Hyderabad Land: అవును హైదరాబాద్ గ్లోబల్ పవర్ ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తాజాగా రాయదుర్గం భూముల వేలంలో ఎకరాకు 237 కోట్లు పలికి సరికొత్త రికార్డులు సృష్టించడం అంటే మాటలా? హైదరాబాద్ కు ఇలాంటి రికార్డులు కొత్త కావు అనేలా వేలం జరిగింది. యావద్దేశం ఆశ్చర్యపోలేదు. కారణం హైదరాబాద్ రియల్ పవర్ అలాంటిది. డిమాండ్ ఉన్న చోటే కదా రేటు ఉండేది. దేశంలో మరే ఇతర సిటీలో ప్రైమ్ లొకేషన్ ల్యాండ్ కు ఇంతలా క్రేజ్ లేదు. ఇది కేవలం హైదరాబాద్ కే సొంతమైన విషయం. ఇది నోటి మాటగా చెబుతున్నది కాదు. ఇప్పటిదాకా అమ్మిన రేట్లు చెబుతున్న విషయమే.
అప్పట్లో కోకాపేట నియోపోలిస్ లో ఎకరం రేటు వంద కోట్ల రూపాయలంటే అబ్బో అన్నారు. అద్భుతమన్నారు. అదరహో అన్నారు. అదీ హైదరాబాద్ పవర్ అన్నారు. అది గతం.. కానీ మన సిటీ పవర్ అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఎకరా రేటు నాలెడ్జ్ సిటీలో 177 కోట్లు పలికింది. ఓ ఇక తిరుగు లేదు అనుకున్నారు. ఈ రికార్డులు బద్దలవడం కష్టమే అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా రాయదుర్గం పాన్‌మక్తాలో ఎకరా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 237 కోట్ల రూపాయలు పలికింది. రియల్ జోరు అంతంత మాత్రంగానే ఉందనుకున్న టైంలో ఈ తరహా రేట్లు రావడం… ప్రైమ్ లొకేషన్ లో డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిర్వహించిన భూ వేలంలో 2017లో రాయదుర్గంలో 2.84 ఎకరాలకు ఎకరానికి 42.59 కోట్ల రూపాయలు పలకగా.. 2022లో కోకాపేట నియోపోలీస్ వేలంలో 3.60 ఎకరాల్లో ఎకరాకు 100.75 కోట్లు పలికి అప్పట్లో ఆల్ టైమ్ హై రికార్డు సృష్టించింది. ఎకరం వంద కోట్లు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా రాయదుర్గంలో కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయ్. ఓవరాల్ గా చూస్తే రాష్ట్రంలో వ్యాపార అనుకూల నిర్ణయాలు, కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడం, సింగిల్ విండో విధానాలు, పారిశ్రామిక, ఐటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సానుకూల వాతావరణం ఉండడంతోనే ఈ స్థాయి రేట్లు వస్తున్నాయంటున్నారు. పెట్టుబడిదారులు, డెవలపర్లు హైదరాబాద్ భవిష్యత్తుపై చూపుతున్న నమ్మకానికి ఈ స్థాయి ధరే రుజువు అని చెబుతున్నారు.
Also read: నాగేశ్వర్ ఎపిసోడ్.. ఒడవని ముచ్చట! ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి! రోత పుట్టిస్తున్న ఇష్యూ..
తెలంగాణ రైజింగ్ 2047కు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. భూమిపై పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారెవరూ లేరు. అది రాయదుర్గం, గచ్చిబౌలి ఏరియాలో అయితే తిరుగు ఉంటుందా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే కొన్ని తరాలు వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు.. అదీ.. అక్కడి లాండ్ వాల్యూ.. ల్యాండ్ పవర్. సో తాజా వేలం లెక్కలు చూస్తే బెంచ్ మార్క్ లన్నీ పటాపంచలయ్యాయ్. రికార్డులు బద్దలయ్యాయ్. రాయదుర్గంలో రేట్లు ఎక్కడికో వెళ్లిపోయాయ్. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎకరం భూమి 100 కోట్లు అంటే అంతా షాక్ అయ్యారు. గతేడాది ఎకరా 177 కోట్లతో కొత్త రికార్డులు సృష్టిస్తే అద్భుతమన్నారు. ఇప్పుడు ఏకంగా ఎకరా రేటు 237 కోట్ల మార్కును దాటి ఆల్ టైమ్ రికార్డు రేటు పలికింది. రాయదుర్గంలో TGIIC ఈనెల 28న నిర్వహించిన e-వేలంలో మునుపెన్నడూ లేనివిధంగా ఎకరం భూమి ఏకంగా 237 కోట్లు పలికి పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. రాయదుర్గం గ్రోత్ కారిడార్‌లోని కీలకమైన 83/1 సర్వే నంబర్ లోని ప్లాట్ నెంబర్ 1A, 1/F పరిధిలోని 6.29 ఎకరాల మల్టీ యూజ్ ల్యాండ్ కు టీజీఐఐసీ గురువారం e-వేలం నిర్వహించింది. ఎకరాకు 139 కోట్ల రిజర్వు రేటును డిసైడ్ చేశారు. ఇది రాయదుర్గం ఐటీ కారిడార్ ప్రైమ్ లొకేషన్ లో ఉండడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ల్యాండ్ ను దక్కించుకోవడానికి పోటీపడ్డాయ్.
