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది. క్రూడ్ ఆయిల్ ధర డాలర్ పెరిగితే.. భారత్ ఏటా అదనంగా 16 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుంది.

రూపాయి విలువపై భారీ ఒత్తిడి

నవంబర్ దాకా క్రూడ్ వంద డాలర్ల పైనే ఉంటే.. మన ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు 200 బిలియన్ డాలర్లు దాటుతుంది. ఇది రూపాయి విలువను పాతాళానికి నెట్టేస్తుంది. ఏ రకంగా చూసినా.. హర్మూజ్ జలసంధి సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు సఫలమై, ఇరుపక్షాలు తమ పట్టుదలను వీడితేనే.. ఈ దిగ్బంధనం వీడుతుంది. లేదంటే, రాబోయే నవంబర్ వరకే కాదు.. ఈ ఏడాది చివరి వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ గండం తప్పేలా లేదు!

Also Read: భాగ్యలక్ష్మి ఆలయం సాక్షిగా బీఆర్ఎస్ నిరసన.. బండి సంజయ్ పదవి ఊడాల్సిందే!

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×