MSTC పోర్టల్ ద్వారా పారదర్శకంగా సాగిన డిజిటల్ వేలంలో ఊహించని రీతిలో బిడ్లు దాఖలయ్యాయ్. చివరకు రిజర్వు ధర కంటే రికార్డు స్థాయిలో అంటే మొత్తం 1,490.73 కోట్ల రూపాయల భారీ డీల్ తో ఈ ప్లాట్ అమ్ముడుపోయింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌లతో కలుపుకొంటే మరింత ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంది. హైదరాబాద్‌కి చెందిన గౌర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ ప్రైమ్ లొకేషన్ ల్యాండ్ ను దక్కించుకుంది. JLL సంస్థ ఈ ట్రాన్సాక్షన్ కు ప్రత్యేక అడ్వైజరీగా వ్యవహరించింది. ఇదే సర్వే నంబర్ లోని ప్లాట్ నంబర్ P4లో 5.09 ఎకరాలకు జూన్ ఒకటిన వేలం జరగనుంది. అది మరెన్ని రికార్డులు సృష్టిస్తుందోనన్న ఆసక్తి అంతటా నెలకొంది. సో ఈ అమ్మకంతో రియల్ ల్యాండ్ మార్క్ గా హైదరాబాద్ నిలిచింది.
హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల మధ్య తాజాగా వేలం వేసిన ల్యాండ్ ఉండటంతో ఈ భూమికి మార్కెట్లో ఊహించని విధంగా డిమాండ్ ఏర్పడింది. 2017లో రాయదుర్గం ప్రాంతంలో 2.84 ఎకరాల భూమికి ఎకరాకు 42.59 కోట్లు పలికింది. 2022 నాటికి కోకాపేట నియోపొలిస్ వేలంలో 3.60 ఎకరాల పరిధిలో ఎకరా ధర 100.75 కోట్లకు చేరి అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. 2025 అక్టోబర్ లో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరిగిన వేలంలో ఎకరా ధర 177 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ఇప్పుడు ఆ రికార్డులన్నీ బద్దలయ్యేలా రాయదుర్గంలోని పాన్‌మక్తాలో వేలం జరిగింది. ఎకరా 237 కోట్ల రూపాయలు పలికి కొత్త రికార్డులు సృష్టించింది. రికార్డు ధరకు ప్లాట్ అమ్ముడవడంపై టీజీఐఐసీ ఎండీ శశాంక సంతోషం వ్యక్తం చేశారు. రాయదుర్గం e-వేలానికి వచ్చిన స్పందన అసాధారణమని, హైదరాబాద్‌తో పాటు తెలంగాణపై పెట్టుబడిదారులకు, డెవలపర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు.
అటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఎయిర్ పోర్ట్ కు సమీపంలోని రావిర్యాల భూములకూ e-వేలం నిర్వహిస్తే స్కేర్ యార్డ్ కు గరిష్ఠంగా 83 వేల 500 రూపాయలకు అమ్ముడైనట్లు హౌసింగ్‌బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం చెప్పారు. 1,000 నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలోని నాలుగు ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలం ద్వారా సుమారు 140 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ భూములను దక్కించుకోవడానికి 17 సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో 1,113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొనడానికి బిడ్డర్లు ఆసక్తి చూపారు. 26 వేల రూపాయలు కనీస ధరను నిర్ణయించగా.. పోటీపడుతూ గరిష్ఠంగా 83 వేల 500కి చేరింది.
గతేడాది నాలెడ్జ్ సిటీలోని సర్వే నెంబర్ 83/1 ల్యాండ్ పార్శిల్ లోని ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు ఉంటే.. ప్లాట్ నంబర్ 15 A/2లో 7.67 ఎకరాలున్నాయి. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరనే 101 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం డిసైడ్ చేసింది. గతేడాది అక్టోబర్ 6న e-వేలంలో 15 A/2లోని 7.67 ఎకరాల భూమి హాట్ కేకులా అమ్ముడుపోయింది. ప్లాట్ 15A/2లో ఒక్కో ఎకరాకు 177 కోట్లు పెట్టి MSN రియాలిటీ సంస్థ కొన్నది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి నాడు 1,357.59 కోట్ల ఆదాయం లభించింది. ప్రైమ్ స్పేస్ లో గతేడాది ఎకరం 177 కోట్లు పెట్టి కొన్న సంస్థ msn రియాలిటీకి బ్యాక్ గ్రౌండ్ గట్టిగానే ఉంది. ఇది MSN గ్రూప్ లో భాగం. 2021లో ఈ MSN రియాలిటీ సంస్థను స్థాపించారు. డాక్టర్ MSN రెడ్డి ఈ మొత్తం గ్రూప్ కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలకు జరిగిన e-వేలంలో ఎకరాకు 141.5 కోట్ల చొప్పున మొత్తం భూమిని బెంగళూరుకు చెందిన ప్రెస్టిజ్ రియాలిటీ సంస్థ దక్కించుకుంది. ఈ భూవేలం ద్వారా నాడు సర్కారుకు 1,556.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మొత్తంగా 18.67 ఎకరాల అమ్మకం ద్వారా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌లతో కలుపుకొని ప్రభుత్వానికి గతేడాది నాలెజ్డ్ సిటీ భూముల అమ్మకంతో 3,135 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. సో ఇది రికార్డు కాదు. ఇది హైదరాబాద్ బ్రాండ్ అన్నట్లుగా వేలం జరిగింది.
Also Read: గిన్నెలు కడగడం కష్టంగా ఉందా? రూ.10వేలలోపు 5 బెస్ట్ స్మార్ట్ గాడ్జెట్స్!
అటు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ తన సత్తా చాటుతోందని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయ్. దేశాన్ని ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా ముందుకు నడిపించడంలో తెలంగాణ డిజిటల్ పవర్‌హౌస్‌గా మారిందని అసోచామ్ పీడబ్ల్యూసీ రిపోర్ట్ తెలిపింది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, హైపర్ స్కేల్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం అద్భుతంగా ముందుకు వెళ్తోందని అన్నది. హైదరాబాద్ ఒక టెక్ మెట్రోపాలిస్‌గా మారిందని.. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ ప్రాంతాలు హై స్కిల్డ్ గ్లోబల్ వసతులతో అద్భుతమైన క్యాంపస్‌లుగా మారాయన్నది. ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వివరించింది. తెలంగాణ డేటా సెంటర్లు, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తున్న విధానంపై అసోచామ్, పీడబ్ల్యూసీ జాయింట్ గా ఈనెల 28న రిపోర్ట్ రిలీజ్ చేశాయి. ప్రత్యేక ఏఐ యూనివర్శిటీ ఏర్పాటు చేసి ఇండస్ట్రీలతో ఒప్పందం చేసుకోవాలని, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ఈ నివేదిక సూచించింది.
ఐటీ కారిడార్‌లో పెద్దఎత్తున డేటా సెంటర్లతో కార్పొరేషన్ ఆదాయం 15% పెరిగింది. విదేశీ పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచాయి. భూ కేటాయింపులు, సబ్సిడీల కన్నా వీటి ఏర్పాటుతో దీర్ఘకాలిక ఆర్థిక లాభాలు ఎక్కువ. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్ దేశంలోనే అత్యంత ముఖ్యమైన ఐటీ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. పరిశ్రమలకు 24 గంటల నాన్ స్టాప్ కరెంట్ ప్లస్ పాయింట్. అటు తెలంగాణలో టాప్ ఎడ్యుకేషన్ సంస్థల కేంద్రంగా ఉంది. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ, ఏఐకేఏఎం, గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ హబ్ సంస్థలు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్, ఫ్యూచర్ టెక్ కు తగ్గట్లు నిపుణులను తీర్చిదిద్దుతున్నాయి.
Also read: వ్యభిచారం నేరం కాదు.. సె*క్స్ వర్కర్లను అరెస్టు చేయెుద్దు.. సుప్రీంకోర్టు సంచలనం